• facebook
  • whatsapp
  • telegram

చిప్‌ తయారీకి నయా చిరునామా



ప్రస్తుత డిజిటల్‌ యుగంలో కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, ఎలెక్ట్రిక్‌ వాహనాలు మొదలుకొని క్షిపణులు, అంతరిక్ష నౌకల వరకు అన్నింటికీ సెమీకండక్టర్లే మూలాధారం. దేశీయంగా వీటి తయారీ కోసం తీవ్ర కృషి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అండదండలతో అంతర్జాతీయ చిప్‌ తయారీదారులు భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నారు.


సెమీ కండక్టర్ల తయారీలో స్వావలంబన సాధించడానికి భారత ప్రభుత్వం 1976లోనే పంజాబ్‌లోని మొహాలీలో సెమీకండక్టర్‌ కాంప్లెక్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌సీఎల్‌) నెలకొల్పింది. 1989లో అనూహ్య అగ్నిప్రమాదం ఆ సంస్థ ప్రయోగశాలను భస్మం చేసింది. చివరకు 2006లో కానీ ఎస్‌సీఎల్‌ తేరుకోలేకపోయింది. సంస్థలో అగ్ని ప్రమాదం సంభవించకపోతే భారత్‌ ఈపాటికి సెమీకండక్టర్ల రంగంలో అగ్రగాముల సరసన నిలిచి ఉండేది. ప్రస్తుతం భారత్‌లో పెద్దసంఖ్యలో స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి, కూర్పు జరుగుతున్నా- వాటి చిప్‌ల కోసం విదేశాలపై ఆధారపడక తప్పడం లేదు. ఈ దుస్థితిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ప్రయత్నిస్తోంది. మొహాలీ సెమీకండక్టర్‌ కాంప్లెక్స్‌ (ఎస్‌సీఎల్‌) ఆధునికీకరణకు 120 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం ఈ సంస్థ రక్షణ, అంతరిక్ష రంగాలకు కావలసిన చిప్‌ల తయారీకి అంకితమైంది. ఇక్కడ తయారైన చిప్‌లను ఇస్రో మంగళయాన్‌, చంద్రయాన్‌లలో ఉపయోగించింది.


చైనాకు పోరు నష్టం! 

నేడు ప్రపంచ మార్కెట్‌కు 60శాతం చిప్‌లను తైవాన్‌ సరఫరా చేస్తోంది. తదుపరి స్థానాలలో చైనా, దక్షిణ కొరియా నిలుస్తున్నాయి. చైనా కనుక తైవాన్‌పై దండెత్తితే చిప్‌ల రంగంలో అల్లకల్లోలం తప్పదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలని అమెరికా పట్టుదలగా ఉంది. ఈ రంగంలో చైనా-అమెరికా విభేదాలు భారత్‌కు లాభించనున్నాయి. నిరుడు జూన్‌లో భారత ప్రధాని మోదీ అమెరికా సందర్శించినప్పుడు రెండు దేశాల మధ్య సెమీకండక్టర్‌ సరఫరా గొలుసుల్లో భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం కుదిరింది. తదనుగుణంగా అమెరికాకు చెందిన మైక్రాన్‌ సంస్థ గుజరాత్‌లోని సణంద్‌లో 82.5 కోట్ల డాలర్లతో సెమీకండక్టర్‌ కూర్పు, టెస్టింగ్‌ కేంద్రాన్ని స్థాపించింది. ఈ ఏడాది మైక్రాన్‌ మొట్టమొదటి మేకిన్‌ ఇండియా చిప్‌ను అందించనుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇటీవల ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ సభలో ప్రకటించారు. గుజరాత్‌లో తాము కూడా సెమీకండక్టర్‌ ఉత్పత్తి కర్మాగారాలను స్థాపిస్తామని టాటా గ్రూప్‌, దక్షిణ కొరియాకు చెందిన సిమ్‌టెక్‌ ప్రకటించాయి. రానున్న సంవత్సరాల్లో అంతర్జాతీయ సెమీకండక్టర్‌ పరిశ్రమకు 10 లక్షల మందికిపైగా నిపుణ సిబ్బంది అవసరమవుతారు. వారిని తయారు చేసే సత్తా భారత్‌కు ఉంది. సెమీ కండక్టర్‌ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం 104 విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తోంది. అమెరికా తరవాత భారత్‌ నిరుడు జపాన్‌తోను దరిమిలా ఈయూతో కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. త్వరలోనే భారత్‌లో మూడు కొత్త సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లు నెలకొనబోతున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. వీటికి స్థలాల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నామని వివరించారు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ భారత్‌లో నాలుగైదు సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లను స్థాపిస్తానని ప్రకటించింది. తెలంగాణలోని కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌ త్వరలోనే ఆపిల్‌ ఫోన్ల విడిభాగాలను తయారు చేయనుంది. ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు సమీపంలోనే సెమీకండక్టర్ల కూర్పు కర్మాగారాన్ని స్వదేశీ సంస్థ కేనెస్‌ టెక్నాలజీస్‌ నెలకొల్పనుంది. 2023 అక్టోబరు నాటికి భారత్‌లో రూ.76వేల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్‌, డిస్‌ప్లే యూనిట్ల స్థాపనకు 45 దరఖాస్తులు అందాయి. ఇజ్రాయెల్‌కు చెందిన టవర్‌ టెక్నాలజీస్‌ భారత్‌లో 65, 40 నానోమీటర్ల చిప్‌ల తయారీకి దరఖాస్తు చేసింది. వేదాంత గ్రూప్‌ గుజరాత్‌లో చిప్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయదలచింది. అమెరికాకు చెందిన ఏఎమ్‌డీ సంస్థ నిరుడు నవంబరులో బెంగళూరులో చిప్‌ డిజైన్‌ కేంద్రాన్ని ప్రారంభించింది. రాజస్థాన్‌లోని సహస్ర సెమీకండక్టర్‌ సంస్థ నిరుడు అక్టోబరులో భారతదేశ మొట్టమొదటి మెమరీ చిప్‌ను తయారుచేసింది. డేటా, ప్రోగ్రామ్‌ల నిల్వకు మెమరీ చిప్‌లు ఉపకరిస్తాయి. ఇంకా హెచ్‌సీఎల్‌, లార్సెన్‌ అండ్‌ టూబ్రో, మహీంద్ర వంటి కంపెనీలు కూడా సెమీకండక్టర్ల రంగంలో ప్రవేశిస్తున్నాయి. 


అవకాశాలు అందిపుచ్చుకోవాలి

సెమీకండక్టర్ల డిజైన్‌ రంగంలో స్వదేశీ అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1200 కోట్ల నిధిని ఏర్పాటుచేసింది. ఈ పథకం కింద ఇప్పటికే 27 అంకురాలను ఎంపిక చేశారు. కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లకు చిప్‌ తయారీలో అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌(జీపీయూ) క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిశ్చయించింది. 2028కల్లా భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్‌ పరిమాణం 8000 కోట్ల డాలర్లకు మించనుంది. ఈ రంగంలో ఇంజినీర్లు, ఆపరేటర్లు తదితర నిపుణ సిబ్బందికి లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయి. ఇలాంటి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. ఈ పరిశ్రమకు అవసరమైన రీతిలో సంసిద్ధమయ్యేలా ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలి.


- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎవరికీ పట్టని ‘పర్యావరణ పరిరక్షణ’

‣ ఎన్నికల వేళ.. ఎటూ తేల్చుకోలేక

‣ ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు

‣ ఇటు శాంతి మంత్రం.. అటు రణతంత్రం

‣ నూతన విధానాలతో ఎగుమతులకు ఊతం

‣ చైనాతో జతకడితే.. అంతే!

‣ గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!

Posted Date: 27-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం