• facebook
  • whatsapp
  • telegram

గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!



గల్ఫ్‌ ప్రాంతంలో ఇండియాకు అత్యంత విశ్వసనీయ మిత్రదేశాల్లో ఒమన్‌ ఒకటి. దానితో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని దిల్లీ ఆకాంక్షిస్తోంది. భారత్‌లో ఒమన్‌ సుల్తాన్‌ ఇటీవలి పర్యటన అందుకు ఊతంగా నిలవనుంది.


ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర సంక్షోభం నెలకొన్న వేళ ఒమన్‌ సుల్తాన్‌ హైథమ్‌ బిస్‌ తారిఖ్‌ ఇటీవల ఇండియాలో పర్యటించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గత 26 ఏళ్లలో ఒమన్‌ సుల్తాన్‌ భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. ఆయన పర్యటన దిల్లీ-మస్కట్‌ ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని ముందునుంచే విశ్లేష ణలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టే- సముద్ర జలాలు, అనుసంధానత, హరిత ఇంధనం, అంతరిక్షం, సాంకేతికతలు, డిజిటల్‌ చెల్లింపులు సహా దాదాపు 10 రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్ళేందుకు ఇరు దేశాలు తాజాగా కీలక దార్శనిక పత్రాన్ని విడుదల చేశాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భావిస్తున్న భారత్‌ కలల సాకారానికి, దేశాభివృద్ధి కోసం ఒమన్‌ రూపొందించుకున్న ‘విజన్‌ 2040’ సాకారమయ్యేందుకు దార్శనిక పత్రం దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదం, ఆర్థిక నేరాలను కట్టడి చేయడంతో పాటు సమాచార సాంకేతిక రంగంలో పరస్పర సహకారం పెంచుకోవడంపైనా ప్రధాని మోదీతో భేటీలో సుల్తాన్‌ విస్తృత సమాలోచనలు జరపడం శుభ పరిణామం.


అరేబియా సముద్రానికి ఆవలి వైపున ఇండియాకు వ్యూహాత్మకంగా కీలకమైన భౌగోళిక స్థానంలో ఒమన్‌ ఉంది. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రక్షణరంగంలో దీర్ఘకాలంగా దానితో పటిష్ఠ మైత్రీబంధాన్ని దిల్లీ కొనసాగిస్తోంది. ఆ దేశ బలగాలతో కలిసి మన త్రివిధ దళాలు తరచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. పశ్చిమాసియాతో ఇండియా సంబంధాల్లో ఒమన్‌ కీలకం. గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ), అరబ్‌ లీగ్‌, ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌(ఐఓఆర్‌ఏ)లలో ఆ దేశం దిల్లీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటుంది. ఒమన్‌లో అనేకమంది భారతీయులు వైద్యులుగా, ఇంజినీర్లుగా, ఉపాధ్యాయులు, నర్సులు, మేనేజర్లు, వృత్తినిపుణులు, కార్మికులుగా పనిచేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల విషయంలో భారతీయులకే మస్కట్‌ అధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను అక్కడి ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయ వాణిజ్యంలో వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్‌ జలసంధికి ఒమన్‌ చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఆర్థిక, ఇంధన భద్రతలో మస్కట్‌ కీలకం.


ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేలా వీలైనంత త్వరగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ఖరారు చేసుకోవాలని దిల్లీ, మస్కట్‌ తాజాగా నిర్ణయించుకోవడం మరో కీలక పరిణామం. సీఈపీఏపై ఇప్పటికే పలు అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఒప్పందం పట్టాలెక్కితే ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో కొత్త అధ్యాయం మొదలైనట్లే. సీఈపీఏ కుదిరితే- మెజారిటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని మినహాయిస్తారు. దానివల్ల మస్కట్‌కు మన దేశం నుంచి గ్యాసోలిన్‌, ఇనుము, ఉక్కు, ఎలెక్ట్రానిక్స్‌, యంత్రపరికరాల ఎగుమతి ఊపందుకుంటుంది. పశ్చిమాసియా మార్కెట్లకు ఒమన్‌ను ప్రవేశద్వారంలా ఉపయోగించుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. అంతర్జాతీయంగా ఇండియాను అపకీర్తిపాలుజేసేందుకు యత్నించే పాకిస్థాన్‌- గాజా సంక్షోభం నేపథ్యంలో తన కుట్రలను మరింత ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్‌కు భారత్‌ మద్దతును తప్పుబడుతూ ముస్లిం మెజార్టీ దేశాలను రెచ్చగొట్టేందుకు అది ప్రయత్నించింది. అయితే ఇండియాలో పర్యటించడం ద్వారా ఇస్లామాబాద్‌ కుయుక్తులపై ఒమన్‌ సుల్తాన్‌ గట్టి దెబ్బకొట్టారు. పాలస్తీనాకు ఇండియా వ్యతిరేకమేమీ కాదు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులతో దిక్కుతోచని స్థితిలో పడ్డ పాలస్తీనీయులకు ఇండియా సహాయ సామగ్రిని పంపింది. గాజాలో తక్షణం కాల్పుల విరమణ పాటించాలన్న ఐరాస జనరల్‌ అసెంబ్లీ తీర్మానానికి మద్దతు పలికింది. ఒమన్‌ సుల్తాన్‌ పర్యటన నేపథ్యంలో ఇతర ముస్లిం దేశాలు ఇండియా వైఖరిని అర్థంచేసుకునే అవకాశాలు మెరుగయ్యాయని చెప్పవచ్చు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని, ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని దిల్లీ, మస్కట్‌ తమ ఉమ్మడి ప్రకటనలో పిలుపిచ్చాయి. పాలస్తీనా సమస్య పరిష్కారంపైనా చర్చించాయి. ఈ పరిణామాలన్నీ గాజా సంక్షోభానికి తక్షణం తెరపడాలన్న ఇరు దేశాల బలమైన కాంక్షకు నిదర్శనాలుగా భావించవచ్చు.


- ఎం.నవీన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏకత్వ తాళంలో భిన్నత్వ రాగాలు

‣ కాగ్‌ విశ్వసనీయతకు తూట్లు

‣ మాల్దీవులతో బంధానికి బీటలు

‣ భవితకు భరోసా.. ప్రత్యామ్నాయ ఇంధనాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం