• facebook
  • whatsapp
  • telegram

మాల్దీవులతో బంధానికి బీటలు


హిందూ మహాసముద్రంలోని ద్వీపదేశం మాల్దీవులతో ఇండియా మైత్రి ప్రస్తుతం ఒడుదొడుకులకు లోనవుతోంది. కొత్తగా మాల్దీవుల అధ్యక్ష పీఠమెక్కిన మహమ్మద్‌ ముయిజు- బీజింగ్‌ను సంతుష్టపరచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా దిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలను పణంగా పెడుతున్నారు.


మాల్దీవులతో ఇండియాది దీర్ఘకాలిక స్నేహబంధం. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండటంతో ఈ చిన్న దేశానికి విదేశాంగ విధానంలో దిల్లీ ఎప్పుడూ సముచిత ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఇప్పటిదాకా మాలే పాలనాపగ్గాలు చేపట్టినవారిలో అత్యధికులు ‘ఇండియాకు తొలిప్రాధాన్యం’ విధానాన్ని అనుసరించడంతో ద్వైపాక్షిక బంధం బలపడుతూ వచ్చింది. చైనా అనుకూలవాదిగా పేరున్న ముయిజు గత నెలలో మాల్దీవుల అధ్యక్ష పీఠమెక్కడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. తమ దేశం నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని ఇటీవలే దిల్లీని కోరడం ద్వారా తమ భవిష్యత్‌ వైఖరిని ముయిజు సర్కారు స్పష్టం చేసింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి, తమ ప్రాదేశిక జలాల్లో హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలు నిర్వహించేందుకు ఇండియాను అనుమతించే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోకూడదని నిర్ణయించింది. 2019లో ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించినప్పుడు కుదిరిన కీలక ఒప్పందమిది.


తెర వెనక చైనా!

జలవనరుల లోతు, లోపల ఉన్న అడ్డంకులు, తీరరేఖ తీరుతెన్నుల వంటివి క్షుణ్నంగా తెలుసుకునేందుకు హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలు దోహదపడతాయి. వాటివల్ల జల రవాణా సామర్థ్యం, భద్రత మెరుగుపడతాయి. ఒప్పందంలో భాగంగా మాల్దీవుల్లో 2021 నుంచి ఇండియా ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలు చేపట్టింది. జల వనరులపై కీలక వివరాలు అందజేసింది. సర్వే పరికరాల వినియోగంపై మాల్దీవుల జాతీయ రక్షణ బలగం (ఎంఎన్‌డీఎఫ్‌) సిబ్బందికి శిక్షణనిచ్చింది. ఫలితంగా మాలే లాభపడింది. ఒప్పంద గడువు 2024 జూన్‌ ఏడున ముగియనుంది. దాన్ని పునరుద్ధరించుకోకూడదని ముయిజు సర్కారు తాజాగా నిర్ణయించింది. ఇకపై ఎంఎన్‌డీఎఫ్‌ సొంతంగా హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలు చేపడుతుందని స్పష్టం చేసింది. వచ్చే నెలలో దక్షిణ హిందూ మహాసముద్రం లోలోతుల్లో పరిశోధనలు చేపట్టేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా తమ నౌకను మాల్దీవుల ప్రాదేశిక జలాల్లోకి పంపించాలని భావిస్తోంది. దానికోసం ఆ దేశాన్ని ఇప్పటికే అనుమతి కోరింది. ఈ పరిస్థితుల్లో ఇండియాతో ఒప్పందంపై మాలే కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియాకు మాల్దీవులు భౌగోళికంగా చాలా దగ్గర. పరిశోధక నౌకను పంపే వినతిని ముయిజు సర్కారు అంగీకరిస్తే- మాల్దీవుల ప్రాదేశిక జలాల నుంచి భారత రక్షణ స్థావరాలపై చైనా నిఘా వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


మాల్దీవుల మౌలిక వసతుల రంగంలో ఇండియా భారీగా పెట్టుబడులు పెట్టింది. 2004లో సునామీ వచ్చినప్పుడు, 2014 నాటి మాలే జల సంక్షోభ సమయం, కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ మాల్దీవులకు మొదటగా భారతదేశమే సాయం చేసింది. మాల్దీవుల తాజా మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్‌ హయాములో ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడ్డాయి. హిందూ మహాసముద్రంలో దిల్లీ మీద పైచేయి సాధించాలని కలలు కంటున్న బీజింగ్‌- మాలేను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) కింద భారీగా నిధులు గుమ్మరిస్తోంది. సోలిహ్‌ అధికార పీఠంపై ఉన్నన్నాళ్లూ డ్రాగన్‌ కుయుక్తులు పారలేదు. ఈ క్రమంలో ముయిజుతోపాటు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌లను చైనా పావులుగా వాడుకుంది. ‘ఇండియా వెళ్ళిపోవాలి’ పేరుతో మాల్దీవుల్లో వారిద్దరూ విస్తృతంగా ప్రచారం చేపట్టేలా పురిగొల్పింది. నిజానికి మాల్దీవుల్లో భారతీయ సైనికుల సంఖ్య కేవలం 77. విపత్తులు, ఇతర అత్యవసర సమయాల్లో సహాయక చర్యల కోసం మాలేకు ఇండియా బహూకరించిన రెండు హెలికాప్టర్లు, డోర్నియర్‌ విమానం నిర్వహణ కోసమే వారు అక్కడ ఉన్నారు. వారితో తమ సార్వభౌమత్వానికి ముప్పు కలుగుతోందని ప్రచారం చేస్తూ ఉపసంహరణకు ముయిజు కోరడం హాస్యాస్పదం. ఆ వినతిని దిల్లీ హుందాగా అంగీకరించింది.


రాజకీయ లబ్ధి కోసం..

సముద్ర జలాల్లో భద్రతపై పరస్పర సహకారం కోసం ఉద్దేశించిన కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్‌ (సీఎస్‌సీ) సదస్సుకు మాల్దీవులు ఇటీవల డుమ్మా కొట్టింది. సీఎస్‌సీలో శ్రీలంక, ఇండియా, మాల్దీవులు, మారిషస్‌ సభ్యదేశాలు. దిల్లీ నేతృత్వంలోని బహుపాక్షిక వేదికలకు దూరంగా ఉండాలన్న భావనతోనే సీఎస్‌సీ సదస్సుకు ముయిజు సర్కారు గైర్హాజరై ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాల్దీవుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టినవారు తొలుత ఇండియాలో పర్యటించడం దాదాపు సంప్రదాయంలా వస్తోంది. ముయిజు మాత్రం తుర్కియేలో పర్యటించారు. సోలిహ్‌ హయాములో విదేశాలతో కుదుర్చుకున్న పలు ఒప్పందాలను సమీక్షించనున్నట్లు ఆయన ప్రకటించారు. మాల్దీవుల దౌత్య, ఆర్థిక ప్రయోజనాలను కాదని- చైనా మెప్పు, రాజకీయ లబ్ధి కోసమే ముయిజు ఈ తరహా చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాల్దీవుల విషయంలో ఇండియా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


- ఎం.నవీన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భవితకు భరోసా.. ప్రత్యామ్నాయ ఇంధనాలు

‣ లాభసాటి సేద్యం కోసం..

‣ భద్రతకు ఆత్మనిర్భరతే పునాది

‣ డ్రోన్‌ విపణికి కొత్త రెక్కలు

‣ అపస్వరాల ఐక్యతా రాగం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని