• facebook
  • whatsapp
  • telegram

అపస్వరాల ఐక్యతా రాగం!ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగతా చోట్ల కాంగ్రెస్‌ ఓటమి చవిచూసింది. ఇటువంటి పరిస్థితుల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి ‘మై నహీ, హమ్‌ (నేను కాదు, మనం) అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ సారథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఈనెల 19న దిల్లీలో భేటీ కానుండటం భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తి రేకెత్తిస్తోంది.


కొన్ని వారాల క్రితం వరకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏకమవ్వాలని ఊరూవాడా చాటుతూ వచ్చారు. ఆయన కృషివల్లే ఈ ఏడాది జూన్‌లో పట్నాలో 26 విపక్ష పార్టీలు సమావేశమై ‘ఇండియా’ కూటమిగా జట్టుకట్టాయి. ఈ కూటమి రెండో సమావేశాన్ని బెంగళూరులో, మూడో భేటీని ముంబయిలో నిర్వహించారు. ఇప్పుడు దిల్లీలో నాలుగో సమావేశం జరగనుంది. మునుపటి సమావేశాల్లో కూటమి పక్షాలన్నీ ముక్తకంఠంతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాయి. కానీ, ఆ లక్ష్య సాధనకు అవసరమైన ఉమ్మడి కార్యాచరణను మాత్రం ఇప్పటి వరకు రూపొందించలేదు. కనీసం కన్వీనర్‌ నియామకాన్నైనా చేపట్టలేదు. కూటమిలోని నాయకులందరూ ఎవరికి వారే అధినాయకులమన్నట్లుగా వ్యవహరించడం, అహాలు అడ్డురావడంవల్ల ఐక్య కార్యాచరణ దిశగా ‘ఇండియా’ ముందడుగు వేయలేకపోయింది.


ముఖం చాటేసిన నేతలు

ముంబయి సమావేశం తరవాత మూడు నెలలకు జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో మినహా మిగతా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలైంది. దాంతో తాము లేకుండా భాజపాను కాంగ్రెస్‌ ఓడించలేదని ‘ఇండియా’ కూటమిలోని ప్రాంతీయ పార్టీలు అంటున్నాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో ఓడిపోయిన కాంగ్రెస్‌ విపక్షాల ఐక్యత గురించి నొక్కి చెప్పడానికి ఈనెల 6న ‘ఇండియా’ కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, తమకు వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల సభకు రాలేమని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ముఖం చాటేశారు. చెన్నైని వరదలు ముంచెత్తాయి కాబట్టి, సమావేశానికి రాలేనని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సందేశం పంపారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నుంచీ అటువంటి సమాచారమే వచ్చింది. దాంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఇండియా’ కూటమి భేటీని వాయిదా వేయక తప్పలేదు.


హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమి వల్ల ప్రాంతీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పెద్దన్న పాత్రను అవి నిరసిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమకూ కొన్ని సీట్లు ఇవ్వాలని కోరినప్పటికీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ తోసిపుచ్చడం అఖిలేశ్‌ యాదవ్‌కు ఆగ్రహం కలిగించింది. అందుకే, ఆయన డిసెంబరు ఆరో తేదీ సమావేశానికి రాలేనని చెప్పినట్లు తెలిసింది. ‘ఇండియా’ కూటమి విజయవంతమైతే ప్రధానమంత్రి పదవి తమకే వస్తుందని నీతీశ్‌, మమతలు ఆశిస్తుండటాన్ని ఇక్కడ గమనించాలి. పశ్చిమ్‌ బెంగాల్‌లో వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌, భాజపాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ప్రధాని పదవికి తానే అర్హురాలినని నమ్ముతున్నారు. ఆమెకు భిన్నంగా నీతీశ్‌కుమార్‌ బిహార్‌లో గెలవడానికి అటు భాజపానో, ఇటు లాలూ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)నో ఆశ్రయించక తప్పడం లేదు.


జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనేది కాగితం మీద బాగానే ఉంటుంది. ఆచరణలో అది ఎంతవరకు ఫలిస్తుందన్నది మాత్రం అనుమానమే. కూటమిలోని ప్రాంతీయ పార్టీల బలం ఆయా రాష్టాలకే పరిమితం. ఉదాహరణకు జనతాదళ్‌ (యూ), సమాజ్‌వాదీ పార్టీలు ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ వెలుపల ప్రభావం చూపలేవు. 2017 ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ కలిసి పోటీ చేసినప్పటికీ, ఓటర్ల అనుగ్రహం పొందలేకపోయాయి. అక్కడ మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భాజపా ఏకంగా 312 సీట్లు సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకొంది. ఎస్పీ 47 చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి, ఎన్నికల రాజకీయాల్లో రెండూ రెండూ కలిస్తే కచ్చితంగా నాలుగే అవుతుందని చెప్పలేం. సమాజ్‌వాదీ మాదిరిగానే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు పశ్చిమ్‌ బెంగాల్‌ వెలుపల, డీఎంకేకి తమిళనాడు వెలుపల ఉనికి లేదు. కాబట్టి, ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఇతర పక్షాలు మద్దతుగా నిలిచి భాజపాపై పోరాడటమే సరైన మార్గం. అంతేతప్ప, విశాల కూటమిగా ఏర్పడి సీట్ల కోసం కీచులాడుకుంటే అవి ఓటర్ల ఆదరణను చూరగొనలేవు. ప్రాంతీయ పార్టీల నేతలు తలో దిక్కూ లాగితే ‘ఇండియా’ కూటమి ఎక్కడికక్కడ చతికిలపడిపోతుంది.


రాష్ట్రాల్లో పార్టీలు ఏకమైతేనే..

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్‌, ఝార్ఖండ్‌లలో ఇతర పార్టీలతో పొత్తులో ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో సమాజ్‌వాదీ, లేదంటే ఆమ్‌ఆద్మీ పార్టీతో జట్టు కట్టినా కాంగ్రెస్‌ గెలవగలిగేది కాదు. మధ్యప్రదేశ్‌లో 72 సీట్లకు పోటీచేసిన సమాజ్‌వాదీ కేవలం 0.39శాతం ఓట్లే సాధించింది. ఆమ్‌ ఆద్మీ వివిధ రాష్ట్రాల్లో 205 సీట్లకు పోటీచేసి 202 స్థానాల్లో ధరావతు కోల్పోయింది. ఆ పార్టీకి నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఏతావతా భాజపాను ఓడించాలంటే ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చూడటమే కీలకం. దానికి జాతీయస్థాయి కూటమే అక్కర్లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వివిధ పార్టీలు ఏకమైతే సరిపోతుంది. కాంగ్రెస్‌ ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన వ్యూహం రూపొందించుకోవాలి.


వ్యతిరేకత ఒక్కటే సరిపోదు

కేవలం భాజపా పట్ల వ్యతిరేకత ఒక్కటే ‘ఇండియా’ కూటమికి విజయం సాధించి పెట్టదు. అధికారంలోకి వస్తే, తామేం చేస్తామో చెప్పి ఓటర్ల మద్దతు చూరగొనాలి. కేవలం ఒక వ్యక్తి పట్ల వ్యతిరేకతతో ప్రతిపక్షాలు ఏకమైతే ప్రయోజనం ఉండదు. ఇందిరా గాంధీ విషయంలో ఈ సంగతి నిరూపణ అయింది. కేవలం ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించడం ద్వారానే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు సాధించగలమని విపక్షాలు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి అవి ఉమ్మడి అజెండాను ప్రకటించాలి. అదీకాకుండా, గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు భారతీయులకు చేదు అనుభవాలను మిగిల్చిన విషయాన్ని గుర్తించాలి. కాబట్టి, కాంగ్రెస్‌ తన భవిష్యత్‌ వ్యూహాన్ని ఎంతో జాగ్రత్తగా రచించుకోవాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కెన్యాతో కలిసికట్టుగా..

‣ భవితపై ఆశ.. ప్రగతిపై ధ్యాస!

‣ పర్వతాలపై చెత్త మేట

‣ కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని