• facebook
  • whatsapp
  • telegram

పర్వతాలపై చెత్త మేటఅంతర్జాతీయ పర్వత దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వాటిని తొలగించడం, అక్కడి జీవావరణాన్ని కాపాడుకోవడం అత్యవసరం.


ప్రపంచవ్యాప్తంగా మంచు పర్వతాలు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నాయి. వాటివల్ల వివిధ దేశాలకు, ప్రజానీకానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ప్రపంచ జనాభాలో 15శాతం వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే, వాతావరణ మార్పుల కారణంగా మంచు పర్వతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వాటిని కాపాడుకోవడం మానవాళి, జీవుల మనుగడకు ఎంతో అవసరం. అందుకే, పర్వత ఆవరణ వ్యవస్థను పునరుద్ధరించుకుందామనే సందేశంతో ఈ ఏడాది పర్వత  దినోత్సవ కార్యక్రమాలను రూపొందించారు. పర్వతాల పరిరక్షణకు కృషి చేసేవారికి పురస్కారాలను ప్రదానం చేయడంతో పాటు యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో చర్చాకార్యక్రమాలు, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు.


మంచుతో కూడిన పర్వత ప్రాంతాలు పర్యాటకులను, సాహసికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. పర్వత పర్యాటకంపై ఆధారపడి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. చెప్పాలంటే ఐరోపా, ఆఫ్రికాల్లోని కొన్ని దేశాలు పూర్తిగా పర్వతాలపై ఆధారపడి ఉన్నాయి. నేపాల్‌లోనూ పర్వత పర్యాటకం ఎంతో కీలకం. భారత్‌లో హిమాలయ శ్రేణులు సుమారు 2,400 కిలోమీటర్ల మేర విస్తరించాయి. వాటిలో చాలా ఎత్తయినవి ఉన్నాయి. గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి జీవనదులకు జన్మస్థానం ఈ పర్వతాలే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత మంచుతో కూడిన పర్వతాల్లో హిమాలయాలది మూడో స్థానం. భారత్‌, చైనా సరిహద్దుల్లో వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కారకోరం పర్వత శ్రేణుల్లో అధికభాగం మంచుతో పేరుకున్నవే (గ్లేసియర్స్‌). ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతమైన ఎవరెస్ట్‌ హిమాలయాల్లోనే ఉంది. దీని ఎత్తు సుమారు 8,848 మీటర్లు. భారతదేశానికి చెందిన రాధానాథ్‌ సిగ్దర్‌ అనే గణిత పరిశోధకుడు 1852లో ఎవరెస్ట్‌ పర్వతం ఎత్తును కనుగొన్నాడు. కానీ, భారత సర్వేయర్‌ జనరల్‌గా పనిచేసిన జార్జ్‌ ఎవరెస్ట్‌ పేరునే దానికి పెట్టారు. అయితే, చైనా టిబెట్‌ను ఆక్రమించుకొని ఎవరెస్ట్‌ విషయంలో పర్వతారోహకులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. తమ దేశంలో ఎవరెస్ట్‌ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. నేపాల్‌లోని అసలైన ఎవరెస్ట్‌కు ఇది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరెస్ట్‌తో పాటు మన దేశంలో అత్యధికంగా 8,586 మీటర్ల ఎత్తున ఉన్న కాంచన్‌జంగా వేలమంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. నందాదేవి, కామెట్‌, సాంతోరో కాంగ్రి, ససేర్‌ కాంగ్రి, మమోస్తోండ్‌ కాంగ్రి, రిమో వంటి పర్వతాలూ పర్యాటకులను అలరిస్తున్నాయి. ఇవికాకుండా, దిల్లీ, రాజస్థాన్‌, హరియాణా, గుజరాత్‌లలో సుమారు 700 కిలోమీటర్ల మేర ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఇవి మంచుతో కూడినవి కావు. వీటిలో ఎత్తయిన పర్వతం గురుశిఖర్‌. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో విస్తరించిన పశ్చిమ కనుమలను యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పశ్చిమ్‌ బెంగాల్‌ నుంచి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి.పర్వతారోహణకు మన దేశంలోని పర్వతాలు చాలా అనుకూలమైనవి. మరింతమంది యువత వీటిని అధిరోహించేందుకు ముందుకు రావాలి. ఇటువంటి ఔత్సాహికులకు భారతీయ పర్వతారోహణ సంస్థ (ఐఎంఎఫ్‌), ‘ఏసీఏపీ’ వంటి సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ప్రభుత్వాలూ వారి వెన్ను తట్టాలి. దేశంలోని పర్వత ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే, హిమాలయ పర్వతాలను అధిరోహించే యువతను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మన పర్వత పర్యాటకానికి మంచి గుర్తింపు లభిస్తుంది.


హిమాలయ పర్వతాలు పర్యాటక స్వర్గాలే కాదు, మన దేశానికి రక్షణ కవచాలు కూడా. ముఖ్యంగా సరిహద్దుల్లో, దేశ భద్రత విషయంలో వీటి పాత్ర ఎంతో కీలకం. కాబట్టి, వీటిని పరిరక్షించుకోవడం చాలా అవసరం. చాలామంది పర్వతారోహకులకు, యువతకు వీటి గురించి సరైన అవగాహన ఉండటంలేదు. పర్వతారోహణ శిక్షణ ఇచ్చే సంస్థలు సైతం వాస్తవ పరిస్థితుల గురించి వారికి చెప్పడంలేదు. వాతావరణ మార్పుల కారణంగా పర్వత మార్గాల్లో పరిస్థితులు మారుతున్నాయి. ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను పర్యాటకులు పర్వతాలపై వదిలేస్తున్నారు. దాంతో అక్కడి వాతావరణం కలుషితమవుతోంది. దీన్ని నిరోధించాలి.


- కె.రంగారావు

(అడ్వెంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ వ్యవస్థాపకులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!

‣ ధరల వాతలు.. తీరేనా వెతలు?

‣ సైనిక పాలకులపై ఉమ్మడి పోరు

‣ సరైన సాయంతోనే రైతుకు ఉపశమనం

‣ పర్యావరణంపై వేటు.. భవితకు కాటు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని