• facebook
  • whatsapp
  • telegram

సరైన సాయంతోనే రైతుకు ఉపశమనందేశానికి అన్నం పెట్టే రైతన్న కష్ట నష్టాల సాగుతో తల్లడిల్లిపోతున్నాడు. ప్రకృతి విపత్తులు, చీడపీడలు, సరైన మద్దతు ధరల లేమి వంటివన్నీ సాగును దండగలా మార్చేస్తున్నాయి. చేసిన అప్పులు పెరిగి ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మిగ్‌జాం తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.


ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లుతున్నాయి. చీడపీడలు అధికమవుతున్నాయి. పెట్టుబడి ఖర్చులూ తడిసి మోపెడవుతున్నాయి. మరోవైపు సరైన గిట్టుబాటు ధరలూ కలగా మిగులుతున్నాయి. వీటన్నింటి వల్లా రైతులు పుట్టెడు కష్టాల్లో మునిగిపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఎందరో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నిరుడు పదకొండు వేల మందికి పైగా రైతులు, రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి ఆత్మహత్యల పరంగా కర్ణాటక, మహారాష్ట్రల తరవాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు అన్నదాతలను తీవ్రంగా కుంగదీస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన మిగ్‌జాం తుపానువల్ల ఆ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. కుప్పనూర్చి ఆరబెట్టిన వరి ధాన్యాన్నీ వాన నీరు ముంచెత్తడంతో రైతులకు కన్నీరే మిగిలింది. గతంలో మార్కెట్‌ కమిటీల ద్వారా రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం అవి ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో కొందరు రైతులు అద్దెకు తెచ్చి ధాన్యం రాశులపై కప్పారు. అయినప్పటికీ తుపాను చేతికొచ్చిన పంటను ముంచెత్తింది.


తీవ్ర నష్టం

వాస్తవానికి పంటలకు మెరుగైన ధరలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం 2016లో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ పోర్టల్‌ (ఈ-నామ్‌)ను తెచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నో మార్కెట్లను దీనికి అనుసంధానించారు. అయితే, చాలా మార్కెట్ల వద్ద ఈ-నామ్‌ సరిగ్గా అమలు కాకుండా కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు పంటను మార్కెట్లకు తెచ్చిన వెంటనే ఈ-నామ్‌లో నమోదు చేయడం లేదు. తేమ శాతం పేరుతో వేధిస్తున్నారు. తాజా మిగ్‌జాం తుపాను సమయంలోనూ ఏపీలో ఇలాంటి దుస్థితే నెలకొంది. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని రెండు వారాల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటిని ఏ మాత్రం పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం తుపాను ముంగిట్లోకి వచ్చి తిష్ఠ వేశాక తాపీగా స్పందించింది. పైగా, కోసిన పంటను వెంటనే కొనకుండా ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని, ఆరబెట్టి తీసుకురావాలని ఆర్‌బీకే కేంద్రాల్లో తేల్చి చెప్పారు. దాంతో కొందరు రైతులు మద్దతు ధరకన్నా తక్కువకే పంటను అమ్ముకోవాల్సి వచ్చింది.


విపత్తు పరిస్థితుల్లో పంట రక్షణకు, రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందడానికి గోదాములు ఎంతగానో తోడ్పడతాయి. దేశీయంగా సరిపడా సంఖ్యలో గోదాములు లేవు. దీనివల్లా వర్షాలు, విపత్తులు సంభవించినప్పుడు రైతులకు కోలుకోలేని నష్టాలు తప్పడం లేదు. మరోవైపు దేశీయంగా మొత్తం అన్నదాతల్లో ఎనభై ఆరు శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులే. కొద్దిమొత్తంలో పండించే పంటలకు సరైన ధర దొరికేదాకా వాటిని గోదాముల్లో నిల్వ ఉంచే స్థోమత వీరికి ఉండదు. అందువల్ల అప్పటికి వచ్చిన ధరకు పంటను వీరు అమ్ముకొంటున్నారు. ఇలాంటి వారికోసం కేంద్రం పీఎం కిసాన్‌ భాయ్‌ పథకాన్ని తేవాలని లక్షిస్తోంది. ఇందులో భాగంగా గరిష్ఠంగా మూడు నెలల పాటు రైతులు పంటను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. వాటి అద్దెపై కేంద్రం ఒక్కో క్వింటాకు నాలుగు రూపాయల చొప్పున రాయితీ అందిస్తుంది. ఆ పంట ఉత్పత్తులపై తక్కువ వడ్డీకే రుణాలు లభించేలా చూస్తుంది. తొలి దశలో ఏపీ, అస్సాం సహా ఏడు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పథకం వల్ల రైతులకు ఒనగూడే ప్రయోజనం పెద్దగా ఉండదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  


పటిష్ఠ చర్యలు అవసరం

దేశీయంగా వ్యవసాయం దండగలా మారకూడదంటే, ప్రభుత్వాలు రైతులకు సరైన మద్దతు ధర కల్పించాలి. ముఖ్యంగా తుపానుల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పాలకులు ముందుగానే అప్రమత్తపై పంట నష్టాలను తగ్గించే ప్రయత్నం చేయాలి. నష్టపోయిన పంటలకు సరైన పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. సరైన నిల్వ సదుపాయాలు కొరవడినందువల్ల భారత్‌లో ఏటా 20శాతం దాకా పంట ఉత్పత్తులు వృథా అవుతున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.50 వేల కోట్లని అంచనా. ఈ వృథాను నివారించాలంటే అవసరం మేరకు గోదాముల నిర్మాణానికి పాలకులు నడుం కట్టాలి. వాటిని కేంద్రీకృత వ్యవస్థలోకి తేవాలి. ఈ మేరకు పటిష్ఠ చర్యలు వెంటనే పట్టాలకెక్కితేనే కష్టాల సాగు నుంచి రైతులకు ఉపశమనం దక్కుతుంది.


- ఎం.వి.బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణంపై వేటు.. భవితకు కాటు!

‣ యునెస్కోలో పాక్‌ పైచెయ్యి!

‣ ప్రథమ పౌరుల అధికారం పరిమితమే

‣ ఇండియాతోనే ఈయూ!

‣ ఆహార భద్రతకు భూసార పరిరక్షణ

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని