• facebook
  • whatsapp
  • telegram

ప్రథమ పౌరుల అధికారం పరిమితమే



గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు నవంబరు 10న (2023) కీలక తీర్పు వెలువరించింది. ముఖ్యమైన బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడంపై పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీం తీర్పు వెలువరించింది. గవర్నర్‌ ఏమీ చేయకుండా ‘బిల్లును బిగపట్టడం’ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టీకరించింది.


రాష్ట్రాల ప్రథమ పౌరుల అధికారాలపై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ఆసక్తికరం. ఏదైనా బిల్లుకు గవర్నర్‌ ఆమోదం నిలిపి ఉంచదలచుకుంటే, దాన్ని పునఃపరిశీలన నిమిత్తం ‘సాధ్యమైనంత త్వరగా’ శాసనసభకు తిప్పి పంపాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. శాసనసభ ఆ బిల్లును సవరించినా, సవరించకపోయినా మళ్ళీ నివేదించినప్పుడు గవర్నర్‌ దాన్ని ఆమోదించడం మినహా మరోమార్గం లేదని తేల్చిచెప్పింది. ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదబంధం బిల్లును వేగంగా ఆమోదించడం గవర్నర్‌ రాజ్యాంగ విధి అని నిర్దేశిస్తోంది. గవర్నర్‌ సలహాను పరిగణనలోకి తీసుకోవాలా, వద్దా అనేది తేల్చుకునే అధికారం శాసనసభకు ఉంటుంది. గవర్నర్‌ ఒక బిల్లును తిరస్కరించి అది గడువు తీరిపోయేలా చేయడం, దానికి బదులు కొత్త బిల్లును తీసుకురావాలని శాసనసభను కోరడం రాజ్యాంగ సమ్మతం కాదని సుప్రీం ఉద్ఘాటించింది.


వీటో అధికారం లేదు..

ప్రజలు ఎన్నుకున్న చట్టసభకు ఉండే శాసన నిర్మాణ అధికారాన్ని ప్రజలు ఎన్నుకోని గవర్నర్‌ వీటో చేయడం కుదరదు. రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్‌కు వీటో అధికారం లేనేలేదు. పంజాబ్‌కు ముందు తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలూ తమ గవర్నర్లపై సుప్రీంకోర్టుకు ఇదే తరహాలో ఫిర్యాదులు చేశాయి. తెలంగాణ పిటిషన్‌పై ఈ ఏడాది మార్చి 24న (2023)  ఇచ్చిన తీర్పులోనూ- తమకు సమ్మతంకాని బిల్లులను గవర్నర్లు ‘సాధ్యమైనంత త్వరగా’ శాసనసభలకు తిప్పి పంపాలే తప్ప, వాటిని తమవద్దే ఉంచుకోవద్దని సుప్రీం ఉద్ఘాటించింది. కేరళకు సంబంధించి నవంబరు 24న (2023) ఇచ్చిన తీర్పులో- పంజాబ్‌ విషయంలో పోయిన డిసెంబర్ 10న (2023) తామిచ్చిన తీర్పును పఠించాలని గవర్నర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. శాసనసభ బిల్లులపై తనకు లేని వీటో అధికారాన్ని ప్రయోగించరాదని, పంజాబ్‌ తీర్పును అనుసరించి తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేరళ గవర్నర్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ ఇంకా ముగియలేదు. శాసనసభ తగిన సవరణలతో తిరిగి పంపిన బిల్లుకు గవర్నర్‌ ఆమోదాన్ని బిగపట్టడం రాజ్యాంగ విరుద్ధమనే తమిళనాడు వాదనతో సుప్రీం ఏకీభవించింది. శాసనాలకు సంబంధించి గవర్నర్లకు ఉన్న అధికారాలు చాలా పరిమితమని, వారు మంత్రిమండలి సలహాపైనే తమ విధులను నిర్వహించాలి తప్పితే స్వతంత్రంగా పాలనాధికారాలను చలాయించే హక్కు వారికి లేదని సుప్రీంకోర్టు పదేపదే స్పష్టీకరిస్తూ వచ్చింది. షంషేర్‌ సింగ్‌ తదితరులు వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు మొదలుకొని... నబాం రెబియా వెర్సస్‌ డిప్యూటీ స్పీకర్‌ తదితరుల కేసులో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు వరకు సుప్రీంకోర్టు ఈ అంశాన్నే పునరుద్ఘాటిస్తూ వచ్చింది. నబాం రెబియా కేసులో సుప్రీంకోర్టు గవర్నర్‌కున్న విచక్షణాధికారాన్ని 163(1) రాజ్యాంగ అధికరణ నిర్వచించిందని, ఆ పరిధికి మించి సదరు అధికారాన్ని వినియోగించరాదని ఉద్ఘాటించింది. గవర్నర్‌కు ప్రజాప్రతినిధులకు మించిన అధికారాలు లేవని విస్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు నివేదించాలని, గవర్నర్‌ దాన్ని సమ్మతించడం, సమ్మతిని నిలిపి ఉంచడం, లేదంటే రాష్ట్రపతి పరిశీలనకు సమర్పించడం చేయాలని నిర్దేశిస్తోంది. గవర్నర్‌ ఒకవేళ బిల్లుకు సమ్మతిని నిలిపి ఉంచదలిస్తే దాన్ని పునఃపరిశీలించాలంటూ ‘సాధ్యమైనంత త్వరగా’ శాసనసభకు తిప్పి పంపాలి. 201వ రాజ్యాంగ అధికరణ ప్రకారం, ఏదైనా బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు- దాన్ని ఆమోదించడమో, సమ్మతిని నిలిపి ఉంచడమో చేయవచ్చు. ఆపై గవర్నర్‌కు సదరు బిల్లును రాష్ట్రపతి తిప్పిపంపాలి. గవర్నర్‌ ఆ బిల్లును ‘ఆరు నెలల్లో’ పునఃపరిశీలించాలనే సందేశంతో శాసనసభకు పంపాలి. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను నిలిపి ఉంచడం; 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయడం; రాష్ట్ర పాలన, శాసన నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి నుంచి కోరడం వంటి అధికారాలను రాజ్యాంగం గవర్నర్లకు కల్పించింది. శాసనసభలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించనప్పుడు ముఖ్యమంత్రిని నియమించడం; శాసనసభ బలపరీక్షలో నెగ్గలేకపోయిన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయడం; మంత్రిమండలి రాజీనామా తరవాత ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోతే శాసనసభను రద్దు చేయడం వంటి అధికారాలనూ రాజ్యాంగం గవర్నర్‌కు దఖలు పరచింది. అయితే, వీటిని నిష్పాక్షికంగా ఉపయోగించాలి.


నిర్దిష్ట కాలావధి ఉండాలి..

నిజానికి బిల్లులకు ఆమోదం తెలపకుండా బిగపట్టే అధికారాన్ని రాజ్యాంగం గవర్నర్‌కు ప్రసాదించలేదు. ఇక్కడ ‘సాధ్యమైనంత త్వరగా’ అనే నిబంధనను జాగ్రత్తగా పరిశీలించాలి. 1972లో దుర్గాప్రసాద్‌ ఘోష్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ కేసులో సుప్రీంకోర్టు ‘సాధ్యమైనంత త్వరగా’ అంటే ‘అనవసర జాప్యం లేకుండా, ఆచరణ సాధ్యమైనంత త్వరగా’ అని అర్థవివరణ చెప్పింది. శాసనసభ నివేదించిన బిల్లులకు గవర్నర్‌ ఆరు నెలల్లో ఆమోదం తెలపాలని పంఛీ కమిషన్‌ 2010లో సిఫార్సు చేసింది. గవర్నర్‌ నుంచి రాష్ట్రపతికి వెళ్ళి, అక్కడి నుంచి తిరిగివచ్చిన బిల్లును శాసనసభ ఆరు నెలల్లో పునఃపరిశీలించాలని 201వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. కాబట్టి, ‘సాధ్యమైనంత త్వరగా’ అనే నిబంధనకూ స్పష్టమైన కాలావధిని నిర్దేశించాలి. ఆ వ్యవధి ఆరు నెలలకు మించకుండా చూడాలి. లేదంటే తదుపరి శాసనసభా సమావేశాలు జరిగేలోగా బిల్లు ఆమోదం పొందాలని నిర్దేశించవచ్చు. ఏదైనా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని భావించి రాష్ట్రపతి పరిశీలన కోసం పంపితే తప్ప, అన్ని బిల్లులను గవర్నర్లు నిర్దిష్ట కాలావధిలో ఆమోదించాలి.


విచక్షణాధికారం కాదు

ఏదైనా బిల్లుకు ఆమోదం నిలిపి ఉంచడానికి, సదరు బిల్లును మళ్ళీ పరిశీలించాలంటూ శాసనసభకు తిప్పిపంపడానికి గవర్నర్‌కు ఉన్న అధికారాన్ని విచక్షణాధికారంగా పొరబడుతున్నారని సుప్రీం పేర్కొంది. అసలు ఒక బిల్లును పునఃపరిశీలనకు తిప్పి పంపడమనేది మంత్రి మండలి సలహాపైనే జరగాలని రాజ్యాంగ నిర్మాణసభ నిర్ధారించింది. మంత్రిమండలి ఏదైనా బిల్లుపై పునరాలోచనలో పడినప్పుడు- తగిన మార్పులు చేయడానికి వీలుగా దాన్ని తిప్పిపంపాలని గవర్నర్‌ను కోరే వెసులుబాటు కల్పించాలన్నది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇండియాతోనే ఈయూ!

‣ ఆహార భద్రతకు భూసార పరిరక్షణ

‣ సేంద్రియ వ్యవసాయంతో లాభాలెన్నో!

‣ అసమాన పోరాట శక్తిగా నౌకాదళం

‣ ఇరాన్‌ అమ్ములపొదిలో సరికొత్త క్షిపణి

‣ వర్సిటీ ర్యాంకింగుల్లో మెరుగయ్యేదెన్నడు?

Posted Date: 15-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం