• facebook
  • whatsapp
  • telegram

ఇరాన్‌ అమ్ములపొదిలో సరికొత్త క్షిపణి



ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ పొడ ఏ మాత్రం గిట్టని ఇరాన్‌- హైపర్‌ సోనిక్‌ క్షిపణిని ఇటీవల ఆవిష్కరించింది. ఇది ప్రాంతీయంగా ఆందోళనను మరింత పెంచింది.


దూర శ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని ఇరాన్‌ ఇటీవల ఆవిష్కరించింది. ఇజ్రాయెల్‌లో ఏ ప్రాంతానికైనా చేరుకొనే సత్తా దీనికి ఉంది. ఫతా-2 అని నామకరణం చేసిన ఈ క్షిపణిని అషురా ఏరోస్పేస్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. దీన్ని హైపర్‌ సోనిక్‌ గ్లైడ్‌ వెహికిల్‌ (హెచ్‌జీవీ)గా, హైపర్‌ సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి (హెచ్‌సీవీ)గా ఇరాన్‌ వర్ణించింది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాల తరవాత హైపర్‌ సోనిక్‌ క్షిపణిని రూపొందించుకున్న నాలుగో దేశం ఇరానే. ఈ ఏడాది మొదట్లోనే ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళం ఫతా-1 క్షిపణిని ఆవిష్కరించింది. తాజా క్షిపణి దానికన్నా అధునాతనమైంది. ఫతా-1, 2లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారుచేశామని ఇరాన్‌ చెబుతోంది. శబ్దంకన్నా 13-15 రెట్లు ఎక్కువ వేగంతో ఫతా-2 దూసుకెళ్ళి 1,400 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యంపై విరుచుకుపడగలదు. ఇజ్రాయెల్‌ దేశమంతా దీని పరిధిలోకి వస్తుంది. శత్రు దేశాల క్షిపణి రక్షణ వ్యవస్థలనూ ఫతా-2 ఛేదించగలదు. శత్రు క్షిపణులను గాలిలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగలదు.


ఎలా సంపాదించింది?

హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరిజ్ఞానాన్ని ఇరాన్‌ ఎక్కడి నుంచి సంపాదించిందనేది కీలక ప్రశ్న. క్షిపణి సాంకేతికత నియంత్రణ ఒప్పందం (ఎంటీసీఆర్‌) కింద సభ్య దేశాలు తమ పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి. ఎంటీసీఆర్‌పై సంతకం చేసిన 35 దేశాల్లో భారత్‌ సైతం ఉంది. 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరానికి 500 కిలోల బరువైన బాంబులను తీసుకెళ్ళగల క్షిపణుల పరిజ్ఞానాన్ని ఎంటీసీఆర్‌ దేశాలు ఇతరులతో పంచుకోకూడదు. ఈ సత్తా గల మానవ రహిత గగన వాహనాల (యూసీవీ) తయారీ పరిజ్ఞానాన్నీ ఇతరులకు అందించకూడదు. ఇరాన్‌ వద్ద ఇంతవరకు ఉన్న క్షిపణులు 300 కిలోమీటర్ల లోపు దూరాలకే చేరుకోగలవు. అంతకన్నా ఎక్కువ దూరాలకు దూసుకెళ్ళే క్షిపణులను తయారు చేసే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. అమెరికా ఎటూ తన పరిజ్ఞానాన్ని ఇరాన్‌కు ఇవ్వదు. అందువల్ల రష్యా, చైనాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రష్యా వద్ద అవాన్‌ గార్డ్‌ హైపర్‌ సోనిక్‌ గ్లైడ్‌ వెహికిల్‌ (హెచ్‌జీవీ) ఉంది. ఇది ఖండాలు దాటి అణ్వస్త్రాన్ని ప్రయోగించగలదు. చైనాకు డీఎఫ్‌-17 అనే మధ్య శ్రేణి, డీఎఫ్‌-41 అనే ఖండాంతర హెచ్‌జీవీలు ఉన్నాయి. డీఎఫ్‌-41 సాధారణ బాంబులతోపాటు అణ్వస్త్రాలనూ ప్రయోగించగలదు. చైనా కొత్తగా రెండు హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్షలు జరిపింది. హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరిజ్ఞానంలో చైనాకన్నా అమెరికా చాలా ఏళ్లు వెనకబడి ఉంది. ఇరాన్‌ ఫతా-2 హైపర్‌ సోనిక్‌ క్షిపణికి ఇజ్రాయెల్‌పైనే కాదు, హిందూ మహాసముద్రంలోని అమెరికా యుద్ధ నౌకల మీదా విరుచుకుపడే సత్తా ఉంది. ఈ మహాసముద్రంలో అమెరికా అయిదో నౌకాదళం సంచరిస్తోంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధ సమయంలో ఫతా-2ని ఇరాన్‌ ఆవిష్కరించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.


రష్యాకు డ్రోన్ల సరఫరా

ఇరాన్‌ చుట్టుపక్కల ఇజ్రాయెల్‌, అమెరికాలకు మిత్ర దేశాలే ఉన్నాయి. ఉత్తరాన అజర్‌ బైజాన్‌, ఇరాకీ కుర్దిస్థాన్‌, పశ్చిమాన యూఏఈ, బహ్రెయిన్‌, హిందూ మహాసముద్రంలో అమెరికా నౌకాదళం కమ్ముకుని ఉన్నాయి. మరోవైపు ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌ నలు దిక్కులా తన మిత్ర శక్తులను పెంచిపోషిస్తోంది. లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హూతీ, ఇరాక్‌, సిరియాలలో షియా దళాలు, పాలస్తీనాలో హమాస్‌, గాజాలో ఇస్లామిక్‌ జిహాద్‌ దళాలకు ఇరాన్‌ అండదండలు అందిస్తోంది. ఇవి ఇప్పటికే ఇజ్రాయెల్‌తో పరోక్ష సమరం సాగిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై పోరు కోసం ఇరాన్‌ ఇప్పటికే రష్యాకు డ్రోన్లను సరఫరా చేసింది. రష్యా నుంచి ఎస్‌-300 క్షిపణి వ్యవస్థనూ ఇరాన్‌ కొనుగోలు చేసింది. హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరిజ్ఞానాన్ని ఇరాన్‌ దొంగిలించడమో లేదా, రష్యా నుంచి గుట్టుగా సంపాదించడమో చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇరాన్‌ సొంతంగా ఈ పరిజ్ఞానాన్ని రూపొందించుకోలేదనీ చెప్పలేమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలోకి నేరుగా దిగే ఉద్దేశం ఇరాన్‌కు లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. హైపర్‌ సోనిక్‌ క్షిపణిని ఇజ్రాయెల్‌పై ప్రయోగించే సాహసాన్ని ఇరాన్‌ చేయదని, కేవలం ఆత్మరక్షణ కోసమే దాన్ని రూపొందించుకొని ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. 


 - అరుణిమ్‌ భుయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వర్సిటీ ర్యాంకింగుల్లో మెరుగయ్యేదెన్నడు?

‣ పటిష్ఠ చర్యలతోనే భూతాప నియంత్రణ

‣ జీ20 సారథ్యంలో మేటి విజయాలు

‣ బతుకుల్ని చిదిమేస్తున్న విపత్తులు

‣ కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం