• facebook
  • whatsapp
  • telegram

వర్సిటీ ర్యాంకింగుల్లో మెరుగయ్యేదెన్నడు?

ఐఐఎస్‌సీకి 250వ ర్యాంకుదేశాభివృద్ధిలో కీలకంగా నిలిచే మానవ వనరుల రూపకల్పన, పరిశోధనల్లో ఉన్నత విద్యాలయాల పాత్ర ఎనలేనిది. భారత్‌లో లెక్కకు మిక్కిలిగా విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రపంచస్థాయి ర్యాంకింగుల్లో మన ఉన్నత విద్యాసంస్థలు చాలా వెనకబడుతున్నాయి. దీనికి కారణం ఏమిటి?


ఉన్నత విద్యకు సంబంధించి టైమ్స్‌ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగులు ఇటీవల వెలువడ్డాయి. వాటిలో తొలి రెండు వందల జాబితాలో భారత్‌ నుంచి ఒక్క వర్సిటీ సైతం చోటు సంపాదించలేదు. బెంగళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్ర సంస్థ (ఐఐఎస్‌సీ) 250వ ర్యాంకులో నిలిచింది. భారత్‌ నుంచి మొత్తం 91 విద్యాలయాలు టైమ్స్‌ ప్రపంచ ర్యాంకింగులకు ఎంపికయ్యాయి. వాటిలో ఐఐఎస్‌సీదే అత్యుత్తమ ర్యాంకు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన క్వాక్వరెల్లీ సిమండ్స్‌ (క్యూఎస్‌) ప్రపంచ విద్యాసంస్థల ర్యాంకింగుల్లోనూ తొలి రెండు వందల జాబితాలో కేవలం రెండు భారతీయ వర్సిటీలే చోటు సంపాదించాయి. ఐఐటీ బాంబే 149వ స్థానం, ఐఐటీ దిల్లీ 197వ స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ ఖరగ్‌పుర్‌ 271, ఐఐటీ మద్రాస్‌ 285వ స్థానాలు దక్కించుకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా భారతీయ విశ్వవిద్యాలయాలేవీ ప్రపంచ స్థాయి ర్యాంకింగుల్లో తొలి వంద జాబితాలో లేకపోవడం ఏమిటన్న ప్రశ్న ఇటీవల తరచూ ఉత్పన్నమవుతోంది.


ఆలస్యంగా రంగప్రవేశం

విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగుల కేటాయింపు పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వర్సిటీల్లో కొనసాగుతున్న విద్యావిధానం, వసతుల కల్పన, అక్కడి పరిశోధనలు, విశ్వవిద్యాలయానికి ఉన్న నిధులు, పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు తదితర అంశాలను ర్యాంకుల విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి విశ్వవిద్యాలయానికీ కొన్ని నిధులు ఉంటాయి. చాలామంది సంపన్నులు విశ్వవిద్యాలయాలకు ధనం విరాళంగా ఇస్తుంటారు. ఈ నిధులను కొత్త భవనాల నిర్మాణం, ఉపకార వేతనాల మంజూరు తదితరాలకు వాడుతుంటారు. క్యూఎస్‌ ర్యాంకింగుల్లో అయిదో స్థానంలో నిలిచిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి ఉన్న నిధుల విలువ దాదాపు 5,400 కోట్ల డాలర్లు. 260వ స్థానం సంపాదించిన వర్జీనియా విశ్వవిద్యాలయం నిధుల విలువ వెయ్యి కోట్ల డాలర్లు. భారతీయ విశ్వవిద్యాలయాలకు ఈ స్థాయిలో నిధులు ఉండటం ఊహించలేని విషయం. అందువల్ల నిధుల పరంగా పాశ్చాత్య విశ్వవిద్యాలయాలకు మనకు ఏమాత్రం పొంతనే ఉండదనే చెప్పాలి. ర్యాంకుల కేటాయింపులో మరో ముఖ్యమైన అంశం- పరిశోధనలు. ఈ విషయంలో భారతీయ విశ్వవిద్యాలయాలు కాస్త ఆలస్యంగా రంగప్రవేశం చేశాయి. పాశ్చాత్య వర్సిటీల్లో మొదటి నుంచీ బోధన, పరిశోధన రెండూ కలగలిసి కొనసాగుతున్నాయి. ఇండియాలో పరిశోధనల పరంగా ఒక విభజన పద్ధతి అమలవుతూ వచ్చింది. దీని ప్రకారం రీసెర్చ్‌ బాధ్యత పరిశోధనా సంస్థలది. బోధన బాధ్యత విశ్వవిద్యాలయాలది. ఈ విభజన వల్ల మన ఐఐటీల్లోనూ ఇంచుమించు రెండు దశాబ్దాల కిందటి వరకు పరిశోధనపై పెద్దగా దృష్టి సారించలేదు. విదేశాల్లో మాదిరిగా ఆచార్యులందరూ తప్పనిసరిగా పరిశోధన చేయాలన్న నియమం ఏదీ మన దగ్గర ఉండేది కాదు. ఉత్సాహం, ఆసక్తి ఉన్నవారే పరిశోధన వైపు వెళ్ళేవారు. అంతర్జాతీయ పోటీని తట్టుకోవాలంటే ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనల స్థాయిని, నాణ్యతను పెంచక తప్పదని మన పాలకులకు కాలక్రమంలో అర్థమైంది. ఈ క్రమంలో సంస్థాగతమైన మార్పులు వచ్చాయి. వాటి ప్రకారం ఆచార్యులందరూ పరిశోధన చేయాలన్న నిబంధన తెచ్చారు. ముఖ్యంగా పదవీ ఉన్నతికి, పరిశోధనలకు లంకె పెట్టారు. దీనివల్ల మన విద్యాసంస్థల్లో పరిశోధనకు ప్రాధాన్యం అధికమైంది. పరిశోధనా పత్రాలు, పేటెంట్ల సంఖ్య గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో గణనీయంగా పెరిగింది. మరో దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్త అత్యున్నత విశ్వవిద్యాలయాల ర్యాంకింగుల్లోని తొలి వంద జాబితాలో మన వర్సిటీలు చోటు సంపాదించే అవకాశం ఉంది.సమస్యల పరిష్కారం

క్యూఎస్‌ ర్యాంకింగుల కేటాయింపులో ఒక వర్సిటీ విద్యా ప్రఖ్యాతినీ (అకడమిక్‌ రెప్యుటేషన్‌నూ) పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో భాగంగా పరిశ్రమల నిర్వాహకులు, విద్యారంగ ప్రముఖులను సంప్రతించి సంబంధిత విద్యాసంస్థపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ర్యాంకుల కేటాయింపులో ఇవీ కీలకంగా నిలుస్తాయి. అయితే, ఒక వర్సిటీ ర్యాకింగ్‌ పెరిగితేగాని దాని విద్యకు ప్రఖ్యాతి రాదు. విద్యా ప్రఖ్యాతి వస్తేగానీ ర్యాంకింగ్‌ పెరగదు. మన ఐఐటీలు అందించే విద్యకు ప్రపంచస్థాయిలో ప్రఖ్యాతి లేకపోవడం వల్లే ర్యాంకుల్లో అవి వెనకబడుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తుంటాయి. వాస్తవానికి, విద్యార్థుల్లో జ్ఞాన దీపాలు వెలిగించడం, విజ్ఞానాన్ని విస్తరించడం, దాన్ని పరిరక్షించడం విద్యాసంస్థల బాధ్యతలు. తద్వారా సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నత విద్యాలయాలు కృషి చేయాలి. ర్యాంకింగులకు సంబంధించిన కొలమానాల్లో వీటికే అధిక ప్రాధాన్యం దక్కాలి. ఒక గొప్ప విశ్వవిద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్ధిల్లి, తన చుట్టూ ఉండే సమాజాన్ని ఉద్ధరిస్తుంది. దీన్ని గుర్తించి విద్యాలయాలను అసలైన విజ్ఞాన దివ్వెలుగా మనం తీర్చిదిద్దుకోవాలి. కలకాలం విరాజిల్లే అద్భుత భావి భారత విశ్వవిద్యాలయాల సృష్టి కోసం పాలకులు పాటుపడాలి.


భిన్న కొలమానాలు

ప్రపంచ స్థాయితో పోలిస్తే మన జాతీయ విద్యాసంస్థల ర్యాంకింగ్‌ చట్రం (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో వాడే కొలమానాలు భిన్నంగా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగుల్లో ఒక వర్సిటీ విద్యా ప్రఖ్యాతికి ముప్ఫై శాతం ప్రాధాన్యం ఇస్తారు. మన జాతీయ ర్యాంకింగుల్లో అది పది శాతమే ఉంటుంది. మన ర్యాంకింగుల్లో ఒక వర్సిటీలోని విద్యార్థుల సంఖ్య, పరిశోధనా పత్రాలు, విద్యార్థినులు ఎంతమంది ఉన్నారు తదితర అంశాలకు అధిక ప్రాధాన్యం దక్కుతుంది. దేశీయంగా ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) దాదాపు 27శాతమే. లింగపరమైన సమానత్వం సాధించాలంటే ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరగడం తప్పనిసరి. దేశీయ పరిస్థితులను బట్టి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో అనుసరించే కొలమానాలను మార్గదర్శకంగా తీసుకుని భారత్‌లోని విద్యాసంస్థలు తమ విద్యాప్రమాణాలను పెంచుకోవడానికి కృషి చేయాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పటిష్ఠ చర్యలతోనే భూతాప నియంత్రణ

‣ జీ20 సారథ్యంలో మేటి విజయాలు

‣ బతుకుల్ని చిదిమేస్తున్న విపత్తులు

‣ కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలు

Posted Date: 02-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని