• facebook
  • whatsapp
  • telegram

బతుకుల్ని చిదిమేస్తున్న విపత్తులు



ప్రస్తుతం జాతి, మతం, జాతీయత, రాజకీయ భావజాలపరమైన దుర్విచక్షణలతో వేధింపులకు గురైన వారినే శరణార్థులుగా పరిగణిస్తున్నారు. ఇందులోకి వాతావరణ శరణార్థులనూ తీసుకురావాల్సి ఉంది.  ఇటువంటి నిర్వాసితులను ప్రపంచం విస్మరిస్తోందని ఐరాస మానవ హక్కుల మండలి గతంలోనే స్పష్టం చేసింది.


ప్రపంచంలో రకరకాల ఉత్పాతాల వల్ల సొంత ఊళ్లు, ఇళ్లూవాకిళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయినవారి సంఖ్య 2.15 కోట్లకు చేరిందని ఐరాస శరణార్థుల సంఘం అంచనా. 2030నాటికి వాతావరణ నిర్వాసితుల సంఖ్య 26 కోట్లకు చేరుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. 2050 నాటికి వీరి సంఖ్య 120 కోట్లకు, 2100నాటికి 200 కోట్లకు చేరుతుందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం వరదలు, తుపానుల వల్ల నిర్వాసితులైన వారిలో అత్యధికులు పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, చైనా, భారత్‌, నైజీరియా దేశాలకు చెందినవారేనని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపుతున్నాయి. భారత్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలలో వాతావరణ నిర్వాసితుల సంఖ్య 2030కల్లా 3.75 కోట్లకు, 2050కల్లా 6.29 కోట్లకు చేరుతుందని యాక్షన్‌ ఎయిడ్‌, క్లైమేట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (దక్షిణాసియా) వంటి సంస్థల నివేదిక 2020లోనే హెచ్చరించింది. 2050కల్లా భారత్‌లోనే 4.5 కోట్ల మంది వాతావరణ నిర్వాసితులు ఉంటారంటున్నారు. ఇప్పటికే కోటీ 40 లక్షలమంది ప్రకృతి ఉత్పాతాల కారణంగా స్థానచలనం చెందినట్లు నిర్వాసితుల పర్యవేక్షణ కేంద్రం చెబుతోంది. వాతావరణ మార్పుల వల్ల దెబ్బతిన్న దేశాలకు నష్టాన్ని తట్టుకొనేందుకు నిధులు అందించాలని 2022లో కాప్‌-27 సదస్సు తీర్మానించింది. ఆ నిర్ణయానికి ఈ ఏడాది కాప్‌-28 సదస్సులో కార్యరూపం ఇవ్వాలని నిశ్చయించారు.


వాతావరణ నిర్వాసితులు ప్రధానంగా తమ దేశాల్లోనే ఒకచోటి నుంచి మరో చోటికి వలసవెళ్ళి ఆశ్రయం పొందుతున్నారు. భారతదేశంలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ్‌ బెంగాల్‌లోని సుందర్‌బన్‌ దీవులపై 2019లో విరుచుకుపడిన బుల్‌ బుల్‌ తుపాను ఎన్నో వేల మందిని సురక్షిత స్థలాలకు వలస వెళ్ళేలా చేసింది. సముద్ర మట్టాలు పెరిగి ఉప్పునీరు పొలాల్లోకి చేరడంతో పంటలు పండని స్థితి నెలకొంది. దాంతో వ్యవసాయం, ఇతర వృత్తులపై ఆధారపడిన కుటుంబాల్లో 25శాతం పనుల కోసం కోల్‌కతా తదితర ప్రాంతాలకు వలస వెళ్ళినట్లు గ్రామీణ కుటుంబ సర్వే వెల్లడించింది. ఒడిశాలో చిల్కా సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రకృతి వైపరీత్యాల వల్ల పనుల కోసం దేశంలోని ఇతర చోట్లకు వలస వెళుతున్నారు. భారత్‌లో గంగా మైదానం ఉత్తర ప్రాంతాలతోపాటు దిల్లీ నుంచి లాహోర్‌ వరకు ఎండలు  ఎక్కువవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడుతున్నాయి. ముంబయి, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల తీరంలో సముద్రం పొంగే ప్రమాదం ముంచుకొస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 30 ఏళ్లలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ పాలసీ (సీస్టెప్‌) వెల్లడించింది. ఈ సంస్థ అయిదు దక్షిణాది రాష్ట్రాల్లో అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2050కల్లా వేసవిలో సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర, శీతాకాలంలో రెండు డిగ్రీల మేర పెరుగుతుందని అంచనా కట్టింది. తెలంగాణలో వేసవి, శీతాకాలాల్లో సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల మేర పెరుగుతుందని మదింపు వేసింది.


సముద్రం పొంగడం, తుపానులు, వరదల వల్ల బంగ్లాదేశ్‌లో 53శాతం సాగుభూమి పంటలకు పనికిరాకుండా పోతోంది. ఉప్పునీటిని తట్టుకుని పెరిగే పంటల సాగును చేపట్టడమే పరిష్కారమని గుర్తించారు. వాతావరణ మార్పులవల్ల వర్షపాతంలో వచ్చిన హెచ్చుతగ్గులు తమ పంటలను దెబ్బతీశాయని ఝార్ఖండ్‌లో 90 శాతం రైతులు వాపోయారు. సముద్రం పొంగడం వల్ల తీరప్రాంతాల్లో ఉప్పునీరు భూమిలోకి ఇంకి తాగునీటికి కొరత ఏర్పడుతుంది. ఈ పరిణామం ఇప్పటికే కేరళలోని కొచ్చి నగరంలో కనిపిస్తోంది. ప్రజలు తాగునీటిని కొనడమో, ట్యాంకర్లపై ఆధారపడటమో చేస్తున్నారు. పోనుపోను దేశంలో పలుచోట్ల పంటలు దెబ్బతిని ఆహార సరఫరాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయం, అనుబంధ వృత్తుల్లో ఆదాయాలు పడిపోవచ్చు. ఇలాంటి పరిణామాలు సామాజిక, రాజకీయ అస్థిరతకు దారితీసే ప్రమాదమూ ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కృషి చేస్తూనే వాతావరణ నిర్వాసితులకు ఉన్నచోటే ఆర్థిక అవకాశాలను కల్పించాలి. తద్వారా వారు వలస వెళ్ళాల్సిన అగత్యాన్ని నివారించవచ్చు.


- కైజర్‌ అడపా
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలు

‣ భారత్‌ ఎపెక్‌లో చేరుతుందా?

‣ భద్రమైన జీవనం.. యుద్ధాలతో ఛిద్రం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ ఆదాయం.. సమతూకం!

Posted Date: 01-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం