• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ ఎపెక్‌లో చేరుతుందా?



ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (ఎపెక్‌) శిఖరాగ్ర సమావేశం అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగింది. ఎపెక్‌లో భారత్‌ చేరిక గురించి ఇందులో ప్రముఖంగా చర్చించారు. ఎపెక్‌లో సభ్యత్వం కోసం ఇండియా పలు చర్యలు చేపట్టాల్సి ఉంది.


ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (ఎపెక్‌) 1989లో ఏర్పడింది. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, న్యూజిలాండ్‌, జపాన్‌, రష్యా, అమెరికా, మలేసియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ తదితర 21 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఎపెక్‌ దేశాల జనాభా దాదాపు 290 కోట్లు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 50శాతం, జీడీపీలో 62శాతం వాటా వీటి సొంతం. ఇవన్నీ పసిఫిక్‌ మహాసముద్ర తీర దేశాలే. ఎపెక్‌ దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రాంతీయ ఆర్థిక సహకారంతో సమష్టిగా అభివృద్ధి సాధించాలనే నిబద్ధతతో ఎపెక్‌ ముందుకు సాగుతోంది. ఎపెక్‌ ఏర్పడినప్పటి నుంచి వాణిజ్య సుంకాలను తగ్గించడం ద్వారా వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక సరళీకరణకు పెద్దపీట వేస్తోంది. ఈ విధానాలు ఆసియా-పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధికి చోదక శక్తులుగా నిలుస్తున్నాయి. ఎపెక్‌ ఆర్థికంగా కీలకమైంది, వ్యూహపరంగా ప్రాధాన్యం కలిగింది. ఇందులో భారత్‌కు ఇంతవరకు సభ్యత్వం లభించలేదు.


ఎన్నో ప్రయోజనాలు

ఎపెక్‌లో చేరడానికి 1991లోనే భారత్‌ ప్రయత్నించినా కొన్ని దేశాలు అభ్యంతరం తెలిపాయి. పైగా ఎపెక్‌ పసిఫిక్‌ మహాసముద్ర తీర దేశాలతో ఏర్పడింది. భారత్‌ పసిఫిక్‌కు దూరంగా ఉండటమూ సభ్యత్వానికి అడ్డువచ్చింది. ఇండియానూ చేర్చుకుంటే ఎపెక్‌లో ఆసియా దేశాలకు ఆధిక్యం లభిస్తుందని ఉత్తర, దక్షిణ అమెరికా ఖండ దేశాలు అభ్యంతరపెట్టాయి. ఆర్థికంగా పురోగమించిన చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలతోపాటు ఆరు ఆగ్నేయాసియా సంఘ (ఆసియాన్‌) దేశాలు సైతం ఎపెక్‌లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కొత్త సభ్యుల చేరికపై మారటోరియం 2012లో ముగిసినప్పటి నుంచి ఎపెక్‌లో చేరడానికి భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణను చేపట్టి అధిక జీడీపీ వృద్ధి రేటును సాధిస్తున్న ఇండియాను ఎపెక్‌లో చేర్చుకోవాలని అమెరికా, జపాన్‌ వంటి దేశాలు మద్దతు పలుకుతున్నాయి.


ఎపెక్‌లో భారత్‌ ఇంతవరకు పరిశీలక హోదాలోనే ఉంది. పూర్తిస్థాయి సభ్యత్వం పొందితే ఎపెక్‌ దేశాలతో వ్యాపారాభివృద్ధికి, పెట్టుబడుల ప్రవాహానికి అవకాశం లభిస్తుంది. 2000 సంవత్సరం నుంచి మలేసియా, సింగపూర్‌లతో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలను ఇండియా కుదుర్చుకుంది. భారత్‌-ఆసియాన్‌ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందమూ అమలులోకి వచ్చింది. వీటివల్ల వాణిజ్యం, పెట్టుబడులు వృద్ధిచెందాయి. ఎపెక్‌లో సభ్యత్వంవల్ల అవి మరెన్నో రెట్లు అధికమవుతాయి. వ్యాపార లావాదేవీల ఖర్చు తగ్గి, వాణిజ్యానికి నియమనిబంధనలు సరళమై భారత్‌ నుంచి ఎగుమతులు పెరుగుతాయి. ఎపెక్‌ దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విస్తృతమవుతుంది. ఉత్పాదకతను పెంచే ఆధునిక పద్ధతులనూ ఇండియా అందిపుచ్చుకొంటుంది.భారత్‌కు ఎపెక్‌లో సభ్యత్వం కల్పిస్తే ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యాపార సంస్కరణలు ఊపందుకొంటాయి. ఇండియాకు అమెరికా, రష్యా, జపాన్‌ వంటి దేశాలతో ఉన్న వ్యూహపరమైన మైత్రి, సాగర శక్తి ఎపెక్‌కు ఉపకరిస్తాయి. భారత్‌ ఇప్పటికే ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించింది. గత మూడు దశాబ్దాలలో ప్రపంచ జీడీపీలో ఇండియా వాటా రెట్టింపైంది. భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వమిస్తే ఎపెక్‌ దేశాలకు 140 కోట్లకు పైగా జనాభా గల మార్కెట్‌ అందివస్తుంది. నిపుణ మానవ వనరులు లభిస్తాయి.


ముందున్న సవాళ్లు

ఎపెక్‌లో భారత్‌ సభ్యత్వం ఇరు పక్షాలకూ లాభదాయకమే. అయితే, దీనికోసం ఇండియా తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. భారత్‌ మొదట వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించాలి. ఎపెక్‌ అనుసరించే వాణిజ్య ప్రమాణాలు, నియమాలకు అనుగుణంగా తన నిబంధనావళిని సవరించుకోవాల్సి ఉంటుంది. సుంకాలను తగ్గించడంతోపాటు ఇతర అవరోధాలను తొలగించాలి. అత్యధిక ఎపెక్‌ దేశాలు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఉత్పాదకత పరంగా భారత్‌ కన్నా అవి ముందున్నాయి. వాటి ఆధునిక ఉత్పత్తులు భారతీయ మార్కెట్లలో వెల్లువెత్తితే స్థానిక పరిశ్రమలు, వ్యాపారాలు ఆ పోటీని తట్టుకోలేవు. భారతీయ పరిశ్రమలు ఈ సవాలును అధిగమించేలా వాటిని సన్నద్ధం చేయాలి. హరిత ఇంధనాలు, సామాజిక సమానత్వం వంటి విషయాల్లో ఎపెక్‌ దేశాలకు దీటుగా ఇండియా ఎదగాలి. దీనికోసం ఆర్థిక, సామాజిక సంస్కరణలు తీసుకురావాలి. వీటన్నింటి ద్వారా సమీప భవిష్యత్తులో ఎపెక్‌లో భారత్‌ ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భద్రమైన జీవనం.. యుద్ధాలతో ఛిద్రం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ ఆదాయం.. సమతూకం!

‣ తుంబా రాకెట్‌ ప్రయోగానికి 60 ఏళ్లు

‣ బైడెన్‌ - జిన్‌పింగ్‌.. మాటామంతీ

‣ దిగుబడులపై కరవు ప్రభావం

‣ విపత్తుల కట్టడికి పటిష్ఠ వ్యూహం

Posted Date: 01-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం