• facebook
  • whatsapp
  • telegram

విపత్తుల కట్టడికి పటిష్ఠ వ్యూహంసహజ వనరులను తెలివిగా వినియోగించుకొంటేనే పర్యావరణ వ్యవస్థల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది. విచ్చలవిడిగా అడవులను నరికివేయడం, భూగర్భ జలాలను తోడేయడం, నదుల్లోని ఇసుకను తవ్వేయడం, శిలాజ ఇంధనాలను వినియోగించడం పర్యావరణ వ్యవస్థలకు హానికరం. ఇకనైనా వీటిని నియంత్రించకపోతే విపత్తులు తప్పవని ఐరాస తాజా నివేదిక హెచ్చరిస్తోంది.


ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ, మానవ భద్రత సంస్థ తాజాగా విడుదల చేసిన ‘పరస్పర సంబంధిత విపత్తుల ముప్పు నివేదిక- 2023’లోని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరు రకాలైన పరస్పర సంబంధిత పర్యావరణ అంశాల్లో యావత్‌ ప్రపంచం పతనావస్థకు చేరువవుతున్న వైనాన్ని ఈ నివేదిక వివరించింది. వేగంగా జీవజాతుల అంతర్ధానం, భూగర్భ జలాల క్షీణత, కరిగిపోతున్న మంచు పర్వతాలు, రోదసిలో వ్యర్థాలు పెరగడం, భూగోళం అనూహ్యంగా వేడెక్కడం, భద్రత కరవైన భవిష్యత్తు- ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న పర్యావరణ విపత్కర పరిణామాలుగా ఐరాస తాజా అధ్యయనం వెల్లడించింది. భూ మండలం, ఆవరణ వ్యవస్థలో పర్యావరణ క్షీణతకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను దాటితే పర్యావరణంలో ఆకస్మిక విపరిణామాలు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు వాటిని పూర్వ రూపంలోకి మార్చలేనంతగా మార్పులు సంభవిస్తాయి. అవి ఆవరణ వ్యవస్థల్లో, శీతోష్ణ స్థితిగతుల్లో మొత్తంగా పర్యావరణంలో భయంకరమైన విపత్కర పరిణామాలకు దారితీస్తాయి. భూగోళం వేడెక్కడం, ఆకస్మికంగా కుండపోత వానలు, పిడుగుపాట్లు వంటివన్నీ ఈ కోవకు చెందినవే.


భూగర్భ జలాల క్షీణత

ఇప్పటికే భారత్‌లో గంగా- సింధూ పరీవాహకంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల క్షీణత చిట్టచివరి దశను దాటిందంటూ తాజా అధ్యయనం వెల్లడించింది. వాయవ్య భారత్‌లో 2025 నాటికల్లా భూగర్భ జలాల లభ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా తోడేస్తున్న భూగర్భ జలాల్లో దాదాపు 70శాతాన్ని సాగుకు వాడుతున్నారు. కొన్నిసార్లు నీటి లభ్యత తగినంత స్థాయిలో లేకపోయినా సేద్యానికి భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. సాధారణంగా భూమి లోపలి పొరల్లోని జలధారల నుంచే భూగర్భ జలాల ఊటలు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా 21 ప్రధాన జలధారలు పునరుద్ధరణకు పట్టే సమయాన్ని మించిన వేగంతో క్షీణిస్తున్నాయని ఐరాస విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంది. సౌదీ అరేబియా వంటి దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలమట్టాలు క్షీణించే దశను దాటేశాయి. ఇండియా సహా పలుదేశాలు ఇటువంటి పరిస్థితులకు చేరువలోనే ఉండటం ఆందోళనకరం.


ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద అత్యధికంగా భూగర్భ జలాలను తోడేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. పంజాబ్‌లోని 78శాతం బావుల్లోంచి విచ్చలవిడిగా భూగర్భ జలాలు తోడేసినట్లు తేలింది. ఈ ప్రాంతంలో 2025 నాటికి భూగర్భ జలాల లభ్యత సమస్యాత్మకంగా పరిణమించనుంది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలే 70శాతం సాగు అవసరాల్ని తీరుస్తున్నాయి. వాటి లభ్యత క్షీణించడం పంటల దిగుబడిపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపడమే కాకుండా ఆహార భద్రతకూ పెను సవాలుగా పరిణమించే ప్రమాదముంది. మంచు కొండలు సజీవ జలరాశులకు ప్రధాన వనరులు. నానాటికీ పెరుగుతున్న భూతాపంవల్ల అవి రెట్టింపు స్థాయిలో కరిగిపోతున్నాయి. మంచు పర్వతాలు వేగంగా కరగడంవల్ల సముద్ర మట్టాలు పెరిగి తీరంలోని నగరాలు, పట్టణాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. హిమాలయాలు, కారకోరం, హిందూకుష్‌ పర్వత శ్రేణుల్లోని మంచు పర్వతాలకు కరిగిపోయే ముప్పు పొంచి ఉంది. మరోవైపు, రోదసిలోకి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల సంఖ్య పెరుగుతుండటంతో వ్యర్థాలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. కేవలం కక్ష్యల్లో ఉన్న వాటిలో   25 శాతమే క్రియాశీలక ఉపగ్రహాలు. తక్కినవన్నీ నిరుపయోగ వ్యర్థాలే. ఇవి క్రియాశీల ఉపగ్రహలను ఢీకొట్టి, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ మార్పులు సృష్టిస్తున్న మరో ఉత్పాతం వడగాలులు. విపరీతమైన ఉష్ణోగ్రతలు, తేమ శాతం పెరగడం వల్ల మానవ శరీర ఉష్ణోగ్రతలు చల్లబడటం కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2100 నాటికి 70శాతం కన్నా ఎక్కువమంది వడగాలుల ప్రభావానికి లోనవుతారని అంచనా. వాతావరణ మార్పులవల్ల బీమా ధరలు పెరిగి, చాలామందికి వాటిని చెల్లించలేని పరిస్థితులు ఎదురవుతాయని ఐరాస విపత్తుల ముప్పు నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది రానున్న ఉత్పాతాలను అంచనా వేసి అప్రమత్తం చేయడమే కాకుండా, ప్రజలందరికీ పర్యావరణ స్పృహ అవసరమని చాటుతోంది.


కార్యాచరణ ప్రణాళిక

పట్టణీకరణ, అడవుల నరికివేత, నేలల క్రమక్షయం, కాలుష్యం మూలంగా పర్యావరణ క్షీణతకు తోడు.. చాలీచాలని మౌలిక సదుపాయాలు, లోపభూయిష్ఠమైన భూవినియోగ ప్రణాళికలు, జలవనరుల నిర్వహణ లోపంతో సంభవించే కరవు, నీటి కొరత, వరదలు వంటివి విపత్తుల ముప్పును తీవ్రతరం చేస్తున్నాయి. నష్టతీవ్రతను తగ్గించడానికి ఐరాస విపత్తుల ముప్పు నివేదిక చతుర్ముఖ వ్యూహంతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో విపత్తులను నిలువరించడం, భవన నిర్మాణాలు, భూవినియోగ నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయడం ద్వారా విపత్తులతో సంభవించే నష్ట తీవ్రతను అరికట్టవచ్చు. శిలాజ ఇంధనాల వినియోగానికి బదులు సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక వనరులను వాడాలి. తద్వారా వాతావరణ మార్పుల మూలంగా వాటిల్లే దుష్పరిణామాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి పరచడం ద్వారా సునామీ వంటి విపత్తులను పసిగట్టి ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడవచ్చు. మడ అడవుల పెంపకం వంటి సముద్ర తీర మండల సంరక్షణ విధానాలను అమలు చేయడం, సహజ సిద్ధమైన ఆవరణ వ్యవస్థలను పునరుద్ధరించడం ద్వారా సముద్ర మట్టాల పెరుగుదలను అదుపు చేయవచ్చు.


అంతరించే ముప్పు

భూవినియోగ పద్ధతుల్లో అనుసరిస్తున్న మార్పులు- అంటే సేద్య యోగ్యమైన భూమిని వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగిస్తుండటం, గనులు- ఖనిజాల వెలికితీత పేరుతో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టడం వంటి మానవ చర్యలకు వాతావరణ మార్పులు తోడవుతున్నాయి. వెరసి జీవజాతులు వేగంగా అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. సాధారణంగా జీవజాతులు అంతరించడానికి పట్టే సమయంకన్నా, మానవ చర్యల వల్ల వంద రెట్లు వేగంగా అవి అంతరిస్తున్నట్లు ఐరాస విపత్తుల ముప్పు నివేదిక విశ్లేషించింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అంకురాలే ఆలంబనగా ఆర్థికాభివృద్ధి..

‣ పంట వ్యర్థాలతో లాభాల సాగు

‣ ప్రపంచ ఆర్థికానికి యుద్ధ గాయాలు!

‣ స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!

Posted Date: 22-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని