• facebook
  • whatsapp
  • telegram

అంకురాలే ఆలంబనగా ఆర్థికాభివృద్ధి..



దేశార్థికానికి ఔత్సాహిక వ్యాపారవేత్తలే చోదక శక్తులు. ఐరోపా, అమెరికా మార్కెట్లలో విజయవంతమైన ఎంతోమంది వ్యాపారవేత్తలు ఇటీవలి కాలంలో భారత్‌కు తిరిగి వస్తున్నారని జాతీయ సాఫ్ట్‌వేర్‌, సర్వీసు కంపెనీల సంఘం-నాస్కామ్‌ సహ వ్యవస్థాపకులు సౌరభ్‌ శ్రీవాత్సవ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరం. భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుండటం, అవకాశాలు పెరుగుతుండటమే ఇందుకు కారణమన్నారు.


ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార సంస్థల వ్యవస్థాపకులు దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తారు. వస్తుసేవల ఉత్పత్తికి వనరులను సమర్థంగా వాడుకొంటూ వ్యాపారాలను, పరిశ్రమలను స్థాపించి నడిపిస్తారు. కొత్త అవకాశాలను గుర్తించి, ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించి, కష్టనష్టాలను ఎదుర్కొని తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టగలరు. భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న పరిస్థితుల్లోనూ వారు విజయం సాధించగలరు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తగినంత సంఖ్యలో లేని దేశం శీఘ్ర ఆర్థిక ప్రగతిని సాధించలేదు. దేశార్థికానికి కీలకమైన అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి, ఉపాధి అవకాశాలను విస్తరించి ఆర్థిక ఉద్దీపకులుగా నిలిచే వ్యాపార నిర్వాహకుల  స్ఫూర్తిని దేశం కీర్తిస్తుంది. వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. జాతీయ స్థాయిలో అభ్యుదయం సాధించి, ప్రపంచంలో భారత్‌కు విశిష్ట గుర్తింపు తెచ్చిపెట్టగల సామర్థ్యం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సొంతం. ఆ సామర్థ్యాన్ని అంకితభావంతో, నిబద్ధతతో ఆచరణలోకి తీసుకురావడానికి సహాయ సహకారాలు అందించడం ప్రభుత్వ కర్తవ్యం. వ్యాపార సంస్థల నిర్వాహకుల చొరవను, విజయాలను ప్రశంసించి, వారు మరిన్ని కొత్త శిఖరాలను చేరుకొనేలా ప్రోత్సహించాలి. ఈ క్రమంలో స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ విజయవంతంగా వ్యాపారాలను, పరిశ్రమలను నడపగల ఔత్సాహికులను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.


అడ్డంకులు..

ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులకు తోడు వాటిని సమర్థంగా వినియోగించగల మానవ శక్తి ఉండాలి. అటువంటి ఔత్సాహిక వ్యాపారవేత్తలను అలక్ష్యం చేయడం అభివృద్ధికి ప్రతిబంధకమే అవుతుంది. ఈ అంశాన్ని భారత్‌ గుర్తించింది. గడచిన దశాబ్ద కాలంలో ప్రపంచీకరణ, డిజిటలీకరణలు ఆర్థిక వ్యవస్థల రూపురేఖలను వేగంగా మార్చివేశాయి. ఈ వాతావరణాన్ని విజయవంతంగా ఉపయోగించుకొంటూ ఫలితాలను సాధించగల వ్యాపార నిర్వాహకులు భారతదేశంలో అవతరించారు. వారు స్థాపించిన అంకుర సంస్థలు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. నేడు అంకుర సంస్థల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తోంది. అంకురాలలో 100 కోట్ల డాలర్లకు మించి పెట్టుబడులు సాధించిన సంస్థలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటి యూనికార్న్‌లు భారత్‌లో వందదాకా ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత అత్యధిక యూనికార్న్‌లు మనదేశంలోనే ఉన్నాయి. ఒక్క 2022 సంవత్సరంలోనే 42 భారతీయ అంకురాలు యూనికార్న్‌లుగా ఎదిగాయి.  ప్రభుత్వ ప్రోత్సాహం, సహాయాలతో మన యూనికార్న్‌లలో కొన్ని అంతర్జాతీయంగానూ విఖ్యాతమయ్యాయి. అమెరికా, చైనా, భారత్‌ల తరవాత ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, మెక్సికో, సింగపూర్‌, ఇండొనేసియా వంటి దేశాల్లోనూ అంకురాలు, యూనికార్న్‌లు విస్తరిస్తున్నాయి. యువ అంకుర వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. 


వర్ధమాన దేశాల్లో వ్యాపార సంస్థల వ్యవస్థాపకులు వికాసం సాధించే వాతావరణం పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. తమ దేశాల సుస్థిర అభివృద్ధిలో వారు సంపూర్ణ భాగస్వాములు కాకుండా నిధుల కొరత, నియంత్రణలచట్రం వంటివి అడ్డుపడుతున్నాయి. కొవిడ్‌ సైతం అలాంటివారి పాలిట అశనిపాతంగా పరిణమించింది. పలు చిన్న, మధ్యతరహా సంస్థలు మూత పడటానికి కారణమైంది. వ్యాపార నిర్వాహకులు వేగంగా తేరుకోవడానికి అడ్డంకిగా మారింది. యువ వ్యాపారవేత్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. వర్ధమాన దేశాల్లో వేగంగా పురోగమిస్తున్న డిజిటలీకరణను చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందుకోలేకపోయారు. వర్ధమాన దేశాల విద్యాసంస్థలు ఇప్పటికీ ఉద్యోగార్థులనే తయారు చేస్తున్నాయి. అంతేతప్ప, సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలను స్థాపించేలా వారిని తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఇలాంటి దేశాల్లో వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఉద్భవించి, వికసించే సానుకూల వాతావరణం పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. పాత పరిశ్రమలు, సంస్థలను విచ్ఛిన్నం చేసి కొత్త ఆన్‌లైన్‌ సంస్థల అవతరణకు దారితీస్తున్న సరికొత్త సాంకేతికతలు సవాలు విసరుతున్నాయి. కొవిడ్‌ కారణంగా విచ్ఛిన్నమై అస్తవ్యస్తంగా మారిన సరఫరా గొలుసులు ఇప్పటికీ పూర్తిగా సర్దుకోలేదు. పెట్టుబడుల కొరతకు తోడు సిబ్బందిని నిలబెట్టుకోవడం, నిపుణ సాంకేతిక సిబ్బందిని నియమించుకోవడం, ఉత్పత్తుల మార్కెటింగ్‌, వ్యాపార వ్యూహాల్లో వచ్చిన మార్పులే అందుకు ప్రధాన కారణాలు.


తోడ్పాటు దక్కితే..

మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార నిర్వహణ తీరుతెన్నులను మార్చుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హరిత సంస్థలను స్థాపించాలి. పవన, సౌర శక్తి వినియోగం, వ్యర్థాల శుద్ధి-పునర్వినియోగం, విద్యుత్తు వాహనాలు, కర్బన ఉద్గారాలకు తావివ్వని సాంకేతికతలతో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధకులుగా మారాలి. తమ నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు మెరుగు పెట్టుకోవాలి. అధిక ఉత్పాదకత, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలతో అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాన్ని ఇనుమడింపజేసుకోవాలి. మరోవైపు, ప్రభుత్వపరంగా వ్యాపారవేత్తలకు సత్వరమే పెట్టుబడులు అందే వాతావరణం కల్పించాలి. అంకురాలకు పన్ను విరామాలు ఇవ్వాలి. పెట్టుబడులు, అనుమతులు, ముడి సరకులు, మార్కెటింగ్‌, పన్ను మినహాయింపులు, సులభతర నియమ నిబంధనలను కల్పించి, అవి వేగంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడాలి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వ్యాపార నిర్వహణకు సంబంధించిన ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించాలి. మన విద్యా విధానంలో అందుకు అవసరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాలి. ఇప్పటికే తమ ప్రతిభతో దేశాన్ని అంకుర సంస్థల నిలయంగా మార్చిన వారికి అండగా నిలవాలి.


సహకరించే వాతావరణం

భారత్‌ 2025 కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యంతో వేగంగా పురోగమిస్తోంది. శీఘ్రగతిన ముందడుగు వేసేందుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వనరులు, అవసరమైన నియమ నిబంధనలతో సహాయ సహకారాలను అందిస్తే లక్ష్యసాధన తేలికవుతుంది. భారత్‌ జీడీపీని కొత్త శిఖరాలకు చేర్చడంలోనూ వ్యాపారవేత్తల పాత్ర కీలకంగా మారుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పంట వ్యర్థాలతో లాభాల సాగు

‣ ప్రపంచ ఆర్థికానికి యుద్ధ గాయాలు!

‣ స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!

‣ రోదసిలో భారత కీర్తిపతాక

‣ రష్యా దూకుడుతో అణ్వస్త్ర ఆందోళన

‣ ఉచిత న్యాయం... అవగాహనే కీలకం

‣ డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌

Posted Date: 22-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం