• facebook
  • whatsapp
  • telegram

ఉచిత న్యాయం... అవగాహనే కీలకం



భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ పౌరులంతా చట్టం ముందు సమానమేనని ఉద్ఘాటిస్తోంది. పేదరికం వంటి కారణాల వల్ల న్యాయం అందనివారికి ప్రభుత్వమే న్యాయ సహాయం చేయాలని... అందుకు తగిన చట్టాలు, పథకాలు ప్రవేశపెట్టాలని 39(ఏ) అధికరణ నిర్దేశిస్తోంది. దేశంలో 1952 నుంచే పేదలకు ఉచిత న్యాయసేవల అందజేతపై చర్చ జరుగుతోంది.


మన దేశంలో సమన్యాయం, ఉచిత న్యాయ సహాయానికి రాజ్యాంగంలోని 39(ఏ) అధికరణ భరోసా ఇస్తోంది. దీన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరుస్తూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేపట్టారు. తరవాత 1987లో న్యాయసేవల ప్రాధికార చట్టం తెచ్చారు. అది 1995 నవంబరు తొమ్మిదో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఏటా నవంబరు 9వ తేదీని జాతీయ న్యాయసేవల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఆ సందర్భంగా, ఉచిత న్యాయసేవలు పొందే హక్కు గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్రస్థాయి న్యాయసేవల ప్రాధికార సంస్థలు చైతన్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి.


లోక్‌ అదాలత్‌లతో..

ప్రపంచంలో మొట్టమొదటిసారి పేదలకు ఉచిత న్యాయసేవలు అందించడానికి 1851లో ఫ్రాన్స్‌లో చట్టం తెచ్చారు. 1944లో బ్రిటన్‌ సైతం అలాంటి చట్టం తీసుకొచ్చింది. భారత్‌లో 1958లో 14వ న్యాయ సంఘం ఉచిత న్యాయసేవల ఆవశ్యకతను నొక్కిచెప్పింది. 1980లో హుస్సేనారా ఖాటూన్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో పేదలకు న్యాయం పొందే హక్కును సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఖత్రీ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో ఉచిత న్యాయ సహాయానికి 21వ రాజ్యాంగ అధికరణ వీలు కల్పిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. 1980లో జస్టిస్‌ పీఎన్‌ భగవతి నేతృత్వాన న్యాయ సహాయ పథకాల అమలు కమిటీ (సిలాస్‌) దేశమంతటా ఉచిత న్యాయసేవల అమలు, పర్యవేక్షణ బాధ్యతను స్వీకరించింది. 1987 న్యాయసేవల ప్రాధికార సంస్థల చట్టం- వివాదాల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. సిలాస్‌ లోక్‌ అదాలత్‌లను ఆచరణలోకి తెచ్చింది. 1987నాటి చట్టంలోని మూడో సెక్షన్‌ కింద 1995లో జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా)ను నెలకొల్పారు. బడుగు వర్గాలకు ఉచిత న్యాయసేవలు అందేలా చూడటం నల్సా బాధ్యత. లోక్‌ అదాలత్‌ల ద్వారా వివాద పరిష్కారానికి ఈ చట్టం గుర్తింపునిస్తోంది. దేశంలో మొట్టమొదటి లోక్‌ అదాలత్‌ 1982 మార్చి 14న జునాగఢ్‌లో ఏర్పడింది. తరవాత దేశవ్యాప్తంగా నెలకొన్న లోక్‌ అదాలత్‌లు ఎన్నో వివాదాలను పరిష్కరిస్తున్నాయి. ఇంతవరకు 3.26 కోట్ల కేసులను పరిశీలించిన జాతీయ లోక్‌ అదాలత్‌- వాటిలో 1.27 కోట్ల కేసులను పరిష్కరించింది.


న్యాయ సహాయం పొందే హక్కు గురించి పౌరులకు తెలియజెప్పడానికి 2021 అక్టోబరు రెండో తేదీ నుంచి నవంబరు 14 వరకు దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడం, మొబైల్‌ వ్యాన్ల ద్వారా ప్రచారం, న్యాయ సహాయ క్లినిక్‌ల ద్వారా చైతన్యం పెంచడం వంటివి చేపట్టారు. మొత్తం 38 కోట్ల మందికి న్యాయసేవల గురించి అవగాహన కల్పించారు. నల్సా నిరుడు జాతీయస్థాయిలో అవగాహన కార్యక్రమం చేపట్టింది. అందులో మొబైల్‌ ఫోన్ల కోసం ఐఓఎస్‌ వెర్షన్‌ న్యాయసేవల యాప్‌ను ఆవిష్కరించారు. న్యాయ సహాయం కోసం 10 భాషల్లో దరఖాస్తు చేయడానికి ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. వివిధ డిజిటల్‌ వేదికల మీద 67,000 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విచారణ ఖైదీల కేసుల సమీక్షా సంఘం 10,028 సమావేశాలు ఏర్పాటుచేసింది. 1,137 జైలు న్యాయసేవల క్లినిక్‌ల ద్వారా 2,27,344 మంది న్యాయ సహాయం పొందారు. నల్సా, జాతీయ మహిళా సంఘం కలిసి న్యాయపరమైన అవగాహన ద్వారా మహిళల సాధికారత కోసం నిర్వహించిన కార్యక్రమాలవల్ల 5,33,548 మందికి ప్రయోజనం చేకూరింది. 2021 డిసెంబరు 31 నాటికి దేశమంతటా 12,794 న్యాయసేవల క్లినిక్‌లు కార్యాచరణ సాగిస్తున్నాయి.


నల్సాతోపాటు జాతీయస్థాయి సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ, 39 హైకోర్టు న్యాయసేవల కమిటీలు, 37 రాష్ట్రస్థాయి న్యాయసేవల కమిటీలు, 673 జిల్లాస్థాయి న్యాయసేవల సంస్థలు, 2465 తాలూకా స్థాయి న్యాయసేవల సంస్థలు ఉచిత న్యాయసేవలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు, మౌలిక వసతులను సమకూరుస్తోంది. పదేళ్ల అనుభవమున్న 33,556 మంది న్యాయవాదులు, 24,704 మంది పారా లీగల్‌ వాలంటీర్లు పేదలకు న్యాయం అందించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. చట్టపరమైన అవగాహన పెంచడానికి పాఠశాలల్లో 22,321 లీగల్‌ లిటరసీ క్లబ్బులను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు ఇవి 1,26,856 అవగాహనా కార్యక్రమాలు చేపట్టాయి. ఉచిత న్యాయసేవల కోసం 2021-22 కేంద్ర బడ్జెట్‌లో రూ.145 కోట్లు కేటాయించారు. పేదలకు న్యాయసహాయం అందించడంలో కేరళ పథగామిగా నిలుస్తోంది. ఈ విషయంలో తమిళనాడు, మహారాష్ట్రలు కూడా ముందువరసలో ఉన్నాయి.


ప్రత్యామ్నాయ ప్రక్రియ

షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, మహిళలు, పిల్లలు, దివ్యాంగుల విషయంలో ఉచిత న్యాయసహాయం పొందడానికి ఆదాయ పరిమితి నిబంధనను తొలగించారు. తద్వారా దేశంలో అత్యధిక పేద ప్రజలు ఉచిత న్యాయ సహాయం పొందే వెసులుబాటును పార్లమెంటు కల్పించింది. ఈ సదుపాయం గురించి విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఎస్‌) ప్రక్రియలో న్యాయశాస్త్ర విద్యార్థులను భాగస్వాములను చేస్తే ఎందరికో శీఘ్రంగా న్యాయం జరుగుతుంది. అనుభవజ్ఞులైన న్యాయవాదులు సామాజిక బాధ్యతగా పేదలకు ఉచిత న్యాయం అందించేందుకు కృషి చేయాలి. స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. ఉచిత న్యాయసేవలకు కేంద్రం, రాష్ట్రాలు మరిన్ని నిధులు కేటాయించాలి. సంపన్న దేశాల్లో పేదలను న్యాయం పొందే హక్కు, సౌకర్యాల గురించి జాగృతపరుస్తారు. అందుకు నిర్ణీత కాలావధితో కార్యక్రమాలు చేపడతారు. భారత్‌లోనూ ఆ రీతిగా అవగాహన కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి.


సత్వర పరిష్కారం కోసం..

కొవిడ్‌ సమయంలో న్యాయసేవల ప్రాధికార సంస్థలు ఉచిత న్యాయం అందించడానికి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాయి. వాదిప్రతివాదులు ప్రత్యక్షంగా హాజరు కానక్కర్లేకుండా ఈ-అదాలత్‌లలో పరిష్కారం పొందే వీలు కల్పించారు. దేశంలో 402 శాశ్వత లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో 348 ఇప్పటికీ పనిచేస్తున్నాయి. సత్వర న్యాయసాధన కోసం కోర్టుల వెలుపల 465 ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రాలు, మరో 572 మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా 52,568 వివాదాలను పరిష్కరించడానికి ఇవి తోడ్పడ్డాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌

‣ ప్రాజెక్టు కుశ.. గగనతల రక్షణ కవచం!

‣ వాతావరణ మార్పులతో దిగుబడి తెగ్గోత

‣ అసమానతలపై పోరుకు హేతుబద్ధ పన్నులు

‣ భారత్‌ దౌత్యానికి అగ్ని పరీక్ష!

Posted Date: 11-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం