• facebook
  • whatsapp
  • telegram

ప్రాజెక్టు కుశ.. గగనతల రక్షణ కవచం!



శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకొనే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకొనే కార్యక్రమాన్ని భారత్‌ చేపట్టింది. ‘ప్రాజెక్టు కుశ’ కింద 2028-29 కల్లా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇజ్రాయెలీ రక్షణ వ్యవస్థ ఐరన్‌ డోమ్‌ను ఇది పోలి ఉంటుంది.


భారతదేశ పటిష్ఠ గగనతల రక్షణ వ్యవస్థకు ఉద్దేశించిన ప్రాజెక్టు కుశకు కేంద్ర మంత్రివర్గ భద్రతా వ్యవహారాల సంఘం నిరుడు మే నెలలోనే అనుమతి ఇచ్చింది. దీనికింద రూ.21,700 కోట్ల వ్యయంతో అయిదు స్క్వాడ్రన్ల క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని రక్షణ శాఖ లక్షిస్తోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే దూరశ్రేణి క్షిపణులు (ఎల్‌ఆర్‌-శామ్‌) ప్రాజెక్టు కుశలో కీలక అంతర్భాగం. వీటిని భారత్‌ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటోంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ సైతం ఇండియా గగనతల రక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి చేపట్టే ప్రాజెక్టు కుశ- ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనలో మైలురాయిగా నిలుస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


అత్యాధునిక రాడార్లు

ప్రాజెక్టు కుశలో మూడు రకాల ఎల్‌ఆర్‌-శామ్‌లు ఉంటాయి. అవి శత్రు భూభాగం నుంచి భారత్‌ వైపు దూసుకొచ్చే విమానాలు, క్షిపణులను అడ్డుకొంటాయి. ఒక తరహా ఎల్‌ఆర్‌-శామ్‌ శత్రు విమానం 150 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దాన్ని తుత్తునియలు చేస్తుంది. మిగతావి 250 కిలోమీటర్లు, 350 కిలోమీటర్ల దూరంలోని విమానాలను అడ్డుకొని పేల్చేస్తాయి. ఇవి సుదూరంలో ఉన్న చిన్నవాటితో పాటు గగనతల హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ (అవాక్స్‌), ఇంధన భర్తీ విమానాలనూ ధ్వంసం చేయగలవు. ఎల్‌ఆర్‌-శామ్‌ను ప్రయోగిస్తే శత్రు విమానాన్ని 85శాతం కచ్చితత్వంతో ఒకే దఫాలో తుత్తునియలు చేస్తుంది. ఒక ఎల్‌ఆర్‌-శామ్‌ తరవాత అయిదు సెకన్లలోనే రెండో క్షిపణిని ప్రయోగిస్తే 98.5శాతం కచ్చితత్వంతో శత్రు విమానాన్ని పేల్చేస్తుంది. ఇవి శత్రువు గగనతల దాడిని అడ్డుకొని దేశాన్ని కాపాడతాయి. ప్రాజెక్టు కుశ కింద సుదూరంలోని శత్రు విమానాలను పసిగట్టే నిఘా వ్యవస్థను, వాటిని ధ్వంసం చేయడానికి ఉపకరించే అధునాతన రాడార్లను సైతం అభివృద్ధి చేస్తారు. శత్రు భూభాగంలో 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం వరకు పరిశీలించగల శక్తి ఈ రాడార్ల సొంతం. అంటే పాకిస్థాన్‌ మొత్తం, చైనాలో టిబెట్‌ పీఠభూమి ఈ రాడార్ల పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్‌ఎఫ్‌) రాడార్‌ వ్యవస్థనూ నెలకొల్పుతారు. ఇది సాధారణ రాడార్లకు చిక్కని స్టెల్త్‌ యుద్ధ విమానాలనూ గుర్తిస్తుంది. 


ఎల్‌ఆర్‌-శామ్‌లకు తోడుగా రష్యన్‌ ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థనూ భారత్‌ మోహరించనుంది. 543 కోట్ల డాలర్ల వ్యయంతో మొత్తం అయిదు ఎస్‌-400 ట్రయంఫ్‌ స్క్వాడ్రన్లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి భారత్‌ 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో మూడు ఇప్పటికే అందాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తలమునకలు కావడంతో మిగతా రెండు స్క్వాడ్రన్ల సరఫరా ఆలస్యమైంది. వచ్చే ఏడాది అవి రెండూ భారత్‌ చేతికి అందుతాయంటున్నారు. 380 కిలోమీటర్ల పరిధి గల ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలు మూడింటినీ పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో మోహరించారు. భారత్‌ సొంతంగా తయారుచేసుకుంటున్న ఎల్‌ఆర్‌-శామ్‌లను రష్యన్‌ ఎస్‌-400తో పోలుస్తున్నా, ఆ రెండింటికీ ముఖ్యమైన తేడా ఉంది. ఎస్‌-400 స్వల్ప, మధ్య, దూర శ్రేణిలో శత్రు విమానాలపై దాడి చేయగల సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థ. దీనికి భిన్నంగా ప్రాజెక్టు కుశ దూరశ్రేణి ముప్పులను ఎదుర్కొనే వ్యవస్థ. అంటే శత్రు విమానాలు, క్షిపణులను బాగా దూరం నుంచే పసిగట్టి ఇది విరుచుకుపడుతుంది.


జంట దాడుల నుంచి రక్షణ

అటు చైనా, ఇటు పాకిస్థాన్‌ నుంచి ఏకకాలంలో ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కు ఎస్‌-400 రక్షణ వ్యవస్థ, ప్రాజెక్టు కుశ ఎంతగానో అక్కరకొస్తాయని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్‌కు భారీ సంఖ్యలో విమానాలు, క్షిపణులను ప్రయోగించే సత్తా ఉంది. వాటిని ఎదుర్కోవడానికి కచ్చితత్వంతో పనిచేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకోవడం భారత్‌కు తప్పనిసరి. ఏకకాలంలో చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధం చేయాల్సి వస్తే భారత వైమానిక దళాన్ని పూర్తిగా తనవైపే తిప్పుకొని పాక్‌కు సులువుగా ఇండియాపై దాడి చేసే అవకాశాన్ని చైనా కల్పించగలదు. ప్రాజెక్టు కుశ రెండు వైరి పక్షాల నుంచి గగనతల దాడులను అడ్డుకొంటూ మన వాయుసేన సమర్థంగా జంట శత్రువులపై విరుచుకుపడే వెసులుబాటు అందిస్తుంది. లద్దాఖ్‌లో భారత్‌, చైనా దళాలు ఘర్షణ పడినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్‌ దేశం తన వద్దనున్న ఎస్‌-400 వ్యవస్థలను మోహరించింది. వివిధ రకాల క్షిపణులతో రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంది. దీన్ని ఛేదించడం భారత్‌కు అత్యావశ్యకం. చైనాతోపాటు పాకిస్థాన్‌ సరిహద్దులోనూ ప్రాజెక్టు కుశ, ఎస్‌-400 వ్యవస్థలను మోహరించడం ద్వారా జంట దాడుల ప్రమాదాన్ని ఇండియా సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది.  


అవసరం  ఏమిటి?

ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ను హమాస్‌ ఇటీవల ఛేదించడాన్ని చూసి ప్రాజెక్టు కుశ సామర్థ్యంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనకు ఎస్‌-400 వ్యవస్థ ఉంది. దేశ రాజధాని రక్షణ కోసం ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగల అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ(నాసామ్‌)నూ అమెరికా నుంచి సమకూర్చుకుంటున్నాం. అలాంటప్పుడు ప్రాజెక్టు కుశ అవసరమేమిటని రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌ అనిల్‌ చోప్డా ప్రశ్నించారు. ఇజ్రాయెల్‌ రక్షణ అవసరాలకు, మనకు తేడా ఉందని మరికొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా, ఇజ్రాయెల్‌ను ఐరన్‌ డోమ్‌ చాలావరకు కాపాడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే భారత్‌ సొంత ఐరన్‌ డోమ్‌ తరహా ప్రాజెక్టు కుశను చేపట్టింది. ఇండియా మీద పాక్‌, చైనాలు దాడి చేయాలంటే వెనకాడే పరిస్థితిని ఇది కల్పిస్తుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణ పరిరక్షణకుహరిత ఇంధనం

‣ యుద్ధ జ్వాలల్లో భూగోళం

‣ మదుపరులకు మేలెంత?

‣ చైనా ఎత్తులకు పైయెత్తు!

Posted Date: 07-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం