• facebook
  • whatsapp
  • telegram

చైనా ఎత్తులకు పైయెత్తు!



చైనాకు దీటుగా భారత్‌ సైతం వ్యూహాత్మకంగా విదేశీ భూభాగాల్లో స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. మారిషస్‌లో నౌకాదళ స్థావరాన్ని ఇండియా నెలకొల్పింది. ఇది హిందూ మహాసముద్ర నైరుతి భాగంపై నిఘాకు ఎంతగానో ఉపకరిస్తుంది.


మారిషస్‌ దీవుల్లోని ప్రధాన దీవికి వెయ్యి కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న అగలేగా ద్వీప ద్వయం హిందూ మహాసముద్రంలో అత్యంత రద్దీగా ఉండే నౌకా రవాణా మార్గంలో ఉన్నాయి. 2021 వరకు అక్కడ చేపల పడవలు లంగరు వేయడానికి ఒక డాక్‌, చిన్న విమానాలు దిగడానికి రన్‌ వే మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెద్ద అగలేగా దీవిలో భారతదేశం విశాలమైన రన్‌ వేను, నౌకల రాకపోకలకు వీలుగా జెట్టీని నిర్మించింది. భారీ బోయింగ్‌ పి-81 నిఘా విమానాలు, జలాంతర్గాములపై దాడి చేసే విమానాలు దిగడానికి అనువైన రన్‌ వేను నెలకొల్పింది. భారత నౌకాదళం కనీసం 50 మంది అధికారులు, గార్డులను అగలేగా ద్వీపానికి పంపించనుంది.


తీర రక్షక దళానికి అండ

ఆఫ్రికాలోని జిబూటీలో ఇప్పటికే చైనా తన స్థావరం ఏర్పాటు చేసు కుంది. అక్కడికి సమీపంలోని అగలేగాలో భారత్‌ నౌకా స్థావరాన్ని నెలకొల్పడం విశేష ప్రాముఖ్యం సంతరించుకుంది. జిబూటీతోపాటు ఈక్వెటోరియల్‌ గినీలోనూ చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయనుందని అమెరికా వెల్లడించింది. ఈక్వెటోరియల్‌ గినీ అట్లాంటిక్‌ మహాసముద్ర తీరంలో ఉంది. అక్కడి నుంచి అమెరికా, ఐరోపా దాకా చైనా నౌకాదళ కార్యకలాపాలను విస్తరించడానికి ఈక్వెటోరియల్‌ గినీ స్థావరం సాధనంగా మారుతుంది. ఈక్వెటోరియల్‌ గినీ సైతం బీఆర్‌ఐ కింద చైనా నుంచి అప్పులు తీసుకుని రుణ ఊబిలో కూరుకుపోయింది. మరోవైపు హిందూ మహాసముద్రంలోని రుణగ్రస్త దేశాలైన పాకిస్థాన్‌, శ్రీలంకల్లోని గ్వాదర్‌, హంబన్‌తోట రేవులు చైనా గుప్పిట్లోనే ఉన్నాయి. ఏతావతా హిందూ, అట్లాంటిక్‌ మహాసముద్రాలలో చైనా నౌకాదళ కార్యకలాపాలు పెరగనున్నాయని తేలిపోతోంది. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో చైనా రవాణా నౌకలతోపాటు యుద్ధ నౌకలు, జలాంతర్గాముల సంచారం ఎక్కువైంది. ఇది మున్ముందు మరింత విస్తరించనుంది. చైనా నౌకాదళ కార్యకలాపాలపై నిఘా వేయడంతో పాటు అగలేగా దీవుల అభివృద్ధికీ భారత నౌకాదళం చేయూత ఇస్తుంది. మారిషస్‌ తీర రక్షక దళానికి అండగా నిలుస్తుంది. మారిషస్‌ తీరంలో భారత్‌ 2015లోనే 104 రాడార్‌ నిఘా కేంద్రాల ఏర్పాటుకు సహకరించింది. మారిషస్‌కు సమీపంలోని మాల్దీవుల్లో ఇటీవలి ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ గెలవడంతో భారత్‌కు మిత్రదేశం మారిషస్‌ ఎంతగానో అక్కరకు రానుంది. మారిషస్‌కు సమీపంలోని ఆఫ్రికాలో 46 దేశాల్లో చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టులను చేపట్టింది. పలు దేశాల్లో సాధారణ ఓడరేవులు నిర్మించింది. కెన్యాలో పెద్ద రైల్వే ప్రాజెక్టునూ చేపట్టింది. ప్రస్తుతం ఆఫ్రికాలో పదివేలదాకా చైనా సంబంధిత పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తిష్ఠ వేశాయి. ఈ విధంగా బీఆర్‌ఐ కింద ఆఫ్రికాలో తనకు లభించిన ఆర్థిక ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని చైనా అక్కడ సైనికంగానూ పాగా వేస్తోంది. రష్యా సైతం అదే బాటలో ఉంది.


సంయుక్త కార్యకలాపాలు

సూడాన్‌, నైగర్‌ దేశాలలో రష్యన్‌ వాగ్నర్‌ గ్రూపు కార్యకలాపాలపై అమెరికా ఆందోళన చెందుతోంది. ఇటీవల తిరుగుబాటు జరిగిన నైగర్‌ నుంచి ఫ్రెంచి సేనలను సాగనంపగా, ఆ దళాలు పొరుగున ఉన్న చాడ్‌ దేశానికి చేరాయి. ఇదంతా ఆఫ్రికాలో అమెరికా, ఐరోపా దేశాల ప్రాబల్యం క్షీణించడానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలకు భారత్‌ ఆయుధాలను ఎగుమతి చేస్తూ, రక్షణ సహకారం పెంచుకోవడం గణనీయ పరిణామం. ముఖ్యంగా నైజీరియాతో భారత్‌ రక్షణ సంబంధం బలపడుతోంది. ఇటీవలే భారత నౌకాదళానికి చెందిన సుమేధా యుద్ధ నౌక నైజీరియాలోని లాగోస్‌ రేవులో మూడు రోజులపాటు లంగరు వేసింది. గత ఏప్రిల్‌లో సూడాన్‌ నుంచి భారతీయులను తరలించడానికీ సుమేధను భారత్‌ నియోగించింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకల సంచారం ఎక్కువగా ఉండే గినియా సింధుశాఖలో సంయుక్త కార్యకలాపాలు నిర్వహించాలని, సముద్ర దొంగల ఆటకట్టించాలని భారత్‌, నైజీరియాలు నిశ్చయించాయి. అగలేగా దీవిలోని భారత నౌకాదళ స్థావరం ఈ కార్యకలాపాలకు ఎంతో తోడ్పడుతుంది. మారిషస్‌కు భారత్‌ 2021లో డార్నియర్‌ విమానాన్ని, నిరుడు ధ్రువ్‌ హెలికాప్టర్లను అందించింది. మారిషస్‌ కోస్ట్‌గార్డ్‌ కోసం వివిధ ఆధునిక పరికరాల కొనుగోలుకు నిధులనిచ్చింది. ఇలాంటి వ్యూహాత్మక చర్యల ద్వారా హిందూ మహాసముద్రంలో పట్టు పెంచుకోవడానికి భారత్‌ గట్టిగా కృషి చేస్తోంది.


- ఆర్య
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆహార భద్రతకు పెను సవాళ్లు

‣ యానిమేషన్‌ రంగం.. ఉపాధికి ఊతం!

‣ డ్రాగన్‌తో తెగదెంపులు సాధ్యమేనా?

‣ నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?

Posted Date: 06-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం