• facebook
  • whatsapp
  • telegram

నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?



జనసంఖ్యలో అగ్రస్థానానికి చేరిన భారత్‌-నోబెల్‌ పురస్కారాల్ని మాత్రం సాధించ లేకపోతోంది. చిన్న దేశాలు సైతం ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకొంటున్నాయి. మన విద్యావిధానంలో లోపమా.. మౌలిక సదుపాయాల కొరతా.. మన ఆలోచనా విధానంలోనే తేడా ఉందా?


వైజ్ఞానిక రంగాల్లో భారతీయులకు నోబెల్‌ బహుమతులు ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నను పలు కోణాల నుంచి పరిశీలిస్తూ చర్చించాలి. ఒకసారి మన దేశంలో వైజ్ఞానిక పురోగతి జరుగుతున్న తీరును గమనిద్దాం. ప్రతి దశకానికో, తరానికో పాశ్చాత్య ప్రపంచంలో వైజ్ఞానిక రంగంలో కొత్త ఒరవడులు పుడతాయి. భారతీయులు ఆయా దేశాలకు వెళ్ళి కొత్త విషయాలను నేర్చుకుని స్వదేశంలో వాటిని ప్రచారంలోకి తీసుకొస్తారు. పాత సిద్ధాంతాలకు మనం అలవాటు పడేలోపే కొత్తవి దిగుమతికి సిద్ధంగా ఉంటాయి. వాటిని మళ్ళీ నేర్చుకుంటాం. ఈ పరిణామం ఒక వృత్తంలా సాగుతుంది. కొత్త సిద్ధాంతాలు ఎప్పుడూ ఎక్కడో పుట్టి ఇక్కడికి దిగుమతి కావలసిందే తప్ప, ఇక్కడ పుట్టి విశ్వవ్యాప్తం కావడమనేది చాలా అరుదు. నోబెల్‌ బహుమతీ అంతే. కొత్త సిద్ధాంతాలను, ఒరవడులను పుట్టించిన పురోగాములకే ఇది దక్కుతుంది. వాటిని చాకచక్యంగా అభ్యసించి ప్రచారం చేసినవారికి మాత్రం కాదు.



వలసవాద ఆలోచన తీరు

శతాబ్దాల వలస పాలన వల్ల రాజకీయ రంగంతో పాటు మేధా రంగంలోనూ ఒక విధమైన బానిస సంప్రదాయం కొనసాగుతోంది. మన పరాయి పాలకుల భావాలే ఉన్నతమైనవని, మన సొంత భావాలు అధమమైనవని, బయటివారి ఆమోదం ఉంటే తప్ప మన ఆలోచనలు చెల్లవని మనం నమ్మేలా చేశారు వాళ్లు! అలనాటి మెకాలే వాదానికి వారసత్వంగా మనకు మిగిలిన వలసవాద ఆలోచనా దృక్పథం నేటికీ పూర్తిగా పోలేదు. అందుకే, సొంత భావాలను ధైర్యంగా వెలిబుచ్చే ఆత్మవిశ్వాసం మనలో సన్నగిల్లింది. వలసవాద ఆలోచనా విధానంవల్ల విద్యారంగంలో సంభవించిన పరిణామాలే వైజ్ఞానిక పరిశోధనలకూ వ్యాపించాయి. ‘అంతర్జాతీయ ప్రమాణాల’ పేరుతో అందరూ ఒకే మూసలో పనిచేస్తుంటారు. అలా పనిచేస్తేనే తోటి శాస్త్రవేత్తల మన్నన, ఆమోదం ఉంటుంది. ఎప్పుడో అరుదుగా ఆ మూసలో ఇమడని ఓ కొత్త సిద్ధాంతాన్నో, భావాన్నో ఎవరో వ్యక్తం చేస్తారు. అలాంటి భావాలను వ్యక్తంచేసే భారతీయ శాస్త్రవేత్తను విచిత్రంగా చూస్తారు మనవాళ్లు! కానీ, శాస్త్ర విధానాలను ప్రయోగించి ఆ సిద్ధాంతంలోని నిజానిజాలను పరీక్షించాలని ఎవరికీ అనిపించదు. అంత ధైర్యం, ఆసక్తి ఎవరికీ ఉండవు. అటువంటి పరీక్ష జరిగితే, అది ఏదో ఒక నాటికి మళ్ళీ పాశ్చాత్య ప్రపంచంలోనే జరగాలి. పరీక్షలో ఆ సిద్ధాంతం నెగ్గితే, పాశ్చాత్య దేశాల ఆమోదం ఉంటే, తోటి భారతీయ శాస్త్ర సమాజం కూడా ఆమోదిస్తుంది. ఇక్కడి పరిస్థితులు ఇలా ఉంటాయి కాబట్టి, లోతైన మౌలిక భావాల శోధన జోలికి ఎవరూ వెళ్ళరు. చిన్నాచితకా పరిశోధనలు చేసి, నిర్వివాదమైన విషయాల మీద పేపర్లు రాసి, పదోన్నతులు తెచ్చుకుని సాఫీగా ముందుకు సాగిపోతుంటారు. కానీ, పాశ్చాత్య ప్రపంచంలో అలా ఉండదు. వారు కూడా అలాగే ఆలోచించి ఉంటే వారి విజ్ఞానానికి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచవ్యాప్త ఆమోదం, ప్రభావం ఉండేవికావు.


నేను అమెరికాలో పీహెచ్‌డీ చేసే రోజుల్లో మా విశ్వవిద్యాలయంలో పనిచేసే ఇల్యా ప్రిగోజిన్‌ అనే నోబెల్‌ గ్రహీత ఉపన్యాసాలు వినే భాగ్యం దక్కింది. ఆయన పుస్తకాలు కూడా చదివాను. భౌతిక రసాయన రంగాలకు చెందిన ఒకే ఒక మూల సమస్యను పరిష్కరించడం కోసం, ఒకే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం జీవితమంతా ఆయన పడ్డ ప్రయాస చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాగే, స్టాన్లీ ప్రూస్నర్‌ అనే మరో నోబెల్‌ గ్రహీత కథ తీసుకుందాం. ఒక రకం ప్రోటీన్ల వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన చేసిన ఆవిష్కరణకు నోబెల్‌ పురస్కారం లభించింది. మొదట్లో స్టాన్లీ సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించలేదు. కొన్నేళ్ల క్రితం ఇండియాలో ఆయన మా సంస్థను సందర్శించినప్పుడు- ‘నేను పనిచేసిన సంస్థలో ఓ పదేళ్ల పాటు ఇంచుమించు నన్ను వెలివేసినట్టుగా చూశారు. అలాంటి పరిస్థితుల్లో నా భార్య నాకు కొండంత దన్నుగా నిలిచారు’ అంటూ తన అనుభవాల గురించి చెప్పుకొన్నారు. అందుకని, ఎవరికీ తట్టని రీతిలో ఆలోచించి, ఓ కొత్త సిద్ధాంతాన్ని సూత్రీకరించి, దాని నిరూపణ కోసం ఆధారాలు సేకరించి, ఎవరేమన్నా పట్టించుకోకుండా, ఏకాగ్ర చిత్తంతో పది, ఇరవై, ముప్ఫై ఏళ్ల పాటు- అవసరమైతే జీవితాంతం ఆ భావాల స్థాపన కోసం పనిచేస్తే... నోబెల్‌ బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది.


కీలక సవాళ్లు..

నిజానికి, శాస్త్రవేత్తలు బహుమతుల కోసం, అవార్డుల కోసం పనిచెయ్యరు. అవార్డుల కోసం చేసే పరిశోధన- మార్కుల కోసం చదివే చదువు లాంటిది. శాస్త్రవేత్త ఒక గొప్ప వైజ్ఞానిక ఆదర్శం కోసం అంకితభావంతో కృషి చేస్తాడు. అలా గొప్పగా కృషి చేసిన వారికి రాజకీయ కారణాలవల్ల తగిన బహుమతులు రాకపోయినప్పటికీ, ఏదో ఒకనాటికి శాస్త్ర సమాజంలో కొందరైనా గుర్తిస్తారు. నిజమైన శాస్త్రవేత్తలకు ఆ గుర్తింపు చాలు. కాబట్టి, బహుమతుల కోసం పని చేయకుండా, వివిధ రంగాల్లో ఎదురవుతున్న కీలకమైన సవాళ్లను పరిష్కరించగలిగితే శాస్త్ర సమాజం భారతీయ సమాజానికి ఎనలేని సేవ చేసినట్లు అవుతుంది. అటువంటి సేవలకు ‘ఇస్రో’ సాధిస్తున్న ఘన విజయాల పరంపరే నిదర్శనం. భారతీయ శాస్త్ర సమాజం అన్ని వైజ్ఞానిక రంగాల్లో గొప్ప పరిశోధన ఫలితాలను అందివ్వగలిగితే- అది కోటి నోబెల్‌ బహుమతులతో సమానం!


అక్కడే ఎందుకు ఎక్కువ?

అహరహం పరిశోధనలకే అంకితమయ్యే శాస్త్రవేత్తలు మన దేశంలోనూ ఉంటారు. కానీ, ఇక్కడి సామాన్య వైజ్ఞానిక సమాజంలో ఉండే ఆత్మన్యూనతాభావం వల్ల కొత్త పుంతలు తొక్కేవారిని ఎవరూ పట్టించుకోరు. అయినప్పటికీ, ఏ నాటికైనా గుర్తింపు దక్కుతుందనే ఆశతో కొందరు దేశీయంగానే ప్రయాసపడుతుంటారు. మరికొందరు విదేశాలకు వెళ్ళి తమ సత్తాకు తగిన మన్నన పొందుతుంటారు. పాశ్చాత్య దేశాల్లోని పరిశోధకులకు ఎందుకు మన్నన లభిస్తుందంటే- మనకులాగా ఆత్మన్యూనతా భావం, అభద్రతా భావం వారికి ఉండవు! అందుకనే, వైజ్ఞానిక రంగంలో నోబెల్‌ బహుమతి దక్కే అవకాశం ఇక్కడకన్నా అక్కడ అధికం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లంకతో మాయని చెలిమి

‣ మండలి సంస్కరణలకు భారత్‌ పట్టు

‣ తలసరి ఆదాయంలో మనమెక్కడ?

‣ ప్రకృతి విధ్వంసం.. మనిషే కారణం!

Posted Date: 06-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం