• facebook
  • whatsapp
  • telegram

మండలి సంస్కరణలకు భారత్‌ పట్టు



అక్టోబరు 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐరాస ఆవిర్భవించింది. ఐరాస ప్రధాన అంగాల్లో ఒకటైన భద్రతామండలి నేటికీ మొత్తం ప్రపంచానికి ప్రతిబింబంలా నిలవడం లేదు. కాలానుగుణంగా మండలిలో ఎటువంటి సంస్కరణలూ చోటుచేసుకోవడం లేదు. దీనిపై భారత్‌ గట్టిగా గళం వినిపిస్తోంది.


ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. అప్పటికి, ఇప్పటికి ప్రపంచం ఎంతగానో మారిపోయింది. అయితే, భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు. మండలిలో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లే నేటికీ కొనసాగుతున్నాయి. అన్ని అర్హతలున్న ఇతర దేశాలకు ఆ హోదా దక్కడం లేదు. 53 దేశాలతో ప్రారంభమైన ఐరాసలో ఇప్పుడు సభ్యదేశాల సంఖ్య 193కు చేరింది. ఇన్నేళ్లలో భద్రతా మండలిని ఒకే ఒక్కసారి 1965లో విస్తరించారు. దాంతో తాత్కాలిక, శాశ్వత సభ్య దేశాల సంఖ్య 11 నుంచి 15కి పెరిగింది. మండలిలో 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. ఇవి రొటేషన్‌ పద్ధతిపై మారుతుంటాయి. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల్లో ఏ ఒక్కదానికీ ఇప్పటిదాకా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించలేదు. చిన్న ఐరోపా ఖండం నుంచి రెండు దేశాలకు శాశ్వత హోదా ఉంది. 2003లో ఇరాక్‌పై అమెరికా, నిరుడు ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పుడు భద్రతా మండలి ఆపలేకపోయింది. సమకాలీన ప్రపంచంలో ప్రాదేశిక, రాజకీయ మార్పులకు అనుగుణంగా భద్రతా మండలి మారలేకపోతోంది.


వీటో అధికారం దుర్వినియోగం

భారత్‌, బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌లు ప్రస్తుతం అంతర్జాతీయంగా తమ ప్రాధాన్యం చాటుకొంటున్నాయి. ఈ నాలుగు దేశాలను కలిపి గ్రూప్‌ ఆఫ్‌ 4 (జీ4)గా వ్యవహరిస్తున్నారు. వాటిలో ఏ ఒక్కదానికీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా లభించలేదు. ఇది మండలి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. శాశ్వత సభ్యత్వ హోదా కలిగిన అయిదు దేశాలు మిగతా ప్రపంచానికి నియమ నిబంధనలు బోధిస్తూ, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. 1945 నుంచి అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పులను భద్రతా మండలి ప్రతిబింబించడం లేదని భారత్‌ విమర్శిస్తోంది. మండలిని సర్వామోదనీయ వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే దాన్ని సంస్కరించక తప్పదని ఉద్ఘాటిస్తోంది. ముఖ్యంగా శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను 26కు పెంచాలని సూచిస్తోంది. జీ4 దేశాలతోపాటు ఆఫ్రికా గ్రూపు సిఫార్సు చేసే రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. దీనివల్ల ప్రధాన ప్రాంతీయ దేశాలకు అంతర్జాతీయ హోదా ఏర్పడి ప్రపంచ ప్రయోజనాలను సమర్థంగా కాపాడగలుగుతాయని ఇండియా వివరిస్తోంది.


ఐరాస భద్రతా మండలిలో కొత్తగా శాశ్వత సభ్యత్వం పొందే దేశాలకూ వీటో అధికారం ఉండాలని భారత్‌ స్పష్టం చేస్తోంది. దీనివల్ల పూర్వ శాశ్వత సభ్య దేశాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుండదు. తద్వారా మండలికి అంతర్జాతీయ ఆమోదనీయత చేకూరుతుంది. కొత్త, పాత శాశ్వత సభ్యదేశాలు వీటో అధికారాన్ని ఎంతో విచక్షణతో, అదీ అసాధారణ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి. సామూహిక జనహననం, యుద్ధ నేరాలు, మానవాళిపై ఘోరాలను నిరోధించడానికి మాత్రమే వీటో అస్త్రాన్ని ప్రయోగించాలని భారత్‌ ప్రతిపాదిస్తోంది. ఐరాస సర్వ ప్రతినిధి సభ (జనరల్‌ అసెంబ్లీ)కి భద్రతా మండలి మరింత జవాబుదారీగా ఉండాలని భారత్‌ సూచిస్తోంది. ఉగ్రవాద నిరోధం వంటి ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై భద్రతా మండలి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోకుండా కొన్ని శాశ్వత సభ్య దేశాలు వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని నివారించే ఏర్పాట్లు ఉండాలని, ఇలాంటి అంశాల్లో సాధారణ సభకు మండలి జవాబుదారీగా వ్యవహరించాలని ఇండియా కోరుతోంది.


భద్రతా మండలిని సంస్కరించడంపై మూడు దశాబ్దాలుగా ఐరాస బహిరంగ చర్చల్లో, అంతర్‌ ప్రభుత్వ సంప్రతింపుల వేదిక (ఐజీఎన్‌)లో సుముఖత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, మండలి పనితీరులో చిన్నాచితకా మార్పులు తప్పితే సమూల సంస్కరణలేమీ జరగలేదు. ఇటీవల ఐరాస 78వ సాధారణ సభ సమావేశాల సందర్భంగా విడిగా భేటీ వేసిన జీ4 దేశాల విదేశాంగ మంత్రులు మండలి సంస్కరణల తీరుతెన్నుల గురించి చర్చించారు. సంస్కరణలు ఎంతవరకు వచ్చాయో సమీక్షించారు. భద్రతా మండలి సంస్కరణలు ఆలస్యమైనకొద్దీ అది తన సామర్థ్యం, విశ్వసనీయతలను కోల్పోతుందని హెచ్చరించారు. మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని 2008లోనే తీర్మానించినా అడుగు ముందుకు పడలేదని వారు విమర్శించారు. ఈ అంశంపై 2009 నుంచి జరుగుతున్న ఐజీఎన్‌ సంప్రతింపుల్లోనూ పురోగతి కొరవడింది.


శాంతి, సుస్థిరతలకు భంగం

ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, భద్రతా మండలి కొన్ని సాఫల్యాలను కనబరచింది. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా, లాటిన్‌ అమెరికాలలో శాంతి, సుస్థిరతలకు భంగం వాటిల్లిన సందర్భాల్లో పరిష్కారానికి బరిలోకి దిగింది. అసలు భద్రతా మండలి అనేదే లేకపోతే ఉద్రిక్తతలు మరింత ప్రజ్వరిల్లేవి. అయితే, శాశ్వత సభ్య దేశాలు మిగతా ప్రపంచాన్ని కాదని తీసుకునే నిర్ణయాలు శాంతి, సుస్థిరతలకు భంగం కలిగిస్తున్న మాట నిజం. అంతర్జాతీయ వ్యవస్థను శాశ్వత సభ్యదేశాలు అస్థిరపరచనంత వరకు మండలి అవసరాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. భారత్‌, ఇతర జీ4 దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించినప్పుడే భద్రతా మండలి నేటి ప్రపంచానికి ప్రతీకగా నిలవగలుగుతుంది.


మోకాలడ్డుతున్న చైనా

భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రాబోయే రోజుల్లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పరుగులు తీస్తోంది. ప్రపంచంలో మూడో పెద్ద సైనిక బలం భారత్‌కు ఉంది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోంది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్యాసియా, ఆసియాన్‌ దేశాలు ఈ విషయంలో భారత్‌ను బలపరుస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలూ మద్దతిస్తున్నాయి. ఇలా ధనిక, వర్ధమాన దేశాలు రెండింటి నుంచీ భారత్‌ మద్దతు పొందుతోంది. ఇటీవల దిల్లీలో జరిగిన జీ20 సభలో ఆస్ట్రేలియా, పోర్చుగల్‌ దేశాలు భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం పొందడానికి అర్హమని ఎలుగెత్తి చాటాయి. తరవాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఆఫ్రికన్‌ యూనియన్‌, చివరకు తుర్కియే సైతం భద్రతా మండలి సంస్కరణలకు మద్దతు ప్రకటించాయి. మండలి సంస్కరణలకు, భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మోకాలడ్డే ఒకే ఒక్క దేశం- చైనా!


- డాక్టర్‌ ఆర్‌.బి.కిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తలసరి ఆదాయంలో మనమెక్కడ?

‣ ప్రకృతి విధ్వంసం.. మనిషే కారణం!

‣ ఆదాయాల తెగ్గోత.. పొదుపులో క్షీణత

‣ సేంద్రియ ఎరువులుగా పంట వ్యర్థాలు

‣ బాలికలకు భద్రతే భరోసా

‣ ‘పసుపు బోర్డు’ పసిడి సిరులు పండిస్తుందా?

Posted Date: 25-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం