• facebook
  • whatsapp
  • telegram

బాలికలకు భద్రతే భరోసా



మనం పుష్కరకాలంగా ఏటా అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకొంటున్నాం. ఐక్యరాజ్య సమితి, బీజింగ్‌ కార్యాచరణ వేదికల ఆధ్వర్యాన 1995లో ప్రపంచ మహిళా సదస్సు జరిగింది. ప్రతినిధులంతా బాలికల సమానత్వం, వారి హక్కుల గురించి లోతుగా చర్చించారు. తదనుగుణంగా చేసిన ‘బీజింగ్‌ తీర్మానం’- బాలికల హక్కుల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తోంది.


భారతీయ కుటుంబాల్లో బాలికలకు ప్రత్యేక స్థానముంది. అమ్మాయి పుడితే లక్ష్మీదేవి జన్మించినట్లుగా భావిస్తుంటారు చాలామంది. అయినప్పటికీ, ఇంటాబయటా వారికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సమానత్వం, హక్కుల విషయంలో మహిళలు, బాలికల పట్ల దుర్విచక్షణ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా బాలికలకు ఎదురవుతున్న సమస్యలపై 2011లో ఐక్యరాజ్య సమితి చర్చించి, అక్టోబరు 11వ తేదీని ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’గా ప్రకటించింది. అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు వారి సాధికారత కోసం కృషిచేసేలా ప్రపంచదేశాలను ఉద్యుక్తులను చేయాలన్నదే దీని ఉద్దేశం. ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అన్నింటిలోనూ లింగ సమానత్వం, మహిళలు, బాలికల సాధికారత అంతర్భాగాలుగా ఉన్నాయి. 2030కల్లా వీటిని సాధించడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.


చదువుల్లో వెనకబాటు..

ఐరాస మహిళా విభాగం, యునిసెఫ్‌ల నివేదిక ప్రకారం- ప్రతి అయిదుగురు బాలికల్లో ఒకరు కనీసం పదో తరగతి వరకైనా చదవడం లేదు. పై చదువులకు వెళ్ళిన ప్రతి పదిమంది బాలికల్లో నలుగురు ఇంటర్మీడియట్‌ పూర్తి చేయలేకపోతున్నారు. అల్పాదాయ దేశాల్లోని యువతుల్లో 90శాతం అంతర్జాల సేవలను వినియోగించలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5-14 ఏళ్ల వయసు బాలికలు తమ సమాన వయసున్న అబ్బాయిల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. అయినప్పటికీ, వారికి ఎలాంటి భత్యం లభించడంలేదు. కుటుంబాల్లో పనిభారం ఎక్కువగా అమ్మాయిలపైనే పడుతోంది. ఎంతోమంది కౌమార బాలికలు సన్నిహితుల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారని, కొత్తగా హెచ్‌ఐవీ సోకుతున్నవారిలో యువతులు పెద్దసంఖ్యలో ఉంటున్నారని ఐరాస నివేదిక పేర్కొంది. తరచూ ఎదురవుతున్న వేధింపుల కారణంగా బాలికలు చదువులకు దూరమవుతున్నారు. ఇంటికి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్ళి వచ్చేటప్పుడు, బడుల్లోనూ వారు హింసకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి బాధితుల సంఖ్య ఆరు కోట్ల వరకు ఉంటుందని తాజా సర్వేలో తేలింది. వేధింపుల వల్ల అమ్మాయిల మానసిక స్థితి తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. పర్యవసానంగా వారి ఆరోగ్యం, అభివృద్ధి కుంటువడతాయి. వేధింపులు తాళలేక ఏటా అర్ధాంతరంగా చదువు ముగిస్తున్న బాలికల సంఖ్య 24.6కోట్ల వరకు ఉంటుందని ఓ అధ్యయనంలో యునిసెఫ్‌ విశ్లేషించింది.


భారతదేశంలో బాలికల జనాభా సుమారు 25.30 కోట్లు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 929 మంది బాలికలే ఉన్నారు. పైగా, మగపిల్లలకంటే ఆడపిల్లలే ఎక్కువగా చనిపోతున్నది మన దేశంలోనే కావడం దురదృష్టకరం. 20-24 ఏళ్ల వయసు మహిళల్లో 23.3శాతం 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్నారు. బాల్య వివాహాలను నిర్మూలించడంతో పాటు వారు జీవితంలో నిలదొక్కుకొనేందుకు వీలుగా మహిళల కనీస వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం బాల్యవివాహాల నిషేధ(సవరణ) బిల్లును తీసుకొచ్చింది. నిరుడు జనవరి నాటికి దేశంలో మొత్తం 2,26,728 పోక్సో కేసులు పెండింగులో ఉన్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం- 2021 చివరి నాటికి తెలంగాణలో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 4,332 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. 40.3శాతం కేసులు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. జాతీయ సగటు (36.8శాతం) కంటే ఇది ఎక్కువ! తెలంగాణలో రోజూ సగటున ఏడుగురు మైనర్లపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నట్లు విశ్లేషణలు వచ్చాయి. తల్లి పక్కనే నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసికందును అపహరించి, అత్యాచారానికి పాల్పడటం వంటి ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.


అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. బాలికల విద్య, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి- బేటీ బచావో బేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన వంటి పథకాలను తీసుకొచ్చారు. తొమ్మిది, పదో తరగతి చదివే బాలికలను ప్రోత్సహించేందుకు జాతీయ పథకం, ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ వంటివి ఉపయోగపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలూ ఆడపిల్లల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టాయి. తెలంగాణలో కేసీఆర్‌ కిట్‌తో పాటు ఆడపిల్ల పుట్టినవారికి నగదు అందజేత, కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలకు పైగా ఆర్థిక చేయూత వంటివి అమలవుతున్నాయి. కస్తూరిబా బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ప్రత్యేక గురుకులాలు వంటివి ఉండటంవల్ల తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.


అవగాహనే కీలకం

బాలికల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే, మొదట వారికి తల్లిదండ్రుల సంపూర్ణ మద్దతు ఎంతో అవసరం. జీవన నైపుణ్యాలపై వారికి తర్ఫీదు ఇవ్వాలి. బాలికలపై వేధింపులను నివారించేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమ హక్కుల పట్ల వారికి అవగాహన పెంపొందించాలి. కీలక రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, వారు రాణించేందుకు అవసరమైన వనరులను సమకూర్చాలి. అత్యాచార బాధితుల కోసం ప్రత్యేకంగా పునరావాస ఏర్పాట్లుచేసి, వారి సంపూర్ణ ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి. భద్రత, భరోసా దక్కినప్పుడే- బాలికల జీవితాల్లో ఆనందం విరబూస్తుంది.


ఆలోచన  మారాలి..

చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలను చులకనగా చూస్తుంటారు. అబ్బాయిల ముందు వారిని తక్కువచేసి మాట్లాడటం, డబ్బులు ఖర్చుచేసే విషయంలో వ్యత్యాసం చూపడం చేస్తుంటారు. ఇటువంటి దుర్విచక్షణను కుటుంబ స్థాయిలోనే అరికట్టాలి. తల్లిదండ్రులు అమ్మాయిలు చెప్పేది వినడం, వారి ప్రశ్నలకు సమాధానమివ్వడం, నిర్ణయాలు తీసుకునే విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం ఎంతో అవసరం. నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చు. ఆడ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించినా, కట్నం ఇవ్వనిదే వివాహం కావడంలేదు. వరకట్న నిషేధం, రక్షణకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నప్పటికీ, అవేవీ సరిగ్గా అమలు కావడంలేదు. వీటిని చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘పసుపు బోర్డు’ పసిడి సిరులు పండిస్తుందా?

‣ ప్రకృతి రక్షణ.. జీవ వైవిధ్య పరిరక్షణ!

‣ పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనమెంత?

‣ అజేయ శక్తిగా భారత వైమానిక దళం

‣ రైతును ప్రేమించిన తపస్వి

Posted Date: 14-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం