• facebook
  • whatsapp
  • telegram

ప్రకృతి రక్షణ.. జీవ వైవిధ్య పరిరక్షణ!భౌగోళిక పర్యావరణ వ్యవస్థల సమతౌల్యాన్ని కాపాడటంలో జీవ వైవిధ్యానిదే కీలక పాత్ర. ఇది పర్యావరణ వ్యవస్థల సుస్థిరతను, వాతావరణ నియంత్రణను మెరుగుపరుస్తుంది. విలువైన జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది.


ప్రపంచ దేశాల స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగందాకా సహజ వనరులు, పర్యాటకం, పర్యావరణ వ్యవస్థలు తదితరాల ద్వారానే సమకూరుతుంది. జీవవైవిధ్య ప్రక్రియల్లో అంతరాయం తలెత్తితే ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. పర్యావరణ వ్యవస్థల ఉత్పాదకత తగ్గడం, తెగుళ్లు వ్యాపించడం, సూక్ష్మక్రిములు వృద్ధి చెందడం, వ్యాధులు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. వాతావరణ మార్పుల కారణంగా వడగాలులు, అకాల వర్షాలు సంభవిస్తాయి. ఫలితంగా ఆహార భద్రతకు తీరని నష్టం వాటిల్లుతుంది. మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుంది.


నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా పట్టణీకరణ వేగాన్ని పుంజుకుంది. పారిశ్రామికీకరణ ఇతోధికమైంది. వ్యవసాయ భూములు తరిగిపోతున్నాయి. కార్చిచ్చులు, చెట్ల నరికివేత వల్ల అడవులకు నష్టం వాటిల్లుతోంది. వాతావరణంలోకి హరిత వాయు ఉద్గారాలు విడుదలవుతూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాలు సకాలంలో పడటం లేదు. వాయు, నీటి, నేల కాలుష్యాలు పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయి. ఇవి సహజ ఆవాసాల విధ్వంసం, క్షీణత, విచ్ఛినానికి దారి తీస్తున్నాయి. ఇలాంటి కాలుష్య భరిత వాతావరణాన్ని తట్టుకోలేక వివిధ రకాల వృక్ష, జంతుజాతులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. అనేక జీవజాతులు అంతరిస్తున్నాయి. మరోవైపు మితిమీరిన రసాయనిక మందుల వాడకం వల్ల ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయి. వ్యాధులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, వివిధ రకాల రసాయనిక కారకాల ప్రభావాల వల్ల నీరు కాలుష్యం బారిన పడుతుండటంతో వలస పక్షుల ఆవాస ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లుతోంది. గనుల తవ్వకాల వల్ల భారీ లోహాలు, ఆమ్లాల వంటి కలుషిత కారకాలు పరిసర నేల, నీటి వనరుల్లోకి చేరుతున్నాయి. నీటి లభ్యత, నాణ్యత, ప్రవాహ మార్గాల్లో మార్పులకు అవి కారణమవుతున్నాయి. ఇది వన్యప్రాణుల సహజ ఆవాసాల నాశనానికి దారితీస్తోంది. తద్వారా వాటి కదలికలు, వలసలకు భంగం వాటిల్లుతోంది. ఈ నివాస నష్టం వృక్షజాలాన్నీ నేరుగా ప్రభావితం చేస్తుంది. దానివల్ల వన్యప్రాణులకు ఆహార లభ్యత తగ్గి, క్రమంగా వాటి సంఖ్య తరిగిపోతుంది. తీరప్రాంతాల్లో భార ఖనిజాల కోసం ఇసుక తవ్వకాల చేపడుతున్నారు. దానివల్ల సముద్రపు నీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకొస్తోంది. ఫలితంగా తీరప్రాంతాలకు రక్షణ కల్పించే తీగజాతి మొక్కలకు మంచినీరు లభించక అవి అంతరించి పోతున్నాయి. నదుల్లోనూ ఇసుకను చాలా లోతు వరకు తవ్వితే నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల నిల్వలు క్షీణిస్తాయి.


వివిధ రకాల రసాయనిక కాలుష్య కారకాల వల్ల భారీ లోహాలు, పురుగు మందులతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేస్తున్నాయి. సముద్ర జీవుల్లో కాలుష్య కారకాలు పేరుకుపోతున్నాయి. సముద్రాల్లో ఓడల నుంచి చమురు చిందడం వల్ల అక్కడి జీవులు ఊపిరాడక అంతరిస్తున్నాయి. వ్యవసాయం, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే అధిక పోషక వ్యర్థాలు సముద్రాల్లో హానికరమైన నాచుకు ఇంధనంగా పనిచేసి ప్రాణవాయువు స్థాయులను తగ్గిస్తున్నాయి.


ప్రకృతిని పరిరక్షించడమంటే జీవ వైవిధ్యాన్ని కాపాడటమే. జీవ వైవిధ్య సమతుల్యతలో లోపాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని విపత్తులు సంభవిస్తాయి. వీటిని నివారించాలంటే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించాలి. దీర్ఘకాలిక పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలు రూపొందించి పటిష్ఠంగా అమలు చేయాలి. అటవీ నిర్మూలనను అరికట్టాలి. జాతీయ ఉద్యానాలను పెంపొందించడమూ తప్పనిసరి. పర్యావరణ పర్యాటకాన్నీ ప్రోత్సహించాలి. సుస్థిర భూ వినియోగ పద్ధతులను పాటించాలి. నీటి వనరులు, సరస్సులు, చిత్తడి నేలల కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. సముద్రాలను కాలుష్యం బారి నుంచి కాపాడటమూ తప్పనిసరి. జీవవైవిధ్యానికి కలిగే నష్టం వల్ల సంభవించే విపత్తులపై ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడమూ కీలక అంశం.


- ఆచార్య నందిపాటి సుబ్బారావు

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనమెంత?

‣ అజేయ శక్తిగా భారత వైమానిక దళం

‣ రైతును ప్రేమించిన తపస్వి

‣ పురోగామి రాష్ట్రాలకు నష్టం

‣ చిరకాల మైత్రికి సరికొత్త సవాళ్లు

‣ ఆర్థిక స్వేచ్ఛతో మెరుగైన జీవనం

‣ పుతిన్‌, కిమ్‌.. ఏం మాట్లాడుకున్నారు?

Posted Date: 09-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని