• facebook
  • whatsapp
  • telegram

చిరకాల మైత్రికి సరికొత్త సవాళ్లుమాల్దీవుల నూతన అధ్యక్షుడిగా చైనాకు అనుకూలమైన ‘పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ నేత మహమ్మద్‌ మయిజ్జు విజయం సాధించారు. దీంతో భారత్‌ - మాల్దీవుల సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.


ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) అభ్యర్థి మహ్మద్‌ మయిజ్జు అనూహ్య విజయం సాధించారు. ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌ (పీపీఎం) మద్దతుతో ఆయన 54.04 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సొలిహ్‌ 45.96 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. మాల్దీవుల రాజధాని మాలే మేయర్‌గా ఉన్న మయిజ్జు అక్టోబర్ (2023) 17న అధ్యక్షుడిగా ప్రమాణం చేసే అవకాశముంది. వాస్తవానికి, మయిజ్జు స్థానంలో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాజీ అధ్యక్షుడు, పీపీఎం నేత అబ్దుల్లా యామీన్‌ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాలని పీఎన్‌సీ, పీపీఎంలు తొలుత భావించాయి. అవినీతి కేసులో ఆయన 11 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి రావడంతో ఎన్నికల్లో పోటీకి అర్హత కోల్పోయారు. దాంతో మయిజ్జు పేరు తెరపైకి వచ్చింది.


ప్రస్తుత అధ్యక్షుడైన మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎండీపీ) నేత సొలిహ్‌ భారత్‌కు అనుకూలమైనవారు. ఈ ఏడాది జనవరిలో పార్టీలో జరిగిన అంతర్గత ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు నషీద్‌పై పైచేయి సాధించారు. దాంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. సొలిహ్‌, నషీద్‌లు బాల్య స్నేహితులు. అయినప్పటికీ, అంతర్గత ఎన్నికల్లో ఓటమి తరవాత నషీద్‌ వేరుపడి ‘డెమోక్రాట్స్‌’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. నషీద్‌ సైతం అనేక అంశాల్లో భారత్‌ అనుకూల వైఖరినే కనబరచేవారు. అధ్యక్ష ఎన్నికల ముందు రాజకీయ సమీకరణలు చకచకా మారిపోయాయి. ఇంతకాలం సొలిహ్‌ సర్కారుకు దన్నుగా నిలుస్తూ వచ్చిన మాల్దీవ్స్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ ఎన్నికల ముందు మయిజ్జుకు మద్దతు ప్రకటించింది. దీనికి తోడు డెమోక్రాట్స్‌ అభ్యర్థి ఇలియాస్‌ లబీబ్‌ ఓట్లను భారీగా చీల్చారు. వెరసి- అధ్యక్షుడు సొలిహ్‌ తాజా ఎన్నికలో మట్టి కరవక తప్పలేదు!


ఇక్కడ మనం గమనించవలసింది- ఇండియాను లక్ష్యంగా చేసుకుని, దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల ముందు విపక్షాలు సాగించిన ప్రచారం ఏమిటన్నదే! అధ్యక్షుడు సొలిహ్‌ ద్వీపదేశంలోకి భారత సైనిక దళాలను అనుమతించారంటూ పలు పార్టీలు పెద్దయెత్తున తప్పుడు ప్రచారం సాగించాయి. ఎన్నికలకు ఏడాది ముందే పీపీఎం, పీఎన్‌సీలు ‘ఇండియా అవుట్‌’ నినాదమిచ్చాయి. మాల్దీవుల్లో భారతీయ పెట్టుబడులు, ఉభయ దేశాల రక్షణ భాగస్వామ్యం వంటి అంశాల్లో అనుమానాలను రేకెత్తించి, తద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టాలన్నదే ఈ ప్రచారం వెనక ఉద్దేశం. జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ అధ్యక్షుడు సొలిహ్‌ 2022లో ఈ నినాదాన్ని నిషేధించారు. అనంతరం దేశంలోని అన్ని భూభాగాలపై అధికారాన్ని ధ్రువీకరిస్తూ మాల్దీవుల సైన్యం ప్రకటన విడుదల చేసింది. తమ గడ్డపై భారత దళాల ఉనికి లేనేలేదని వెల్లడించింది. ‘పొరుగుదేశానికి తొలి ప్రాధాన్యం’ విధానాన్ని అనుసరిస్తున్న భారత్‌కు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న మాల్దీవులు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం. పైగా భారత్‌-మాల్దీవుల మధ్య చిరకాలంగా భాష, జాతి, సంస్కృతి, మత, వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. మాల్దీవుల నుంచి చాలామంది విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకుంటున్నారు. వైద్య చికిత్సల కోసమూ ఎంతోమంది ఇండియా వస్తున్నారు. మాల్దీవులకు ముఖ్యమైన భాగస్వామిగా ఉన్నప్పటికీ, అక్కడి రాజకీయ పరిణామాలు భారత్‌ను ఎప్పటికప్పుడు కలవరపెడుతూనే ఉన్నాయి. 2008 నుంచి మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత భారత్‌తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2013-18 మధ్య యామీన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉభయ దేశాల సంబంధాలు కొంత క్షీణించాయి. 2018లో సొలిహ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరవాత మళ్ళీ మెరుగుపడ్డాయి.


దక్షిణాసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భారత్‌ చుట్టూ ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలని డ్రాగన్‌ తలపోసింది. ముత్యాల హారం (స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌)గా పిలుస్తున్న ఈ వ్యూహంలో మాల్దీవులు కీలకంగా మారుతోంది. ఇటువంటి తరుణంలోనే మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా చైనా అనుకూల వైఖరి కనబరచే మయిజ్జు విజయం సాధించారు. ఈ పరిణామం భారత్‌-మాల్దీవుల సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపనుందో!


- అరూణిమ్‌ భుయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక స్వేచ్ఛతో మెరుగైన జీవనం

‣ పుతిన్‌, కిమ్‌.. ఏం మాట్లాడుకున్నారు?

‣ అగ్రరాజ్యం.. కొత్త వ్యూహం!

‣ చట్ట సభల్లో గట్టి స్వరం

‣ భూ హక్కులకేదీ భరోసా?

‣ ముదురుతున్న జల వివాదం

Posted Date: 06-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని