• facebook
  • whatsapp
  • telegram

చట్ట సభల్లో గట్టి స్వరంమహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ విషయంలో భారత రాజకీయ వ్యవస్థ అరుదైన ఏకాభిప్రాయం కనబరచింది. అన్ని రాజకీయ పార్టీలూ  దాదాపు ముక్తకంఠంతో బిల్లుకు మద్దతిచ్చాయి.


మహిళల చదువును, వివిధ వృత్తి, వ్యాపారాల్లో వారి పాత్రను కుటుంబాలు ఆమోదించడం ఇటీవలి దశాబ్దాల్లో పెరిగింది. అయినా ప్రజాజీవితంలో వారి పాత్ర ఇప్పటికీ పరిమితంగానే కొనసాగుతోంది. చట్టసభల్లో 1950లలో అయిదుశాతం ఉన్న మహిళల సంఖ్య ఇప్పుడు 15శాతం దాకా చేరింది. చట్టసభల్లో మహిళలకు ఇంకా ఎంతో ఎక్కువ ప్రాతినిధ్యం అవసరమనడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, సమాజంలో సగభాగానికి సగం గొంతు, ప్రాతినిధ్యం ఉండాలి. పురుషాధిక్య సంప్రదాయం, శతాబ్దాల తరబడి మహిళల అణచివేత కొనసాగిన నేపథ్యంలో- అధికార సభల్లో మహిళలకు మరింత గళం, పాత్ర ఉండటం న్యాయం, అవసరం. కొన్నేళ్లుగా మహిళల పట్ల హింస పెరుగుతోంది. శ్రామిక శక్తిలో స్త్రీల పాత్ర తగ్గుతోంది. ఇప్పుడు 20శాతంలోపే ఉంది. సంపద సృష్టిలో మహిళల పాత్రను కుదించివేస్తే మెరుగైన వృద్ధి సాధించాలన్న మన కలలు నెరవేరవు. కాబట్టి, మహిళలకు మరింత గొంతు, అధికారం ఇవ్వాలి. రెండోది, మన ఫ్యూడల్‌ సమాజంలో, అంతరాల సంస్కృతిలో అధికారమంటే పెత్తనం చలాయించడం, ఇతరులను నియంత్రించడం. అందువల్లే ప్రభుత్వంలో పదవి కోసం హోం(పోలీసు), రక్షణ(సైన్యం), ఆర్థిక, పన్నులు(డబ్బు), రెవిన్యూ (భూమి) వంటి శాఖలనే ఎక్కువమంది కోరుకుంటుంటారు. ఆధిపత్య భావజాలంలో కూరుకుపోవడంవల్లే ఆరోగ్యం, విద్య, కనీస సౌకర్యాలు, నైపుణ్యాలు, ఉపాధి కల్పన మొదలైన శాఖలను చిన్నచూపు చూస్తారు. మహిళల ప్రాతినిధ్యం పెరిగితే పెత్తందారీ రాజకీయాన్ని పునర్నిర్వచించగలరు. రాజకీయమంటే సేవ తప్ప నియంత్రణ, ఆధిపత్యం కాదని నిరూపిస్తారు. ఓటర్లు, పన్ను చెల్లింపుదారులకు రోజువారీ జీవితంలో నిజంగా ఎంతో ముఖ్యమైన అంశాల మీద దృష్టి సారిస్తారు. మనం అధికార రాజకీయాల పట్ల ఆకర్షణను తొలగించాలి. ప్రజలకు సేవలు అందించడం, జవాబుదారీతనం, అధికార వికేంద్రీకరణలను ప్రోత్సహించాలి.


పార్టీల వైఫల్యం

తమ ఆకాంక్షల్ని, ప్రతిభాపాటవాల్ని పురుషుల ఎదుగుదల కోసం అణచివేసుకుంటూ ఒత్తిడితో సతమతమవుతున్న మహిళలు కుటుంబాల్లో, సమాజంలో మనకు నిత్యం కనిపిస్తుంటారు. అయితే ఇదే సమాజంలో, ఓటర్లు మహిళా నేతల పట్ల ఎటువంటి వ్యతిరేక భావాన్నీ ప్రదర్శించరంటే అతిశయోక్తి కాదు. గత కొన్ని దశాబ్దాలలో మనకు పలువురు నిజమైన మహిళా నాయకులు కనిపిస్తారు. ఇందిరాగాంధీ, నందిని శత్పథి, జయలలిత, మాయావతి, వసుంధర రాజె, మమతా బెనర్జీ మొదలైనవారు ఓటర్ల నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఉన్నత స్థానాలకు ఎదిగారు. మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి సమస్య ఓటర్లలో లేదు. మహిళా నాయకత్వాన్ని పెంచడంలో పార్టీల వైఫల్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మహిళా చట్టంలో ఉన్నట్లు... ప్రతి ఎన్నికకు లేదా రెండు ఎన్నికలకోసారి రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్‌ ఏర్పాటు చేయడంవల్ల కీలుబొమ్మ మహిళా నాయకులు తయారవుతారు. తమ అధికారాన్ని కోల్పోవడాన్ని శాయశక్తులా వ్యతిరేకించే బలమైన పురుష నాయకులు తమకు బదులుగా తమ కుటుంబంలోని మహిళా సభ్యులను నామినేట్‌ చేసి నిజమైన అధికారాన్ని మాత్రం తామే చలాయిస్తారు. మహిళా సర్పంచి లేదా పురపాలక నాయకురాలి భర్త నిజమైన అధికారాన్ని చలాయించే సంస్కృతిని ఇప్పటికే చాలా స్థానిక ప్రభుత్వాల్లో చూస్తున్నాం. తమను తాము నిజమైన నాయకులుగా నిరూపించుకున్న మహిళా ప్రతినిధులకు రొటేషన్‌ విధానంవల్ల మరోసారి పోటీచేసే అవకాశం లభించదు. రిజర్వేషన్‌ రొటేషన్‌ వల్ల తిరిగి ఎన్నికయ్యే అవకాశం లేకపోవడంతో ప్రతినిధుల్లోని మానవ సహజ స్వార్థాలను నియంత్రించి వారిని సమాజహితం వైపు నడిపించే ప్రోత్సాహకాలు కరవవుతాయి. దోపిడి, అవినీతి రాజకీయాలకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. నాయకత్వం అభివృద్ధికి దశాబ్దాల కృషి అవసరం. ఇందుకు రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్‌ కన్నా, పార్టీలే ఆ రకంగా రిజర్వేషన్‌కు తగిన సంఖ్యలో సీట్లు ఇచ్చేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేయడం మేలు. ఈ రకమైన పార్టీ కోటా పద్ధతిలో ఏ సీట్లను మహిళలకు కేటాయించాలనే అంశంపై పార్టీలకూ కొంత స్వేచ్ఛ ఉంటుంది. దీనివల్ల పురుషులకు డమ్మీలుగా ఉండే నాయకత్వం కాకుండా, సహజ నాయకత్వం మహిళల నుంచి పెరుగుతుంది. విజయవంతమైన మహిళా నేతలు తరవాతి ఎన్నికల్లో ఆత్మవిశ్వాసంతో పోటీ చేయగలుగుతారు. కాలక్రమంలో తమ స్థాయిని పెంచుకుంటారు. ఇదే సమయంలో పార్టీలు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసి, తమకు బలం లేని స్థానాల్లో మహిళల్ని నిలబెట్టే పరిస్థితి లేకుండా చట్టబద్ధంగా తగిన రక్షణల్ని కల్పించవచ్చు. లోక్‌సభ సీట్లకైతే రాష్ట్రం యూనిట్‌గా, అసెంబ్లీ విషయంలో మూడు లోక్‌సభ స్థానాలు యూనిట్‌గా పార్టీలు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అంటే, ఏ పార్టీ అయినా తాను మహిళలకు కేటాయించాల్సిన సీట్లను తనకు బలం లేని రాష్ట్రంలో కేటాయించే అవకాశం ఉండదు. ప్రతి రాష్ట్రంలో విధిగా లోక్‌సభకు మహిళలకు 33శాతం సీట్లు కేటాయించాలి. రాష్ట్రం విషయానికొస్తే, తమకు బలం లేని సీట్లను మహిళల కోటా కింద ఇవ్వడం కుదరదు. ప్రతి మూడు లోక్‌సభ స్థానాల యూనిట్‌ నుంచి మూడో వంతు అసెంబ్లీ సీట్ల చొప్పున అన్ని లోక్‌సభ స్థానాల నుంచి మహిళలకు 33శాతం సీట్లు కేటాయించాలి.


గుణాత్మక మార్పు

ప్రస్తుత మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపకల్పన లోపభూయిష్ఠంగా ఉన్నప్పటికీ, ఏదో ఒక రూపంలో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి చేసిన ప్రయత్నంగా మనం స్వాగతించాలి. మెరుగైన పద్ధతిలో చట్టం రూపొందిస్తే రాజకీయాల స్వభావంలో గుణాత్మక మార్పు సాధ్యమవుతుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు మన శాసనకర్తలు మరికొంత సమయం తీసుకుంటున్నారు. రాజకీయాల్ని మెరుగుపరచే దిద్దుబాట్లకు ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేయాలి.


సుదీర్ఘ పోరాటాలు

పరిణతి చెందిన అనేక ప్రజాస్వామ్య దేశాల్లో సమాన పౌరులుగా గుర్తింపు పొందడానికి మహిళలు సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలు చేయాల్సి వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గణతంత్ర ప్రజాస్వామ్యంలో మహిళలకు సమాన పాత్ర కల్పించడాన్ని విస్మరించవద్దని అమెరికా రెండో అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌ సతీమణి అబిగెయిల్‌ ఆడమ్స్‌ తన భర్తతో వాదించారు. అయినప్పటికీ, 1787లో ఫిలడెల్ఫియాలో జరిగిన రాజ్యాంగ సదస్సు తెల్లజాతి పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఇచ్చింది. ఎప్పుడో 133 ఏళ్ల తరవాత 1920లో మహిళలకు ఓటు హక్కు లభించింది. బ్రిటన్‌లో మరో ఎనిమిదేళ్లు పట్టింది. మహిళలకు తొలి నుంచే ఓటు హక్కును అందించిన మొదటి రిపబ్లిక్‌ భారత్‌ మాత్రమే.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూ హక్కులకేదీ భరోసా?

‣ ముదురుతున్న జల వివాదం

‣ అణ్వస్త్ర రహిత ప్రపంచం.. ఎంతెంత దూరం?

‣ పర్యావరణ ఆరోగ్యమే రక్షాకవచం

‣ వాన నీటి సంరక్షణతో జలసిరులు

‣ నదులకు కాలుష్యం కాటు

Posted Date: 02-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని