• facebook
  • whatsapp
  • telegram

నదులకు కాలుష్యం కాటు



ప్రపంచ నదీ దినోత్సవం. నదులు మానవ నాగరికతకు మూలం. మితిమీరిన మానవ కార్యకలాపాలే వాటికి శాపంగా మారుతున్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం, హిమనదాలు వేగంగా కరగడం, పరిమితికిమించి ఆనకట్టల నిర్మాణం, ఆక్రమణలు.. నదుల ఉనికికే ముప్పుగా పరిణమిస్తున్నాయి.


వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరవు పరిస్థితులు, కాలుష్యం తదితర ప్రభావాలతో విశ్వవ్యాప్తంగా నదీజలాల్లో నీటి నాణ్యత దెబ్బతింటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2000-22 మధ్యకాలంలో వాతావరణంలో దీర్ఘకాలిక మార్పుల ప్రభావం నదులపై పడుతున్న తీరును నెదర్లాండ్స్‌ పరిశోధకులు విశ్లేషించారు. గత రెండు దశాబ్దాల కాలంలో సంభవించిన వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా నదీజలాల్లో ఉష్ణోగ్రత, లవణీయత భారీగా పెరిగాయనేది ఈ పరిశోధన సారాంశం. లోహాలు, సూక్ష్మజీవులు, ఔషధ వ్యర్థాల సాంద్రత వాటిలో అధికమయ్యింది. కరవులు, వేడిగాలులు నదీ జలాల్లో లవణీయత పెరగడానికి కారణమయ్యాయి. ఔషధ, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సైతం నదులను పట్టి పీడిస్తున్నాయి. ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రుతుపవన ఆధారిత నదులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాయి. 2023 ఆగస్టులో భారత్‌లోని 150 రిజర్వాయర్లలో నీటి నిల్వస్థాయి వాటి అసలు సామర్థ్యం కంటే 38శాతం తక్కువగా నమోదైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహించే పెన్నా, ఒడిశాలోని మహానదిలో నీటి మట్టాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ, తూర్పు, దక్షిణ భారత నదుల్లోని నీటిమట్టాల్లో చాలా లోటు నెలకొంది. ఈ జాబితాలో కృష్ణ, కావేరి తదితర నదులూ ఉన్నాయి. మరోవైపు, హిమాలయ నదుల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పడిపోయిన నాణ్యత

మన దేశంలో మితిమీరిన నగరీకరణ, పారిశ్రామిక కాలుష్యం నదుల పాలిట శాపంగా మారుతున్నాయి. కాలుష్యం కారణంగా నదీజలాల్లో నీటి నాణ్యత భారీగా పడిపోయినట్లు ‘విజ్ఞానశాస్త్ర, పర్యావరణ కేంద్రం’ నివేదిక స్పష్టం చేస్తోంది. గంగ, యమునలతోపాటు భారత్‌లోని 45శాతం నదులు తీవ్ర కాలుష్య కారకాలతో సతమతమవుతున్నట్లు అది తేల్చిచెప్పింది. మహారాష్ట్రలో 55 నదులు కాలుష్య ముప్పును ఎదుర్కొంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో 19, బిహార్‌, కేరళల్లో 18, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటకల్లో 17 నదులు తీవ్ర కాలుష్య ప్రభావంతో విలవిల్లాడుతున్నాయి. నీటి నాణ్యతకు ముఖ్యసూచికగా భావించే బీఓడీ (బయొలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) పరంగా ప్రాణాంతకమైన కాలుష్య స్థాయి విషయంలో ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లోని నదులు ముందున్నాయి. యూపీలోనూ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలోని నదుల్లో 20 పర్యవేక్షక కేంద్రాల్లో పరిమితికి మించి బీఓడీ ఉన్నట్లు తేలింది. గంగ తన ప్రవాహ పరిధిలో 49 ప్రదేశాల్లో అనుమతించదగిన బీఓడీ స్థాయిని అధిగమించగా- యమున 35 చోట్ల, గోదావరి 31, గోమతి 20, కావేరి 15 చోట్ల ఈ స్థాయులను దాటేశాయి. గుజరాత్‌, మణిపుర్‌, ఒడిశాలలోని నదులు సైతం ఈ విషయంలో ముందున్నట్లు అధ్యయనం తెలిపింది.


జీవ వైవిధ్యానికి నష్టం

ఇష్టారీతిన నిర్మిస్తున్న ఆనకట్టలు సైతం నదుల ఉనికికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. నదులు సహజసిద్ధంగా, వరదలు తదితర సమయాల్లో ప్రవాహంతోపాటు తరలించే ఒండ్రుమట్టి, ఇసుక వంటివాటి కారణంగా వరద మైదానాలు, ఇసుక తిన్నెలు, డెల్టాలు ఏర్పడతాయి. అయితే ఆనకట్టను నిర్మించడం వల్ల నదీ జలాల్లో పోషకాలతో పాటు ఒండ్రుమట్టి, ఇసుక వంటివి ప్రవాహంతోపాటు దిగువకు తరలిపోయే ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. దానివల్ల మైదాన ప్రాంతాల్లో జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతోంది.  ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 వేల ఆనకట్టలు నిర్మాణమయ్యాయి. మరో 3700 ఆనకట్టలు నిర్మాణంలోగాని, ప్రణాళికల స్థాయిలోగాని ఉన్నాయి. ఇలా నానాటికీ పెరిగిపోతున్న ఆనకట్టల వల్ల గత నలభై సంవత్సరాల కాలంలో నదుల్లో మట్టి, ఇసుక వంటివి కిందికి ప్రవహించడంలో ఆందోళనకరమైన మార్పులు సంభవించాయి. మరోవైపు, నదులపై ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ఎగువ ప్రాంతాల్లో పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ప్రపంచంలోని పొడవైన నదుల్లో కొన్ని మాత్రమే స్వేచ్ఛగా ప్రవహిస్తున్నాయి. నదులు స్వేచ్ఛగా ప్రవహించడం పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి మూలాధారం. నదీ ప్రవాహాలను నియంత్రించడం భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలకు దారి తీస్తుంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మన అభివృద్ధి నమూనాల్లో మార్పుచేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సత్వరమే ఆ దిశగా అడుగులు పడాలి. నదుల పరిరక్షణపై ఆయా తీరాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమూ తప్పనిసరి.


- గొడవర్తి శ్రీనివాసు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అభివృద్ధి ముసుగులో చైనా అప్పుల వల!

‣ కావేరి.. రణభేరి!

‣ తలరాత మార్చే తలసరి ఆదాయం

‣ జమిలి ఎన్నికలు ఎందుకు?

Posted Date: 02-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం