• facebook
  • whatsapp
  • telegram

జమిలి ఎన్నికలు ఎందుకు?లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కోసం ప్రభుత్వం మంత్రాంగం సాగిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జమిలి ఎన్నికల వల్ల మన ప్రజాస్వామ్యానికి ఒనగూడే ప్రయోజనం ఏమిటి? అసలు ఇవి ఎంతవరకూ ఆచరణ సాధ్యం?


వచ్చే ఏడాది లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకే ఎన్నికలు జరుగుతాయి. అవి- ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఇప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహించగలమా? అలా చేయాలనుకుంటే, రాజ్యాంగపరంగా భారీ కసరత్తు అవసరమవుతుంది. నిబంధనల్ని సవరించాల్సి ఉంటుంది. 2024 జూన్‌కు ముందు ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ అసెంబ్లీల గడువును పొడిగించాలి. ఎన్నికల్ని వాయిదా వేయాల్సిన ఈ అసెంబ్లీల గడువు ముగిశాక ఆపద్ధర్మ ప్రభుత్వాల్ని నడపడానికి రాజ్యాంగం పరిధిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మిగిలిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీలనూ ఒకేసారి రద్దు చేసి లోక్‌సభతో పాటు ఎన్నికలకు సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యమైన సమస్య. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే తప్ప ఇష్టానుసారం అసెంబ్లీలను రద్దు చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలకు అవసరమైన మద్దతు లభించినా, చాలా రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు మొదలవుతాయి. ఎన్‌డీఏ కూటమికి చెందని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాల పదవీ కాలంపై వేటు వేస్తే పెద్దయెత్తున ప్రతిఘటన వస్తుంది. పశ్చిమ్‌ బెంగాల్‌, తమిళనాడు, బిహార్‌, కర్ణాటక, కేరళ, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాల్లో కల్లోలం ఏర్పడుతుంది.


రాజకీయమంటే రాష్ట్రమే!

వెస్ట్‌ మినిస్టర్‌ ప్రభుత్వ నమూనాను అనుసరించే ఫెడరల్‌ దేశం మనది. మన రాజ్యాంగం, రాజకీయాల ప్రకారం యూనియన్‌, రాష్ట్రాల స్థాయిలో జమిలి ఎన్నికలు దాదాపు అసాధ్యం. మరీ ముఖ్యంగా పార్లమెంటరీ తరహా కార్యనిర్వాహక వ్యవస్థతో వెస్ట్‌ మినిస్టర్‌ నమూనా ప్రభుత్వం మనకు ఉన్నంత వరకు లోక్‌సభ లేదా ఒక రాష్ట్ర అసెంబ్లీ నిర్ణీత గడువు పాటు అయిదేళ్లూ సుస్థిరంగా కొనసాగుతుందని హామీ ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎన్నికైన చట్టసభల్ని కాలవ్యవధి కంటే ముందే రద్దు చేయాల్సి రావడం, తిరిగి ఎన్నికల్ని నిర్వహించడం ఎప్పుడైనా జరగవచ్చు. అలాంటప్పుడు గతంలో జరిగినట్లే రాబోయే కాలంలోనూ అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు మళ్ళీ వేరయ్యే అవకాశముంది. జమిలి ఎన్నికల వల్ల మన ప్రజాస్వామ్యానికి ఏమైనా ప్రయోజనముందా? ఇదీ అసలు ప్రశ్న. మన ఫెడరల్‌ రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వం మూడంచెల్లో ఉంటుంది. అవి- యూనియన్‌, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు. ఓటర్లలో అత్యధికుల మనసుల్లో రాజకీయం అంటే రాష్ట్రం. రాష్ట్రమే రాజకీయానికి యూనిట్‌. చాలా రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. వాటికి నిధులు, విధులు లేవు. ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే మొత్తం మూడంచెల్లోని ఎన్నికల్లోనూ ఎక్కువ మంది ఓటు వేస్తుంటారు. రాష్ట్రంలోని ప్రభుత్వం నచ్చితే, అన్ని ఎన్నికల్లో రాష్ట్రంలోని పాలకపక్షం వైపే ఓటర్లు మొగ్గుచూపుతారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తి చెందితే, అన్ని ఎన్నికల్లో వ్యతిరేకంగా తీర్పిస్తారు. మూడంచెల్లోని ప్రభుత్వం, వాటి విధుల మధ్య తేడాను అత్యధిక ఓటర్లు గుర్తించలేకపోతున్నారని ప్రస్తుత ఓటింగ్‌ తీరు తెలియజేస్తోంది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలో తప్ప సర్కారులో తన పాత్ర లేకున్నా ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రచ్ఛన్న ప్రభుత్వంలా, మకుటం లేని మహారాజులా వ్యవహరిస్తున్నారు. బదిలీలు, కాంట్రాక్టులు, పోలీసు కేసులు, సంక్షేమ పథకాల జారీ, సహజ వనరుల కేటాయింపుతో పాటు పలు నిబంధనలను నిర్ణయిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇదే ధోరణి నెలకొంది. దీనివల్ల నియోజకవర్గం యూనిట్‌గా ఓటింగ్‌ సరళి ఇంకా బలోపేతమవుతోంది. పరిణతి చెందిన ఇతర ఫెడరల్‌ ప్రజాస్వామ్యాలతో పోలిస్తే ఇది పూర్తిగా విభిన్నం. అమెరికాలో అన్ని స్థాయుల్లోని ప్రభుత్వాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతి రెండేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. ప్రతినిధుల సభను రెండేళ్లకోసారి ఎన్నుకుంటారు. అధ్యక్షుడు, గవర్నర్లు, మేయర్లు ప్రతి నాలుగేళ్లకూ ఎన్నికవుతారు. ఒకే బ్యాలెట్‌పై పలువురు ఇతర రాష్ట్ర, స్థానిక అధికారుల్ని ఎన్నుకుంటారు. అయినా, ఓటర్లు ఎంతో వివేచనను ప్రదర్శిస్తారు. వేర్వేరు స్థాయుల్లో, వివిధ పదవులకు, భిన్న పార్టీల అభ్యర్థులను ఎన్నుకుంటారు.


నిజమైన సంస్కరణలు కీలకం

భారతదేశ ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత మొక్కుబడిగా మార్చి, జవాబుదారీతనాన్ని ఇంకా నామమాత్రం చేసే ప్రమాదం ఉంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కొలువుతీర్చిన కమిటీ మన ప్రజాస్వామ్యంలోని లోతైన సంక్షోభంపై దృష్టి సారించాలి. ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా డబ్బు ప్రవాహం, ప్రభుత్వ మౌలిక బాధ్యతల్ని పణంగా పెట్టి తాత్కాలిక సంక్షేమ పథకాలు, కులం, ప్రాంతం, మతం వంటి భావోద్రేకాల చుట్టూ పరిభ్రమిస్తున్న రాజకీయ సమీకరణాల్ని అధ్యయనం చేయాలి. మనకు కావాల్సింది, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి పాలనను మెరుగుపరచే నిజమైన, ఆట నియమాల్ని మార్చగల సంస్కరణలు. జమిలి ఎన్నికలు మన సంక్లిష్ట సవాళ్లకు సర్వరోగ నివారిణి కావు!


ఓటే బలమైన ఆయుధంగా..

ఒకవేళ ఏదో ఒక రకంగా భారత్‌లో జమిలి ఎన్నికల్ని క్రమం తప్పకుండా నిర్వహించినా పలు సమస్యలు తప్పవు. ముఖ్యంగా, ఏ స్థాయిలో ప్రభుత్వానికి ఏ బాధ్యతలున్నాయి, వాటిని ఆయా ప్రభుత్వాలు ఎలా నెరవేరుస్తున్నాయి అనే మదింపు లేకుండా అన్ని స్థాయులకూ ఒకే రీతిలో ఓటు వేయడం ఇంకా పెరుగుతుందని అనుభవాలు చెబుతున్నాయి. స్థానిక, రాష్ట్ర, యూనియన్‌ స్థాయిలో ప్రభుత్వం చేయాల్సిన పనులు, అక్కడి సమస్యలపై స్పష్టమైన అవగాహన లేకుండా ఒక సంబరంలా, కోలాహలంగా ఓటు వేయడం; ఎన్నికలయిన దగ్గర్నుంచి నిరంతర నిరసనలు అనే స్థాయికి ఇప్పటికే మన ప్రజాస్వామ్యాన్ని దిగజార్చుకున్నాం. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం యూనియన్‌, రాష్ట్ర, స్థానిక స్థాయుల్లో తాము వేస్తున్న ఓటుకు, తద్వారా తమ జీవితాల్లో ఆశించదగిన మార్పులకు మధ్య సంబంధంపై ఓటర్లలో అవగాహన రావాలి. ఏ సంస్కరణ అయినా ఓటర్ల ఆలోచనను, పరిణతిని ఇంకా పెంచాలి. పరిపాలనను, జవాబుదారీతనాన్ని మెరుగుపరచే బలమైన ఆయుధంగా ఓటును మలచాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆహార భద్రతపై వాతావ‘రణం’!

‣ భారత్‌ - ఆఫ్రికాల బలమైన బంధం

‣ ప్రజాస్వామ్యం తీరుతెన్నులు

‣ పకడ్బందీగా సుస్థిరాభివృద్ధి

Posted Date: 19-09-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని