• facebook
  • whatsapp
  • telegram

పకడ్బందీగా సుస్థిరాభివృద్ధిప్రకృతి వనరులను పరిరక్షిస్తూనే ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను తీరుస్తుంది- సుస్థిరాభివృద్ధి! అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక, సామాజిక, పర్యావరణ వ్యవస్థల మధ్య సమతౌల్యం ఉండాలన్నది ఈ భావనకు మూలం. కానీ, ఆ వ్యవస్థల మధ్య తలెత్తుతున్న సమస్యలవల్ల సుస్థిరాభివృద్ధి సాధనలో నిలకడ లోపిస్తోంది.


ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీలు) ప్రకటించింది. పేదరిక నిర్మూలన, భూగోళ పరిరక్షణకు కృషి చేయడం, శాంతిని పెంపొందించడం వంటి చర్యల ద్వారా 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవడానికి పాటుపడతామని భారత్‌ సహా 193 దేశాలు ప్రతినబూనాయి. ఇండియాలో 68శాతానికి పైగా జనాభా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. గ్రామాల్లో సామాజిక న్యాయాన్ని నెలకొల్పి, స్వయంసమృద్ధిని సాధించేందుకు పంచాయతీరాజ్‌ సంస్థలే కీలకం. కాబట్టి, గడువులోగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఈ వ్యవస్థలను భాగస్వాములను చేయడం ఎంతో అవసరం. దేశంలో 2.69లక్షలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. వాటికి ఎన్నికైన సుమారు 32లక్షల ప్రజాప్రతినిధుల్లో 40శాతానికి పైగా మహిళలు ఉన్నారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం 2021-26 కాలానికి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.4.36లక్షల కోట్లు అందించాలని నిర్ణయించింది. ఈ నిధుల ద్వారా స్థానిక సంస్థల సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరముంది.


లక్ష్యాల సాధనలో వెనకడుగు

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయతీరాజ్‌ శాఖ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. లక్షిత సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలను స్థానికంగా అమలుపరచేందుకు వీలుగా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వాటిని తొమ్మిది అంశాలుగా కుదించింది. అవి- పేదరిక నిర్మూలన, ఆరోగ్య పరిరక్షణ, మెరుగైన జీవనోపాధి కల్పన, పరిశుభ్రత-పచ్చదనం పెంపు, జలవనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు తోడుగా నిలిచేలా పంచాయతీలను తీర్చిదిద్దడం. రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌ ద్వారా పంచాయతీరాజ్‌ ప్రతినిధులకు ఈ అంశాలపై అవగాహన పెంపొందించాలని నిశ్చయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక-2023 ప్రకారం- ఈ లక్ష్యాల సాధనలో ఫిన్లాండ్‌, స్వీడన్‌, డెన్మార్క్‌లు వరసగా తొలి మూడు ర్యాంకులు సాధించాయి. ఇండియా 112వ స్థానానికి పరిమితమైంది. లక్ష్యాల దిశగా 18శాతం దేశాలే పురోగమిస్తున్నాయని, 67శాతం దేశాల పనితీరు నామమాత్రంగానే ఉందని ఆ నివేదిక విశ్లేషించింది. వాటి పనితీరు ఇదే మాదిరిగా కొనసాగితే 2030నాటికి లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమేనని అభిప్రాయపడింది. జీ20 సభ్యదేశాలకు ప్రపంచ జీడీపీలో 80శాతానికిపైగా, అడవుల్లో 70శాతం వరకు వాటా ఉంది. జనాభాలో సుమారు 60శాతానికి, భూభాగంలో 50శాతానికి అవి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లిగ్నైట్‌, బొగ్గు తవ్వకాల్లో 90శాతం, చమురు, గ్యాస్‌ ఉత్పత్తిలో 60శాతం వాటా జీ20 దేశాలదే. అందుకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ఆ దేశాలపై ఎక్కువగా ఉంది. మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్‌ పేదరిక నిర్మూలన, బాధ్యతాయుతమైన ఉత్పత్తి, వినియోగం వంటి అంశాల్లోనే కొంత పురోగతి కనబరుస్తోంది. ‘ఎస్‌డీజీ భారత సూచీ 2020-21’ ప్రకారం... ఈ లక్ష్యాల సాధనలో కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లు ముందువరసలో నిలిచాయి. ఝార్ఖండ్‌, బిహార్‌, అస్సామ్‌లు అట్టడుగున ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు వీటి సాధనలో జోరు పెంచేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.


సమగ్ర ప్రణాళికలు అవసరం

ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా గ్రామపంచాయతీలు తమ పరిధిలోని ప్రజల ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయసాధన కోసం సమగ్ర ప్రణాళికలను రూపొందించాలి. స్థానికంగా అమలుచేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వీటితో సమన్వయం చేసుకోవడంతో పాటు ఈ అంశాల పట్ల పంచాయతీరాజ్‌ వ్యవస్థల్లోని ప్రజాప్రతినిధులు, సిబ్బందికి సరైన అవగాహన కల్పించాలి. జాతీయ గ్రామీణ జీవనోపాధుల పెంపు, ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్‌ మిషన్‌ వంటి కార్యక్రమాలను విస్తృతస్థాయిలో అమలుపరచాలి. పంచాయతీల్లో జీవవైవిధ్య పరిరక్షణ కమిటీలను బలోపేతంచేసి, సహజ వనరుల పరిరక్షణ, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. బడుల నిర్వహణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషకాహారం, ప్రజాపంపిణీ, సామాజిక న్యాయం వంటి అంశాల్లోనూ కమిటీలను ఏర్పాటు చేసుకుని, ఆయా కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలి. మండల, జిల్లా స్థాయుల్లోనూ ఇటువంటి చర్యలు ఎంతో అవసరం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సత్వర సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పంచాయతీరాజ్‌ సంస్థల మధ్య సమన్వయం కీలకం.


- ఎ.శ్యామ్‌కుమార్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ జీ20.. భారత్‌ ముద్ర!

‣ మహిళాభివృద్ధిలో మనమెక్కడ?

‣ జమిలి బాటలో సవాళ్ల మేట

Posted Date: 15-09-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం