రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య సమస్యలు నెలకొన్న తరుణంలో జీ20 సారథ్య బాధ్యతలను భారత్ చేపట్టింది. శిఖరాగ్ర సమావేశ నిర్వహణపై అలముకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ- దీన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది. తద్వారా భారత సారథ్య ప్రతిభ మరోమారు ప్రపంచానికి తెలియవచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ‘జీ20’ కూటమి 18వ శిఖరాగ్ర సమావేశం ఈనెల 10న దిల్లీలో విజయవంతంగా ముగిసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతున్న పరిస్థితుల్లో ఈ కూటమికి సారథ్యం వహించడం కత్తి మీద సాము వంటిదే. గడచిన నవంబరులో ఇండొనేసియా నుంచి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఇండియా- జీ20ని ఎలా ముందుకు నడిపిస్తుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది. ఉక్రెయిన్‌లో యుద్ధంపై జీ20 విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. అంతకుముందు, ఈ ఏడాది ఆరంభంలో శ్రీనగర్‌లో నిర్వహించిన జీ20 పర్యాటక సదస్సుకు చైనా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రతినిధులు హాజరుకాలేదు. ఆర్థిక లక్ష్యాల సాధనే పరమావధిగా ఈ కూటమి అంకురించినప్పటికీ- మహిళా సాధికారత, స్టార్టప్‌లకు తోడ్పాటు, అవినీతి నిర్మూలనపై జరిగిన సమావేశాల్లోనూ సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయి. వీటికి తోడు పలు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం వంటి పరిస్థితులు, సముద్ర జలాల విషయంలో వివాదాలు, ఆఫ్రికా దేశాల్లోని సహజ వనరులు విపరీతమైన దోపిడికి గురవుతుండటం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి తరుణంలో అసలు జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగుతుందా అన్న అనుమానాలు భౌగోళిక-వ్యూహాత్మక నిపుణుల్లో వ్యక్తమయ్యాయి. ఒకవేళ ఈ సదస్సు జరిగినప్పటికీ, ఎలాంటి తీర్మానాలు లేకుండానే తెమిలిపోతుందని, దానివల్ల భారత్ సారథ్యానికి చెడ్డపేరు వస్తుందని పలువురు విశ్లేషకులు భావించారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇండియా విజయవంతంగా నిర్వహించి ప్రపంచ దేశాల మన్ననలు అందుకొంది. తదుపరి అధ్యక్ష బాధ్యతలను లాంఛనంగా బ్రెజిల్‌కు అప్పగించింది.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ..
జీ20 నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తరవాత భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తొలుత ‘వాయిస్ ఆఫ్ ద సౌత్’ పేరిట 125 అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలతో సమావేశం నిర్వహించింది. అందులో ఆయా దేశాలు వ్యక్తపరచిన సమస్యలను మూడు అంశాలుగా వర్గీకరించింది. వాటిపై దేశంలోని 60కు పైగా నగరాల్లో 230కి పైగా సమావేశాలు నిర్వహించింది. భారత ప్రతినిధులతో పాటు లక్ష మందికిపైగా అంతర్జాతీయ ప్రతినిధులు వీటికి హాజరయ్యారు. శిఖరాగ్ర సమావేశం తీర్మానంలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండించాలని, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి ఒడంబడికను ఆ దేశం ఉల్లంఘించడంతో పాటు అంతర్జాతీయ చట్టనిబంధనలను కూడా తుంగలో తొక్కిందని స్పష్టంగా పేర్కొనాలని పశ్చిమ దేశాలు పట్టుపట్టాయి. అందుకు రష్యా తీవ్ర అభ్యంతరం తెలపడమే కాకుండా... జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా 1945లో అణు దాడికి పాల్పడటాన్ని తీర్మానంలో ప్రస్తావించాలని డిమాండ్ చేసింది. అయితే, భారత ప్రతినిధులు ఎంతో సావధానంగా అన్ని పక్షాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరికి ఈనెల 9వ తేదీ ఉదయానికి ఇవి ఫలించి, అందరి ఆమోదంతో ‘దిల్లీ డిక్లరేషన్’ రూపుదిద్దుకొంది. ఈ విజయం వెనక భారత ఉన్నతాధికారి అమితాబ్ కాంత్‌తో పాటు ఆయన బృందంలోని ఐఎఫ్‌ఎస్ అధికారుల కృషి ఉంది. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ నేతృత్వంలోని అధికారులూ ఎంతగానో శ్రమించారు.
జీ20 తీర్మానంలో ఎక్కడా ‘రష్యా’, ‘దురాక్రమణ’ అనే పదాలు లేవు! ఈ పరిణామం నాటో దేశాలకు ఇబ్బంది కలిగించేదే. అయినప్పటికీ, పశ్చిమ దేశాలకూ కొంత ఊరట లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్ సంఘర్షణగానే పేర్కొంటోంది. డిక్లరేషన్‌లో మాత్రం దీన్ని ‘యుద్ధం’గానే వ్యాఖ్యానిస్తూ- ఐరాస ఒడంబడికను అనుసరించి ప్రతి దేశం ఇతర దేశాల సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపిచ్చారు. తద్వారా రష్యాకు పరోక్షంగా సందేశమిచ్చినట్లయింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తీర్మానంలో అసలు ప్రస్తావించనే లేదు. అయితే, ‘దిల్లీ డిక్లరేషన్’ను ఎవరికివారే తాము సాధించిన విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని పురోగామి సదస్సుగా అభివర్ణించిన రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్- ప్రపంచసంస్థల ప్రజాస్వామ్యీకరణకు సరైన పునాది వేశారంటూ భారత నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రష్యా ఒంటరిదని జీ20 ద్వారా మరోమారు రుజువైందంటూ... తీర్మాన రూపకల్పనలో భారత్ పాత్రను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ప్రశంసించారు. బైడెన్ సహా అనేక దేశాల అధ్యక్షులు ఇండియాపై ప్రశంసలు కురిపించారు.
ఖర్చుపై చర్చ..
జీ20 సదస్సు కోసం భారత్ ఎంత ఖర్చు చేసింది, దానివల్ల లాభమేమిటన్నది ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, జీ20 సభా ప్రాంగణం ‘భారత్ మండపం’ నిర్మాణంతోపాటు వసతుల ఏర్పాటుకు సుమారు రూ.2700కోట్లు ఖర్చయింది. ఇంతకుముందు పలు సభ్య దేశాలు జీ20 సదస్సు నిర్వహణకు చేసిన ఖర్చుతో పోలిస్తే ఇది తక్కువే! ఈ నిర్మాణాలన్నీ శాశ్వత ప్రాతిపదికన నిర్మించినవే కాబట్టి, భవిష్యత్తులోనూ ఇటువంటి సమావేశాలు నిర్వహించుకోవడం సులభమవుతుంది. జీ20లోకి వర్ధమాన దేశాల్లో కీలకమైన ఆఫ్రికన్ యూనియన్‌ను తీసుకురావడం ఇండియా సాధించిన పెద్ద విజయం. తద్వారా వర్ధమాన దేశాలకు భారత్ అనధికార నాయకురాలిగా, సంధానకర్తగా అవతరించినట్టయింది. మొత్తంగా చూస్తే జీ20 శిఖరాగ్ర సదస్సు- భారత కీర్తికిరీటంలో మరో కలికితురాయి వంటిదనే చెప్పాలి. కొత్త ప్రపంచ క్రమాన్ని ఆవిష్కరించే తరుణంలో - భారత్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది ప్రబల నిదర్శనం. తుదిపత్రంలో పేర్కొన్న అంశాలపై పురోగతిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ నవంబరులో వీడియో సమావేశం నిర్వహించనున్నారు. డిక్లరేషన్ అంశాల్లో పురోగతిపై అప్పుడు జరిగే మదింపు- మన దేశ పనితీరుకు అద్దం పడుతుంది.
కీలక ప్రయోజనాలివీ..
జీ20 నిర్వహణ ద్వారా భారత్ తదితర దేశాలకు మూడు కీలక ప్రయోజనాలు చేకూరినట్లయింది. అవి:
1. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇండియా వడివడిగా అడుగులు వేయడానికి హరిత సాంకేతికతలు చాలా అవసరం. వాటిని సమకూర్చుకునేందుకు వీలుగా ఇండో-అమెరికన్ సంయుక్త నిధి ఏర్పాటుకు బాటలు వేయడం.
2. జీ20 వ్యవస్థాపక సభ్య దేశాలైన భారత్, అమెరికా, బ్రెజిల్‌లు కలిసి ‘గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయెన్స్’ ఏర్పాటుకు అంగీకారం. సులభతర సాంకేతికతలను అభివృద్ధిపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన జీవఇంధనాల వినియోగాన్ని పెంచడానికి ఈ వేదిక దోహదపడుతుంది.
3. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇటలీ, గ్రీస్‌ల మీదుగా భారత్ నుంచి అమెరికాకు ‘సముద్ర మార్గం- రైలు రవాణా కారిడార్’ ఏర్పాటుకు నిర్ణయం. దీనివల్ల తక్కువ సమయంలోనే సరకుల రవాణాకు వీలు కలగడంతో పాటు ఖర్చు భారీగా తగ్గుతుంది.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం ... మీ కోసం!
‣ లోపాలు సరిదిద్దితేనే సరైన న్యాయం