• facebook
  • whatsapp
  • telegram

జీ20 సర్వత్రా ఆసక్తి!దిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశం తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలపై చర్చించనున్నారు. జీ20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ ఈ సమావేశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.


ప్రపంచ జీడీపీలో 85శాతం, వాణిజ్యంలో 75శాతం వాటా కలిగిన జీ20 దేశాల్లో మూడింట రెండొంతుల ప్రపంచ జనాభా నివసిస్తోంది. ఈసారి జీ20 శిఖరాగ్ర సమావేశం దిల్లీలో భారత్‌ అధ్యక్షతన జరుగుతోంది. కాబట్టి, వివిధ రంగాల్లో మన దేశం సాధించిన పురోగతిని ప్రపంచ దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా పరికించే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది జీ20 ప్రాధాన్యాంశాలు: హరిత అభివృద్ధి, సవాళ్లను అధిగమించే తీరులో అభివృద్ధి సాధన, వాతావరణ మార్పులను నిరోధించడంలో వర్ధమాన దేశాలకు సంపన్న దేశాలు నిధులు సమకూర్చడం, పర్యావరణహితకరమైన జీవనశైలి, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను వేగిరపరచడం, సాంకేతిక పరిజ్ఞానంతో రూపాంతరీకరణ, డిజిటల్‌ వసతుల ఏర్పాటు, మహిళల నేతృత్వంలో అభివృద్ధి, ప్రపంచబ్యాంకు వంటి బహుళ పక్ష ఆర్థిక సంస్థలను 21వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం. వీటితో పాటు వివిధ సంక్షోభాలకు పరిష్కారాలను కనుగొనేందుకు జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ ఇప్పటికే ప్రత్యేక కార్యబృందాలతో సమావేశాలు నిర్వహించింది. వీటిలో హరిత అభివృద్ధి, జీవనశైలి, ప్రకృతి ఉత్పాతాల నిభాయింపు, హరిత ఉదజని, ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధనాలు వంటి అంశాల్లో ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ కృషి చేసింది. ఇండియా చొరవతో ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల శీఘ్ర సాధన ప్రణాళిక-2023’ను జీ20 దేశాల మంత్రుల సమావేశం ఆమోదించింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సంపన్న దేశాలు ఏటా 10,000కోట్ల డాలర్లను సమకూర్చాలని పారిస్‌ వాతావరణ సభ తీర్మానించినప్పటికీ, ఆ విషయంలో పురోగతి లేదు. ఇందుకు 2024 నుంచి రెట్టింపు కృషి అవసరమని, ఈ విషయమై నూతన సమష్టి లక్ష్య ప్రకటన జరగాలని భారత్‌ ఆశిస్తోంది.


అంతర్జాతీయ డిజిటల్‌ ప్రజా మౌలిక వసతుల వ్యవస్థ, అంతర్జాతీయ డిజిటల్‌ ఆరోగ్య సంస్థల ఏర్పాటుకు జీ20 చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ప్రస్తుత సమావేశంలో ఈ సంస్థలపై ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ కృషి చేస్తోంది. భారత్‌ ఇప్పటికే ఆధార్‌, యూపీఐ, కొవిన్‌, డిజిలాకర్‌ వంటి డిజిటల్‌ వసతులను విజయవంతంగా నడుపుతోంది. అన్ని వర్గాలను డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థతో మమేకం చేయడంలో భారత్‌ అనుభవం ఇతర దేశాలకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు డిజిటల్‌ వేదికను కల్పించడం, వాణిజ్య పత్రాల డిజిటలీకరణపై జీ20 వాణిజ్య, పెట్టుబడి కార్యబృందం చర్చలు జరిపింది. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు భారత్‌ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సుస్థిర క్రిప్టో ఆస్తుల నియంత్రణ గురించి జీ20 దేశాల ఆర్థిక మంత్రులు ఇప్పటికే చర్చించారు. దీనికోసం అంతర్జాతీయ యంత్రాంగాన్ని ఏర్పరచాలని భారత్‌ కోరుతోంది. అంతర్జాతీయ రుణ సంక్షోభ పరిష్కారంపై జీ20 సభ దృష్టి పెడుతోంది. భారత్‌ ఇప్పటికే శ్రీలంకకు రుణ సదుపాయం అందించి, ఐఎంఎఫ్‌ ఆర్థిక సహాయం పొందడానికి తోడ్పడింది. జాంబియాను రుణ సంక్షోభం నుంచి బయటపడేయడానికి జీ20 ఉమ్మడి నిబంధనల చట్రం ఉపకరించింది. దీన్ని ఇతర రుణబాధిత దేశాల కోసమూ వినియోగించాలని భారత్‌ కోరుతోంది. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఉపద్రవాల నివారణపై జీ20 కార్యబృందం చర్చించింది. ప్రకృతి విపత్తుల గురించి ముందుగా హెచ్చరించే వ్యవస్థలతో పాటు అవి సంభవించినప్పుడు సత్వరం స్పందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ కార్యబృందం సూచించింది.  ప్రపంచ ఆహార భద్రతకు చిరుధాన్యాలు అక్కరకొస్తాయని చెబుతున్న భారత్‌- తన జీ20 అధ్యక్ష సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా పాటించడం విశేషం. ఇప్పటివరకు దేశంలో జరిగిన జీ20 సమావేశాలన్నింటిలో చిరుధాన్యాల కౌంటర్లను ఏర్పాటు చేసింది. భారతీయ పాక నిపుణులు వీటితో చేసిన వంటకాలను అంతర్జాతీయ అతిథులకు వడ్డించి మన్ననలు పొందారు.


సాంస్కృతిక వారసత్వ పరిచయం

గత ఎనిమిది నెలల్లో దేశంలో పలుచోట్ల 200కు పైగా జీ20 సమావేశాలు జరిగాయి. మంత్రులు, ప్రతినిధుల స్థాయి సమావేశాలను మహా నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ నిర్వహించారు. తద్వారా భారత్‌లో పర్యాటక అవకాశాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సభలు నిర్వహించి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతినిధులకు పరిచయం చేశారు. ఇది దేశ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌ను శాశ్వత సభ్యదేశంగా చేర్చేందుకు భారత్‌ శ్రద్ధ తీసుకొంటోంది. ఇందుకు కూటమిలోని మెజారిటీ సభ్య దేశాల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశ సంయుక్త నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


రుణభారం నుంచి విముక్తికి..

ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను సంస్కరించడం ద్వారా వర్ధమాన దేశాలను రుణ ఊబి నుంచి గట్టెక్కించేందుకు జీ20 అజెండా ప్రాధాన్యమిస్తోంది. అందుకు అవసరమైన సంస్కరణలను సిఫార్సు చేసేందుకు 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎన్‌.కె.సింగ్‌, అమెరికా ఆర్థికవేత్త ల్యారీ సమ్మర్స్‌ల నాయకత్వంలోని నిపుణుల బృందం సంప్రతింపులు జరుపుతోంది. ఫలితంగా వాతావరణ మార్పుల నిరోధం, అభివృద్ధి సాధన కోసం వర్ధమాన దేశాలకు మరిన్ని నిధులు సమకూరవచ్చని భావిస్తున్నారు.


హస్తిన అదరహో..

దిల్లీలోని జామా మసీదును జాతీయ జెండాలోని త్రివర్ణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వాగత తోరణాలు, సృజనాత్మక హోర్డింగులతో దేశ రాజధాని అందంగా ముస్తాబయింది. హస్తిన ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో పాటు పలు గృహాలపై వేసిన భారీ కుడ్య చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.


ఆహా.. ఏమి రుచి

దిల్లీ వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులకు విభిన్న వంటకాలను రుచి చూపించనున్నారు. ముఖ్యంగా ఒడిశా రాష్ట్ర గిరిజన మహిళల సహకారంతో చిరుధాన్య వంటకాలను సిద్ధం చేస్తున్నారు. భారతీయులు బాగా ఇష్టపడే ‘స్ట్రీట్‌ ఫుడ్‌’నూ వేడివేడిగా వడ్డించనున్నారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లోపాలు సరిదిద్దితేనే సరైన న్యాయం

‣ విశ్వ కుటుంబంగా ముందడుగు

‣ భూటాన్‌కు డ్రాగన్‌ వల

‣ ప్రత్యేక భేటీ.. అమిత ఉత్కంఠ!

‣ నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

‣ డాలర్‌ పెత్తనానికి గండి?

Posted Date: 15-09-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని