• facebook
  • whatsapp
  • telegram

విశ్వ కుటుంబంగా ముందడుగు



‘వసుధైవ కుటుంబకమ్‌’.. ఈ రెండు పదాల్లో నిగూఢమైన తాత్త్వికత ఇమిడి ఉంది. దీని అర్థం.. ‘ఈ ప్రపంచమే ఒక కుటుంబం’. సరిహద్దులు, భాషాభేదాలు, భావజాలాలకు అతీతంగా అందరం ఒకే విశ్వ కుటుంబంగా పురోగమించడానికి ఈ భావన తోడ్పడుతుంది. భారత్‌ జీ20 అధ్యక్షతన మానవుడు కేంద్రంగా అభివృద్ధి అన్నది ప్రధాన నినాదంగా ముందుకొచ్చింది. ఒకే ధరణిగా ప్రపంచం అభివృద్ధికి మనం ఏకతాటిపైకి వస్తాం. ఒకే కుటుంబంగా అభివృద్ధి చెందడంలో మనమందరం ఒకరికొకరం అండగా నిలుస్తాం. పరస్పరం అనుసంధానితమైన ప్రస్తుత ప్రపంచంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగడం ప్రధాన అంశం.


కొవిడ్‌ మహమ్మారి విజృంభణ తరవాత ప్రపంచంలో చాలా పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా మూడు మార్పులను మనం గమనించవచ్చు. అవి- స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) కేంద్రితం నుంచి మానవుడు ప్రధాన భూమికగా ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం ఉందన్న భావన క్రమంగా అధికమవుతోంది. వైరస్‌ ప్రభావం నుంచి సరఫరా గొలుసులు త్వరగా కోలుకోవడం, వాటిలో విశ్వసనీయత పెరగాల్సిన ఆవశ్యకతను ప్రపంచం గుర్తిస్తోంది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ద్వారా వాటిలో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం పెంచాలన్న డిమాండు పెద్దయెత్తున వినిపిస్తోంది. జీ20 అధ్యక్ష స్థానం నుంచి ఈ మూడు అంశాల పరంగా భారత్‌ కీలక పాత్ర పోషించింది.


నిర్మాణాత్మక వైఖరి

నిరుడు డిసెంబరులో ఇండొనేసియా నుంచి జీ20 సారథ్యాన్ని భారత్‌ స్వీకరించినప్పుడు, ఆలోచనా విధానంలో మార్పు తేవడానికి ఈ కూటమి ఉత్ప్రేరకంగా నిలవాలని నేను పిలుపిచ్చాను. ముఖ్యంగా వర్ధమాన దేశాల ఆకాంక్షలకు మన్నన దక్కాలనుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా కీలకం. భారత్‌ జీ20 నేతృత్వంలో జరిగిన ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌ సమ్మిట్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయా దేశాల నుంచి ఆలోచనలను పంచుకోవడంలో ఇది ఎంతగానో తోడ్పడింది. ఇందులో 125 దేశాలు పాలుపంచుకున్నాయి. జీ20కి ఇండియా అధ్యక్షత వహించిన కాలంలో ఆఫ్రికా దేశాలకు సమధిక ప్రాధాన్యం దక్కింది. ఆఫ్రికన్‌ సమాఖ్యకు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత్‌ చొరవ చూపింది. పరస్పరం అనుసంధానమైన ప్రపంచం అంటే... ఆయా రంగాల్లో మన సవాళ్లు సైతం ఒకే విధంగా ఉంటాయి. 2030 నాటికి సాధించాల్సిన పలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీలను) ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది. ఎస్‌డీజీలకు సంబంధించిన పురోగతి గాడి తప్పడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఏడాది జీ20 రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఆయా దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.


ప్రకృతితో మమేకమై జీవించడం అనాదిగా భారత్‌లో ఆనవాయితీగా వస్తోంది. ఆధునిక కాలంలోనూ వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో భారత్‌ తనవంతు పాత్ర పోషిస్తోంది. చాలా వర్ధమాన దేశాలు అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్నాయి. పర్యావరణ మార్పులను నిలువరించడానికి వాటికి అగ్రరాజ్యాలు సరైన ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది. కేవలం వాతావరణ మార్పులను నిలువరించాలంటూ లక్ష్యాలు నిర్దేశించుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. దానికోసం సమధిక నిధులు కేటాయించాలి. సాంకేతికతలను పరస్పరం బదిలీ చేసుకోవాలి. వాతావరణ మార్పులను నిలువరించడానికి ఏమి చేయకూడదు అనే నిర్బంధ వైఖరి నుంచి ఏమి చేయాలి అనే నిర్మాణాత్మక వైఖరి వైపు మళ్ళాల్సిన అవసరం ఉందని భారత్‌ విశ్వసిస్తోంది. సుస్థిర నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చెన్నై ఉన్నత స్థాయి సూత్రాలు మన సముద్రాలను స్వచ్ఛంగా ఉంచేందుకు తోడ్పడతాయి. శుద్ధ, హరిత హైడ్రోజన్‌కు ప్రాధాన్యం దక్కడానికీ ఇండియా జీ20 సారథ్యం ఎంతగానో తోడ్పడింది. 2015లో భారత్‌ అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేసింది. ప్రపంచ బయోఇంధన కూటమి ద్వారా, ఇంధన రంగంలో మేలిమి మార్పులకు ఇండియా సహకరిస్తోంది.


తమ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు రోజువారీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ విధంగానే, భూగోళ ఆరోగ్యానికి నష్టం వాటిల్లకుండా వారు తమ జీవనశైలి విషయంలోనూ నిర్ణయాలు తీసుకోగలరు. కాబట్టి, వాతావరణ పరమైన కార్యాచరణను ప్రజాస్వామ్యీకరించుకోవడమే మేలైన మార్గం. సమగ్ర ఆరోగ్యం కోసం యోగాను ప్రపంచ ఉద్యమంగా మార్చినట్లే... ‘సుస్థిరాభివృద్ధి కోసం జీవనశైలి (లైఫ్‌)’ దిశగా ప్రపంచాన్ని నడిపిస్తున్నాం. వాతావరణ మార్పుల వల్ల ప్రజలందరికీ ఆహార, పోషకాహార భద్రతను కల్పించడం ఎంతో కీలకంగా మారింది. చిరుధాన్యాలు లేదా శ్రీఅన్న ఇందుకు దోహదపడతాయి. ప్రస్తుత అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరంలో వీటిని ప్రపంచానికి రుచి చూపించాం. సాగుకూ ఇవెంతో అనుకూలం. ‘ఆహార భద్రత, పోషకాహారంపై దక్కన్‌ ఉన్నతస్థాయి నియమాలు’ కూడా ఈ దిశగా తోడ్పడుతున్నాయి.


ఐక్యంగా మున్ముందుకు..

చేపట్టిన ప్రతి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చడమన్నది ఈరోజు భారత్‌ లక్షణం. జీ-20 సారథ్యమూ అంతే. చెప్పాలంటే ఇప్పుడిది ప్రజలు నడిపిస్తున్న ఉద్యమం. మన సారథ్య గడువు పూర్తయ్యేనాటికి ఇండియావ్యాప్తంగా 60 నగరాల్లో 200కు పైగా సమావేశాలు జరుగుతాయి. 125 దేశాల నుంచి వచ్చే సుమారు లక్ష మంది ప్రతినిధులకు భారత్‌ ఆతిథ్యమిస్తుంది. భారతదేశ జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, అభివృద్ధి గురించి జీ-20 ప్రతినిధులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారని అనుకొంటున్నా. విభజనలను రూపుమాపి, అవరోధాలను అధిగమించడానికి... సహకారమనే విత్తనాలను చల్లడం ద్వారా అసమ్మతి స్థానంలో ఐక్యతను చాటే ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి మన జీ20 సారథ్యం కృషి సలుపుతోంది. జీ20 సారథిగా ప్రతి గొంతునూ వింటామని, ప్రతి దేశంతోనూ కలిసికట్టుగా ముందుకెళ్తామని ప్రతినబూనాం. మన చర్యలు, వాటి ఫలితాలు ఆ హామీకి అనుగుణంగానే ఉన్నాయని నేను భావిస్తున్నాను.


సాంకేతికత తోడుగా..

ఎప్పటికప్పుడు సాంకేతికతలను ఉన్నతీకరించుకున్నా, వాటిని సమర్థంగా వినియోగించుకునేలా చేయడం కీలకం. గతంలో సాంకేతికతలు అభివృద్ధి చెందినప్పటికీ, వాటి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా లబ్ధి చేకూర్చలేదు. సాంకేతికత ద్వారా అసమానతలను ఎలా రూపుమాపవచ్చన్నది భారత్‌ కొన్నేళ్లుగా చేసి చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నేటికీ బ్యాంకు సదుపాయానికి, డిజిటల్‌ గుర్తింపునకు నోచుకోవడం లేదు. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ)తో వారికి ఆర్థిక తోడ్పాటు అందించవచ్చు. భారత్‌లో ఇలాంటి వారి కోసం డీపీఐ ద్వారా చూపిన పరిష్కారం ప్రపంచ ఆదరణ పొందింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు డీపీఐను ఏర్పాటు చేసుకోవడానికి, దాని ప్రయోజనాలను పొందడానికి, తద్వారా అవి సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు జీ-20 వేదిక ద్వారా ఇండియా తోడ్పడుతుంది.


మహిళల అభివృద్ధి

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడమన్నది ఆకస్మికంగా జరిగిందేమీ కాదు. సులభతరమైన, ఆచరణాత్మకమైన, సుస్థిర పరిష్కారాలే అట్టడుగు వర్గాలకు బలిమి చేకూర్చాయి. భారత్‌ను అభివృద్ధి పథాన నడిపిస్తున్నాయి. అంతరిక్షం నుంచి క్రీడల వరకు, ఆర్థిక రంగం నుంచి వ్యవస్థాపనల వరకు... ఎన్నో రంగాల్లో భారతీయ మహిళలు నాయకత్వ స్థానాన్ని అందుకొన్నారు. ‘మహిళాభివృద్ధి’ ప్రస్థానాన్ని ‘మహిళల నేతృత్వాన అభివృద్ధి’కి తీసుకెళ్ళారు. కార్మికశక్తి వినియోగంలో అంతరాలను రూపుమాపడంతో పాటు నాయకత్వంలో, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలా తోడ్పడటంలో భారత్‌ జీ-20 సారథ్యం నిమగ్నమైంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూటాన్‌కు డ్రాగన్‌ వల

‣ ప్రత్యేక భేటీ.. అమిత ఉత్కంఠ!

‣ నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

‣ డాలర్‌ పెత్తనానికి గండి?

Posted Date: 15-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం