• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యేక భేటీ.. అమిత ఉత్కంఠ!



కేంద్ర ప్రభుత్వం (సెప్టెంబర్ 2023) 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టు 2023, 31న విపక్ష ‘ఇండియా’ కూటమి ముంబయిలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్న సమయంలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడింది. వాస్తవానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిశాయి. అంతలోనే మళ్ళీ ‘ప్రత్యేక సమావేశాలు’ ఏర్పాటు చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.


మన దేశంలో పార్లమెంటు ‘ప్రత్యేక సమావేశాలు’ నిర్వహించడం విచిత్రమేమీ కాదు. రాజ్యాంగ విరుద్ధమూ కాదు. కాకపోతే, ఇవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. భారత రాష్ట్రపతి తాను అనుకూలమని భావించిన సమయంలో పార్లమెంటు ఉభయసభల సమావేశాలకు పిలుపివ్వాలని రాజ్యాంగంలోని 85వ అధికరణ చెబుతోంది. అయితే, రెండు సెషన్ల మధ్య కాలావధి ఆరు నెలలకు మించకూడదు. అందుకే- ఏటా బడ్జెట్‌, వర్షాకాల, శీతాకాల సమావేశాలను నిర్వహించడం పరిపాటి. అలాగని ఈ మూడు సందర్భాల్లోనే పార్లమెంటు భేటీ కావాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తిచేసుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తున్న ‘అమృత్‌ కాలం’లో అయిదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా జరిగే చర్చలు ఫలవంతం కావాలని కేంద్రం ఆశిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యానించారు.


చరిత్రాత్మక సందర్భాల్లో..

దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించే సమయంలో లోక్‌సభ ప్రత్యేకంగా భేటీ కావడం గురించి రాజ్యాంగంలోని 352వ అధికరణ చెబుతోంది. కానీ, ప్రస్తుత సందర్భం వేరు. గతంలో చేపట్టిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చలు సరైన దిశలో, అర్థవంతంగా జరిగాయి. పలు చారిత్రక సంఘటనలకు అవి వేదికలయ్యాయి. భారత్‌-చైనా యుద్ధ పరిస్థితిపై చర్చించేందుకు 1962లో నవంబరు ఎనిమిది-తొమ్మిది తేదీల్లో దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రేరణ మేరకు ప్రత్యేక సమావేశాలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా, ఆయనకు నివాళులు అర్పించేందుకు 2015 నవంబరు 26-27 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఆ సమయంలో రాజ్యాంగంపట్ల రాజకీయ నిబద్ధత గురించి చర్చించాలని నిర్ణయించారు. అదే ఏడాది నవంబరు 26ను కేంద్రం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి యాభై ఏళ్లవుతున్న సందర్భంగా 1997లోనూ ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు ఒకటి వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగాయి. వస్తుసేవల పన్నుకు (జీఎస్‌టీకి) సంబంధించి 2017 జూన్‌ 30న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించారు. అనంతరం జులై ఒకటి నుంచీ జీఎస్‌టీ అమలులోకి వచ్చింది.


భారత్‌ స్వాతంత్య్రం పొందిన సందర్భంగా 1947 ఆగస్టు 14-15 తేదీల్లో తొలి వేడుకల సమావేశాలు జరిగాయి. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి యాభై ఏళ్లయిన సందర్భంగా 1992 ఆగస్టు తొమ్మిదిన; స్వతంత్ర భారతికి పాతికేళ్లు నిండిన సమయంలో 1972 ఆగస్టు 14-15 అర్ధరాత్రి కూడా వేడుకలకు సంబంధించి సమావేశాలు నిర్వహించారు. 1997 తరవాత ఇప్పుడు మళ్ళీ సుదీర్ఘంగా అయిదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేకంగా భేటీ కానుంది. వీటి అజెండాను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రకటించాల్సి ఉంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం విపక్ష ‘ఇండియా’ తన వ్యూహాలకు పదునుపెడుతున్న సమయంలో ప్రత్యేక సమావేశ ప్రకటన వెలువడటం ఆ కూటమి పక్షాలను విస్మయానికి గురిచేసి ఉండవచ్చు. మహిళా రిజర్వేషన్‌తో పాటు ఇతర వివాదాస్పద బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని కొలువుతీర్చింది. దాంతో అందరి దృష్టీ జమిలి ఎన్నికలవైపు మళ్ళింది. వాస్తవానికి ఈ అంశం 1983 నుంచీ చర్చల్లో నలుగుతోంది. 2018లో న్యాయసంఘం ముసాయిదా నివేదిక జమిలి ఎన్నికలపై మూడు ఐచ్ఛికాలను సిఫార్సు చేసింది.


దేశంలో లోక్‌సభతో పాటు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఎన్నో లాభనష్టాలతో కూడుకున్న పని. పైగా ఇందుకోసం చట్టాలు, నియమాలకు పెద్దయెత్తున సవరణలు చేయాల్సి ఉంటుంది. జమిలి కోసం రాజ్యాంగంలోని అధికరణలు 83(చట్టసభల కాలవ్యవధి), 85(లోక్‌సభ రద్దు), 172(రాష్ట్రాల చట్టసభల కాలవ్యవధి), 174(రాష్ట్రాల చట్టసభల రద్దు), 356(రాష్ట్రపతి పాలన)తో పాటు పదో షెడ్యూల్‌(ఫిరాయింపులవల్ల ఉత్పన్నమయ్యే అన్ని అనర్హత అంశాలను ఆరు నెలల్లోగా సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారి నిర్ణయిస్తారని హామీ ఇవ్వడం) వంటివాటిని సవరించాలి. ఈ సవరణలను సగానికి తక్కువ కాకుండా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. మరోవైపు, చట్టాల సవరణ కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని పలు సెక్షన్లకు మార్పులు చేయాల్సిన అవసరముంది. ప్రధానంగా సెక్షన్‌ 2(‘ఏకకాల ఎన్నికలు’ అనే పదాన్ని చేర్చాలి), సెక్షన్‌ 14, 15(సాధారణ, శాసనసభల ఎన్నికల ప్రకటన)లను సవరించాలి. లోక్‌సభ, శాసనసభ వ్యవహారాల విధి విధానాలకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు అవసరమవుతాయి.


జమిలి కోసమేనా?

దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎన్నో అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, కేంద్రం ఈ విషయంలో కొంతవరకు ముందడుగు వేసే అవకాశముంది. మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో అరుణాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, హరియాణాల్లోనూ అసెంబ్లీల గడువు ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటితో సంప్రతింపులు చేపట్టి, లోక్‌సభతోపాటే ఈ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలనూ నిర్వహించే అవకాశముంది. ఇప్పటికే ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండొనేసియా, పోలాండ్‌, దక్షిణాఫ్రికా, స్పెయిన్‌, యూకేల్లో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానం అమలవుతోంది. భారత్‌లోనూ ఆ దిశగా జమిలి ఎన్నికల నిర్వహణ కోసమే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారేమో... రానున్న కాలమే వెల్లడిస్తుంది!


ఏకాభిప్రాయ సాధనే కీలకం

జమిలి ఎన్నికలకు వెళ్ళడమన్నది అంత సులభమైన విషయమేమీ కాదు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ అంశంలో రాజకీయ       ఏకాభిప్రాయాన్ని సాధించడమే అతిపెద్ద సవాలు. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ గడువు తీరకముందే జమిలి ఎన్నికలకు వెళ్ళేందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.   లోక్‌సభతో పాటు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగే సందర్భాల్లో సహజంగానే జాతీయస్థాయి అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అలాంటప్పుడు జమిలి ఎన్నికలకు అంగీకరించడం ద్వారా ప్రాంతీయంగా తమ ప్రాముఖ్యతను కోల్పోవడానికి రాష్ట్రాలు సిద్ధమవుతాయా అన్నది సందేహాస్పదమే!


- వివేక్‌ కే అగ్నిహోత్రి (విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్‌)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

‣ డాలర్‌ పెత్తనానికి గండి?

‣ వైమానిక సేనకు స్వయంశక్తి

‣ ‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

‣ పర్యటనలే ఉద్యోగమైతే!

‣ డాలరుకు ప్రత్యామ్నాయం ఏమిటి?

Posted Date: 09-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం