• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పర్యటనలే ఉద్యోగమైతే!

* గౌరవప్రదమైన జీతభత్యాలున్న వివిధ కొలువులు ప్రపంచాన్ని చుట్టేయాల‌న్న‌ది చాలామందికి కల. కానీ రకరకాలైన కారణాలతో వృత్తి ఉద్యోగాల్లో తలమునకలై నలిగిపోతూ ఉంటారు. అనుకున్నట్టుగా దూర ప్రాంతాలకు వెళ్లలేక, చేస్తున్న పని మూసగా అయిపోయి, సెలవులు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా పనిలోనే పర్యటించే అవకాశం ఉంటే భలే బాగుంటుంది కదా! అలా చేసే వీలున్నవే ఈ కెరియర్లన్నీ. వీటిలో ఉద్యోగాలు మీకు చాలాచోట్ల పర్యటించే అవకాశం కల్పించడమే కాదు.. చక్కని వేతనాలనూ, గౌరవప్రదమైన జీతభత్యాలనూ అందించగలవు. మరి అవేంటో చూసేద్దామా..


ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌

యూపీఎస్సీ ద్వారా ఏటా నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌)కు ఎంపికైన అభ్యర్థులకు దేశవిదేశాల్లో పర్యటించాల్సిన అవసరం ఉంటుంది. హై కమిషన్స్, ఎంబసీలు, కాన్సలేట్స్‌... ఇలా అనేక చోట్ల దేశ సేవలో వీరు పాలుపంచుకుంటారు. ఇతర దేశాలు, అంతర్జాతీయ సమాజంతో మంచి బంధాలు నెలకొల్పేలా చూడటం.. వివిధ ప్రాంతాల్లో దేశానికి ప్రతినిధిగా పనిచేయడంతోపాటు.. అంతర్జాతీయ స్థాయిలో మన గొంతుక బలంగా వినిపించే అవకాశం దొరుకుతుంది. 

ఎలా?: యూపీఎస్సీ ఏటా నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఈ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవచ్చు. ఈ పరీక్ష తదుపరి నోటిఫికేషన్‌ 2024లో వెలువడనుంది.


ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

వివిధ ప్రాంతాల్లో జరిగే రకరకాలైన ఈవెంట్లను నిర్వహించే మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో చేరడం ద్వారా చాలా చోట్ల పర్యటించే వీలు కలుగుతుంది. ఈ ఉద్యోగంలో మీ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు చూపించడంతోపాటు దేశవిదేశీ టూర్లు వేయొచ్చు. వందలు, వేలాది మంది పాల్గొనే కార్పొరేట్, ప్రైవేట్, గవర్నమెంట్, పొలిటికల్‌ ఈవెంట్లు కావడంతో జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అదే సమయంలో సమాజంలో ఉన్నతశ్రేణి పరిచయాలు కలిగే అవకాశం దొరుకుతుంది. 

తెలుగు రాష్ట్రాల్లో వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్లు అందిస్తున్న ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీలను అభ్యసించడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకోసం నిర్వహణ, సమస్యా పరిష్కారం, సృజనాత్మక, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్, నెగోషియేషన్, బడ్జెటింగ్, మల్టీటాస్కింగ్‌ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి.


ఫ్లైట్‌ అటెండెంట్‌

విమాన ప్రయాణాలు ఆస్వాదించేవారికి ఫ్లైట్‌ అటెండెంట్‌/ఎయిర్‌ హోస్టెస్‌  ఉద్యోగం చాలా నచ్చుతుంది. ఫ్లైట్‌లో ప్రయాణికుల అవసరాలు - రక్షణ,  విమాన పరిశుభ్రత, ఇతర ముఖ్య విధులన్నీ చూసుకోవడం వీరి బాధ్యత. డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌ కంటే కూడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేసేవారికి వివిధ ప్రదేశాలు చూసే అవకాశం ఎక్కువ. చక్కని జీతభత్యాలతోపాటు నక్షత్ర హోటళ్లలో బస, వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంటుంది. 

ఎలా?: ప్లస్‌టూ తర్వాత అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, లేదా డిగ్రీ చేసే వీలుంది. బీబీఏ ఏవియేషన్, బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, పీజీలో ఎమ్మెస్సీ ఏవియేషన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన వారు ఎయిర్‌లైన్స్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పూర్తిస్థాయి శిక్షణ అందించిన అనంతరం కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి.


క్రూయిజ్‌లలో..

నెలల తరబడి ప్రయాణాల్లో ఉన్నా ఫర్వాలేదు అనుకునే వారికి క్రూయిజ్‌లలో పనిచేయడం నచ్చుతుంది. ఈ సమయంలో భోజనం, వసతి ఉచితంగా లభించడమే కాకుండా మంచి జీతభత్యాలు కూడా అందుకోవచ్చు. ఇది కొత్త వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వడమే కాదు.. మంచి అనుభవాలను మిగల్చగల వృత్తి. దీనికి పాస్‌పోర్ట్‌ ఉండటం తప్పనిసరి, దాంతోపాటు సముద్రం మీద అధిక సమయం గడపగలిగేలా ఆరోగ్యంగా ఉండాలి.

ఎలా?: క్రూయిజ్‌ లైన్‌కు నేరుగా వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నియమ నిబంధనలు అనుసరించి నియామకాలు ఉంటాయి. కన్సల్టెన్సీల ద్వారా కూడా చేరవచ్చు. ఇందులో మెరైన్‌ ఆపరేషన్స్, సర్వీస్‌ ఆపరేషన్స్‌ పేరుతో డెక్, మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, లాండ్‌ బేస్డ్, టెక్నికల్, రెస్టారెంట్‌ - స్పా, ఇలా అనేక రకాలైన విభాగాలుంటాయి. విద్యార్హత, ఆసక్తిని అనుసరించి ఎంచుకోవచ్చు.


బ్లాగర్స్‌/వ్లాగర్స్‌

ట్రావెల్‌ వీడియోలు, బ్లాగ్స్‌/వ్లాగ్స్‌ ద్వారా సొంతంగా పనిచేసుకోవచ్చు, లేదా ఇతర కంపెనీలు, సంస్థల కోసం కూడా చేసే వీలుంటుంది. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ద్వారా ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా మారవచ్చు. మీకు నచ్చిన ప్రదేశాలు పర్యటనలు చేస్తూనే ఆదాయం, ఇతర అవకాశాలు పొందవచ్చు.  

ఒకప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లు సొంతంగా చేసేవారు కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ రంగంలో రాణించాలంటే చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సెరా, యుడెమీ, స్కిల్‌షేర్‌ వంటి దాదాపు అన్ని రకాలైన ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ వ్ల్లాగ్స్‌ చేయడం, వాటిని మార్కెటింగ్‌ చేసుకోవడం, పూర్తిస్థాయి కెరియర్‌లా ఆదాయం పొందడం, ఇంకా మంచి అవకాశాలు అందుకోవడం.. ఇలా ప్రతి దశనూ క్షుణ్ణంగా నేర్చుకునే వీలుంది. కొన్నిచోట్ల ఉచిత కోర్సులు కూడా లభిస్తున్నాయి, వీటి ద్వారా అభ్యసించవచ్చు.


ట్రావెల్‌ కన్సల్టెంట్‌

హోటల్స్, ట్రావెల్‌ వెబ్‌సైట్స్‌ వంటి సంస్థలు ట్రావెల్‌ కన్సల్టెంట్లను నియమించుకుంటాయి. వీరు వ్యక్తులు - సంస్థలకు ప్రయాణాల్లో సహాయకారులుగా ఉండటం, డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ట్రిప్స్‌ను నిర్వహించడం, వారి పర్యటన అవసరాలను తెలుసుకుని అందుకు తగిన విధంగా వారికి గైడ్‌ చేయడం వంటి విధులుంటాయి.

ఇంటర్‌ తర్వాత ఈ ట్రావెలింగ్‌ కోర్సులు చేసేందుకు వీలుంది. బీటీటీఎం (బ్యాచిలర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌), ఎంటీహెచ్‌ఎం (మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌) వంటి అనేక కోర్సులు చేసే వీలుంది. ట్రావెల్‌ కన్సల్టెంట్‌గా సొంతంగా వ్యాపారం పెట్టుకున్నా, కార్పొరేట్‌ పరిశ్రమలో పనిచేసినా అవకాశాలు బాగుంటాయి. ఇందులో సీటీఏ (సర్టిఫైడ్‌ ట్రావెల్‌ అసోసియేట్‌), సీటీసీ (సర్టిఫైడ్‌ ట్రావెల్‌ కౌన్సెలర్‌) అనే రెండు రకాలైన సర్టిఫికేషన్స్‌ ఉన్నాయి. నియామకాలను అనుసరించి పరిశ్రమలో కొంత అనుభవం తర్వాత వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ట్రావెల్‌ రైటర్‌

ట్రావెలింగ్‌ రైటర్లు ఒక ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకుని వారి అనుభవాలను అందంగా రాస్తారు. అక్కడకు వెళ్లాలి అనుకునే పర్యటకులకు వీరి రాత ఒక గైడ్‌లా పనిచేస్తుంది. ఇలా ఫ్రీలాన్సర్‌గా అయినా చేయవచ్చు, లేదా ఏదైనా పబ్లిషింగ్‌ హౌస్, మ్యాగజీన్, వెబ్‌సైట్‌ వంటి వాటికి రాయవచ్చు. ఈ రచయితలు గైడ్‌ బుక్స్, రివ్యూలు, ట్రావెల్‌ ఫీచర్లు, సోషల్‌ మీడియా పోస్టులు.. ఇలా అనేక విధాలైన కంటెంట్‌ సృష్టిస్తారు. మొదట్లో పర్యటన ఖర్చులు ఇచ్చి రాయించుకునే సంస్థలు దొరకడం కాస్త కష్టమైనా.. అనుభవం, గుర్తింపు పెరిగేకొద్దీ మంచి లాభాలు ఆర్జించవచ్చు.

ఎలా?: ఏదైనా కనీస డిగ్రీ పూర్తిచేయాలి. జర్నలిజం, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, ట్రావెల్‌ అండ్‌ టూరిజం, హిస్టరీ వంటివి చదవడం మరింత ఉపకరిస్తుంది.  రాయడం సాధన చేయాలి. వివిధ సంస్థల్లో ట్రావెల్‌ రైటింగ్‌ పొజిషన్స్‌కు దరఖాస్తు చేయడం ద్వారా ఉద్యోగం సంపాదించవచ్చు. సొంతంగా సోషల్‌ మీడియా ఖాతాలు నిర్వహించుకోవడం ద్వారా పాఠకులకు మరింత చేరువ కావొచ్చు.


ఫొటోగ్రాఫర్‌

ఫొటోగ్రఫీ ట్రావెలర్స్‌కి అత్యంత నచ్చే వృత్తి. వెడ్డింగ్, పార్టీ, ఏరియల్, ఇండస్ట్రియల్, మోడలింగ్, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ.. ఇలా విభాగం ఏదైనా సరే, వివిధ ప్రదేశాలు తిరిగి చూసే అవకాశం దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో ఫొటోలను అమ్మకానికి పెట్టడం, లేదా రైటర్ల మాదిరిగానే పబ్లిషింగ్‌ హౌసెస్, మ్యాగజీన్స్, వెబ్‌సైట్స్‌ వంటి వాటికి పనిచేయడం ద్వారా ఆదాయం అందుకోవచ్చు.

ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి మన దేశంలో చాలా ప్రముఖ సంస్థలు ప్రొఫెషనల్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఏ విభాగంలో ఆసక్తి ఉందనేది గుర్తించి కోర్సు ఎన్నుకోవడం ముఖ్యం. అందులో భాగంగానే ఎక్విప్‌మెంట్‌ను ఆపరేట్‌ చేయడం కూడా నేర్పిస్తారు. రకరకాలైన ఫొటోలు తీయడం ద్వారా పోర్ట్‌ఫోలియో నిర్మించుకుని సోషల్‌ మీడియా ద్వారా వీక్షకులకు, సంస్థలకు మరింత చేరువ కావొచ్చు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

‣ ఆన్‌లైన్‌ దరఖాస్తు చాలు.. 15 రోజుల్లో విద్యారుణం!

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

Posted Date : 24-08-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం