• facebook
  • whatsapp
  • telegram

వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

* ఉద్యోగార్థులకు సూచనలు


కరోనా తర్వాత ఇంటర్వ్యూలు జరిగే తీరులో చాలా మార్పులొచ్చాయి. వర్చువల్‌ ముఖాముఖిల సంఖ్య పెరిగింది. దానికి తగిన టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో.. ప్రస్తుతం ప్రతి పది సంస్థల్లో తొమ్మిది ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీని వల్ల వాటికి సమయం ఆదాతో పాటు తక్కువ శ్రమతో పని సులువవుతోందని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ఈ విధానం సంస్థలకు లాభదాయక మైనప్పటికీ అభ్యర్థులకు మాత్రం అంత సులువైన పద్ధతైతే కాదు. మరి ఏం చేస్తే వర్చువల్‌ ఇంటర్వ్యూలో మెరవొచ్చో తెలుసుకుందామా!


ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూ ఎదుర్కొనేటప్పుడు ఉన్న ముఖ్యమైన అనుకూల అంశం ఏంటంటే.. మన ఇంట్లో, మన గదిలో, సౌకర్యవంతంగా కూర్చుని మాట్లాడవొచ్చు. ఎక్కడికో వెళ్లాలి, గంభీరమైన ఆఫీసు వాతావరణంలో, అప్పటికే వచ్చి ఎదురుచూస్తున్న పోటీదారులతో కలిసి కూర్చుని టెన్షన్‌ పడాలి అనే బాధ ఉండదు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. వర్చువల్‌ ఇంటర్వ్యూల్లో అవతలి వ్యక్తిని నేరుగా చూసి మాట్లాడలేకపోవడం, వారి ప్రతి కదలికను పూర్తిస్థాయిలో గమనించ లేకపోవడం ఒక ప్రతికూలత. సాంకేతిక సమస్యలు ఉండనే ఉంటాయి. వీటన్నింటినీ మనం మార్చలేం కాబట్టి మన పరిధిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.


ఆహార్యం


ఇంట్లోనే ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూనే కదా అనే ఉద్దేశంతో దుస్తుల విషయాన్ని సులభంగా తీసుకోవడం సరికాదు. నేరుగా ముఖాముఖికి వెళ్తే ఎలా తయారవుతామో ఇక్కడా అంతే ప్రొఫెషనల్‌గా కనిపించాలి. ఫ్యాన్సీ దుస్తులు, విపరీతంగా ఆకర్షించే రంగులు నప్పవు. జుట్టు, యాక్సెసరీస్‌ విషయంలోనూ ఇదే జాగ్రత్త అవసరం.


ప్లాట్‌ఫామ్‌ గురించి..


ఏ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మనకు ఇంటర్వ్యూ జరగబోతోందో దాని గురించి తెలుసుకోవడం అవసరం. అసలేమీ పరిచయం లేకుండా లాగిన్‌ అయిపోతే తీరా ఇంటర్వ్యూ సమయంలో ఏ ఆప్షన్‌ ఎలా ఉపయోగించాలో తెలియక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానివల్ల సంభాషణలో ఫ్లో మిస్‌ అయితే ఆ ప్రభావం ఇంటర్వ్యూపై పడుతుంది. దీని కోసం ముందుగా స్నేహితుల, కుటుంబ సభ్యుల సాయంతో ఓÛసారి ఆ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి చూడాలి.


నోట్స్‌


మనం చేసిన ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ప్రొఫైల్‌ గురించి ఇతర ముఖ్య వివరాలన్నీ బుల్లెట్‌ పాయింట్ల మాదిరిగా రాసి ఎదురుగా ఉంచుకోవడం ద్వారా అవసరమైనప్పుడు ఒక్కసారి చూసి, గుర్తు చేసుకుని చెప్పేందుకు వీలుంటుంది. అయితే ఈ నోట్సును సింపుల్‌గా ఒకే ఒక్క పేజీలో రాసుకోవాలి. వాటిని ఎలా చెప్పాలనేది ముందే సాధన చేయాలి. ఒకవేళ మర్చిపోతే చూసుకోవడానికి బ్యాకప్‌ మాత్రమే ఇది. ఎక్కువగా చూస్తున్నట్లు కనిపించడం అంత మంచి అభిప్రాయం ఏర్పడనివ్వదు.


మాట్లాడే వేగం


సాధారణ ఇంటర్వ్యూలో నేరుగా ఉంటాం కాబట్టి మాట్లాడే ఫ్లో అర్థమవుతుంది. కానీ ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడేటప్పుడు మన మాట వారికి ఎంత వేగంతో, ఎంత శబ్దంతో వినిపిస్తుందనే విషయంపై శ్రద్ధ వహించాలి. మరీ నెమ్మదిగా అవతలి వారికి బోర్‌ కొట్టేలా కాకుండా.. అలా అని మరీ వేగంగా వారు ఫాలో అయ్యేందుకు వీల్లేనంతగా కూడా కాకుండా జాగ్రత్తగా స్పష్టంగా మాట్లాడటం వల్ల వారి ఆసక్తి సడలకుండా ఉంటుంది. అవసరాన్ని బట్టి చేతులు మితంగా కదిలించడం ద్వారా సంభాషణను మరింత చక్కగా సాగే వీలుంటుంది.


పరిసరాలు.. 


చాలామంది అభ్యర్థులు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ అనగానే ఇంట్లోనే కదా అని కాస్త తేలికగా తీసుకుంటారు. కానీ చుట్టుపక్కల వాతావరణం మన ఉద్యోగావకాశాలను ప్రభావితం చేయగలదు. వీలైనంత వరకూ వెనక ఖాళీ ప్రదేశం లేదా గోడ ఉండటం మంచిది. లేదంటే మన అకడమిక్, క్రీడా ప్రతిభను, క్రమశిక్షణ కలిగిన ప్రవర్తనను తెలియజేసేలాంటి వస్తువులు ఉండటం ఉపకరిస్తుంది. రెజ్యూమెను ప్రతిబింబించేవి మాత్రమే నేపథ్యంలో ఉండాలి. వీలైనంతగా కూల్‌ లైటింగ్‌ (తెలుపు రంగును ప్రతిబింబించే లైట్లు) ఉండటం లేదా సహజ కాంతి ఉండటం అవతలి వారికి కంటికి హాయిగా అనిపిస్తుంది.


అలవాటు


వీడియో కాల్స్‌ మాట్లాడే అలవాటు లేనివారికి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తాము కూడా స్క్రీన్‌ మీద కనిపించడం జవాబులు ఇచ్చే సమయంలో కాస్త ఒత్తిడికి గురిచేయొచ్చు. అందుకే ఈ ప్రక్రియను అలవాటు చేసుకోవడం ఉత్తమం. అలాగే ముందే ఎవరైనా స్నేహితులతో మాట్లాడి వీడియో రికార్డ్‌ చేయడం ద్వారా ఎదుటివారి కళ్లలోకి చూస్తున్నామా లేదా, సరిగ్గా కూర్చుంటున్నామా లేదా, ఇంకేమైనా బాడీ లాంగ్వేజ్‌ తప్పులు చేస్తున్నామా అనేది చూసే వీలుంటుంది. మాట్లాడేటప్పుడు గొంతు  ఏ స్థాయిలో ఉంది.. సరిగ్గా వినపడేలా ఉందా లేదా అనేదీ సరిచూసుకోవచ్చు. కూర్చునేటప్పుడు మరీ దూరంగానూ లేక మరీ దగ్గరగానూ కాకుండా భుజాల వరకూ స్పష్టంగా కనిపించేలా ఉంటే అవతలివారికి సౌకర్యవంతంగా ఉంటుంది.


పొరపాటున..


ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి ఇంటర్వ్యూ మధ్యలో స్క్రీన్‌ ఆగిపోయినా.. లాగ్‌ఔట్‌ అయిపోయినా మొదట కంగారు పడకుండా చాట్‌ ఆప్షన్‌ ద్వారా ఇంటర్వ్యూయర్‌కి సమాచారం తెలియజేయాలి. ఫోన్‌ ద్వారా, వేరే ఏ విధంగా అయినా ముఖాముఖి కొనసాగించవచ్చేమో అడిగి చూడాలి. ఇలాంటివి జరిగితే ప్లాన్‌ బి ఏదో ఒకటి ఉంటుంది. విషయాన్ని కంపెనీకి తెలియజేసి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చాలా సంస్థలు వర్చువల్‌ ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో చేరడం ద్వారా మెరుగైన ప్రదర్శన కనపరచవచ్చు. వర్చువల్‌ ఇంటర్వ్యూల్లో తమకు దొరికిన తక్కువ సమయం, అవకాశంలో ఇంటర్వ్యూవర్‌ మన గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అందులోనే మన బెస్ట్‌ ఏంటో చూపించేయాలి.. అదే సమయంలో నిజాయతీగానూ ఉండాలి సుమా!


అన్నీ సిద్ధం


ఇంటర్వ్యూకి కూర్చునే ముందే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలి. అవసరమైన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, గ్యాడ్జెట్లు ఎటువంటి సమస్యా లేకుండా పనిచేస్తున్నాయా అనేది సరి చూసుకోవాలి. గదిలో సరిపడా వెలుతురు ఉందా, వీడియో ఎటువంటి సమస్యా లేకుండా కనిపిస్తోందా/వినిపిస్తోందా అనేది చెక్‌ చేయాలి. నెట్‌ కనెక్షన్‌ ఇంట్లో ఇతరులు షేరింగ్‌లో వాడుతుంటే మీ ఇంటర్వ్యూ  సమయంలో మిగతావారిని ఆపేయమనడం ద్వారా అత్యధిక స్పీడ్‌తో పనిచేస్తుంది. అలాగే ఏవైనా అవాంతరాలు వస్తాయని భావిస్తే వీలైనంతగా వాటిని నివారించడం (ఫోన్‌ సైలెంట్‌లో ఉంచడం, ఎవరూ గదిలోకి రావొద్దని చెప్పడం వంటివి..), నివారించలేని విషయాలైతే ముందే ఇంటర్వ్యూయర్‌కి చెప్పడం.. (ఉదాహరణకు పక్క రూమ్‌లో మీ పెంపుడు కుక్క ఉందనుకోండి.. అది అరిస్తే ఇబ్బంది పడటంకంటే ముందే వారికి చెప్పడం వంటివి) ద్వారా అసౌకర్యానికి ఆస్కారం ఉండదు.


సానుకూలంగా..


ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు వీలైనంత వరకూ సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించాలి. ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్‌ ద్వారా దీన్ని సాధించవచ్చు. మాట్లాడేటప్పుడు కొంచెం ముందుకు వంగి మాట్లాడటం, అవతలి వారు మాట్లాడుతున్నప్పుడు చిన్నగా తల ఆడించడం ద్వారా సంభాషణ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు కనిపించవచ్చు. అటూ ఇటూ చూస్తున్నట్టు, ఫోకస్‌ మారుతున్నట్లు కనిపించకూడదు. వాళ్లు ఏదో అడుగుతారు, మనం చెబుతాం అన్నట్లు కాకుండా ఇంటర్వ్యూను వీలైనంత లైవ్‌గా ఉంచేందుకు, సంభాషణలా మార్చేందుకు ప్రయత్నించాలి. మనకు తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లే ఉంటూ అదే సమయంలో ప్రొఫెషనల్‌గానూ ఉండాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..  చాలామంది స్క్రీన్‌ మీద ఇంటర్వ్యూవర్‌ లేదా తమ ఇమేజ్‌ను చూస్తూ మాట్లాడుతుంటారు, కానీ చూడాల్సింది కెమెరాలోకి. దీన్ని కోఆర్డినేట్‌ చేసుకోవడం ముందుగానే సాధన చేయాలి. ఇంటర్వ్యూవర్‌ను చూడగానే చిన్నగా తల ఆడించి చిరునవ్వుతో హలో చెప్పడం ద్వారా అనుకూల వాతావరణంలో మొదలుపెట్టవచ్చు.


ముందుగానే..


చాలా టెక్‌ కంపెనీలు ముందుగానే మనల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరో వివరాలు చెబుతుంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడం ఇంటర్వ్యూ సమయంలో ఉపకరిస్తుంది. వారి ప్రొఫెషనల్‌ ఖాతాలు, పోస్ట్‌ చేసే కథనాలు - వివరాలు, మాట్లాడిన ప్రసంగాలు, ఎటువంటి గ్రూప్స్‌-క్లబ్స్‌లో ఉన్నారు.. ఇలాంటివి తెలుసుకోవడం ద్వారా ముఖాముఖి సమయంలో ఎక్కడైనా బ్లాంక్‌ స్పేస్‌ వచ్చినా, సంభాషణ పొడిగించడానికి, అవతలి వారిని ఎంగేజ్‌ చేయడానికి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ పేదింటి బిడ్డలు.. ‘ఎస్సై’లుగా కొలువు దీరారు!

‣ ఉన్నత విద్య.. ఉద్యోగానికి ‘గేట్‌’

‣ ఉద్యోగార్థులూ.. కొత్త పరీక్షలకు సిద్ధమేనా!

‣ ఇంటర్‌తో ఉద్యోగాలెన్నో!

Posted Date: 17-08-2023


 

ఉద్యోగాన్వేష‌ణ‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం