• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగార్థులూ.. కొత్త పరీక్షలకు సిద్ధమేనా!

నియామకాల్లో నూతన పద్ధతులను అనుసరిస్తున్న సంస్థలు



క్లాస్‌లో ఉన్నప్పుడు ఎవ్వడైనా ఆన్సర్‌ చెప్తాడు. కానీ పరీక్షలో రాసినోడే.. టాపర్‌ అవుతాడు!.. ఓ సినిమాలో డైలాగ్‌ ఇది. సందర్భానికి తగ్గ స్పందన  గురించి ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరేమో. 


పోటీలో కావాల్సింది వేగం, పనిలో ఉండాల్సింది కచ్చితత్వం. ఆ రెంటినీ అంచనా వేసేవే ‘సైకోమెట్రిక్‌ టెస్టులు’. ఒక అభ్యర్థి సందర్భానికి తగినట్టు ఎంత వేగంగా ఎంత కచ్చితంగా రియాక్ట్‌ అవుతాడనే విషయాన్ని తెలుసుకోవడానికి కంపెనీలు, రిక్రూటింగ్‌ ఏజెన్సీలు వీటిని ఉపయోగిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులు వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


కంపెనీలకు ప్రధానంగా కావాల్సింది మనం ఎలా పనిచేస్తాం, ఎలా ప్రవర్తిస్తాం అనే రెండు విషయాలు. వీటిని కచ్చితంగా అంచనా వేయడంలో సైకోమెట్రిక్‌ టెస్టులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 


ఈ పరీక్షలు అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాయి. ఇందులో తప్పొప్పుల కంటే కూడా అభ్యర్థి ఆలోచనా ధోరణి తెలుసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఉంటుంది.


ఎవరి గురించైనా చూడగానే తెలిసిపోతే భలే ఉంటుంది కదా! వారి ఆలోచనలేంటో, సామర్థ్యాలేంటో, బలహీనతలేంటో, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారో అన్నీ తెలుసుకుంటే.. సగం సమస్యలు ఉండవు. అదే కంపెనీలకు తమకు నమ్మకంగా పనిచేసే ఉద్యోగులు కావాలి, వేలాదిగా వచ్చే దరఖాస్తుల నుంచి మెరికల్లాంటి వారిని ఏరుకోవాలి. తాము ఎంచుకున్న అభ్యర్థులు స్థిరంగా సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి. అందుకు వారికి సైకోమెట్రిక్‌ టెస్టులు ఉపయోగపడుతున్నాయి.


ఆధునిక ఉద్యోగ నియామకాల్లో సైకోమెట్రిక్‌ టెస్టులు నయా ట్రెండ్‌ సెట్టర్‌. అభ్యర్థి బలాలు  - బలహీనతలేంటో, ఉద్యోగంలో చూపగలిగే సామర్థ్యాలేంటో.. అన్నింటినీ ఒక టెస్టుతో అంచనా వేయగలిగేలా ఉండటమే వీటి ప్రత్యేకత. ఏ ఉద్యోగానికైనా అభ్యర్థిలో కావాల్సిన ప్రధానమైన లక్షణాలు వెర్బల్, న్యూమరికల్, బిహేవియరల్‌ స్కిల్స్‌. సైకోమెట్రిక్‌ టెస్టులు ఈ మూడింటినీ పరిశీలిస్తాయి. సాధారణంగా ఇవి రెండు రకాలు, 1. ఎబిలిటీ టెస్ట్‌ 2. పర్సనాలిటీ టెస్ట్‌.


ఎబిలిటీ టెస్టుల్లో అభ్యర్థి కాగ్నిటివ్‌ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. న్యూమరికల్, వెర్బల్, లాజికల్, క్రిటికల్‌ థింకింగ్‌.. ఇలా దేన్నయినా గుర్తించేలా ఈ టెస్టులు ఉంటాయి. పర్సనాలిటీ టెస్టులు అభ్యర్థి ప్రవర్తన, ప్రేరణ, మనస్తత్వాన్ని అంచనా వేసేలా ఉంటాయి.


ఎందుకీ ప్రాధాన్యం?

కొత్తవారిని రిక్రూట్‌ చేసుకునేటప్పుడు సైకోమెట్రిక్‌ టెస్టులు పూర్తిస్థాయిలో కంపెనీలకు అభ్యర్థుల గురించి ఇన్‌సైట్స్‌ ఇవ్వగలవు. తన అవగాహన, నైపుణ్యాలు, సామర్థ్యాలు అన్నింటి గురించి తెలియజేయగలవు. సాధారణంగా తొలిదశలో భారీగా అభ్యర్థులను వడపోయాలన్నప్పుడు ఎంట్రీ లెవెల్‌ ఆటోమేటిక్‌ టెస్టులను నిర్వహిస్తారు. ఇవి వందల మందిని చాలా తేలికగా అంచనా వేస్తాయి. దీంతో సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవ్వడం వల్ల అధికంగా ఉపయోగిస్తున్నాయి.


ఏ రకాలున్నాయి?

ఎబిలిటీ టెస్టుల్లో పలు రకాలున్నాయి.


1. న్యూమరికల్‌ రీజనింగ్‌: సైకోమెట్రిక్‌ టెస్టుల్లో ఇది అత్యంత ప్రాధాన్యం ఉన్న, విరివిగా ఇస్తున్న పరీక్ష. అంకెల సమాచారాన్ని అభ్యర్థి ఎలా హ్యాండిల్‌ చేస్తాడనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. డేటాను విశ్లేషణ చేయడం, అంచనాకు తీసుకురావడం, పట్టికలు - గ్రాఫ్స్‌ను అధ్యయనం చేయగలగడం.. ఇవన్నీ ఇందులో భాగం. ఇచ్చిన సమయంలో ఎంత వేగంగా ఎంత కచ్చితత్వంతో ప్రశ్నలకు జవాబులు కనుక్కున్నారనేది చూస్తారు.


2. వెర్బల్‌ రీజనింగ్‌: పారాగ్రాఫ్‌లు, టెక్ట్స్‌ను ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారనేది ఇందులో చూస్తారు. ఇందులో సాధారణంగా పెద్ద పెద్ద పేరాలు ఇచ్చి ట్రూ, ఫాల్స్, కెనాట్‌ సే అనే ఆప్షన్లలో ఏదైనా ఒకటి జవాబుగా ఎంచుకోమంటారు. కేవలం ఆ పేరాల్లో ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే వీటికి జవాబులు రాయాలి. సాధారణంగా ఈ ప్రశ్నలు పెద్దపెద్దగా ఉండటం వల్ల వేగంగా చదివి, ఇచ్చింది అర్థం చేసుకుని సమాధానం ఇవ్వడం అవసరం.


3. లాజికల్‌/ డయాగ్రమెటిక్‌ రీజనింగ్‌: సమస్యాపూరణ నైపుణ్యాలను అంచనా వేసేందుకు దీన్ని వాడతారు. మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్, ఇంజినీరింగ్, ఫైనాన్స్‌ వంటి ముఖ్య విభాగాలకు చెందిన నియామకాల్లో డయాగ్రమెటిక్‌ లాజికల్‌ టెస్టులు అధికంగా వినియోగిస్తున్నారు. ఇందులో ఇచ్చే ప్రశ్నలు చిత్రాలు, నమూనాలు, ఆకారాలు ఉపయోగించి తయారుచేస్తారు.


4. ఎర్రర్‌ చెకింగ్‌ టెస్టులు: సెట్ల వారీగా ఇచ్చిన డేటా, పేరాల్లో తప్పులను వెతికి పట్టుకోవడం ఈ పరీక్ష. సెక్రటేరియల్, క్లరికల్, అడ్మినిస్ట్రేటివ్‌ ఉద్యోగాల్లో ఎర్రర్‌ చెకింగ్‌ టెస్టులు అధికంగా ఉపయోగిస్తున్నారు. చూడటానికి ఒకేలా ఉంటూ చిన్న చిన్న తేడాలతో అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా ఉంటాయివి.


5. డేటా అనాలిసిస్‌: ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చేలా ఈ టెస్టులు ఉంటాయి. విస్తృతమైన డేటా నుంచి సంక్షిష్టమైన, సూక్ష్మమైన, అవసరమైన అంశాలను గుర్తించగలుగుతున్నారా లేదా అనే పరీక్షిస్తారు.


6. క్రిటికల్‌ థింకింగ్‌ టెస్టులు: పేరుకు తగినట్టుగానే ఇది అభ్యర్థి లోతైన ఆలోచనా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించినది. ఒక ఆర్గ్యుమెంట్‌ను లాజికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతున్నారా లేదా అనేది దీని ద్వారా తెలుసుకుంటారు.


7. మెకానికల్‌ రీజనింగ్‌: టెక్నికల్‌ ఉద్యోగాలకు సంబంధించి ఈ పరీక్షను నిర్వహిస్తుంటారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను మెకానికల్‌ ప్రిన్సిపల్స్‌ ఉపయోగించి ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని ఈ టెస్టులు పరిశీలిస్తాయి.


8. సిచ్యువేషన్‌ జడ్జిమెంట్‌: ఇది ఆసక్తికరమైన టెస్టు. రోజువారీ పని ప్రదేశంలో ఎదురయ్యే వివిధ సందర్భాలకు అభ్యర్థి ఎలా ప్రతిస్పందిస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాయీ టెస్టులు. ఈ ప్రశ్నలకు ఆప్షన్లు కూడా ‘మోస్ట్‌ లైక్లీ, లీస్ట్‌ లైక్లీ’ అనేలా ఉంటాయి. దీనికి తప్పు, ఒప్పు జవాబు అంటూ ఏదీ ఉండదు. కంపెనీకి కావాల్సినట్లు, లేదా దాని అంచనాలకు తగినట్టు, నైతికంగా ఒప్పు అనిపించేలా ప్రవర్తించేవారు అధిక మార్కులు పొందుతారు.


పర్సనాలిటీ టెస్టుల్లో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, బలాలు, బృందంతో పనిచేసే గుణం, అభివృద్ధికి అవకాశాలు, పోటీతత్వం, పని విలువలు, ప్రేరణ, సత్ప్రవర్తన.. ఇవన్నీ తెలుసుకునేలా ప్రశ్నపత్రాలు ఉంటాయి.


సంప్రదాయ పద్ధతిలో రిక్రూటర్లు అభ్యర్థి రెజ్యూమె, అర్హతలు, ఇంటర్వ్యూలో ఇచ్చిన జవాబుల ఆధారంగా అతడిని అంచనా వేస్తారు. అయితే ఇవి పూర్తిస్థాయిలో కచ్చితంగా ఉంటాయా అనేది చెప్పలేం. కానీ సైకోమెట్రిక్‌ టెస్టులు ఇంతకంటే లోతైన ప్రశ్నలతో ఎక్కువ తెలుసుకునే అవకాశం ఇస్తున్నాయి. వీటిద్వారా ఆబ్జెక్టివిటీ, కచ్చితత్వం, వేగం.. ఇలా ఎన్నో అంశాలను పరిశీలించవచ్చు.


ఇవి సాధారణంగా ఇచ్చిన సమయంలో రాసేలా ఉంటూ మల్టిపుల్‌ చాయిస్‌ ఫార్మాట్‌లో ఉంటాయి. 


ఇతర పరీక్షల మాదిరిగానే వీటికీ ‘వేగం - కచ్చితత్వం’ అనేవి ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు.


సాధారణంగా ఇందులో నెగిటివ్‌ మార్కింగ్‌ అనేది ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉండే అవకాశం ఉంటుంది. 


దరఖాస్తు చేసిన పోస్టు స్థాయిని అనుసరించి టెస్టులో అడిగే ప్రశ్నల కఠినత్వం ఆధారపడి ఉంటుంది. 


అలాగే కంపెనీ/సంస్థ ఉన్న రంగం, అభ్యర్థి దరఖాస్తు చేసిన ఉద్యోగం తీరును బట్టి కూడా ఈ టెస్టుల్లో అడిగే ప్రశ్నల విధానం మారుతుంది. 


కొన్ని కంపెనీలు ప్రాథమిక స్థాయిలో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు రాసే అవకాశం ఇస్తున్నాయి. ఎందుకంటే సైకోమెట్రిక్‌ టెస్టులు చీటింగ్‌ను గుర్తుపట్టేయగలవు. ఒక ప్రశ్నకూ మరో ప్రశ్నకూ ఇచ్చిన జవాబు, ఆలోచనాధోరణిలో వచ్చే తేడాను కనిపెట్టేయగలవు. అంతేకాకుండా ప్రాథమికంగా పాసైనా తిరిగి కంపెనీలో అధికారికంగా మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. అప్పుడు, ఇప్పుడు వేరేలా ఉంటే దాన్ని గమనించే టెక్నాలజీ ఉంది వీటికి. 


వీటిని ఇప్పటికే ఆర్‌ఆర్‌బీ, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లోనూ ఇస్తున్నారు.


సన్నద్ధత ఎలా?

సైకోమెట్రిక్‌ టెస్టులు ఒక్కో రిక్రూటింగ్‌ ఏజెన్సీ నుంచి వచ్చేవి ఒక్కో రీతిన ఉంటాయి. ఏ టెస్టు రాస్తున్నాం అనేదాన్ని బట్టి సన్నద్ధం కావాలి. మిగతా పరీక్షల మాదిరిగానే ఎంతగా సాధన చేస్తే అంతగా వీటిలో మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

ఈ పరీక్షలు సాధారణ టెస్టుల మాదిరిగా గంటల్లో ఉండవు, నిమిషాల్లో మాత్రమే ఉంటాయి. ఆ తక్కువ సమయంలో అప్పటికప్పుడు స్పందించి జవాబు ఇవ్వాలి. 

ఏ కొలువుకు దరఖాస్తు చేస్తున్నా ఆ కంపెనీకి మీ ఉద్యోగం ద్వారా ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ నైపుణ్యాలకు పదునుపెట్టండి.

చాలామంది అభ్యర్థులు మ్యాథ్స్, ఇంగ్లిష్‌  బాగా వస్తే సైకోమెట్రిక్‌ టెస్టులు సులభంగా రాసేయొచ్చు అనుకుంటారు. కానీ ఇది కొంతవరకే నిజం. ఇవి ఇప్పటివరకూ ఉన్నవాటికి విభిన్నమైన పాట్రన్‌ కలిగిన టెస్టులు. అవగాహన, సాధన లేకుండా మంచి మార్కులు తెచ్చుకోవడం సాధ్యం కాదు.

ఇందులో ఏ సబ్జెక్టు గురించైనా ఇవ్వొచ్చు, ఎటువంటి పాట్రన్‌లో అయినా ప్రశ్న ఉండొచ్చు. వాటి గురించి తెలుసుకోవడం, వీలైనంత సాధన చేయడం మాత్రమే మంచి మార్కులు వచ్చేలా చేస్తాయి.

అన్ని రకాల ఉద్యోగాలకు ఒకేలాంటి ప్రశ్నలు ఉండవు. మనం పోటీ పడుతున్న ఉద్యోగానికి ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనేది తెలుసుకోవాలి. 

ఇవన్నీ టైమ్‌ లోపల రాసేలాగానే ఉంటాయి. కేవలం 1 - 2 శాతం మంది అభ్యర్థులు మాత్రమే టెస్ట్‌ పూర్తిగా రాసేంత తక్కువ టైమ్‌ ఇస్తారు. మిగతా అందరూ ప్రశ్నలు వదిలేస్తారంటే ఎంత వేగంగా పూర్తిచేయాలో అర్థం చేసుకోవచ్చు. అందుకే టైమింగ్‌కు ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయడం అవసరం. 

ఇంగ్లిష్‌ బాగా చదవడం, ఒకాబ్యులరీ పెంచుకోవడం కూడా ముఖ్యం. అప్పుడు పరీక్షలో పదాలు అర్థం చేసుకోవడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. 

చివరిగా.. ఇది అభ్యర్థులకు అకడమిక్‌ వ్యవస్థలో అంతగా పరిచయం లేని అంశం. పూర్తిగా నేర్చుకుంటేనే, ఉద్యోగాలకు తగిన ఆలోచనాధోరణి వృద్ధి  చేసుకుంటేనే విజయం సాధించవచ్చు. తగిన సాధన చేస్తే కోరుకున్న ఉద్యోగం అందుకోవచ్చు!


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉన్నత విద్య.. ఉద్యోగానికి ‘గేట్‌’

‣ ఇంటర్‌తో ఉద్యోగాలెన్నో!

‣ పోటీలో ఉండాలి ఇలా..

‣ ప్రాంప్ట్‌ ఇంజినీర్‌.. కోట్లలో ప్యాకేజీ!

‣ బీటెక్‌తో హెచ్‌ఏఎల్‌లో ఉద్యోగాలు

‣ 'క్యాట్‌ 2023' సన్నద్ధత ఇలా..

Posted Date : 15-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.