• facebook
  • whatsapp
  • telegram

'క్యాట్‌ 2023' సన్నద్ధత ఇలా..

పరీక్ష స్వభావం, సిలబస్‌ విశ్లేషణ వివరాలుకార్పొరేట్‌ ప్రపంచంలో వివిధ సంస్థల సీఈఓల్లో చాలామంది ఐఐటీలు, ఐఐఎంలలో చదివిన పట్టభద్రులే కనిపిస్తారు. విజయవంతమవుతున్న చాలా అంకుర సంస్థల బాధ్యులు ఈ సంస్థల నేపథ్యం ఉన్నవారే. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐ.ఐ.ఎం.)ల్లో ఎంబీఏ చేస్తే పెద్ద మొత్తంలో వార్షిక వేతన ప్యాకేజ్‌లు పొందవచ్చు. ఈ సంస్థల్లో, టాప్‌ బిజినెస్‌ స్కూల్స్‌లో సీటు సాధించాలంటే గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు ‘క్యాట్‌’ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)లో అర్హత తప్పనిసరి. ఈ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైన సందర్భంగా ముఖ్య వివరాలు, సన్నద్ధత మెలకువలు..


గత సంవత్సరం అన్ని ఐ.ఐ.ఎం.లలోని దాదాపు 5000 ఎంబీఏ సీట్ల కోసం 2.20 లక్షలమంది క్యాట్‌లో పోటీ పడ్డారు. ప్రవేశ విషయంలో సానుకూలత ఏమిటంటే- కొన్ని సంవత్సరాలుగా ఐ.ఐ.ఎం.లు ‘తరగతి గదుల్లో వైవిధ్యం’ కోసం సాధారణ డిగ్రీ విద్యార్థులైన బీకాం, బీఎస్సీ, ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ చదివినవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. బీటెక్‌ చదివినవారికన్నా పై గ్రూపు విద్యార్థులకు క్యాట్‌లో తక్కువ స్కోరు వచ్చినా అడ్మిషన్‌ అవకాశం ఉంటోంది! 


క్యాట్‌లో అర్హత సాధించిన తర్వాత, ఐ.ఐ.ఎం.లు, బిజినెస్‌ స్కూల్స్‌ తదుపరి స్క్రీనింగ్‌ టెస్ట్స్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌ (రాత పరీక్ష), గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిస్తే ప్రవేశం కల్పిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు క్యాట్‌ సన్నద్ధతతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా పెంపెందించుకొంటే ఐ.ఐ.ఎం.ల్లో ప్రవేశం పొందటం ఖాయం. 


దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 13.


క్యాట్‌ తేదీ: నవంబర్‌ 26


ఫలితాలు: జనవరి రెండోవారం.   


అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులు (జనరల్, ఓబీసీ). 45 శాతం మార్కులు (ఎస్‌సీ, ఎస్‌టీ, డీఏ) ఫైనల్‌ ఇయర్‌ డిగ్రీ విద్యార్థులు కూడా అర్హులే. 


సబ్జెక్టుల వారీగా..


వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఎ ఆర్‌సీ)  

నాలుగు ప్యాసేజీలు (16 ప్రశ్నలు), వెర్బల్‌ ఎబిలిటీపై 8 ప్రశ్నలు (పేరా జంబుల్స్‌- 3, పేరా సమ్మరీ-3, పేరా కంప్లీషన్‌-2 ఉంటాయి. ప్రతి అభ్యర్థికీ కష్టంగా అనిపించే విభాగమిది. ఎందుకంటే మిగతా విభాగాలైన మ్యాథ్స్‌కూ, రీజనింగ్‌కూ ఉండే షార్ట్‌ కట్స్‌  దీనికి ఉండవు. అయితే ఇంగ్ల్లిష్‌ను తార్కికంగా చదివితే సులభంగా విజయం సాధించవచ్చు. ఎక్కువ వెయిటేజీ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (ఆర్‌సీ)కి ఉంది. 19 ప్రశ్నలు కేవలం ప్యాసేజ్‌లపైనే అడిగారు. అభ్యర్థులు తప్పనిసరిగా రీడింగ్‌ నైపుణ్యాలు పెంపెందించుకోవాలి. అంటే సాధారణ పఠనం కాకుండా, తార్కికమైన పఠనం చెయ్యాలి.  


ప్రతి పోటీ పరీక్షలో ఆర్‌సీ రెండు విభాగాలతో కూడి ఉంటుంది- ఒకటి ప్యాసేజీ, రెండోది దాని ప్రశ్నలు, ఛాయిస్‌లు. ఎగ్జామినర్‌ ప్యాసేజీలను దినపత్రికలు, పుస్తకాల నుంచి సేకరించి పరీక్షలకు ఉపయోగిస్తారు. అంటే ప్యాసేజీలు కష్టతరంగా ఉండనప్పటికీ.. వాటి ప్రశ్నలు, ఛాయిస్‌ల భాగంలోనే ఉచ్చులు (ట్రాప్స్‌) ఉంటాయి. ఇక్కడ కొద్దిగా సమయం వెచ్చించి జాగ్రత్తగా చదవాలి/ఛేదించాలి. చాలా సందర్భాల్లో అభ్యర్థులు ప్యాసేజీని పదేపదే చదువుతూ సమయం వృథా చేస్తుంటారు. దీన్నుంచి బయటపడాలి. అలాగే ప్యాసేజీని చదివేటప్పుడు, ప్రతి పేరాలోని ముఖ్య భావనలు వెలికితీయాలి. అంతేకానీ ప్రతి పదానికీ అర్థం కోసం వెతకకూడదు. ప్రశ్నలు పేరాలోని ముఖ్య భావనలపైనే కానీ, పదాలపై ఉండవు.


ఆర్‌సీ ప్రశ్నలు రెండు రకాలు. ఫ్యాక్ట్‌ (వాస్తవ సమాచార) ఆధారిత ప్రశ్నలు. ఇవి సులువైనవి. ప్యాసేజీల్లో వెతికితే జవాబులు దొరుకుతాయి. అయితే రెండో రకం ఇన్ఫరెన్స్‌ ప్రశ్నలు. వీటి జవాబులు పైపైన చదివితే దొరకవు. అంతర్లీనంగా /నర్మగర్భంగా ఉంటాయి. ఇక్కడ నిశిత పఠనం అవసరం. క్యాట్‌లో ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా ఇస్తుంటారు. ఈ విభాగంలో సమయపాలన చాలా అవసరం. ఎందుకంటే 40 నిమిషాల్లో 4 ప్యాసేజీలు, వెర్బల్‌ ఎబిలిటీ (వీఏ) విభాగం పూర్తి చెయ్యాలి. అంటే ఒక్కో ప్యాసేజీని 10 నిమిషాల్లోపే పూర్తిచేసి మిగతా సమయాన్ని వీఏకి ఉపయోగించుకోవాలి. మొత్తం మీద అభ్యర్థులు వేగంగా చదవటం అలవర్చుకోవాలి. క్యాట్‌లో ఆర్‌సీలు ఆన్‌లైన్‌లోని అంతర్జాతీయ దినపత్రికలు, మ్యాగజీన్స్‌ (ద గార్డియన్, ద న్యూయార్క్‌ టైమ్స్‌..)లో వచ్చే ప్రత్యేక వార్తలు, సంపాదకీయాల నుంచి ఇస్తుంటారు. ఫిలాసఫీ, సైన్స్, ఆర్థిÄక నేపథ్యమున్న కథనాలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవాలి. నిత్యం కొన్ని కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకొంటూ పదజాలం పెంపొందించుకోవాలి. ప్యాసేజీలను చదువుతున్నపుడు కొత్త పదాలు ఎదురైతే సందర్భానికి అనుగుణంగా అర్థం చేసుకోగలగాలి. ఈ ఆర్‌సీ సాధన ద్వారా వీఏని సులభంగా ఛేదించవచ్చు. దీనికి ప్రత్యేక సాధన అవసరం ఉండదు. ఈవిధంగా రోజూ ఇంగ్లిష్‌ ఆర్‌సీల సాధన, అంతర్జాతీయ వార్తాపత్రికల పఠనం, కొత్త పదాలను నేర్చుకోవడం ద్వారా వీఏ ఆర్‌సీ విభాగంలో మంచి స్కోరు సాధించవచ్చు.  పరీక్ష స్వరూపం (2022 క్యాట్‌ ప్రకారం) 

1. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌: 24 ప్రశ్నలు  

2. లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌: 20 ప్రశ్నలు  

3. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: 22 ప్రశ్నలు 

మొత్తం ప్రశ్నలు: 66. 

ఎంసీక్యూలు: 49.

నాన్‌ ఎంసీక్యూలు: 17 (వీటికి నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు). 

కాల వ్యవధి: 2 గంటలు (ప్రతి విభాగానికీ 40 నిముషాలు)

ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు కోల్పోతారు.

క్యాట్‌తో పాటు జాట్‌ (జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌), స్నాప్‌ (సింబయాసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) లాంటి చాలా ప్రవేశపరీక్షల్లో దాదాపుగా ఇదే సిలబస్‌ కామన్‌గా ఉంటుంది. అందుకే క్యాట్‌ సన్నద్ధత అన్ని బీ స్కూల్స్‌ ప్రవేశ పరీక్షలకూ ఉపయోగకరం. 


లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (ఎల్‌ఆర్‌ డీఐ)  

దీనిలో ఎల్‌ఆర్‌పై 10 ప్రశ్నలు, డీఐపై 10 ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో బార్‌ గ్రాఫ్‌లు, కాలమ్‌ గ్రాఫ్‌లు, టేబుల్‌ ఆధారిత ప్రశ్నలు, లైన్‌ చార్టులు, పై చార్టులు అడుగుతారు. పోయిన సంవత్సరం ‘యూనివర్సిటీ టీం, మెట్రో లైన్స్, 15 గర్ల్స్‌’ అనే టాపిక్స్‌పై ఎల్‌ఆర్‌ డీఐ ప్రశ్నలు తయారు చేశారు. నంబర్స్‌ ఆధారిత, వెన్‌ డయాగ్రమ్‌ లాంటి ఎల్‌ఆర్‌ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగంపై పట్టు రావాలంటే మొదటగా అరిథ్‌మెటిక్‌ సబ్జెక్టు, సెట్‌ థియరీపై అవగాహన రావాలి. సాధారణమైన లాజికల్‌ థింకింగ్‌ సామర్థ్యాలు పెంచుకోవడానికి సుడోకు లాంటి పజిల్స్‌ సాధన చెయ్యగలిగితే ఎల్‌ఆర్‌ డీఐపై పట్టు సాధ్యమవుతుంది.   


క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (క్యూఏ) 

2022 క్యాట్‌లో అరిథ్‌మెటిక్‌-8, ఆల్‌జీబ్రా-8, జామెట్రీ-3, నంబర్‌ సిస్టం-1, మోడర్న్‌ మ్యాథ్స్‌-2 ప్రశ్నలు అడిగారు. అరిథ్‌మెటిక్‌లో నంబర్‌ సిస్టమ్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, సమయం, వేగం- దూరం, బారు-చక్రవడ్డీ, పైప్స్, సిస్టెర్న్స్‌ లాంటి అంశాలనుంచి ప్రశ్నలు వస్తాయి. క్యూఏలో విజయం కోసం 8 నుంచి 10వ తరగతి మ్యాథ్స్‌ ప్రాథమిక అంశాల అధ్యయనం, అనువర్తనం చెయ్యాలి. సూత్రాలను బట్టీ పట్టకుండా తార్కిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు కనుగొనాలి. ఒక సౌలభ్యం ఏంటంటే- క్యాట్‌లో ఆన్‌స్క్రీన్‌ కాల్‌క్యులేటర్‌ ఉంటుంది. నాన్‌-మ్యాథ్స్‌ అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు సగం ప్రశ్నలు మ్యాథ్స్‌పై కాకుండా నిత్యజీవితంలో ఉపయోగించే అరిథ్‌మెటిక్‌ నుంచే ఇస్తున్నారు.   


సగం ప్రశ్నలకు సరైన జవాబులు రాస్తే చాలు   

చాలామంది క్యాట్‌ను ‘డిఫికల్ట్‌’ పరీక్ష అని భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవానికి ‘డిఫరెంట్‌’ పరీక్ష మాత్రమే. ఎందుకంటే మొత్తం 66 ప్రశ్నల్లో సగం (33) సరైన జవాబులు ఇవ్వగలిగినవారికి 99 పర్సంటైల్‌ స్కోరు వస్తుంది. ఈ టాప్‌ స్కోరు అన్ని టాప్‌  ఐ.ఐ.ఎం.లలో ప్రవేశానికి ఉపయోగపడుతుంది. 90 పర్సంటైల్‌ (20 ప్రశ్నలకు సరైన సమాధానాలు) సాధించినా అనేక ఐ.ఐ.ఎం.లలో అర్హత సాధిస్తారు. అంటే క్యాట్‌లో మంచి స్కోరుకు- అభ్యర్థి తన శక్తికి తగ్గ ప్రశ్నలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అసాధ్యమైన క్లిష్ట ప్రశ్నలను వదిలివేసే (ఎలిమినేషన్‌) సమయస్ఫూర్తి కూడా కావాలి. ఉన్న 2 గంటల సమయంలో తన సామర్థ్యానికి తగ్గ ప్రశ్నలను ఎంపిక చేసుకొని ఛేదిస్తే చాలు!


ముఖ్యంగా క్యాట్‌లో విజయానికి దోహదపడేది- ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టుల సాధన. పరీక్ష లోపు కనీసం 50 మాక్స్‌ రాయాలి. రాసినవాటిలో తప్పులు ఎందుకు పోతున్నాయో విశ్లేషించి గ్రహించాలి. తద్వారా క్రమేణా స్కోరు మెరుగుపడుతుంది. మాక్‌ టెస్టుల్లో భాగంగా గత ప్రశ్నపత్రాలను కూడా సాధన చేయాలి. ఈవిధంగా పరీక్షపైౖ పూర్తి అవగాహనతో ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమవటం, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయటం.. ఇవి చేస్తే క్యాట్‌లో మంచి స్కోరు సులువుగా సాధించవచ్చు! 


వెబ్‌సైట్‌: https://iimcat.ac.in/

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ తండ్రి కష్టం.. తనయ విజయం

‣ ఇంటర్‌తో కేంద్ర కొలువులు

‣ 'నాసా' మెచ్చిన కుర్రాడు!

‣ ఫిజియోథెరపీతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు

‣ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు

‣ న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 450 ‘ఏవో’ కొలువులు

‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్‌వో కొలువులు

Posted Date: 09-08-2023


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌