• facebook
  • whatsapp
  • telegram

రాస్తున్నారా.. క్యాట్‌?

గరిష్ఠ స్కోరుకు సూత్రాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లతో పాటు దేశంలోని ఇతర ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయాలంటే రాయాల్సిన ప్రవేశపరీక్ష.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌). ఈ ఏడాది నవంబర్‌ 28వ తేదీన జరగనుంది. ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రణాళిక ప్రకారం శ్రద్ధగా సిద్ధమయితే ఇందులో మంచి స్కోరు తెచ్చుకోవడం సాధ్యమే. 

జాతీయ స్థాయిలో జరిగే క్యాట్‌ లాంటి పోటీ పరీక్షల్లో వేగం, కచ్చితత్వం ప్రధాన అంశాలు. ప్రిపరేషన్‌ వ్యూహం కూడా ఈ కోణంలో నుంచే సాగాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన కాన్సెప్ట్టుపై పూర్తి స్థాయి పట్టు ఉండాలి. దీని ద్వారా సమాధానాల్లో కచ్చితత్వం వస్తుంది. సాధ్యమైనన్ని మాక్‌ పరీక్షలు రాయడం ద్వారా వేగం సాధించొచ్చు. ఫలితంగా ఎక్కువ స్కోరు చేసుకోవచ్చు. ఉత్తమ కళాశాలలో సీటూ దక్కించుకోవచ్చు.

పూర్తి స్థాయి పరీక్షలు

అంశాల వారీగా మాత్రమే కాకుండా పూర్తి స్థాయి మాక్‌ పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. నిజానికి ప్రిపరేషన్‌లో ప్రాథమిక అంశాలు, అధ్యాయాల వారీగా సిద్ధం కావడం అనేది కేవలం 20 నుంచి 30 రోజులకు పరిమితం కావాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి మాక్‌ టెస్ట్‌లు రాసేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 

సన్నద్ధతకు ఇవి ముఖ్యం

పరీక్ష విధానంపై అవగాహన 

సమయ నిర్వహణ

మాక్‌ టెస్టులు

నాణ్యమైన స్టడీ మెటీరియల్‌

నిత్య సాధన, ఆత్మవిశ్వాసం

క్యాట్‌ ప్రశ్నపత్రంలో మూడు అంశాలుంటాయి. 

1. వెర్చల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌  

2. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 

3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌. 

వెర్చల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌: ఈ విభాగంలో రీడింగ్‌ కాంప్రహెన్షన్, జంబుల్డ్‌ పేరాగ్రాఫ్, పేరా సమ్మరీ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ వెయిటేజీ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు ఉండొచ్చు. రీడింగ్‌ కాంప్రహెన్షన్, పేరా సమ్మరీలకు సంయుక్తంగా సిద్ధం కావాలి. జాతీయ, అంతర్జాతీయ దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను, ప్రారంభంలో మెల్లగా చదువుతూ వాటిని అవగాహన చేసుకొనేందుకు యత్నించాలి. ఆయా సంపాదకీయాల్లో, అంతర్లీనంగా ఉన్న అర్థాలను (ఇన్ఫరెన్స్‌), అర్థం తెలియని పదాలను పరిశీలించాలి. సందర్భానుసారం వాటిని అర్థం చేసుకోగలగాలి. సొంతంగా అభ్యర్థులు ప్రశ్నలు ఊహించగలగాలి. పరీక్ష అయ్యేంతవరకు కూడా నిత్యం ఈ కసరత్తును కొనసాగించాలి. సంబంధిత ప్యాసేజీ ద్వారా, రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో చూడాలి. శాస్త్ర- సాంకేతిక అంశాలు, ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్యాసేజీలను చదవాలి. ఆ తర్వాత సాధ్యం అయినన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. సందర్భానుసారంగా అర్థం చేసుకుంటున్న పదాలు ఎంత శాతం మేర సరి అవుతున్నాయో చూసుకోవాలి. 90% సందర్భాల్లో కచ్చితత్వం ఉంటే, ప్యాసేజ్‌ అర్థం అవుతున్నట్లు. వేగం పెంచేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇటీవలి కాలంలో క్యాట్‌లో పేరా సమ్మరీ ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఒక పేరాగ్రాఫ్‌ ఇచ్చి, ఆ తర్వాత నాలుగు ఆప్షన్స్‌ ఇస్తున్నారు, అందులో సరైన దానిని ఎంపిక చేసుకోవాలి. చదివేప్పుడే పూర్తి స్థాయిలో, అంతరార్థం గ్రహించాలి. తక్కువ సమయంలో మార్కులు తెచ్చే విభాగం కాబట్టి, అభ్యర్థులు దీనిని స్కోరింగ్‌గా గుర్తుంచుకోవాలి. జంబుల్డ్‌ పేరాగ్రాఫ్‌కు సైతం నేరుగా సాధన చేయాల్సి ఉంటుంది. వీలైనన్ని సాధన చేయడం ద్వారా ఎక్కువ స్కోరు చేసేందుకు వీలు ఉంటుంది.

డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌: డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌లో భాగంగా బార్‌ గ్రాఫ్‌లు, కాలమ్‌ గ్రాఫ్‌లు, టేబుల్స్‌ ప్రశ్నలు అడుగుతారు. వెన్‌ డయాగ్రామ్‌లు కూడా భాగం కావొచ్చు. కాంబినేషన్‌లో కూదా కొన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు రావొచ్చు. ఉదాహరణకు లైన్‌ చార్జ్‌లు, పై చార్జ్‌లు కలుపుతూ ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ అంశంలో స్కోరు చేయడానికి అభ్యర్థులు శాతాలు, నిష్పత్తులు, సరాసరి తదితర అంశాల్లో పట్టు సాధించాల్సి ఉంటుంది. మల్టిపుల్‌ చాయిస్‌ (ఎంసీక్యూ) ప్రశ్నలతో పాటు నాన్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు కూడా ఇస్తారు. అయితే ఏవి ఎన్ని సంఖ్యల్లో వస్తాయని మాత్రం చెప్పలేం. కాబట్టి అభ్యర్థులు వీలైనన్ని ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. లాజికల్‌ రీజనింగ్‌లో భాగంగా బ్లడ్‌రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, లాజికల్‌ సీక్వెన్సెస్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇవి కూడా నేరుగా అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. మొదట్లో సమయం ఎక్కువ తీసుకున్నా సరే కొనసాగించాలి, ప్రశ్నల సంఖ్య పెరిగేకొద్దీ వాటికి పరిష్కారం కనుగొనే సమయం తగ్గిపోతుంది.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అరిథ్‌మెటిక్, ట్రిగనామెట్రీ, ఆల్‌జీబ్రా తదితర అంశాలనుంచి ఈ సెక్షన్‌లో ప్రశ్నలు అడుగుతారు. అరిథ్‌మెటిక్‌లో నంబర్‌ సిస్టమ్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ స్పీడ్, సింపుల్, కాంపౌండ్‌ ఇంట్రస్ట్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి సంబంధించి పాఠశాల స్థాయిలో ప్రాథమిక అంశాలను అధ్యయనం చేయవచ్చు. అయితే సూత్రాలను నేర్చుకోవడం, వాటి ఆధారంగా చేయడం సరికాదు. తార్కిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు కనుగొనాలి. ముఖ్యంగా మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల్లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సరి కానివి తొలగించుకుంటూ వెళితే ప్రశ్నలకు జవాబులు తేలికగా దొరుకుతాయి. అయితే అన్ని ప్రశ్నలకూ ఇలా ఎలిమినేట్‌ చేసే విధానం సరిపోదు. కొన్నింటికి నేరుగా జవాబులు కనుగొనాల్సి వస్తుంది. మాక్‌ పరీక్షలు రాయడం ద్వారా, ప్రశ్నలను ఏ పద్ధతిలో జవాబులు కనుగొనవచ్చో తెలుస్తుంది. 

నెగిటివ్‌ మార్కులున్నాయి

పరీక్షకు సంబంధించిన అంశాలనే పేర్కొన్నారు గానీ నిర్దిష్ట సిలబస్‌ అంటూ లేదు. అయితే అక్టోబరులో ఐఐఎం అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌ పరీక్ష పత్రం అందుబాటులోకి తేనున్నారు. దాన్ని అభ్యర్థులు పరిశీలించొచ్చు. 

క్యాట్‌కు రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత నిర్వహణ అధికారులే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు.

పరీక్ష కేంద్రంలోకి కాల్‌క్యులేటర్‌ను అనుమతించరు. అయితే పరీక్ష అయ్యేంత వరకు కంప్యూటర్‌పై ఆన్‌ స్క్రీన్‌ కాల్‌క్యులేటర్‌ అందుబాటులో ఉంటుంది, దానిని వినియోగించుకోవొచ్చు.

ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్, నాన్‌ మల్టిపుల్‌ చాయిస్‌ అనే రెండు అంశాలుగా ఉంటాయి.

మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల్లో ప్రతి సరైన సమాధానానికీ మూడు మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కును తీసివేస్తారు. 

నాన్‌ ఎంసీక్యూ ప్రశ్నల్లో ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు. వీటికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు. వీటికి స్క్రీన్‌పైనే సమాధానాలను టైపు చేయాల్సి ఉంటుంది.

ఎన్ని నాన్‌ ఎంసీక్యూస్‌ ప్రశ్నలు వస్తాయో ఎక్కడా పేర్కొనలేదు.

ముఖ్యమైన తేదీలు 

క్యాట్‌ రిజిస్ట్రేషన్‌ ఆరంభం: ఆగస్టు 4 

రిజిస్ట్రేషన్లు ముగిసే తేదీ: సెప్టెంబర్‌ 15 

అడ్మిట్‌ కార్ట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: అక్టోబర్‌ 27 

పరీక్ష తేదీ: నవంబర్‌ 28 

వెబ్‌సైట్‌: https://iimcat.ac.in/

- విరివింటి రాజేంద్రశర్మ
 

Posted Date: 04-08-2021


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌