• facebook
  • whatsapp
  • telegram

ప్రసిద్ధ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ!

క్యాట్‌-2022 ప్రకటన విడుదల

దేశంలో అత్యంత ప్రాధాన్యమున్న మేనేజ్‌మెంట్‌ విద్యలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు శిఖరస్థాయి సంస్థలు. వీటిలో ప్రవేశానికి మొదటి మెట్టు కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (క్యాట్‌)లో అత్యుత్తమ స్కోరు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఐఐఎంలతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సంస్థల్లోనూ ఎంబీఏ చదువులకు పోటీ పడవచ్చు. ఇటీవలే క్యాట్‌ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం! 

దేశంలో 20 ఐఐఎంలు ఉన్నాయి. ఏటా దాదాపు 2 లక్షల మంది క్యాట్‌ రాస్తున్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా సంస్థల్లో ప్రవేశాలకు ఇందులో సాధించిన స్కోరే ప్రామాణికం. ఐఐఎంల్లో సీటు కోసం అత్యుత్తమ పర్సంటైల్‌ అవసరం. వీటిలో చదివే అవకాశం కొందరికే దక్కుతుంది. అయితే దేశంలోని టాప్‌ వంద బిజినెస్‌ స్కూళ్లలో ఎందులోనైనా సీటు పొందినవారు కోర్సు అనంతరం మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఈ టాప్‌-100 సంస్థల్లో సీటు దక్కాలంటే సుమారు 80 పర్సంటైల్‌ సాధిస్తే సరిపోతుంది. 

అందువల్ల క్యాట్‌ కఠినమైనదే అయినప్పటికీ సాధారణ విద్యార్థి సైతం మేటి సంస్థలో చదువుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నవారు పేరున్న సంస్థలో ఎంబీఏ సీటు పొందవచ్చు. గణాంకాల విశ్లేషణ, తార్కిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాల్లో అభ్యర్థి స్థాయిని తెలుసుకునేలా పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సన్నద్ధత ప్రణాళికను అందుకు అనుగుణంగా రూపొందించుకోవాలి.

పరీక్ష విధానం

పరీక్ష వ్యవధి 2 గంటలు. ఒక్కో సెక్షన్‌కూ 40 నిమిషాలు. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. అవి..

సెక్షన్‌ 1. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏఆర్‌సీ)

సెక్షన్‌ 2. డేటా ఇంటర్‌ ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్‌ (డీఐఎల్‌ఆర్‌)

సెక్షన్‌ 3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (క్యూఏ)

వీఏఆర్‌సీ

పాసేజ్, పేరాగ్రాఫ్, జంబుల్డ్‌ సెంటెన్స్‌ల్లో ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడం, విశ్లేషించడంపై ఈ సెక్షన్‌లో విజయం ఆధారపడి ఉంటుంది. భిన్న అంశాలను విస్తృతంగా తక్కువ వ్యవధిలో చదివి, ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అభ్యర్థి ఇచ్చిన సమాచారాన్ని వేగంగా అర్థం చేసుకుంటున్నారా? లేదా? అలాగే, అందులో అంతర్లీనంగా ఉన్న సమాచారాన్ని గుర్తించగలిగారా? లేదా? అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. సాధనకు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలు ఉపయోగపడతాయి. ఇవి తత్వం (ఫిలాసఫీ), శాస్త్ర సాంకేతిక అంశాలు, ఆర్థిక అంశాలకు సంబంధించినవై ఉండాలి. 

కొత్త పదాలు వచ్చినప్పుడు సందర్భోచితంగా అక్కడికక్కడే అర్థం తెలుసుకునే నేర్పు అవసరం. ఆ పదానికి సంబంధించిన సామెతలు, నుడికారాలు ఏవైనా ఉన్నాయా చూసుకోవాలి. నిత్యం నిర్ణీత పదాలు నేర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రిపరేషన్‌ సమయంలోనే వాక్య నిర్మాణం, సబ్జెక్టు - ఆబ్జెక్టు అగ్రిమెంట్‌...ఇలాంటివి పరీక్షించుకోవాలి. వ్యాకరణాంశాలపైనా పట్టు పెంచుకోవాలి. 

డీఐఎల్‌ఆర్‌

స్టేట్‌మెంట్లు ఇచ్చి వాటికింద ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో రాణించడానికి తర్కమే అస్త్రం. ఏదైనా సమాచారం ఇచ్చి దానికింద నాలుగు లేదా ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు. నేరుగా సమాచారం అందించే వ్యాఖ్యపై దృష్టి సారించి సమాధానం రాబట్టడానికి ప్రయత్నించాలి. అరేంజ్‌మెంట్స్, పజిల్స్, వెన్‌డయాగ్రమ్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో సరైన జవాబు గుర్తించడానికి ప్రశ్నలో ఇచ్చిన సమాచారంపై దృష్టి పెట్టాలి. అలాగే ఇచ్చిన అన్ని ఆప్షన్లూ శ్రద్ధగా చదవాలి. సాధన ద్వారా నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులూ ఇందులో ఎక్కువ స్కోరు పొందవచ్చు. 

సాధారణంగా దత్తాంశాన్ని గ్రాఫ్‌లు, టేబుల్స్, పైచార్టుల రూపంలో ఇచ్చి, ఆ సమాచారం ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ అభ్యర్థుల తార్కిక పరిజ్ఞానాన్నే పరిశీలిస్తారు. దత్తాంశంలో రెండు భిన్న అంశాలు నిష్పత్తి లేదా సరాసరిలో వస్తోన్న మార్పులు ఎలా ఉన్నాయో ప్రశ్నిస్తారు. లాజికల్‌ రీజనింగ్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిసం, ఫజిల్స్, ర్యాంకింగ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి వేగంగా, తార్కికంగా ఎలా ఆలోచిస్తారో పరిశీలిస్తారు. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా ఈ విభాగంలో రాణించవచ్చు.

క్యూఏ

సహజంగా ఈ సెక్షన్‌ మ్యాథ్స్, ఇంజినీరింగ్‌ నేపథ్యం వారికి అనుకూలమని చాలామంది పొరపాటు పడతారు. అయితే గత క్యాట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఇది నిజం కాదని తేలుతుంది. ఈ విభాగంలో దాదాపు మూడోవంతు అంటే 10 నుంచి 12 ప్రశ్నలు సింపుల్‌ ఈక్వేషన్స్, రేషియో, టైమ్‌ అండ్‌ వర్క్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, పర్సంటేజీలు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, ఏవరేజెస్‌ నుంచే తేలికస్థాయిలోనే అడిగారు. ప్రశ్నలు అభ్యర్థిలో సింప్లిఫికేషన్‌ (సూక్ష్మీకరణ) సామర్థ్యం, తార్కిక పరిజ్ఞానాలను తెలుసుకునేలా అడుగుతారు. పాఠశాలలో చదివిన పుస్తకాల ద్వారా ప్రాథమిక పరిజ్ఞానం పొందవచ్చు. వాటి అనువర్తన ప్రశ్నిస్తారు కాబట్టి ముందుగా గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు పరిశీలించడం ద్వారా ప్రశ్నల కోణం అలవడుతుంది. షార్ట్‌కట్స్‌పై ఆధారపడకుండా నేరుగా ప్రశ్నను అర్థం చేసుకుని, జవాబు కనుక్కునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. 

2021లో ఇలా..

గత ఏడాది క్యాట్‌లో 66 ప్రశ్నలే వచ్చాయి. అంతకు ముందు సంవత్సరం 76 ప్రశ్నలు అడిగారు. గత సంవత్సరం పరీక్షలో.. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 24 ప్రశ్నలు వచ్చాయి. వీటిలో ఆర్‌సీ 16, వీఏ 8 ఉన్నాయి. ఆర్‌సీలో 4 ప్యాసేజ్‌లు ఇచ్చి ఒక్కో దానికీ 4 ప్రశ్నలు చొప్పున అడిగారు. వీఏలో 3 పేరా ఫార్మేషన్లు, 2 ఆడ్‌ వన్‌ అవుట్, 3 పేరా సమ్మరీ ప్రశ్నలు వచ్చాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ (డీఐఎల్‌ఆర్‌) నుంచి 20 ప్రశ్నలు అడిగారు. ఒక్కో సెట్‌ నుంచి 6 చొప్పున 2 సెట్లలో ప్రశ్నలు అలాగే ఒక్కో దాని నుంచి 4 చొప్పున 2 సెట్లలో ప్రశ్నలు వచ్చాయి. క్వాంటిటిటేవ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 22 ఇండివిడ్యువల్‌ ప్రశ్నలు అడిగారు. 

ముఖ్య సమాచారం 

అర్హత: కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45) శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 14 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. ప్రవేశ పత్రాల జారీ: అక్టోబరు 27 నుంచి

పరీక్ష తేదీ: నవంబరు 27 

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1150. మిగిలినవారికి రూ.2300.

వెబ్‌సైట్‌: https://iimcat.ac.in/

ఇతర పరీక్షలకూ ఉపయోగమే 

జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రాధాన్యంగా క్యాట్‌ నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్‌ల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. రైల్వే, బ్యాంకులు, ఎస్‌ఎస్‌సీ, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ పరీక్షల్లోనూ ఈ అంశాలపైనే అభ్యర్థులను ఎక్కువగా పరీక్షిస్తారు. అందువల్ల క్యాట్‌ సన్నద్ధత ఎన్నో పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఎక్స్‌ఏటీ, శ్నాప్, ఎన్‌మ్యాట్‌... ఇలా అన్ని మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్షలనూ క్యాట్‌ సన్నద్ధతతో సులువుగానే ఎదుర్కోవచ్చు.

సన్నద్ధత ఇలా..

ప్రాథమికాంశాలకు మరీ ఎక్కువ సమయం అవసరం లేదు. వీటిని 15 రోజుల్లో పూర్తిచేయాలి. ఎందుకంటే క్యాట్‌లో ఒక్క లాజికల్‌ రీజనింగ్‌ మినహా మిగతావన్నీ పాఠశాల, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో చదువుకున్న అంశాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. 

గణితంలో ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. అలాగే ఆంగ్ల వ్యాసాలు వేగంగా చదివి, అర్థం చేసుకునే నైపుణ్యం పెంపొందించుకోవాలి. 

ప్యూర్‌ మ్యాథ్స్‌ కంటే అరిథ్‌మెటిక్‌ అంశాలను ఎక్కువ ప్రాధాన్యంతో చదువుకోవాలి. 

వెర్బల్‌ ఎబిలిటీలో పదాలకు అర్థాలు, వ్యతిరేకపదాలు, నానార్థాలు తెలుసుకుంటే సరిపోదు. సందర్భానుసారం ఒక పదానికి అర్థం ఏ విధంగా మారుతుందో అవగాహన పెంచుకోవాలి. 

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో ఒకే తరహా అంశాలు చదవకుండా శాస్త్ర, సాంకేతికాంశాలు; తత్వం, సైకాలజీ...ఇలా విభిన్న అంశాలు ఎంచుకోవాలి. వివిధ సంచికల్లో వస్తోన్న వ్యాసాలు గమనించాలి. 

గ్రామర్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు సంబంధించి ప్రాథమికాంశాలు బాగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్‌ + వర్బ్‌ అగ్రిమెంట్‌ సబ్జెక్టులో వచ్చే సింగులర్, ప్లూరల్‌ పదాల వాడకంపై ఎక్కువ ప్రశ్నలుంటాయి.

ప్రోవెర్బ్, ఇడియం, ఫ్రేజల్‌ వెర్బ్‌..ఇలా ఒక పదాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో తెలుసుకోవాలి. రోజూ నిర్ణీత సంఖ్యలో వీటిని తెలుసుకోవడం ద్వారా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో పరిజ్ఞానం పెరుగుతుంది. 

పాత ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. గత ఐదేళ్ల ప్రశ్నపత్రాలను తప్పక సాధించాలి. ప్రశ్నలు అడుగుతోన్న విధానంలో ఏటా వస్తోన్న మార్పులు గమనించి, సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మార్చుకోవాలి. 

వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. అందులో సెక్షన్లవారీ సాధించిన మార్కులను పరిశీలించుకోవాలి. తప్పులు చేస్తోన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ విభాగాల్లో సాధ్యమైనన్ని ప్రశ్నలు సాధించాలి. ఇలాచేయడం వల్ల స్కోరు మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది.

ప్రతి సెక్షన్‌లోనూ అందులోని విభాగాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. 

పరీక్షలో ముందు తేలిక ప్రశ్నలకు సమాధానమివ్వాలి. చివరలోనే కష్టమైనవి, ఎక్కువ సమయం అవసరమైనవాటిని ప్రయత్నించాలి. 

టాటామెక్‌గ్రాహిల్, పియర్‌సన్, చాంద్, టైమ్‌...ఇలా పలు సంస్థల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి ప్రయత్నించవచ్చు. 

ఒత్తిడి, ఆందోళన కారణంతో తెలిసిన ప్రశ్నలకు సైతం జవాబు గుర్తించలేము. అందువల్ల విజయానికి మానసిక ప్రశాంతత ఎంతో కీలకం. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహిళలకు ప్రత్యేకం.. ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ అన్ని విభాగాల‌కు స‌మ ప్రాధాన్యం

Posted Date: 30-08-2022


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌