• facebook
  • whatsapp
  • telegram

‘క్యాట్‌’ స్కోరుకు సన్నద్ధత!

* నవంబర్‌ 26న పరీక్ష

క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) - 2023ను నవంబరు 26న దేశవ్యాప్తంగా 155 నగరాల్లో నిర్వహిస్తారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. పరీక్ష మొదలైన 1977 నుంచి చూస్తే అత్యధికంగా 3.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 20 ఐఐఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌)లలో దాదాపు 5000 ఎంబీఏ సీట్ల కోసం, టాప్‌ బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ ప్రవేశాల కోసం క్యాట్‌లో అర్హత తప్పనిసరి. ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఈ తుది 30 రోజుల్లో అప్రమత్తంగా పరీక్షకు సన్నద్ధమవ్వాలి. ఇంతవరకూ సరిగా ప్రిపేర్‌ కానివారు కూడా ఇప్పటినుంచి సమగ్రంగా తయారైతే మంచి స్కోరు సాధించవచ్చు! 


క్యాట్‌లో మెరుగైన స్కోరు కోసం పరీక్షలోని మూడు సెక్షన్ల  అంశాలను ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకుందాం.


వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 

4 ప్యాసేజీలు (16 ప్రశ్నలు), వెర్బల్‌ ఎబిలిటీపై 8 ప్రశ్నలు (పేరా జంబుల్స్‌ - 3, పేరా సమ్మరీ - 3 పేరా కంప్లీషన్‌ -2) ఉంటూ ప్రతి అభ్యర్థికీ కష్టంగా అనిపించే విభాగమిది. ఎందుకంటే మిగతా విభాగాలైన మ్యాథ్స్‌కు, రీజనింగ్‌కు షార్ట్‌కట్స్‌ ఉంటాయి. ఇంగ్లిష్‌ను షార్ట్‌కట్స్‌తో కాకుండా లాజికల్‌గా చదివితే సులభంగా విజయం సాధించవచ్చు. ఈ మొదటి సెక్షన్లలో ఎక్కువ వెయిటేజీ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు మాత్రమే ఉంది. అంటే 16 ఆర్‌సీ, 3 పేరా సమ్మరీ ప్రశ్నలు కలిపితే.. 19 ప్రశ్నలు కేవలం ప్యాసేజ్‌లపైనే ఉన్నాయి. 

  వివిధ రకాల ఆర్‌సీ ప్యాసేజీల సాధన ప్రారంభించండి. ఒకే నేపథ్యంతో కూడినవి కాకుండా వైవిధ్యభరితమైన అంశాలను చదవాలి. ఫిలాసఫీ, సైన్స్, ఆర్థిక నేపథ్య ప్యాసేజీలు లేదా ఆర్టికల్స్‌ చదవాలి. ప్రతి ప్యాసేజ్‌కు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించకూడదు. ప్యాసేజీని చదివేటప్పుడు మొదటగా దాని ప్రధాన భావన (సెంట్రల్‌ ఐడియా), ప్రతి పేరాలోని ఐడియాస్‌ (భావనలు) వెలికితీయాలి. అంతేకానీ ప్రతి పదానికీ అర్థం కోసం వెతకకూడదు. ప్రశ్నలు పేరాలోని ప్రధాన భావనలపై ఉంటాయి కానీ పదాలపై కాదు. 

  రోజూ కనీసం ఒక వీఏఆర్‌సీ సెక్షన్‌ టెస్ట్‌ రాయాలి. వారానికి 25 ఆర్‌సీలు సాధన చేయాలి. పరీక్ష లోపు 100 ప్యాసేజ్‌లు, వాటి సమగ్ర విశ్లేషణ చేయాలి. ఎందుకంటే క్యాట్‌ ఇంగ్లిష్‌ సెక్షన్‌లో ఇన్ఫÄరెన్స్‌ (అంతర్లీన అర్థ) ప్రశ్నలు ఎక్కువ. వీటి జవాబులు పైపై పఠనంతో దొరకవు. నిశిత పఠనం అవసరం. గత సంవత్సరం క్యాట్‌ వీఏఆర్‌సీ సెక్షన్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ లేకుండా.. 13 ప్రశ్నలు సరైనవి చేస్తే 99 పర్సంటైల్, 8 ప్రశ్నలకే 90 పర్సంటైల్‌ వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు సరిగ్గా చేయగలిగిన 10 ప్రశ్నలను (24 ప్రశ్నల్లో) ఛేదిస్తే ఈ సెక్షన్‌లో మంచి స్కోరు సులభంగా వస్తుంది. 


లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ 

 దీంట్లో ఎల్‌ఆర్‌పై 10 ప్రశ్నలు, డీఐపై 10 ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో బార్‌గ్రాఫ్‌లు, కాలమ్‌ గ్రాఫ్‌లు, టేబుల్‌ ఆధారిత ప్రశ్నలు, లైన్‌ ఛార్ట్స్‌ అడుగుతారు. నంబర్స్‌ ఆధారిత, వెన్‌ డయాగ్రమ్‌లాంటి ఎల్‌ఆర్‌ ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో పట్టు రావాలంటే, మొదటగా అరిథ్‌మెటిక్‌ సబ్జెక్టు, సెట్‌ థియరీపై కూడా పట్టు బిగించాలి. ఎల్‌ఆర్‌డీఐ పై పట్టు సాధించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. 

  మొదటగా మొత్తం ఎల్‌ఆర్‌డీఐ సిలబస్‌ను మూడు వర్గాలుగా విభజించండి. అంటే అత్యంత ముఖ్యమైన సెట్‌లు, కఠినమైన సెట్‌లు, చాలా ఎంపికచేసిన సెట్‌లు. ముందుగా అత్యంత ముఖ్యమైన అంశాలపై (సీక్వెన్స్, సిరీస్, మాట్రిక్స్‌) దృష్టి పెట్టండి. ముఖ్యమైన ప్రాథమిక అంశాలను పూర్తిచేసిన తర్వాత క్లిష్టతరమైన ప్రశ్నలను ఛేదించడం మొదలుపెట్టండి. 

 ప్రాథమిక ప్రిపరేషన్‌లో (మొదటివారం) సమయ పరిమితి గురించి ఆలోచించకుండా వీలైనన్ని ఎక్కువ ఎల్‌ఆర్‌ సెట్‌లను సాధన చేస్తూ ఉండండి. సబ్జెక్టు కాన్సెప్టులు నేర్చుకున్న తర్వాత కూడా నిర్దిష్ట ప్రశ్నలను పరిష్కరించలేరని భావిస్తే.. మళ్లీ బేసిక్స్‌ను తిరగేయండి. ప్రతిరోజూ ఒక సెక్షనల్‌ టెస్ట్‌ రాయండి. రోజులో కొన్ని ఎల్‌ఆర్‌ ప్రశ్నలు, డీఐ సెట్స్‌ గత సంవత్సరపు ప్రశ్నల సరళితో సాధన చేయండి. 


క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 

క్యాట్‌-2022లో అరిథ్‌మెటిక్‌-8, ఆల్జీబ్రా-8, జామెట్రీ-3, నంబర్‌ సిస్టం-1, మోడరన్‌ మ్యాథ్స్‌-2 ప్రశ్నలు అడిగారు. అరిథ్‌మెటిక్‌ అంటే నంబర్‌ సిస్టమ్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, సమయం, వేగం, దూరం, బారు, చక్రవడ్డీ, సరాసరి (యావరేజస్‌), పైప్స్, సిస్టెర్న్స్‌ లాంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ సెక్షన్‌లో విస్తృత సిలబస్‌ ఉంది కాబట్టి దీనిపై ఎక్కువ సమయం కేటాయించాలి. అయితే ఇప్పటికే కాన్సెప్టులపై పట్టు సాధించినట్లయితే మెరుగైన స్కోరుపై దృష్టి పెట్టాలి. మొదటివారంలో గణితంలో ఆల్జీబ్రాలోని సరళ సమీకరణాలు, వర్గ సమీకరణాలు, ప్రత్యేక సమీకరణాలు, సర్డ్స్, సూచికల భావనలపై పట్టు పెంచుకోండి. ప్రశ్నలు లోతుగా ఉంటాయి కాబట్టి వాటిని బాగా చదివి అర్థం చేసుకోండి. రెండో వారంలో అరిథ్‌మెటిక్‌ను సాధన చేయండి. మూడోవారంలో మిగిలిన మ్యాథ్స్‌ చాప్టర్లపై (తక్కువ వెయిటేజీ అంశాలు) దృష్టిపెట్టండి. 

  ఫార్ములాలను బట్టీ పట్టకుండా తార్కిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు కనుక్కోవాలి. ఒక సౌలభ్యం ఏమిటంటే.. క్యాట్‌లో ఆన్‌స్క్రీన్‌ కాలిక్యులేటర్‌ ఉంటుంది. కాబట్టి నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు సగం ప్రశ్నలు మ్యాథ్స్‌పై కాకుండా నిత్యజీవితంలో ఉపయోగించే అరిథ్‌మెటిక్‌ సంబంధమైనవే. 


చేయకూడనివి

క్యాట్‌ మాక్‌ టెస్టులు రాసి.. తక్కువ స్కోరు వస్తే నిరాశపడకండి. ఈ నమూనా పరీక్షల్లో వచ్చే స్కోరు క్యాట్‌లోని నిజమైన స్కోరుకు కొలబద్ద కాకపోవచ్చు. స్కోరు తగ్గినప్పుడు సరైన విశ్లేషణ, దానికి సంబంధించిన సిలబస్‌పై సమీక్ష చేసుకోండి. ప్రిపరేషన్‌ దృష్టి మరల్చే వాటి నుంచి దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా ఈ నెల రోజులలో మీరు సాధించే అసలైన స్కోరు గురించి అసలు ఆలోచించవద్దు. రోజువారీ సన్నద్ధతపైనే దృష్టి పెట్టండి. అంటే పలితం కోసం ఆలోచించకుండా ప్రయత్నంపైనే గురి పెట్టాలన్నమాట. 


క్లిష్ట ప్రశ్నలకు సమయం వృథా చేయొద్దు


క్యాట్‌-2002లో మొత్తం 66 ప్రశ్నల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ లేకుండా.. కేవలం 27 ప్రశ్నలు సరైనవి చేస్తే . టాప్‌ స్కోర్‌...99 పర్సంటైల్‌ వచ్చింది. 19 ప్రశ్నలు చేస్తే 95 పర్సంటైల్‌ వచ్చింది. ఈ 95 పర్సంటైల్‌ ద్వారా చాలా ఐఐఎంలకు అర్హత సాధించవచ్చు. 

క్యాట్‌లో విజయం సాధించాలంటే అన్ని ప్రశ్నలూ ఛేదించాల్సిన అవసరం లేదు. చేయగలిగిన 50 శాతం ప్రశ్నలను ఎంచుకుని.. సరిగ్గా చేయగలిగితే చాలు. అంతేకానీ సంక్లిష్టమైన ప్రశ్నలపై అనవసరంగా సమయాన్ని వృథా చేయొద్దు. 


ఐదు సూత్రాలు

చాలామంది ఇప్పటికే క్యాట్‌ మాక్‌ (నమూనా) టెస్టులు రాసి ఉంటారు. తక్కువ స్కోరు వస్తున్న విద్యార్థులు కంగారుపడకుండా ఆత్మవిశ్వాసంతో ఈ చివరి నెల ఒక్కొక్క వారానికి తగ్గట్టుగా స్టడీప్లాన్‌ను తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా తయారుచేసుకోవాలి. కచ్చితత్వంతోపాటు వేగాన్ని సమన్వయం చేసే విధంగా సాధనకు సిద్ధం కావాలి. ప్రతివారం చివర్లో తమ పనితీరును సమీక్షించుకోవాలి. 

సానుకూల దృక్పథంతో చూస్తే నెలరోజుల్లో స్కోరును గణనీయంగా పెంచుకోవచ్చు. ఎలాగంటే.. మూడు సెక్షన్లలో ఒక్క క్వాంటిటేటివ్‌ ఎబిలిటీకి తప్ప.. మిగతా రెండు సెక్షన్ల ప్రిపరేషన్‌కు తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఈ రెండుసెక్షన్లకు సరైన సాధన తప్ప, చాప్టర్‌వారీగా ప్రాథమిక అంశాలు (ఫండమెంటల్స్‌), భావనలు (కాన్సెప్టులు) చదివే అవసరం లేదు. కాబట్టి చాలా సమయం మిగిలినట్లే. 

3 గత 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలను తిరగేస్తూ.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు రాయాలి. వారానికి మూడు చొప్పున నెలలో 12 రాస్తే మంచిది. రాసిన తర్వాత స్కోరు తగ్గిన చాప్టర్లు, ప్రశ్నలపై విశ్లేషణ చేసుకోవాలి. క్యాట్‌లో ఎక్కువ మార్కుల ప్రాధాన్యం ఉన్న చాప్టర్లపై తొందరగా పట్టు సాధించాలి. ఉదాహరణకు క్యూఏలో అరిథ్‌మెటిక్, ఆల్జీబ్రాలకు ఎక్కువ వెయిటేజీ ఉంది. కాబట్టి ఈ తక్కువ సమయంలో వీటిని పునశ్చరణ చేసుకోవాలి. 

4 టాపర్లకు కూడా కొంత ఇబ్బంది కలిగించే సెక్షన్‌ - వీఏఆర్‌సీ. కాబట్టి రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (ఆర్‌సీ) ప్యాసేజీలను రోజూ సాధన చేయాలి. క్యాట్‌ ఆధారిత ఆర్‌సీలతోపాటు ఇంగ్లిష్‌ పఠనం అవసరం. ఆన్‌లైన్‌లో లభించే అంతర్జాతీయ దినపత్రికలు, మ్యాగజీన్లు/జర్నల్స్‌ చదువుతూ రోజూ కొన్ని కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకుంటూ ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ పెంపొందించుకోవాలి. ఎందుకంటే క్యాట్‌లోని ప్యాసేజీలు ఎక్కువగా ఆన్‌లైన్‌ మెటీరియల్‌ (ది గార్డియన్‌ దినపత్రిక, ఏ ఇయాన్‌ మొదలైనవి) నుంచే సాధారణంగా వస్తున్నాయి.

5 చివరగా విద్యార్థులు ఎస్‌డబ్ల్యూఓటీ విశ్లేషణ చేయాలి. అంటే.. ఎస్‌-స్ట్రెంగ్త్‌- (శక్తి) డబ్ల్యూ -వీక్‌నెస్‌ (బలహీనత), ఓ-ఆపర్చునిటీ (అవకాశం), టి-త్రెట్‌ (ముప్పు) తెలుసుకోవాలి. ఏ సెక్షన్‌లో బలహీనంగా ఉన్నారో.. దానిపై తమ దినసరి షెడ్యూల్‌లో ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ విశ్లేషణ ఆధారంగా ఒక నోట్‌బుక్‌ పెట్టుకుని 3 సెక్షన్లలోని ముఖ్యమైన చాప్టర్ల ఫార్ములాలు, అనుసరణ విధానాలు రాయండి. ఈ విధంగా ఈ నెలలో మొత్తం క్యాట్‌ సిలబస్‌ను సంక్షిప్త రూపంలో కుదించి దాన్ని రిఫరెన్స్‌ మెటీరియల్‌గా ఉపయోగించుకోవాలి. 


మొత్తం ప్రశ్నలు: 66 

సెక్షన్లు: 3

ఎంసీక్యూ: 49 ప్రశ్నలు

నాన్‌ ఎంసీక్యూ: 17 ప్రశ్నలు (వీటికి నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. వీటికి స్క్రీన్‌పైనే సమాధానాలను టైప్‌ చేయాలి).

పరీక్ష కాలవ్యవధి : 2 గంటలు

సెక్షనల్‌ టైమింగ్‌ : ప్రతి విభాగానికీ 40 నిమిషాలు


ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. నెగెటివ్‌ మార్కింగ్‌ వల్ల.. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు కోల్పోతారు. 

1. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (వీఏఆర్‌సీ): 24 ప్రశ్నలు

2. లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (ఎల్‌ఆర్‌డీఐ): 20 ప్రశ్నలు

3. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (క్యూఏ): 22 ప్రశ్నలు 


క్యాట్‌ స్వరూపం 

(2022 పరీక్ష ప్రకారం)


 

- శ్రీధర్, డైరెక్టర్, కౌటిల్య, తిరుపతి

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ ఉద్యోగానికి టెక్‌ స్కిల్స్‌!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Posted Date: 26-10-2023


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌