• facebook
  • whatsapp
  • telegram

ఐటీ ఉద్యోగానికి టెక్‌ స్కిల్స్‌!

బెస్ట్‌ కెరియర్‌కు వివిధ మార్గాలుసాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించాలని ప్రయత్నించే అభ్యర్థులు.. టెక్నికల్‌ నైపుణ్యాల దారిలో పయనించవచ్చు. ఏ ఐటీ ఉద్యోగానికి అయినా టెక్‌ స్కిల్స్‌ ఆయువుపట్టు. వీటిలో ఎంతగా ప్రావీణ్యం సంపాదిస్తే అంతగా మెరుగైన కెరియర్‌ దిశగా అడుగేసే వీలుంటుంది. ఇందుకు ఏయే మార్గాలున్నాయో పరిశీలిస్తే..


టెక్నికల్‌ రైటింగ్, కోడింగ్, నెట్‌వర్క్‌ కాన్ఫిగరేషన్, హార్డ్‌వేర్‌ డిప్లాయ్‌మెంట్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, డేటాబేస్‌ నిర్వహణ, డెవోప్స్, సెక్యూరిటీ, సోషల్‌ మీడియా నిర్వహణ.. వంటి వివిధ అంశాల్లో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా ఐటీలోకి ప్రవేశించే వీలుంటుంది. ఇవన్నీ నేర్చుకునేందుకు ఇప్పుడు అనేక మార్గాలున్నాయి. కష్టమైనా కాస్త ఇష్టంగా సాధన చేస్తే సులువుగా పట్టు సంపాదించవచ్చు.


కోడింగ్‌

కోడ్‌ రాయగలగడం అత్యంత ఆవశ్యకమైన నైపుణ్యం. చాలావరకూ ఐటీ కంపెనీలు ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్, వెబ్‌ డెవలప్‌మెంట్‌ పనులను నిర్వహిస్తాయి. వీటిని సమర్థంగా నడిపించేందుకు ప్రోగ్రామింగ్‌ తెలిసిన నిపుణులు అవసరం. సీ ప్లస్‌ ప్లస్, పైతాన్, జావా, రూబీ, పవర్‌షెల్‌ వంటి భాషల్లో మెలకువలు తెలిసి ఉండాలి. కోడ్‌ను అర్థం చేసుకోవడంతోపాటు ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించే సామర్థ్యం, నాణ్యతా ప్రమాణాలు పాటించే తీరును అవలంబిస్తే.. ఈ దారిలో అవకాశాలకు కొదవ లేదు.


టెక్నికల్‌ రైటింగ్‌

టెక్నికల్‌ పనులకు సంబంధించి ఆలోచనలు, ప్రక్రియలు, సూచనలను సులభంగా, అర్థవంతంగా రాయగలగడం మిగతావారి కంటే మిమ్మల్ని భిన్నంగా చూపించగలదు. చాలా ఐటీ సంస్థలకు రాతపూర్వకమైన నైపుణ్యాలు తెలిసినవారు అవసరం. క్లిష్టమైన టెక్నికల్‌ ప్రక్రియలు, పద్ధతులను రాయడం.. వినియోగదారులకు నేరుగా వివరించాల్సి రావడం, సమాచారాన్ని అనువదించడం.. వంటివన్నీ ఈ విధుల్లో భాగం. వెబ్‌ కంటెంట్, ప్రెస్‌ రిలీజ్‌ల వంటివి కూడా రాయాల్సిన అవసరం పడొచ్చు. ఈ నైపుణ్యాలపై దృష్టిపెట్టడం ఒక మార్గం.


నెట్‌వర్క్‌

మరో ముఖ్యమైన నాలెడ్జ్‌ నెట్‌ వర్కింగ్‌. నెట్‌వర్క్స్‌ గురించి  పూర్తిస్థాయిలో తెలుసుకుంటే నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ కాగలరు. నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం, వాటిని నిర్వహించడం వంటి పనులు చేసేవారికి ఐపీ సెటప్, వైర్‌లెస్‌ రూటర్స్, క్లౌడ్‌ సర్వీసెస్, కోడింగ్‌లపై అవగాహన ఉండాలి. క్లౌడ్‌ అప్లికేషన్లు, అడ్మినిస్ట్రేషన్‌ గురించి కూడా తెలిసుండాలి. లోకల్‌ ఏరియా, వైడ్‌ ఏరియా, స్టోరేజ్‌ ఏరియా, వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌ వంటివి నిర్వహించడం నేర్చుకోవడం ద్వారా అవకాశాలు అందుకోవచ్చు.


హార్డ్‌వేర్‌

హార్డ్‌వేర్‌ నిర్వహణలో ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్, టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేయడం వంటి పనులుంటాయి. క్లిష్టమైన టెక్నాలజీలను డిస్‌కనెక్ట్‌ చేయడం, రీ అసెంబుల్‌ చేయడం వంటివి ముఖ్యమైన నైపుణ్యాలు. వీటిని సాధన చేయడం ద్వారా హార్డ్‌వేర్‌ డిప్లాయ్‌మెంట్‌లో అవకాశాలు అందుకోవచ్చు.


ఆపరేటింగ్‌ సిస్టమ్‌

వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ ఎలా పని చేస్తాయనేది తెలుసుకోగలగడం మరో ముఖ్యమైన నైపుణ్యం. ఇది తెలిసిన వారు సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్లుగా రాణించవచ్చు. ఈ స్కిల్స్‌ క్లౌడ్‌లో పనిచేసేటప్పుడు, సెక్యూరిటీ దిశగానూ పనికొస్తాయి. ఇందులో ప్రాథమిక స్థాయి ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ అయిన విండోస్, లైనెక్స్, మాక్‌ వంటివి నిర్వహణ.. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ - సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం, టెక్నికల్‌ సమస్యలు ఎదురైనప్పుడు ఉద్యోగులకు సహాయపడటం వంటి పనులుంటాయి. ఓఎస్‌ అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అవసరం.


డేటాబేస్‌ నిర్వహణ

డేటాను విశ్లేషించడం తెలిసిన వారు డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌లో సునాయాసంగా రాణించగలరు. సమాచారాన్ని పర్యవేక్షించడం, వివిధ బృందాలకు ఉపయోగపడేలా దాన్ని తీర్చిదిద్దడం, రక్షణ సమస్యలను గుర్తించడం, మొత్తంగా సంస్థ ప్రగతికి పాటుపడటం.. ఇవన్నీ ఇందులో భాగం. రోజువారీ టాస్క్‌ల్లోనూ ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. డేటాతో పని చేసే ఉద్యోగులను డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజినీర్స్‌ అంటారు.


సోషల్‌ మీడియా నిర్వహణ

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను నిర్వహించడం తెలిసిన ఉద్యోగులు సంస్థలకు వివిధ మార్గాల్లో సహాయపడగలరు. కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌లో సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, వెబ్‌ అనలిటిక్స్‌ చాలా ముఖ్యం. ఈ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను సంస్థలు ఆహ్వానిస్తున్నాయి.


సెక్యూరిటీ

ఏ విభాగానికి చెందిన బృందానికి అయినా.. సెక్యూరిటీ అనే అంశం పునాది వంటిది. హెల్ప్‌ డెస్క్, నెట్‌వర్కింగ్, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పోస్టుల్లో కెరియర్‌ను మొదలుపెట్టడం ద్వారా సెక్యూరిటీను పూర్తిగా అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌ వంటి ప్రాథమిక స్థాయి ఉద్యోగాల్లో చేరేందుకు.. నెట్‌వర్క్, సెక్యూరిటీ, ఫైర్‌వాల్స్‌ - రూటర్స్‌ ఇన్‌స్టాల్‌ చేయడం, డేటా ఎన్‌క్రిప్షన్, థ్రెట్‌ అనాలిసిస్, ఎథికల్‌ హ్యాకింగ్‌ వంటి అంశాలపై కనీస అవగాహన ఉండాలి.


ఎలా?

ప్రముఖ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ అన్నింటిలోనూ ఈ నైపుణ్యాలను సాధన చేయవచ్చు. యుడెమీ, స్కిల్‌షేర్, కోర్సెరా వంటి దాదాపు అన్ని ముఖ్య వేదికల్లోనూ సంబంధిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ప్రతి టెక్నాలజీకి ఉండే అధికారిక వెబ్‌సైట్లలో దాని గురించి పూర్తిస్థాయి సమాచారం, నేర్చుకునే విధివిధానాలు ఉంటాయి. అటువంటి సైట్ల నుంచి కూడా ఈ నైపుణ్యాలను సాధన చేసే వీలుంది.


డెవోప్స్‌

డెవోప్స్‌.. డెవలప్‌మెంట్‌ - ఆపరేషన్స్‌ల సమ్మేళనంగా ఉన్న ఈ అంశాన్ని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఐటీ బృందాల మధ్య సమన్వయం కోసం వినియోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించడం తెలిసినవారు సంస్థను నడిపించడంలో ముఖ్యపాత్ర పోషించగలరు. డెవోప్స్‌తో పనిచేయడం నేర్చుకోవడం ద్వారా డెవోప్స్‌ ఇంజినీర్‌ అవ్వొచ్చు. ఇందుకోసం డాకర్, క్యూబర్‌నెటిస్‌ వంటి కంటైనర్‌ టెక్నాలజీపైన.. పైతాన్, రూబీ, సీ వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపైనా అవగాహన అవసరం. క్లౌడ్‌ ఆపరేషన్స్‌ ఎలా జరుగుతాయి అనేదీ నేర్చుకోవాలి.


క్లౌడ్‌ కంప్యూటింగ్‌

ప్రస్తుతం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అత్యంత గిరాకీ ఉన్న నైపుణ్యం. క్లౌడ్‌ వాతావరణాన్ని నిర్మించడంతోపాటు దాన్ని నిర్వహించడం వరకూ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ టెక్నాలజీతో పని చేయడం నేర్చుకోవడం ద్వారా క్లౌడ్‌ డెవలపర్, అడ్మినిస్ట్రేటర్, ఆర్కిటెక్ట్‌.. వంటి ఉద్యోగాల్లోకి వెళ్లవచ్చు. ఏడబ్ల్యూఎస్, గూగుల్‌ క్లౌడ్, మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్, ఒరాకిల్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై అవగాహన ఉండటం ఉపయోగపడుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Posted Date: 25-10-2023


 

టెక్‌ స్కిల్స్‌

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం