• facebook
  • whatsapp
  • telegram

ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

* ఎకడమిక్‌ బర్న్‌ అవుట్‌ అధిగమించేందుకు సూచనలు

కొంతమంది విద్యార్థులు గంటలకొద్దీ సమయాన్ని చదువుతూనే గడుపుతుంటారు. పరీక్షల ముందు విపరీతమైన ఒత్తిడినీ ఎదుర్కొంటుంటారు. ఇవన్నీ కూడా భావోద్వేగాలు, శారీరక, మానసిక ఆరోగ్యాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితినే ‘ఎకడమిక్‌ బర్న్‌ అవుట్‌’గా  చెబుతారు నిపుణులు. 


కొన్ని వారాలు లేదా నెలలపాటు ఒకే సిలబస్‌ చదవడం.. కొన్ని ప్రాజెక్టుల మీద నెలల తరబడి పనిచేయడం.. వీటన్నిటి కారణంగా కూడా బాగా అలసిపోవడం, నిరుత్సాహం ఆవహించడం లాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఎకడమిక్‌ బర్న్‌ అవుట్‌కు కారణం అవుతుంటాయి. ఫలితంగా తలనొప్పి, నిద్ర]లేమి, కుంగుబాటు.. లాంటి అనేక అనారోగ్య సమస్యలకూ గురయ్యే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్నుంచి బైటపడటానికి ప్రయత్నించవచ్చు. అవేమిటో చూద్దామా...


ఒక్కోసారి బాగా అలసిపోయినప్పుడు ముఖ్యమైన కొన్ని అసైన్‌మెంట్లు, ప్రాజెక్టు పనులను వాయిదా వేస్తుంటారు. అలా కాలయాపన చేయడం వల్ల నిర్ణీత గడువులోగా ఏ పని పూర్తికాదు. దాంతో ఒత్తిడికి గురై.. నిద్ర పట్టకపోవడం, నిరాశాలాంటి సమస్యలు చుట్టుముడతాయి. 


నిర్ణీత గడువులోగా ఏ పని పూర్తిచేయాలన్నా.. ముందుగా కావల్సింది సమయపాలన. విద్యా సంవత్సరం మొదట్లో సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తుంటారు కొందరు. దీంతో సంవత్సరాంతంలో ఇబ్బంది పడుతుంటారు. మొదటినుంచీ సమయపాలనను కచ్చితంగా పాటిస్తే ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. 


నిశ్శబ్దంగా ఎలాంటి అవరోధాలూ లేకుండా ఉంటాయని.. నాలుగ్గోడల మధ్య చదవడానికే ఇష్టపడతారు ఎక్కువమంది. అయితే అప్పుడప్పుడూ ఆరుబయట ఉండే పచ్చని చెట్ల మధ్య చదవడానికీ ప్రాధాన్యమివ్వాలి. ఇలా ప్రకృతి ఒడిలో చదవడం వల్ల ఒత్తిడి తగ్గి.. మానసిక ప్రశాంతతా లభిస్తుంది. దీంతో మరింత ఉత్సాహంగా చదవగలుగుతారు. 


ఒకేసారి పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించలేకపోయినా నిరాశ ఆవరిస్తుంది. ముందుగా స్వల్పకాలిక లక్ష్యాలను పెట్టుకుని వాటిని నిర్ణీత సమయంలోగా సాధించడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాల వైపు దృష్టిని సారించాలి. 


చదువు ధ్యాసలో పడి అభిరుచులను పక్కన పెట్టేస్తుంటారు చాలామంది విద్యార్థులు. ఇది ఎంతమాత్రం సరికాదు. కొత్త భాష, సంగీతం నేర్చుకోవడం లేదా నచ్చిన ఆటలు ఆడటం.. ఇలా వేటినైనా ఎంచుకోవచ్చు. వాటికీ కొంత సమయాన్ని కేటాయించడం వల్ల మూసధోరణికి భిన్నంగా సమయాన్ని గడపగలుగుతారు.


ఎన్ని పనులున్నా.. వ్యాయామానికీ సమయాన్ని కేటాయించాలి. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయడానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుంది. ఇది విసుగ్గా అనిపిస్తే నచ్చిన క్రీడను ఎంచుకోవచ్చు. అలాగే పోషకాహారం తీసుకుంటూ తగినన్ని మంచినీళ్లూ తాగాలి. దీంతో శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.  


విద్యార్థులు తమ అధికంగా ఒత్తిడికి గురవటానికీ, తరచూ అలసిపోవటానికీ కారణమేమిటో గ్రహించాలి. అప్పుడే దాన్ని అధిగమించటానికి ప్రాతిపదిక ఏర్పడుతుంది. 


‣ క్లాస్‌మేట్లతో మార్కుల పరంగా, ఇతరత్రా పోల్చుకునే ధోరణి విద్యార్థుల్లో ఉంటుంది. ఇది ఒత్తిడికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ఇలా పోల్చుకోవడం ఆపెయ్యాలి. 


ఎడతెగని ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం, భావాలు పంచుకునే స్నేహితులు దగ్గర్లో లేకపోవడం లాంటి కారణాల వల్ల ఒంటరిగా ఉన్నామనే భావన పెరిగి, వ్యాకులతకు గురవ్వవచ్చు. ఆత్మీయ మిత్రులను కలవటం, ఫోన్‌లోనైనా సంభాషించడం వల్ల ఇలాంటి సమస్యను అధిగమించవచ్చు. 


చాలామంది విద్యార్థులు కోర్సు పరంగా తాము గురయ్యే ఒత్తిడికి అధ్యాపకులను నిందిస్తుంటారు. ఇది సరికాదు. నిజానికి తాము ఒత్తిడి నుంచి బయటపడటానికి అధ్యాపకులే తమకు సహాయపడతారని గ్రహించాలి. చొరవగా తమ సమస్యను చెప్పి వారి సలహా పొందటం సముచితం.    

మరింత సమాచారం... మీ కోసం!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా‌ (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ నౌకాదళంలో 224 కొలువులకు నోటిఫికేషన్‌ (చివరి తేదీ: అక్టోబరు 29, 2023)

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి మార్గం.. మ్యాట్‌ (చివరి తేదీ: నవంబరు 28, 2023)

‣ దివ్యాంగులకు కేంద్రం ఆర్థిక సాయం (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

Posted Date: 20-10-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం