• facebook
  • whatsapp
  • telegram

మార్పులు తెలుసుకో..  మార్కులు పెంచుకో!

క్యాట్‌-2020 వ్యూహం

క్యాట్‌.. ప్రతిష్ఠాత్మక బీ స్కూళ్లలో ప్రవేశానికి మార్గం. ఏటా రెండు లక్షలకుపైగా అభ్యర్థులు దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు, ఇతర ప్రతిష్ఠాత్మక బీ స్కూళ్లలో తమ మేనేజ్‌మెంట్‌ కోర్సు కలను నెరవేర్చుకోగలుగుతున్నారు. ఈ ఏడాది పరీక్ష తీరులో మార్పులొచ్చాయి. అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకుని సన్నద్ధతను పూర్తిచేసుకుంటే విజయావకాశాలు మరింత మెరుగవుతాయి!

వీటిని పాటిస్తే మేలు
ప్రతిసారీ దీర్ఘకాలం నుంచి సన్నద్ధమయ్యే వారికంటే తాజాగా పరీక్ష రాసేవారు కొంత ఒత్తిడికి గురయ్యేవారు. కానీ ఈసారి పరీక్ష సమయంలో మార్పు ప్రతి ఒక్కరిపై ఒకేరకమైన ఒత్తిడిని తీసుకొచ్చింది. కాబట్టి, మిగిలిన ఈ కొద్ది సమయాన్ని అందుకు తగ్గట్టుగా ఉపయోగించుకునేలా ప్రణాళిక వేేసుకోవడం అత్యవసరం.
పరీక్షకు కేటాయించే సమయంలోనే మార్పు ఉంది. అది మినహాయించి సబ్జెక్టులు, సిలబస్‌ల్లో మార్పు లేదు. కాబట్టి, మాక్‌ టెస్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. గత ప్రశ్నపత్రాలను సాధన చేసుకోవచ్చు. ఇది ప్రశ్నల కఠినత్వ స్థాయిని అంచనా వేసుకోవడానికి సాయపడుతుంది. కానీ మాక్‌ టెస్ట్‌లను రాయడం తప్పనిసరి. ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని కేటాయించిన టైమ్‌ స్లాట్‌ల్లోనే రాయడానికి ప్రయత్నించాలి. ఇది అభ్యర్థి వేగం, కచ్చితత్వాలను అంచనా వేసుకోవడానికీ తోడ్పడుతుంది.
ప్రతి మాక్‌ టెస్ట్‌లో ప్రదర్శనను నోట్‌ చేసుకుంటుండాలి. దాని ప్రకారం సన్నద్ధత ప్రణాళికలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మెరుగుపరచుకునే మార్గాలను చూసుకోవాలి.
ముఖ్యమైన ఫార్ములాలు, షార్ట్‌కట్‌లు, చేసిన/చేస్తున్న తప్పిదాలు అన్నింటినీ పుస్తకంలో నోట్‌ చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రివిజన్‌కు సాయపడుతుంది.
వివిధ ఆంగ్ల పత్రికల వ్యాసాలను రోజుకు ఒకటి చొప్పున అయినా చదువుతుండాలి. భిన్న సబ్జెక్టు విషయాలను ఎంచుకుంటే మేలు. కాన్సెప్టులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఈ సమయంలో కొత్త అంశాల జోలికి పోకపోవడం మంచిది. కానీ ప్రతి అంశానికి సంబంధించి ప్రాథమికాంశాలపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి. 
సమయపాలనకు పరీక్షలో ప్రాధాన్యం అధికం. సన్నద్ధతతోపాటు దీనినీ చూసుకుంటుండాలి. ఆవిధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. తక్కువ సమయంలో సమస్యలను సాధించే మార్గాలను చూసుకోవాలి.
అన్ని సెక్షన్లకీ సమ ప్రాధాన్యమివ్వాలి. ఏ ఒక్కదానికో పరిమితమై ఉండొద్దు.

క్యాట్‌ కటాఫ్‌ ఆధారంగానే విద్యార్థులను తదుపరి రౌండ్లకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆపై గ్రూప్‌ డిస్కషన్, రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌ (డబ్ల్యూఏటీ), వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించినవారు ప్రవేశం పొందుతారు. కాబట్టి, తుది సన్నద్ధతలో పరిమాణానికి కాకుండా నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి సిద్ధమవ్వాలి. అప్పుడే విజయావకాశాలు పెరిగి మేటి ర్యాంకు సాధ్యమవుతుంది! 


చదివిన పాఠ్యాంశ విభాగాలతో సంబంధం లేకుండా ఎక్కువమంది ఎంచుకునేది మేనేజ్‌మెంట్‌ విద్య. చాలామంది దీన్ని ప్రముఖ బీ స్కూళ్లలో పూర్తిచేయడానికి మొగ్గు చూపుతారు. వీటిల్లో ప్రవేశానికి కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) ప్రధాన మార్గం. దీన్ని ఈ ఏడాది నవంబరు 29న నిర్వహించనున్నారు. కొవిడ్‌ కారణంగా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చారు. వీటిని ఈ ఏడాదికే పరిమితం చేస్తున్నట్లు ఈ ఏడాది పరీక్ష నిర్వహిస్తున్న ఐఐఎం ఇండోర్‌ తెలియజేసింది. కానీ ఈ అకస్మాత్‌ మార్పులు ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నవారిని కొంత కంగారు పడేలా చేయొచ్చు. గమనించుకుని, అందుకు తగ్గట్టుగా తుది సన్నద్ధతలో మార్పులు చేసుకుంటే సరిపోతుందనేది నిపుణుల అభిప్రాయం.

మార్పులివీ!    
  క్యాట్‌ 2020   క్యాట్‌ 2019
పరీక్ష స్లాట్లు 3 2
పరీక్ష వ్యవధి 120 ని. 180 ని.
ప్రతి సెక్షన్‌కూ సమయం  40 ని. 60 ని.

క్యాట్‌ పరీక్ష విధానం ప్రతి నాలుగైదేళ్లకు మారుతూనే ఉంటుంది. గతంలో పెన్ను, పేపర్‌ ఆధారితంగా ఉండేది. కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షగా మారింది. ఇక ఈసారి మూడు గంటల పరీక్ష రెండు గంటలకు మారింది. కానీ పరీక్ష నిర్వహణ ఉద్దేశంలో ఏమాత్రం మార్పులేదు. అభ్యర్థులు భౌతిక దూరపు నిబంధనలు పాటించాల్సిరావటం వల్ల అదనంగా ఒక పరీక్ష స్లాటును పెంచారు.  పరీక్ష, సెక్షన్లవారీగా కేటాయించిన సమయంలో తగ్గుదల అభ్యర్థులను కొంత భయపెడుతోందన్నది వాస్తవం. కానీ నిశితంగా పరిశీలిస్తే..
ప్రశ్నల సంఖ్యలో 25-30% తగ్గుదల ఉండే అవకాశముంది. కానీ పరీక్షలో 75 వరకూ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో వెళ్లడం మంచిది.
ప్రతి సెక్షన్‌ కటాఫ్‌ మార్కుల విషయంలోనూ మార్పులుంటాయి.
ఎంసీక్యూ, నాన్‌ ఎంసీక్యూల నిష్పత్తిలోనూ మార్పులుంటాయి.
ప్రశ్నల కఠినత్వ స్థాయిలో కొద్దిపాటి మార్పులనే ఆశించవచ్చు.

Posted Date: 04-08-2021


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌