‣ సిలబస్, సన్నద్ధత వివరాలు
బ్యాంకు పరీక్షార్థులను ఆనందాశ్చర్యాలతో ముంచెత్తుతూ ఐబీపీఎస్ ఒకేసారి రెండు నోటిఫికేషన్లు.. (ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ ఆఫీసర్లు) విడుదల చేసింది. ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్‌ను మాత్రం సాధారణ సమయానికే విడుదల చేసినా.. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్‌ను రెండు నెలల ముందే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పీఓ ఖాళీలు 3049, స్పెషలిస్ట్ ఖాళీలు 1402 - అంటే మొత్తం 4451 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఐబీపీఎస్ ద్వారా రిక్రూట్‌మెంట్ జరిపే 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 5 మాత్రమే ఖాళీల వివరాలను పేర్కొన్నాయి. ఇంకా 6 వెల్లడించలేదు. వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద బ్యాంకులు కూడా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఐబీపీఎస్ పీఓ పరీక్షకు డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించిన విద్యార్హత ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు పరీక్షలు రాసే అవకాశం ఉండే అభ్యర్థులకు ఇది డబుల్ బొనాంజా.
ఐబీపీఎస్ పీఓ పరీక్షకు ప్రిపేర్ అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్షకు అది సరిపోతుంది. మెయిన్స్ పరీక్షకు ప్రత్యేకంగా సన్నద్ధం కావాలి.
ఎంపిక
రెండు పరీక్షల్లోనూ మూడు అంచెలుంటాయి. మొదటి దశలో ప్రిలిమ్స్, రెండో దశలో మెయిన్స్, మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైనవారే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దానిలో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థులకు మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను 80:20 నిష్పత్తిలో తీసుకుని వాటి ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఈ టాపిక్స్ చాలా ముఖ్యం
1. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ కంపారిజన్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, అరిథ్‌మెటిక్ టాపిక్స్. వీటిలో రేషియో, ఏవరేజి, పర్సంటేజి, ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంటరెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎలిగేషన్, మెన్సురేషన్, పర్ముటేషన్ - కాంబినేషన్, ప్రాబబిలిటీ అత్యంత ప్రధానమైనవి.\
2. రీజనింగ్: ఆల్ఫా-న్యూమరిక్ సిరీస్, కోడింగ్-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇన్ ఈక్వాలిటీస్, వెన్ డయాగ్రమ్, సిలాజిజమ్, పజిల్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, డెసిషన్ మేకింగ్, స్టేట్‌మెంట్స్.మొదలైనవి.
3. ఇంగ్లిష్: గ్రామర్ ఆధార ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ (సిననిమ్స్/ యాంటనిమ్స్). ప్రధానంగా సెంటెన్స్ కరక్షన్, రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిల్లర్స్, క్లోజ్‌టెస్ట్, సెంటెన్స్ రీ ఆర్డర్ మొదలైన గ్రామర్ ఆధారిత ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
4. జనరల్ అవేర్‌నెస్: కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జి.కె. లతోపాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, వార్తల్లోని వ్యక్తులు, ముఖ్యమైన ప్రదేశాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, క్రీడావార్తలు మొదలైనవి బాగా చదవాలి.
గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాల గమనిస్తే ప్రశ్నల సరళి బోధపడుతుంది. దీనికి అనుగుణంగా సన్నద్ధతను శ్రద్ధగా కొనసాగిస్తే విజయం సాధించవచ్చు!
బేసిక్స్ అన్నీ పూర్తయ్యాక పరీక్ష తరహాలో ఉండే మోడల్ పేపర్లు ప్రతిరోజూ ఒకటి రాయాలి. దాన్ని విశ్లేషిస్తూ సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. బేసిక్స్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, టెస్ట్‌లు రాయడం.. ఇలా కొనసాగాలి. దీనివల్ల ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగుతోందో అభ్యర్థులకే అర్థమవుతుంది.

సన్నద్ధత ఎలా?
రెండు పరీక్షలకూ అర్హత ఉన్న అభ్యర్థులు ఐబీపీఎస్ పీఓ పరీక్షకు ప్రిపేర్ అయితే స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్షకు కూడా సరిపోతుంది. ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అక్టోబర్ ప్రారంభంలో, మెయిన్స్ నవంబర్‌లో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌కు ఉన్న సమయానికి తగ్గట్లుగా అభ్యర్థులు తమ సన్నద్ధత ప్రణాళిక తయారుచేసుకోవాలి. మెయిన్స్‌లోని నాలుగు విభాగాల్లో మూడు ముఖ్యమైన విభాగాలు ప్రిలిమ్స్‌లోనూ ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్ష సన్నద్ధతలోనే మెయిన్స్ సన్నద్ధత కూడా సింహభాగం పూర్తవుతుంది. కాబట్టి ఆ మూడు విభాగాలకు మెయిన్స్ పరీక్షకు తగిన విధంగానే ప్రారంభం నుంచీ సిద్ధమవ్వాలి. మెయిన్స్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్, డిస్క్రిప్టివ్ ఇంగ్లిష్‌లకు కూడా ఇప్పటినుంచే కొంత సమయం కేటాయించాలి.
తొలిసారిగా పరీక్ష రాసే అభ్యర్థులు ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టుల్లోని టాపిక్స్ అన్నింటినీ బాగా నేర్చుకుని సాధన చేయాలి. వీలైనంత త్వరగా వాటిని నేర్చుకోవాలి. 25, 30 రోజుల సమయం వీటికి సరిపోతుంది. టాపిక్స్ నేర్చుకున్నాక వాటిలో వివిధ స్థాయుల్లో ఉన్న ప్రశ్నలను బాగా సాధన చేయాలి. ప్రశ్నలను వేగంగా చేయగలిగేలా వివిధ షార్ట్‌కట్ పద్ధతులు ఉపయోగిస్తూ సాధన చేయాలి. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుసుకోవడానికి సమయాన్ని నిర్దేశించుకుని టాపిక్‌లవారీగా టెస్టులు రాయాలి. (ఉదాహరణకు 10 నిమిషాల్లో 10 ప్రశ్నలు).
ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులూ కవర్ చేయాలి. సబ్జెక్టుల కఠినత్వం ఆధారంగా సాధనకు సమయం కేటాయించుకోవాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి సహజంగానే వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్: స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షలో ఉండే ఈ విభాగం.. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన సబ్జెక్టు. ఇది వాళ్లు డిగ్రీ/ పీజీలో చదివిన సబ్జెక్టు కాబట్టి దీనికి బాగా సన్నద్థం కావొచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్ల తుది ఎంపిక మెయిన్స్‌లో ఉండే ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లోని మార్కులు (80 శాతం), ఇంటర్వ్యూ (20 శాతం) ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విభాగం. అభ్యర్థులకు ఈ విభాగంలో ఎంత పట్టు ఉంటే తాము ఎంపిక కావడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది.
తొలిసారిగా పరీక్ష రాసే అభ్యర్థులు ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టుల్లోని టాపిక్స్ అన్నింటినీ బాగా నేర్చుకుని సాధన చేయాలి. వీలైనంత త్వరగా వాటిని నేర్చుకోవాలి.
నోటిఫికేషన్ వివరాలు..
విద్యార్హత (21.08.2023 నాటికి): ఏదైనా డిగ్రీ (పీఓ), నిర్ణీత విద్యార్హత (ఎస్‌ఓ)
వయసు (01.08.2023 నాటికి): 20 - 30 సంవత్సరాలు (జనరల్ అభ్యర్థులు)
దరఖాస్తు ఫీజు: రూ.850, రూ.175 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ)
దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023
ప్రిలిమ్స్ పరీక్ష: సెప్టెంబర్/ అక్టోబర్ (పీఓ), 30/31 డిసెంబర్ (ఎస్‌ఓ)
మెయిన్స్: నవంబర్ (పీఓ), 28.01.2024 (ఎస్‌ఓ)
వెబ్‌సైట్: https://www.ibps.in/