• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 450 ‘ఏవో’ కొలువులు

అర్హత: డిగ్రీ, పీజీన్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనరలిస్ట్, స్పెషలిస్టు.. అన్నీ కలిపి దేశవ్యాప్తంగా 450 పోస్టులు భర్తీచేయనున్నారు. ఇన్సూరెన్స్‌ ఏఓ లేదా ఏఏఓ పరీక్షలు బ్యాంకు పీఓ పరీక్షల స్థాయిలో ఉంటాయి. పీఓతో పోల్చితే.. ఎక్కువ జీతం, తక్కువ పని ఒత్తిడి.. తదితర కారణాల వల్ల అభ్యర్థులు దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పరీక్ష, ఎంపిక విధానం కూడా బ్యాంకు పీఓ మాదిరిగానే ఉంటుంది. 


ఏఓ ఉద్యోగాల నియామకంలో మూడు దశల ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో కనీస మార్కులతో అర్హత సాధించే అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 15 రెట్ల మందిని రెండో దశలోని మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. దానిలో అర్హత సాధిస్తే మూడో దశలో నిర్వహించే ఇంటర్వ్యూకు ఎంపికవుతారు. దీనిలో అర్హత సాధించిన మొత్తం అభ్యర్థుల మెయిన్స్‌లోని ఆబ్జెక్టివ్, ఇంటర్వ్యూల మార్కులను 75 : 25 నిష్పత్తిలో తీసుకుని తుది ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లు అర్హత పరీక్షలు మాత్రమే. 


ఇన్సూరెన్స్, బ్యాంకు పరీక్షల్లో తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి చాలా వేగంగా ప్రశ్నలను సాధించాలి. న్యూ ఇండియా సంస్థ ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలను 60 నిమిషాల్లో, మెయిన్స్‌లో 200 ప్రశ్నలను 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. బాగా సాధన చేస్తూ వేగంగా జవాబులను గుర్తించగలిగేలా షార్ట్‌కట్‌ పద్ధతులు ఉపయోగించాలి. అలా చేస్తేనే ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు!  


జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు రూ.50,925 మూలవేతనం ఉంటుంది. పెద్ద నగరాల్లో దాదాపు రూ.80,000 వరకూ వేతనం అందుతుంది. దీంతోపాటు పీఎఫ్‌ఆర్‌డీఏ, గ్రాట్యుటీ, ఎల్‌టీఎస్, మెడికల్, వసతి మొదలైన సదుపాయాలుంటాయి. 


పదోన్నతి క్రమం: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా చేరినవారు పదోన్నతులతో అంచెలంచెలుగా అసిస్టెంట్‌ మేనేజర్, బ్రాంచ్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డివిజినల్‌ మేనేజర్, సీనియర్‌ డివిజినల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్‌/ రీజనల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) హోదా వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. 


సన్నద్ధత ఎలా?

ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబరు నెలలో నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్ష అక్టోబరులో ఉంటుంది. అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు కలిపి ఉమ్మడిగానే సన్నద్ధతను కొనసాగించాలి. మెయిన్స్‌ పరీక్షలో ప్రిలిమ్స్‌లోని మూడు సబ్జెక్టులతోపాటు జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగముంది. ప్రిలిమ్స్‌ పరీక్ష వరకూ ప్రిపరేషన్‌ పూర్తయ్యేలా చూసుకోవాలి. అంటే.. 45 రోజుల్లో ప్రిపరేషన్‌ పూర్తవ్వాలి. మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు ప్రాథమికాంశాలతో సన్నద్ధత ప్రారంభించాలి. సబ్జెక్టులపై అవగాహన ఉండే అభ్యర్థులు బాగా సాధన చేయాలి. లేకపోతే ముందుగా వివిధ టాపిక్స్‌ బేసిక్స్‌ నేర్చుకుని ఆపై వాటిలో ఉండే వివిధ స్థాయిలలోని ప్రశ్నలను బాగా సాధన చేయాలి. 


ఆన్‌లైన్‌ టెస్ట్‌లు: పరీక్ష విధానానికి అలవాటు పడటానికీ, నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుసుకోవడానికీ ఆన్‌లైన్‌ పద్ధతుల్లో టెస్ట్‌లు రాయాలి. దీని కోసం టాపిక్‌లవారీ టెస్ట్‌లు, సబ్జెక్టులవారీ టెస్ట్‌లు, ఏఓ పరీక్ష తరహాలో ఉండే మాదిరి టెస్ట్‌లు రాయాలి. టాపిక్స్‌ పూర్తయ్యేవరకూ టాపిక్‌ టెస్ట్‌లు, ఆ తర్వాత సబ్జెక్టులవారీ మాదిరి పరీక్షలు రాస్తే ఉపయోగముంటుంది. ఈ టాపిక్స్‌ ముఖ్యమైనవి  

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, క్వాంటిటీ కంపారిజన్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌. వీటిలో రేషియో, ఏవరేజి, పర్సంటేజి, ఏజెస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంటరెస్ట్, టైమ్‌ అండ్‌ వర్క్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, ఎలిగేషన్, మెన్సురేషన్, పర్ముటేషన్‌ - కాంబినేషన్, ప్రాబబిలిటీ. 


రీజనింగ్‌: ఆల్ఫా-న్యూమరిక్‌ సిరీస్, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌రిలేషన్స్, ఆర్డర్‌ అండ్‌ ర్యాంకింగ్, ఇన్‌ ఈక్వాలిటీస్, వెన్‌ డయాగ్రమ్, సిలాజిజమ్, పజిల్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, డెసిషన్‌ మేకింగ్, స్టేట్‌మెంట్స్‌. 


ఇంగ్లిష్‌: గ్రామర్‌ ఆధార ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ (సిననిమ్స్‌/ యాంటనిమ్స్‌). ప్రధానంగా సెంటెన్స్‌ కరక్షన్, రీ-అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ఫిల్లర్స్, క్లోజ్‌టెస్ట్, సెంటెన్స్‌ రీ ఆర్డర్‌ మొదలైన గ్రామర్‌ ఆధారిత ప్రశ్నలు బాగా సాధన చేయాలి. 


జనరల్‌ అవేర్‌నెస్‌: కరెంట్‌ అఫైర్స్, ఇన్సూరెన్స్‌ అవేర్‌నెస్, స్టాటిక్‌ జి.కె.. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, వార్తల్లోని వ్యక్తులు, ముఖ్యమైన ప్రదేశాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, క్రీడావార్తలు మొదలైనవి బాగా చదవాలి. గతంలో జరిగిన పరీక్షల పేపర్లను గమనిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది. దీనికి అనుగుణంగా సన్నద్ధత కొనసాగించాలి. ఒక ప్రణాళిక తయారుచేసుకుని రోజుకు 10-12 గంటల సమయం శ్రద్ధగా ప్రిపేర్‌ అయితే ఈ పరీక్షల్లో విజయం సాధించవచ్చు! 


వెబ్‌సైట్‌: https://www.newindia.co.in/portal/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్‌వో కొలువులు

‣ ‘స్మార్ట్‌’గానూ చదవొచ్చు!

‣ కేంద్ర బలగాల్లో 1,876 ఎస్‌ఐ కొలువులు

‣ మేటి మేనేజ్‌మెంట్‌ సంస్థల్లోకి ‘మ్యాట్‌’

‣ కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో..

Posted Date : 04-08-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం