• facebook
  • whatsapp
  • telegram

కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో..

ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థల వివరాలు



‘మీరు ప్రేమించే ఉద్యోగాన్ని ఎన్నుకోండి.. అప్పుడు జీవితంలో ఒక్కరోజు కూడా పని   చేస్తున్నామనే భావన కలగదు’ అనేది పెద్దల మాట. ఎందుకంటే మనసుకు నచ్చిన వృత్తిలో ఉంటే ఆ సంతోషం, సంతృప్తి  మాటల్లో చెప్పలేం. సగటు మనిషి తన జీవితంలో సగానికిపైగా వృత్తిలోనే గడిపేస్తాడు. తన అభివృద్ధినీ, ముందు తరాల భవిష్యత్తునూ నిర్దేశించే అంతటి ప్రాముఖ్యం కలిగిన ఉద్యోగ జీవితాన్ని నిర్ణయించుకోవడంలో ముందుచూపు చాలా అవసరం. ఇందుకు ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలిసి ఉండాలి. దీనికోసమే కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో కెరియర్‌ కౌన్సెలింగ్‌ అందిస్తున్నాయి. అవేంటో, ఆ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చో పరిశీలిద్దాం!


విద్యార్థి తన ఉద్యోగ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో కౌన్సెలింగ్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొన్ని సర్వేల ప్రకారం సరైన సమయంలో కెరియర్‌ కౌన్సెలింగ్‌ తీసుకున్న అభ్యర్థులు జీవితంలో సంతోషకరమైన ఉద్యోగ జీవితాన్ని పొందుతారని రుజువైంది. అందుకే కోర్సులు ఎంచుకునే ముందు, కెరియర్‌ గురించి ఆలోచించే ముందు కౌన్సెలింగ్‌ తీసుకోవాలనేది నిపుణుల సలహా. విద్యార్థులకు ఈ విషయంలో సాయం చేసేందుకు చాలా సంస్థలున్నాయి.


ప్రతిభ.ఈనాడు.నెట్‌

పదోతరగతి నుంచి పీహెచ్‌డీ పూర్తయ్యే వరకూ విద్యార్థులకు కావాల్సిన సమస్త సమాచారం ఇక్కడ దొరుకుతుంది. ఎటువంటి కోర్సులు ఎంచుకోవాలి, ప్రవేశ పరీక్షలు - పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే వివరాలతోపాటు ఎప్పటికప్పుడు తాజా విద్య, ఉద్యోగ సమాచారం, ఆన్‌లైన్‌ టెస్టులు, ఇంగ్లిష్‌ లెర్నింగ్, ఈ-బుక్స్, మోడల్‌ పేపర్లు.. ఇలా ఎన్నో ఉపయోగకరమైన అంశాలు ఇక్కడ ఉంటాయి. విద్యార్థులకు తమ చదువు, కెరియర్‌ల గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా ‘ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌’ కాలమ్‌ ద్వారా నిపుణులను సంప్రదించవచ్చు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.


ఎన్‌సీఎస్‌.జీవోవీ.ఇన్‌

నేషనల్‌ కెరియర్‌ సర్వీస్‌ (ఎన్‌సీఎస్‌) కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వేదిక. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరియర్‌ సంబంధిత సంపూర్ణ సమాచారం ఉచితంగా అందించేలా దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో కెరియర్‌ కౌన్సెలింగ్‌తోపాటుగా ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి, వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారం, ఇంకా చాలా లభిస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లో కెరియర్‌ కౌన్సెలర్లు, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు, పరిశ్రమలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. వీరంతా ఒకచోట విద్యార్థులకు సరైన సమాచారం అందించేలా బృందంగా పనిచేసేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ కృషి చేస్తుంది. 14 ఏళ్ల వయసు దాటిన వారు ఎవరైనా వివరాలు నమోదు చేసుకుని కావాల్సిన అంశాలు తెలుసుకోవచ్చు. జాబితాగా కనిపించే కెరియర్‌ కౌన్సెలర్లలో కావాల్సిన వారిని ఎంచుకుని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.


ఐడ్రీమ్‌ కెరియర్‌.కామ్‌

ఇందులోకి లాగిన్‌ అవ్వడం ద్వారా ఉచితంగా వెయ్యికి పైగా కెరియర్‌లను గురించి రాసిన డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. కాలేజీలు, ప్రవేశపరీక్షలు, స్కాలర్‌షిప్‌లు, 15కు పైగా దేశాల్లో విద్యావకాశాల గురించి మొత్తం సమాచారం ఇందులో లభిస్తుంది. ఇంకా పూర్తిస్థాయిలో వన్‌ టు వన్‌ కావాలంటే రుసుము చెల్లించి సెషన్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇందులో విద్యార్థితోపాటు, తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇస్తారు. 9వ తరగతి చదివే వారి నుంచి ఈ సేవలు మొదలవుతాయి. సైకోమెట్రిక్‌ అనాలిసిస్‌ చేయడం ద్వారా ఇది విద్యార్థులను అంచనా వేస్తుంది.


మైండ్లర్‌.కామ్‌

ఈవేదిక 5 అంచెల అసెస్‌మెంట్‌ ద్వారా విద్యార్థిని అంచనా వేస్తుంది. ఓరియంటేషన్‌ స్టైల్, ఇంట్రెస్ట్, పర్సనాలిటీ, ఆప్టిట్యూడ్, ఎమోషనల్‌ కోషంట్‌లను పరిశీలించడం ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తిస్తుంది. ఆ తర్వాత నిపుణుల ద్వారా వన్‌ టు వన్‌ నిర్వహించి విద్యార్థి రిపోర్ట్‌ను మరింత విపులంగా వివరించేలా చేస్తుంది. చాలాచోట్ల లభించని వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ ఇక్కడ ప్రత్యేకంగా దొరుకుతాయి. విదేశాలకు వెళ్లేటప్పుడు రాయాల్సిన దరఖాస్తుల గురించి కూడా పూర్తిస్థాయిలో నేర్చుకోవచ్చు. మొదట కొంత కాలానికి ఈ సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అనంతరం ఇంకా కొనసాగించాలంటే రుసుము చెల్లించాలి.


ఫ్రెషర్స్‌వరల్డ్‌.కామ్‌

ఇది ఒక ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌. యూట్యూబ్‌లో కెరియర్‌ సంబంధిత వీడియోల ద్వారా విద్యార్థులకు చేరువయ్యింది. వివిధ ఉద్యోగాల తీరు, వాటికి కావాల్సిన అర్హతలు, ఉద్యోగావకాశాలు.. ఇలా వీటన్నింటి గురించి తెలియజేస్తుంది. ఉచిత రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వ, ప్రైవేటు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, కెరియర్‌కు సంబంధించి వివిధ అంశాలపై వీరు నిర్వహించే వెబినార్లు, రాష్ట్రాల వారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు, రెజ్యూమె బిల్డింగ్, ఇంటర్వ్యూ సన్నద్ధత... ఇలా సేవలన్నీ ఉపయోగించుకోవచ్చు. ఇంతకంటే ఇంకా సమాచారం కావాలి అనుకునేవారు ప్రీమియం మెంబర్‌షిప్‌ తీసుకునే అవకాశం ఉంది. అందులో అడ్వాన్స్‌డ్‌ సేవలు, ఉద్యోగావకాశాలు, ప్రయారిటీ షార్ట్‌లిస్టింగ్‌ వంటివి ఉంటాయి.


ఎడ్యుమైల్‌స్టోన్‌.కామ్‌

కెరియర్‌ కౌన్సెలింగ్‌ రంగంలో ఈ సంస్థకు చక్కని అనుభవం ఉంది. దేశం మొత్తం మీద ఇప్పటివరకూ లక్షల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చింది. దాదాపు 4200 మందికిపైగా కౌన్సెలర్లు ఈ సంస్థతో అనుసంధానమై పనిచేస్తున్నారు. 150కిపైగా ప్రాంతాల్లో వీరు నేరుగా సేవలు అందిస్తున్నారు. 5వ తరగతి విద్యార్థుల నుంచి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి వరకూ, విదేశాల్లో చదవాలి అనుకునేవారికి ఎటువంటి సలహాలు, సూచనలు అయినా అందిస్తున్నారు. కనీస సమాచారం అంతా ఉచితంగా తెలుసుకోవచ్చు, ఆర్టికల్స్‌ చదివే వీలుంది. విద్యార్థికి ప్రత్యేకించి వివరాలు కావాలంటే కొంత రుసుము చెల్లించాలి.


మ్యాప్‌మైటాలెంట్‌.ఇన్‌ 

ఇది దిల్లీ కేంద్రంగా ఉండే కెరియర్‌ కౌన్సెలింగ్‌ వేదిక. విద్యార్థిని పూర్తిగా అంచనా వేయడం ద్వారా వీరు కెరియర్‌ కౌన్సెలింగ్‌ ఇస్తారు. బిహేవియరల్‌ సైన్స్‌ సహాయం ద్వారా ఉన్న బోలెడన్ని ఆప్షన్లలో ఏది ఎంచుకోవచ్చో తెలిసేలా చేస్తారు. విభిన్ననేపథ్యాల నుంచి వచ్చిన కెరియర్‌ కౌన్సెలర్లు ఇందులో ఉన్నారు. ఇందులో అసెస్‌మెంట్‌ ప్రాసెస్‌కు, రిపోర్టుల జారీకి ఏ రుసుములూ చెల్లించాల్సిన అవసరం లేదు. విద్యార్థి పర్సనాలిటీ అసెస్‌మెంట్‌ పూర్తి చేసిన తర్వాత అతడికి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు.


శిక్ష.కామ్‌

ప్రపంచం మొత్తం మీద ఉన్న కాలేజీల గురించి దాదాపుగా సమాచారం అంతా ఇందులో లభిస్తుంది. ముఖ్యంగా యూజీ, పీజీ కోర్సులు చేయదలచిన విద్యార్థుల కోసం ఇది పనిచేస్తోంది. వీరి వద్ద దాదాపు 1400 వరకూ విద్యాసంస్థలు, 40 వేలకు పైగా కోర్సుల గురించి సమాచారాన్ని లక్షల్లో విద్యార్థులు ఉపయోగించుకున్నారు. మూడున్నర లక్షల మందికి పైగా విద్యార్థులు పేరు నమోదు చేసుకున్నారు. కొత్తగా ఉచిత కౌన్సెలింగ్‌ అవకాశాన్ని ప్రవేశపెట్టిందీ సంస్థ. దీని ద్వారా విద్యార్థి నేరుగా చాట్‌ చేసి  సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థిపరంగా  సూచనలు అందుతాయి. వెయ్యి మందికి పైగా నిపుణులు దీనికి అనుబంధంగా పనిచేస్తున్నారు.


1. ఆన్‌లైన్‌ సైట్లలో చాలావరకూ విద్యార్థుల వ్యక్తిత్వం, ఆసక్తులు, సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా కెరియర్లను సూచిస్తాయి.

2. సైకోమెట్రిక్‌ టూల్స్, టెస్ట్‌లను ఉపయోగించేటప్పుడు పూర్తిగా మనకేం అనిపిస్తుందో అదే జవాబు ఇవ్వడం ద్వారా కచ్చితమైన ఫలితాలను పొందవచ్చు.

3. ఇంకా ఇటువంటి వేదికలు చాలా ఉన్నాయి. అంతర్జాలంలో అన్వేషించడం ద్వారా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే అదే సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోర్సు ఎంపికకు.. కౌన్సెలింగ్‌ ముఖ్యం

‣ భాషలపై పట్టు.. అవకాశాలు మెండు

‣ అగ్నివీరులకు వాయుసేన ఆహ్వానం

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఉత్తమ మార్గం

‣ ఉపాధి అవకాశాల ‘ఆప్టోమెట్రీ’

‣ ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్‌ క్యాడర్‌ పోస్టులు

‣ సూపర్‌ కెరియర్‌.. ‘సైబర్‌ సెక్యూరిటీ’

Posted Date: 26-07-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌