• facebook
  • whatsapp
  • telegram

భాషలపై పట్టు.. అవకాశాలు మెండు

అంతర్జాతీయ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలు



అంతర్జాతీయ కంపెనీలెన్నో వివిధ దేశాల్లో పరిశ్రమలను నెలకొల్పుతున్నాయి. దీంతో ప్రధానంగా ఆంగ్లంలో ఉన్న సమాచారాన్ని బహుళ ప్రాంతీయ భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలంటే ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాషల మీదా పట్టు సాధించాలి. ఇలాచేస్తే  అవకాశాలెన్నో తలుపుతడతాయి. అవేమిటో చూద్దామా?


ట్రాన్స్‌లేటర్లు

మార్కెటింగ్, మెడిసిన్, వెబ్‌సైట్లు, యాప్స్, పుస్తకాలు, లా, వీడియోల్లో సబ్‌టైటిలింగ్‌... ఇలాంటి విభిన్న అంశాల్లో అనువాదకుల అవసరం ఎంతో ఉంటుంది. అంతర్జాతీయంగా ఆంగ్లంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లిష్‌ మీద, ప్రాంతీయ భాష మీద పట్టు సంపాదించినవాళ్లు అనువాదకులుగా చక్కని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. 


ప్రూఫ్‌రీడర్లు

ఏదైనా ఒక వ్యాసం లేదా పుస్తకాన్ని ప్రచురించే ముందు.. ఎలాంటి అన్వయ, అక్షరదోషాలు లేకుండా చూడాలి. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు ప్రూఫ్‌రీడర్లు. వివిధ వెబ్‌సైట్లలోనూ అనేక అంశాల మీద సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాంటప్పుడూ వీరి సేవలు అవసరమవుతాయి. 


ఇంటర్‌ప్రెటర్లు

ఏ విషయాన్నయినా ఇతరులకు అర్థమయ్యేలా వివరిస్తూ.. వ్యాఖ్యానించడం వీరి పని. అయితే ఇదంతా సాధారణంగా ప్రత్యక్ష వేదికల మీదే జరుగుతుంది. అంతర్జాతీయ సభలు, సమావేశాల్లో వీరి సేవలు అవసరం అవుతాయి. యునైటెడ్‌ నేషన్స్, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి.. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆంగ్లంలో మాట్లాడినప్పుడు.. వారి ప్రసంగాలను స్థానిక భాషలోకి వీరు అనువదించి చెబుతుంటారు. ఎన్నికల సమయంలోనూ, మత సంబంధ కార్యక్రమాలు జరిగినప్పుడూ వీరి సేవలను వినియోగించుకోవడం చూస్తుంటాం. ప్రసంగాన్ని వేగంగా అనువదించడం తోపాటు.. సందర్భోచితంగా మాట్లాడగలిగే నైపుణ్యమూ ఇంటర్‌ప్రెటర్లకు ఎంతో అవసరం. 


డేటా ట్రెయినింగ్‌ ఇంజినీర్లు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ) లకు డిమాండ్‌ పెరుగుతోంది. సాంకేతిక అంశాలపైన ముందుగా అవగాహన పెంచుకుని.. వాటిని ఇతరులకు అర్థమయ్యేలా బోధించాలన్నా ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాషల మీదా గట్టి పట్టు ఉండాలి. 


డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ప్రింటర్‌ లింక్డ్‌ టెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ ద్వారా మ్యాటర్‌ను ప్రింట్‌ చేయడం తెలిసిందే. వివిధ వార్తలు, రిపోర్ట్‌లు, ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని ఈ పద్ధతిలోనే ముద్రిస్తుంటారు. ఈ పద్ధతిలో నాణ్యత విషయంలోనూ రాజీపడాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా పుస్తక ముద్రణ మాదిరిగానే ఉంటుంది. వివిధ భాషల్లో టైప్‌ చేయడం వచ్చినట్లయితే.. ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్థానిక భాషల్లోనూ ప్రచురించవచ్చు. వివిధ భాషల మీద పట్టు సాధిస్తే డీటీపీలో నాణ్యతా పెరుగుతుంది. 


ప్రొడక్ట్‌ మేనేజర్లు

కొన్ని కంపెనీల వివిధ సాంకేతిక పరికరాలను ఉత్పత్తి చేస్తుంటాయి. వీటిని వివిధ స్థానిక మార్కెట్లో విక్రయించాలి. వాటిని వినియోగించాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, ప్రయోజనాలనూ ప్రాంతీయ భాషల్లో సరళంగా వివరించగలగాలి. కొంతమందికి తప్ప.. వినియోగదారులందరికీ ఇంగ్లిష్‌ రాకపోవచ్చు. అలాంటప్పుడు వారికి అర్థమయ్యే స్థానిక భాషలో పరికరాల గురించి చెప్పగలగాలి. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు ప్రొడక్ట్‌ మేనేజర్లు. వీరు ఉత్పత్తుల సమాచారాన్ని వినియోగదార్లకు తెలిసిన భాషలో అర్థమయ్యేలా వివరిస్తారు. 


కంటెంట్‌ క్రియేటర్లు

స్థానిక భాషలో వివిధ అంశాలపైన రాస్తుంటారు. అంతేకాకుండా ఆంగ్లంలో ఉన్న బ్లాగులు, వ్యాసాలను స్థానిక భాషల్లోకీ అనువదిస్తుంటారు. అయితే ఇక్కడ యథాతథంగా అనువాదం చేయడం అనేదే ముఖ్యంకాదు. స్వేచ్ఛానువాదం చేయడంతోపాటు.. అర్థాలు మారిపోకుండా.. ఆసక్తికరంగా మలచడమూ అవసరమే. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోర్సు ఎంపికకు.. కౌన్సెలింగ్‌ ముఖ్యం

‣ అగ్నివీరులకు వాయుసేన ఆహ్వానం

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఉత్తమ మార్గం

‣ ఉపాధి అవకాశాల ‘ఆప్టోమెట్రీ’

‣ ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్‌ క్యాడర్‌ పోస్టులు

‣ సూపర్‌ కెరియర్‌.. ‘సైబర్‌ సెక్యూరిటీ’

Posted Date: 25-07-2023


 

ఉద్యోగ ప‌రీక్ష‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌