• facebook
  • whatsapp
  • telegram

అగ్నివీరులకు వాయుసేన ఆహ్వానం 

ఆగస్టు 17 దరఖాస్తుకు గడువు



అగ్నిపథ్‌ పథకంలో అగ్నివీర్‌వాయు పోస్టుల భర్తీకి భారతీయ వాయుసేన  ప్రకటన వెలువరించింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలూ అర్హులే. పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు నాలుగేళ్లు  సేవలందించవచ్చు. ఆపై వీరిలో 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగానికి అవకాశం ఇస్తారు. మిగిలినవారు సర్టిఫికెట్, ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలగుతారు. 


ఎయిర్‌ ఫోర్స్‌ ఏడాదికి రెండుసార్లు ఆగ్నివీర్‌వాయు పోస్టులకు ప్రకటన విడుదల చేస్తోంది. తాజా నోటిఫికేషన్‌ 2024(1) ఇన్‌టేక్‌కు చెందింది. అగ్నివీర్‌వాయులో సైన్స్, నాన్‌ సైన్స్‌ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సైన్స్‌ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారు నాన్‌ సైన్స్‌ ఖాళీలకూ పోటీ పడవచ్చు. ఇందుకోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు.   


సైన్స్‌ విభాగం: ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా నిర్దేశిత బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పది/ ఇంటర్‌/ డిప్లొమా/ ఒకేషనల్‌ ఎందులోనైనా ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. 


నాన్‌ సైన్స్‌ విభాగం: ఏదైనా గ్రూపుతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ అర్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పది/ ఇంటర్‌/ ఒకేషనల్‌ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు పొందాలి. 


ఎత్తు: అన్ని విభాగాలకూ పురుషులు 152.5 సెం.మీ. మహిళలు 152 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు 5 సెం.మీ. వ్యత్యాసం తప్పనిసరి. 


ఎంపిక: మూడు దశల్లో నిర్వహించే వివిధ పరీక్షలతో నియామకాలు చేపడతారు. 


ప్రోత్సాహకాలు 

అగ్నివీర్‌వాయులో అవకాశం వచ్చినవారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30,000 చెల్లిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ.33,000 వేతనం ఉంటుంది. మూడో ఏడాది రూ.36,500 అందుతుంది. నాలుగో సంవత్సరం రూ.40,000 ప్రతి నెలా చెల్లిస్తారు. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌ లీవ్‌ కేటాయిస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకుగానూ వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌వాయు స్కిల్‌ సర్టిఫికెట్‌ అందుతుంది. వీరికి పింఛను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ హోదా వర్తించవు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఉండదు. 



సేవానిధి 

ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెలా పొందే రూ.30,000 నుంచి రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీర్‌వాయు చేతికి రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,550 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. ఇలా నాలుగో ఏడాదికి వీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి జమవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జత చేస్తుంది. రెండూ కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీని జతచేసి, అగ్నివీర్‌వాయుకి అందిస్తారు. 


నాలుగేళ్ల సేవలు అనంతరం శాశ్వత ఉద్యోగంలోకి అవకాశం రానివారికి సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. కార్పొరేట్‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయని ప్రకటించాయి. నాలుగేళ్ల సర్వీస్‌ మధ్యలో కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే అగ్నివీర్‌వాయుకి అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం దక్కదు.


ఫేజ్‌-1

ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌ సైన్స్‌ వారికి పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. సైన్స్, నాన్‌ సైన్స్‌ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అలాగే తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు మార్కు తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి. ఎంచుకున్న పరీక్షను బట్టి ఇంగ్లిష్‌ 20, ఫిజిక్స్‌ 25, మ్యాథ్స్‌ 25, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు ఉంటాయి. 


సన్నద్ధత.. ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు పరీక్షను సులువుగా ఎదుర్కోగలరు. మ్యాథ్స్, ఫిజిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలకు ఎంసెట్‌ స్థాయిలో సన్నద్ధమైతే సరిపోతుంది. ఇంటర్మీడియట్‌ ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టిపెడితే ఆ విభాగంలోనూ మెరుగైన స్కోరు పొందవచ్చు. రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలు మరీ లోతుగా ఉండవు. మాదిరి ప్రశ్నలు సాధన చేసి, మెరుగైన మార్కులు పొందవచ్చు. జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలకు.. ఇటీవలి కాలంలో రక్షణ విభాగంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలకు ప్రాధాన్యమివ్వాలి. క్రీడలు, అవార్డులు, విజేతలు, పుస్తకాలు, రచయితలు, నియామకాలు, ఎన్నికలు... తాజా పరిణామాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.


ఫేజ్‌-2

ఫేజ్‌-1 ప్రతిభావంతులకే ఫేజ్‌-2లో అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు నిర్దేశిత సెలక్షన్‌ కేంద్రాలకు ప్రవేశపత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు, వాటి నకళ్లు, ఫొటోలు, సామగ్రిని తీసుకెళ్లాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు ఒక్కోటీ నిమిషం వ్యవధిలో.. 10 బస్కీలు, 10 గుంజీలు, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. మహిళలు 90 సెకన్లలో 10 గుంజీలు, నిమిషంలో 15 స్క్వాట్స్‌ చేయగలగాలి. వీటన్నింటిలోనూ అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. దీనిద్వారా అభ్యర్థి వాయుసేన ఉద్యోగం, వాతావరణానికి అలవాటు పడగలడా లేదా పరిశీలిస్తారు. 


ఫేజ్‌-3

అడాప్టబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించినవారిని వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు.


ఉద్యోగంలోకి..

నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీర్‌వాయు ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని ఎయిర్‌ఫోర్స్‌లో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతిభ, సంస్థ అవసరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. సైన్స్‌ విభాగంలో అవకాశం వచ్చినవారు గ్రూప్‌-ఎక్స్‌ (ఫిట్టర్‌) విధులు నిర్వర్తిస్తారు. వీరికి మొదటి నెల నుంచే రూ.33,100 మూలవేతనం అందుతుంది. నాన్‌ సైన్స్‌ అభ్యర్థులు గ్రూప్‌ వై(టెక్నీషియన్‌) సేవలు అందిస్తారు. వీరికి రూ.26,900 మూలవేతనం చెల్లిస్తారు. ఈ రెండు ట్రేడులవారికీ డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అందుతాయి. ఎక్స్‌ ట్రేడ్‌ల్లోనివారు మొదటి నెల నుంచే రూ.యాభై వేలకు పైగా, వై ట్రేడుల్లో చేరినవాళ్లు సుమారు రూ.45,000 వేతనం అందుకోవచ్చు. విధుల్లో కొనసాగినవారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ (ఎండబ్ల్యువో) స్థాయికి చేరుకోవచ్చు. అలాగే సర్వీసులో కొనసాగుతూ కొన్ని పరీక్షల్లో అర్హతలు సాధించినవారు కమిషన్డ్‌ ఆఫీసర్లూ కావచ్చు. ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్యవధితో ఉన్నత విద్య కొనసాగించడానికీ అనుమతిస్తారు. పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం పింఛను, ఇతర సౌకర్యాలు వీరికి దక్కుతాయి.  


ముఖ్య సమాచారం..

వయసు: జూన్‌ 27, 2003 - డిసెంబరు 27, 2006 మధ్య జన్మించినవారు అర్హులు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 27 నుంచి ఆగస్టు 17 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.250.

ఆన్‌లైన్‌ పరీక్షలు: అక్టోబరు 13 నుంచి ప్రారంభమవుతాయి. 

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/


గమనిక: నోటిఫికేషన్‌లో అడాప్టబిలిటీ టెస్టు-1 పేర్కొన్నప్పటికీ దాన్ని తొలగిస్తున్నట్లు ఎయిర్‌ ఫోర్స్‌ వెబ్‌సైట్‌ ప్రత్యేక ప్రకటనలో పేర్కొన్నారు. అడాప్టబిలిటీ టెస్టు-2 యధాతథంగా ఉంటుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉపాధి అవకాశాల ‘ఆప్టోమెట్రీ’

‣ ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్‌ క్యాడర్‌ పోస్టులు

‣ సూపర్‌ కెరియర్‌.. ‘సైబర్‌ సెక్యూరిటీ’

‣ ‘పీహెచ్‌పీ’తో పక్కా ఉద్యోగం

‣ నర్సింగ్‌ కోర్సు.. అవకాశాలు అనేకం

‣ సీజీపీడీటీఎంలో 553 ఉద్యోగాలు

‣ డేటా సైన్స్‌లో ప్రత్యేకతలివిగో!

Posted Date : 25-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌