• facebook
  • whatsapp
  • telegram

వాయుసేనలో అగ్నివీరులవుతారా?

ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు


 


అగ్నివీర్‌ వాయు పోస్టుల భర్తీకి వాయుసేన ప్రకటన విడుదలచేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలూ అర్హులే. పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు నాలుగేళ్లు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలినవారు సర్టిఫికెట్, ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలగాలి. వీరికి కార్పొరేట్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి. అగ్నివీర్‌ వాయు 2025 (2) ప్రకటన వివరాలు.. 


ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌.. ఈ మూడూ అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ పోస్టులను దాదాపు ఏటా రెండుసార్లు భర్తీ చేస్తున్నాయి. అయితే వీటిలో ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. తాజా నోటిఫికేషన్‌ 2025(2) ఇంటేక్‌కు చెందింది. ఇందులో సైన్స్, నాన్‌ సైన్స్‌ విభాగాల్లో ఉద్యోగాలున్నాయి. సైన్స్‌ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారు కావాలనుకుంటే నాన్‌ సైన్స్‌ ఖాళీలకూ పోటీ పడవచ్చు. ఇందుకోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు.  


    అర్హతలు   

సైన్స్‌ విభాగానికి: మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు ఇంటర్మీడియట్‌లో చదవాలి. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లేదా నిర్దేశిత బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులు పొందాలి. ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. పది/ఇంటర్‌/డిప్లొమా/ఒకేషనల్‌ ఎందులోనైనా ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. 

నాన్‌ సైన్స్‌ పోస్టులకు: ఏదైనా గ్రూపుతో ఇంటర్‌లో 50 శాతం మార్కులు పొందినవారు అర్హులు లేదా రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఏ అర్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పది/ఇంటర్‌/ఒకేషనల్‌ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు అవసరం. 

ఎత్తు: అన్ని విభాగాలకూ పురుషులు 152.5 సెం.మీ. మహిళలు 152 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు 5 సెం.మీ. వ్యత్యాసం తప్పనిసరి. పురుషులకు ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. అవసరం.


    ఎంపిక   
మూడు దశల్లో నిర్వహించే వివిధ పరీక్షలతో నియామకాలు చేపడతారు. 

ఫేజ్‌-1: ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌ సైన్స్‌ వారికి పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. సైన్స్, నాన్‌ సైన్స్‌ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అలాగే తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు మార్కు తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి. ఎంచుకున్న పరీక్షను బట్టి ఇంగ్లిష్‌ 20, ఫిజిక్స్‌ 25, మ్యాథ్స్‌ 25, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు సాధించాలి.


    ఫేజ్‌-2లో...  

ఫేజ్‌-1 ప్రతిభావంతులకే ఫేజ్‌-2లో అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు నిర్దేశిత సెలక్షన్‌ కేంద్రాలకు ప్రవేశపత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు, వాటి నకళ్లు, ఫొటోలు, సామగ్రిని తీసుకెళ్లాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు ఒక్కోటీ నిమిషం వ్యవధిలో.. 10 బస్కీలు, 10 గుంజీలు, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. మహిళలు 90 సెకన్లలో 10 గుంజీలు, నిమిషంలో 15 స్క్వాట్స్‌ చేయగలగాలి. వీటన్నింటిలోనూ అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. దీనిద్వారా అభ్యర్థి వాయుసేన ఉద్యోగం, వాతావరణానికి అలవాటు పడగలడా లేదా పరిశీలిస్తారు. 

    ఫేజ్‌-3  

అడాప్టబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు ఎంపిక చేస్తారు. 


    మెరుగైన స్కోరు కోసం  

1. https://agnipathvayu.cdac.in/ వెబ్‌సైట్‌లో సిలబస్‌ వివరాలు గమనించాలి. మాదిరి ప్రశ్నలనూ ఇచ్చారు. మాక్‌ టెస్టూ అందుబాటులో ఉంచారు. వీటన్నింటి ద్వారా.. పరీక్ష స్వరూపం, ప్రశ్నల తీరు గ్రహించి, చదవాల్సిన అంశాలు, వాటిస్థాయి తెలుసుకోవాలి.  

2. ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల ఈ సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు బాగా చదువుకోవాలి. 

3. రీజనింగ్‌ ప్రశ్నలకు హైస్కూల్‌ మాథ్స్‌ పుస్తకాల్లోని జనరల్‌ అంశాలు బాగా చదివితే సరిపోతుంది. 

4. జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం హైస్కూల్‌ సైన్స్, సోషల్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలతోపాటు, వర్తమాన సంఘటనలను అనుసరించాలి. 

5. పాఠ్యపుస్తకాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు పరీక్షను సులువుగా ఎదుర్కోగలరు. 

6. మ్యాథ్స్, ఫిజిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలకు ఎంసెట్‌ స్థాయిలో సన్నద్ధమైతే సరిపోతుంది. 

7. ఇంటర్మీడియట్‌ ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టిపెట్టి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనచేస్తే ఆ విభాగంలోనూ మెరుగైన స్కోరు పొందవచ్చు. 

8. రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలు మరీ లోతుగా ఉండవు. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు, సాధారణ తర్కం ఉపయోగించగలిగితే సులువుగానే సమాధానాలు గుర్తించవచ్చు.  

9. జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలకు.. రక్షణ విభాగంలో ఇటీవలి కీలక పరిణామాలకు ప్రాధాన్యమివ్వాలి. క్రీడలు, అవార్డులు, విజేతలు, పుస్తకాలు, రచయితలు, నియామకాలు, ఎన్నికలపై దృష్టి సారిస్తే అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించవచ్చు. 


    ప్రోత్సాహకాలు  

అగ్నివీర్‌ వాయులో అవకాశం వచ్చినవారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30,000 చెల్లిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ.33,000 వేతనం ఉంటుంది. మూడో ఏడాది రూ.36,500 అందుతుంది. నాలుగో సంవత్సరం రూ.40,000 ప్రతి నెల పొందుతారు. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌ లీవ్‌ కేటాయిస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గానూ వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌ వాయు స్కిల్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వీరికి పింఛను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ హోదా, ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఇవేవీ ఉండవు.  


    సేవానిధి  

ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే 30,000 నుంచి రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీర్‌ వాయు చేతికి     రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,550 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. ఇలా నాలుగో ఏడాదికి వీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 కేటాయిస్తారు. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి జమవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జత చేస్తుంది. రెండూ కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీని కలిపి, అగ్నివీర్‌ వాయుకి అందిస్తారు. 


     శాశ్వత ఉద్యోగంలోకి   

నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీర్‌ వాయు ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని ఎయిర్‌ఫోర్స్‌లో శాశ్వత ఉద్యోగానికి ఎంపికచేస్తారు. ఇందుకోసం నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతిభ, సంస్థ అవసరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా సైన్స్‌ విభాగంలో అవకాశం వచ్చినవారు గ్రూప్‌-ఎక్స్‌ (ఫిట్టర్‌) విధులు నిర్వహిస్తారు. వీరికి మొదటి నెల నుంచే రూ.33,100 మూలవేతనం అందుతుంది. నాన్‌ సైన్స్‌ అభ్యర్థులు గ్రూప్‌ వై (టెక్నీషియన్‌) సేవలు అందిస్తారు. వీరికి రూ.26,900 మూలవేతనం చెల్లిస్తారు. ఈ రెండు ట్రేడులవారికీ డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఎక్స్‌ ట్రేడ్‌ల్లోనివారు మొదటి నెల నుంచే రూ.యాభై వేలకు పైగా, వై ట్రేడుల్లో చేరినవాళ్లు సుమారు రూ.45,000 వేతనం అందుకోవచ్చు. విధుల్లో కొనసాగినవారు భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ (ఎండబ్ల్యువో) స్థాయికి చేరుకోవచ్చు. అలాగే సర్వీసులో కొనసాగుతూ కొన్ని పరీక్షల్లో అర్హతలు సాధించినవారు కమిషన్డ్‌ ఆఫీసర్లూ కావచ్చు. ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్యవధితో ఉన్నత విద్య కొనసాగించడానికీ అనుమతిస్తారు. పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం పింఛను, ఇతర సౌకర్యాలు దక్కుతాయి.  


     బయటకొస్తే..  

నాలుగేళ్ల సేవలు అనంతరం శాశ్వత ఉద్యోగంలో అవకాశం రానివారికి సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. కార్పొరేట్‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. పలు సంస్థలు నియామకాల్లో వీరికి ప్రాధాన్యమిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. నాలుగేళ్ల సర్వీస్‌ మధ్యలో కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే అగ్నివీర్‌ వాయుకి అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం దక్కదు.


     ముఖ్య సమాచారం   

వయసు: 21 ఏళ్లలోపు ఉండాలి. జులై 3, 2004 - జనవరి 3, 2008 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 8 నుంచి 28 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.550. దీనికి జీఎస్‌టీ అదనం.

ఆన్‌లైన్‌ పరీక్షలు: అక్టోబరు 18 నుంచి మొదలవుతాయి.

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/AV/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

Posted Date : 24-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు