• facebook
  • whatsapp
  • telegram

అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు

యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ వివరాలు


అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్‌ చదివి ఉండాలి. ప్లస్‌టూలో కనీసం 50శాతం మార్కులు సాధించి ఉండాలి. ప్రతి యూనివర్సిటీ తమకంటూ కొన్ని అర్హతలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. వాటిలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ప్రవేశాలు పొందవచ్చు.

వ్యవసాయ సంబంధిత అంశాల మేనేజ్‌మెంట్‌ కోర్సులు.. సాధారణ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనే ఒక శాఖగా ఉన్నాయి. ఆహార ప్రాసెసింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, వేర్‌హౌసింగ్, రిటైలింగ్‌ వంటివన్నీ ఇందులో భాగం. ధరలు నిలకడగా ఉండేందుకు, రైతుల సరకకు డిమాండ్‌ తేడాలను తగ్గించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఫామ్‌ ప్లానింగ్, వెదర్‌ ఫోర్‌కాస్టింగ్, ల్యాండ్‌ రిసెర్చ్, సాయిల్‌ మేనేజ్‌మెంట్, సీడ్‌ ప్రొడక్షన్, మెషినరీ, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌.. వంటివన్నీ విద్యార్థులు ఇందులో నేర్చుకుంటారు.  

ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థుల్లో చాలామందికి ఇది ప్రథమ ఎంపిక కాకపోయినా.. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన, డిమాండ్‌ ఉన్న రంగం ఇది. భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు 17.5 జీడీపీ వ్యవసాయం వల్లే సాధ్యమవుతోంది. వ్యవసాయ రంగం సాధారణ జీవనాధారం స్థాయి నుంచి ఉన్నతస్థాయి అభివృద్ధి అవకాశంగా రూపుదిద్దుకుంది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల.. నిపుణులైన యువత అవసరం దీనికి ఉంది. దీంతో అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కెరియర్‌ ప్రస్తుతం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.

అగ్రి బిజినెస్‌ను అగ్రికల్చరల్‌ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్‌ల కలయికగా చెప్పవచ్చు. ఇది వ్యవసాయాన్నీ,  వ్యాపారాన్నీ కలగలుపుతుంది. ఫార్మ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆగ్రో కెమికల్స్, మెషినరీ, రిటైలింగ్‌ వంటి అంశాలూ ఇందులో భాగం. స్థిరమైన ఆహార సరఫరా, అగ్రికల్చర్‌ ప్రొడక్ట్‌ల పంపిణీలో ఈ విషయ నిపుణులు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న విదేశీ డిమాండ్‌ను అందిపుచ్చుకుంటే వ్యవసాయానికి మంచి బిజినెస్‌ అవకాశాలు అందించవచ్చు.


   మీకు వ్యవసాయమంటే ఇష్టమా?   

‣ చిన్న, సన్నకారు రైతులకు సాయపడేలా.. అదే సమయంలో ఉన్నతస్థాయి ఉద్యోగంలో స్థిరపడితే బాగుంటుంది అనుకుంటున్నారా? 

‣ రైతులకూ,  వినియోగదారులకూ మేలు చేసేలా, మెరుగైన పంపిణీ వ్యవస్థకు మీవంతు కృషి చేయాలని భావిస్తున్నారా? 

‣ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా దేశ రైతాంగానికీ, వ్యవసాయానికీ మేలు చేయాలి అనుకుంటున్నారా? 

‣ అయితే అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు మీకు సరైన ఎంపిక!


   కోర్సులు   

భారత్‌లో కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లు ఈ తరహా మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. అగ్రికల్చర్‌ సెక్టార్‌లోని ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌పై ఈ కోర్సులు దృష్టి సారిస్తాయి. ముఖ్యమైన వ్యాపార విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించడం వీటి ఉద్దేశం. ఇందులో డిగ్రీ స్థాయిలో బీకాం, బీబీఏ, బీఎస్సీ (ఆనర్స్‌), పీజీ స్థాయిలో ఎంకాం, ఎంబీఏ, ఎంఫిల్, ఆపైన పీహెచ్‌డీ, డిప్లొమా వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు వర్శిటీలు, కళాశాలల్లో దీనికి సంబంధించిన రెండు, మూడేళ్ల కోర్సులు వివిధ ఫార్మాట్లలో లభిస్తున్నాయి. బీబీఏ, ఎంబీఏ అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్, బీటెక్‌ - బీఈ - ఎంటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఎమ్మెస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రోనమీ వంటివి ప్రస్తుతం విద్యార్థులు అధికంగా ఎంచుకుంటున్న కోర్సులు.


   అవకాశాలు   

ప్రస్తుతం అగ్రికల్చర్‌ ఒక బిజినెస్‌గా అవతరించింది. అందుకే ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ అవసరం అవుతోంది. భారత్‌లో కమర్షియల్‌ అగ్రికల్చర్‌ ఎన్నో అవకాశాలకు వేదికగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వినూత్న ఆలోచనలతో గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగం ఊపందుకుంటోంది. పబ్లిక్, ప్రైవేట్, కోఆపరేటివ్‌ వ్యవస్థల్లో ఈ రంగ నిపుణుల అవసరం ఉంది. వ్యవసాయంతోపాటుగా రియల్‌ఎస్టేట్, రిటైల్‌ మార్కెటింగ్, డెయిరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫుడ్‌ ప్రొడక్షన్‌.. వంటి అనుబంధ రంగాల్లోనూ వీరు రాణించవచ్చు.


   ఉద్యోగాలు   

ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం అగ్రికల్చర్‌ మేనేజర్, ఫామ్‌ మేనేజర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్, టెక్నీషియన్, క్వాలిటీ ఎస్యూరెన్స్‌ మేనేజర్, మార్కెట్‌ అనలిస్ట్‌ వంటి పలు హోదాల్లోకి ప్రవేశించవచ్చు. ఇంకా లాజిస్టిక్స్‌ మేనేజర్, మార్కెటింగ్‌ మేనేజర్, హెచ్‌ఆర్‌ మేనేజర్, అకౌంటింగ్‌ మేనేజర్, అగ్రికల్చర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వంటి పోస్టుల్లోకి వెళ్లవచ్చు. 

‘పరిశ్రమ అభివృద్ధి పథంలో ఉండటం వల్ల నిపుణులైన యువత అవసరం దీనికి ఉంది. దీంతో అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కెరియర్‌ ఎక్కువమందిని ఆకర్షిస్తోంది,

ఐటీసీ, హిందుస్థాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్, నెస్లే, జేకే అగ్రి జెనెటిక్స్‌ లిమిటెడ్, హెచ్‌పీసీ బయోసైన్సెస్‌ లిమిటెడ్, నాథ్‌ బయో-జీన్స్‌ (ఇండియా) లిమిటెడ్‌.. వంటి అనేక సంస్థలు ఈ చదువులు పూర్తి చేసిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఉదాహరణకు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ), ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల్లో ఈ నిపుణుల అవసరం ఉంటుంది.


   అతిగా స్పందిస్తున్నారా?   

కోరుకున్న కోర్సు లేదా కాలేజీలో సీటు రాలేదని ఆందోళన చెందే విద్యార్థులూ... పరీక్షల తేదీ దగ్గరపడుతున్నప్పుడు విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాళ్ల్లూ... తరచి చూస్తే వీరందరిలోనూ ఒక పోలిక కనిపిస్తుంది. అదే.. అతిగా స్పందించడం! 

ఇలాంటివాళ్లు చిన్న విషయాలనే పెద్దగా ఊహించుకుని భయపడుతుంటారు. ఫలితాలు ఊహించిన దానికంటే భిన్నంగా వచ్చినప్పుడూ, వైఫల్యంపై విమర్శలు విన్నప్పుడూ అతిగా స్పందిస్తారు. సమస్యలన్నీ తమను మాత్రమే చుట్టుముడుతున్నాయనే ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతారు. 

పరిసరాల, పరిస్థితుల ప్రభావం ప్రతి ఒక్కరి మీదా ఉంటుంది. దీనికి విద్యార్థులూ అతీతులు కాదు. కానీ అతిగా స్పందించడం వల్ల ఇబ్బంది పెరుగుతుందేగానీ తగ్గదు. దీన్నుంచి బయటపడటానికి ఏం చేయాలో చూద్దాం.

వార్షిక, ప్రవేశ, పోటీ పరీక్షల్లో అంచనాలూ తలకిందులై.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. సంపాదించిన మార్కులు అసంతృప్తినీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అయోమయ పరిస్థితినీ కలిగించొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాటి ప్రభావం ఆలోచనలు, ప్రవర్తన మీద పడకుండా ఉండటానికి భావోద్వేగ నియంత్రణను అలవర్చుకోవాలి. 

‘ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటున్నా.. ఎవరూ మెచ్చుకోరు. అందరూ విమర్శిస్తూనే ఉంటారు’.. అని ఆలోచించే విద్యార్థులూ ఉంటారు. ఇతరులు ప్రశంసించడం లేదా నిందించడం అనేది మన చేతుల్లోలేని విషయం. కాబట్టి ఇలాంటి వాటి గురించి పదేపదే ఆలోచించడం మానేయాలి. దీని బదులుగా మనం చేస్తున్న కృషి.. స్నేహితుల నుంచీ, కుటుంబ సభ్యుల నుంచీ ఎలాంటి సాయం తీసుకోవచ్చనే దిశగా ఆలోచించాలి. 

గతంలో జరిగిన విషయాలనూ, భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించీ ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందడం సరికాదు. గతంలో బాధపెట్టిన అంశాలు ఎన్నో ఉండొచ్చు. భవిష్యత్తులో ఏం జరగనుందోననే భయంతో ఆందోళనా ఆవహించవచ్చు. ఇవన్నీ మానసిక ప్రశాంతతను దూరం చేసే విషయాలే. వర్తమానంలో జీవించడం వల్ల చేసే పని మీదే ధ్యాసను నిలుపగలుగుతారు. 

ప్రతికూల ఫలితాలు రావడానికి ఇతరులే కారణమని నిందించడం, నెపాన్ని ఎదుటివారి మీదకు నెట్టేయడం వల్ల అతిగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పట్ల మనమే బాధ్యత తీసుకోవాలి. అనుకున్నది చేయడంలో విజయం వరించినా.. వైఫల్యం ఎదురైనా.. దానికి పూర్తి బాధ్యత మనదే కావాలి. అప్పుడు అతిగా స్పందించడానికి బదులుగా పరిష్కార మార్గాల గురించి మాత్రమే ఆలోచిస్తాం.  

మోతాదుకు మించి స్పందించినప్పుడు... మనం మాట్లాడే విధానం, ప్రవర్తనా పూర్తిగా మారిపోతాయి. దాంతో ఇతరుల మనసును అనవసరంగా నొప్పించినవాళ్లమవుతాం. ఇది మనం ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. 

ఆలోచనలను ఒకచోట రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. వాటిలో ఆలోచింపజేసేవీ, ఆవేశపరిచేవీ, అనవసరమైనవీ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల ఒత్తిడీ తగ్గుతుంది. ఎదుటివారితో మనుసులోని బాధలను పంచుకున్న అనుభూతీ కలుగుతుంది. ఆ తర్వాత వాటిలోంచి అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకుని.. ఆచరణలో పెడితే అతిగా స్పందించే అవకాశమే ఉండదు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

Posted Date: 19-06-2024


 

కోర్సులు