• facebook
  • whatsapp
  • telegram

వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

కోర్సులు, ఉద్యోగావకాశాల వివరాలు


జన్యుశాస్త్రం (హ్యూమన్‌ జెనెటిక్స్‌) ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్టు! జంతు, వృక్ష, మానవ జాతుల గురించి తెలుసుకోవడంలో దీనిపాత్ర ఎంతో ముఖ్యమైనది. దాన్ని పరమాణు స్థాయిలో లోతుగా చర్చించే ‘మాలిక్యులర్‌ జెనెటిక్స్‌’ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం జన్యువులపైనా, వ్యాధులపైనా, మందుల తయారీలోనూ లోతైన పరిశోధన, వివరాల విశ్లేషణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగపు నిపుణులకు డిమాండ్‌ పెరిగింది. తక్కువ పోటీ ఉండే ఇటువంటి సబ్జెక్టులను ఎంచుకోవడం ద్వారా వినూత్న కెరియర్‌ను అందుకోవచ్చు.


సాధారణ స్థాయికంటే జెనెటిక్స్‌పై లోతైన పరిశోధన చేసేదే మాలిక్యులర్‌ జెనెటిక్స్‌. ఇందులో విద్యార్థులు సెల్‌ బయాలజీ, ఇమ్యునో జెనెటిక్స్, ఫార్మకాలజీ.. వంటి మెడిసిన్‌ అనువర్తనం (అప్లికేషన్‌) చేసే సబ్జెక్టులు చదువుతారు. ప్రధానంగా పరిశోధన రంగంలో పనిచేస్తారు. వీరి రిసెర్చ్‌ ఆధారంగా వైద్యులు రోగి  లక్షణాలు గుర్తించడం, వ్యాధిని నిర్థÄరించడం, వైద్యాన్ని సిఫార్సు చేయడం.. వంటివి చేస్తారు.


ఉదాహరణకు కరోనా విజృంభించిన సమయంలో ఆ వైరస్‌ గురించి తెలుసుకోవడంలో మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ నిపుణులు ఎంతగానో సహాయపడ్డారు. ఆపైన కనిపెట్టిన వ్యాక్సిన్, ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లోనూ వీరు కీలకంగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల వీటికి గతంలో కంటే మెరుగైన ఆదరణ లభిస్తోంది. యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగంలోనూ వీరు రాణిస్తున్నారు.

ఎమ్మెస్సీ మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ కోర్సు ఏపీలో గతంలో ఆంధ్రాయూనివర్సిటీలో ఉండేది. కానీ ల్యాబ్‌ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో కొంతకాలంగా ప్రవేశాలు నిలిపివేశారు. ఇతర ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు వర్శిటీల్లో అందుబాటులో ఉంది. దీనిలో ప్రవేశాలకు ఏకమొత్తంగా ఎటువంటి ప్రవేశ పరీక్షలూ లేవు. వర్శిటీలు దేనికవే వాటి నిబంధనలను అనుసరించి తీసుకుంటున్నాయి.


  విధులేంటి?  

మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ టెక్నాలజిస్ట్‌లు.. మెడిసిన్‌లో జెనెటిక్స్‌ పాత్ర ఏమిటి అనేది పరిశీలిస్తారు. రోగి డీఎన్‌ఏను పరిశోధన చేయడం, డయాగ్నైజ్‌  చేయడం, క్యాన్సర్లు, నరాల సంబంధిత వ్యాధులు, ఇతర డిజార్డర్ల వంటి వ్యాధుల వైద్యంలో వీరి రిసెర్చ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. వీరు డీఎన్‌ఏను విశ్లేషించి ట్యూమర్లు వంటి వాటికి దారితీసే అసాధారణతలు ఏమైనా ఉన్నాయేమో గమనిస్తారు. గర్భస్థ శిశువు డీఎన్‌ఏను పరీక్షించి డౌన్‌ సిండ్రోమ్‌ లాంటి వాటి బారిన పడే ప్రమాదం ఉందా     అనేది పరిశీలిస్తారు. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ టెక్నాలజిస్ట్‌లు పాథాలజిస్ట్, సైంటిస్ట్‌లతో కలిసి పనిచేస్తారు. వీరు చేసే రిసెర్చ్‌ అనేక జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం, నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.


   స్పెషలైజేషన్లు   

మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ టెక్నాలజిస్ట్‌లు కార్డియోవాస్క్యులర్‌ మెడిసిన్, కైటోజెనిటిక్స్, హెపటైటిస్, హెచ్‌ఐవీ, ఇమ్యునాలజీ.. అనేక ఇతర సంబంధిత అంశాలను స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్, టీచింగ్, క్వాలిటీ కంట్రోల్, టెక్నికల్‌ స్పెషలిస్ట్‌గా పనిచేయవచ్చు.


   ఎక్కడ?    

ఆసుపత్రులు, రిసెర్చ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు ల్యాబ్‌లు, కంపెనీలు మాలిక్యులర్‌ జెనెటిక్‌ టెక్నాలజిస్ట్‌లను ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అయితే ఇందులో ప్రమాదకర రసాయనాలతో పనిచేయాలి. డెస్క్‌ జాబ్‌ అయినప్పటికీ ఎక్కువ గంటలు పనిలో గడపాలి. అన్నీ ఆలోచించి ఆసక్తి ఉన్నవారు ఎంచుకోవచ్చు.


  చదవడం ఎలా?   

దీనికి సంబంధించిన కోర్సులు చదవదలచిన విద్యార్థులు ఇంటర్‌లో కచ్చితంగా బయాలజీ సంబంధిత కోర్సు చేసి ఉండాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, చత్తీస్‌గడ్, తమిళనాడు... ఇలా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మంచి ఇన్‌స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు ఉత్తమ ఎక్విప్‌మెంట్‌తో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో చేరిన విద్యార్థులు ఆర్‌టీపీసీఆర్‌ వంటి అంశాలపై శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఈ విద్యార్థులు అధికశాతం ఆర్‌అండ్‌డీ (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌)లో ఉపాధి పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో బయాలజీ సబ్జెక్టులు కూడా చదువుకున్న వారికి బోధన అవకాశాలు ఉన్నాయి కానీ, కేవలం మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ చదివినవారు బోధన చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవడం లేదు. విదేశాల్లో మాత్రం వీరు అటు పరిశోధనలోనూ ఇటు బోధనలోనూ రాణిస్తున్నారు.

‣ ఈ నిపుణులకు అధికంగా రిసెర్చ్‌ ల్యాబ్స్, క్యాన్సర్‌ సెంటర్స్, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో అవకాశాలు ఉంటాయి. సాధారణ పరీక్షలను దాటి లోతైన పరిశీలన అవసరం అనుకున్న చోట వీరి అవసరం ఉంటుంది. ప్రొటీన్‌ డెఫిషియన్సీ, జన్యుపరమైన లోపాలను పరిశీలించడానికి వీరి శోధన అవసరం అవుతుంది. ఇందుకోసం డిగ్రీ స్థాయిలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్‌ వంటివి చదవాలి. పీజీ స్థాయిలో ఎమ్మెస్సీలో మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ పేపర్‌ ఒకటి ఉంటుంది. ఇంజినీరింగ్‌లో దీన్ని బయోటెక్నాలజీ వారు చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అరబిందో, హెటిరో, రెడ్డీస్‌ వంటి డ్రగ్‌ డిజైనింగ్‌ కంపెనీల్లో అధికంగా పనిచేస్తున్నారు. వీరికి రిసెర్చ్‌ ఆఫీసర్, టెక్నికల్‌ ఆఫీసర్‌ వంటి వివిధ హోదాలుంటాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

Posted Date: 13-06-2024