• facebook
  • whatsapp
  • telegram

కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

ఐటీ రంగంలో బలమైన కెరియర్‌


అవసరం నుంచే ఆలోచనలు, ఆలోచనల నుంచే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వ్యాపార అవకాశం దాగివున్నట్టే. వ్యాపారం అంకురించినచోట కొత్త ఉద్యోగాలు ఉద్భవిస్తాయి. డేటానే జీవనాడిగా వృద్ధి చెందుతున్న సమాచార సాంకేతిక రంగం (ఐటీ) ఎదుగుతున్న క్రమంలో అవతరించిన కొత్త రంగమే క్లౌడ్‌ కంప్యూటింగ్‌. 

రెండు దశాబ్దాల కిందట ఎవరికీ తెలియని రంగం.. కంప్యూటర్‌ క్లౌడ్‌ / క్లౌడ్‌ కంప్యూటింగ్‌. ఒకపక్క ఐటీ రంగం దినదిన ప్రవర్థమానమవుతూ ఆ ఒరవడిలో ముందుకెళ్లిపోతుండగా 2006లో ఒక ప్రపంచ వ్యాపార దిగ్గజానికి చటుక్కున స్ఫురించిన కొత్త అవకాశమే కంప్యూటర్‌ క్లౌడ్‌.  

మేఘం పేరును తనలో ఇముడ్చుకున్న ఈ ఐటీ విభాగం స్వభావరీత్యా చేసే మేలు అటువంటిదే. ఘనీభవించిన నీటిని తనలో నిక్షిప్తం చేసుకున్న మేఘం దూరతీరాలకు పయనిస్తూ వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు తటాలున వర్షిస్తుంది. అలాగే కుప్పలుతెప్పలుగా పోగవుతున్న డేటాను చెక్కుచెదరకుండా భద్రపరచి అవసరమైనప్పుడు తిరిగి తీసుకొని వినియోగించడమే కంప్యూటర్‌ క్లౌడ్‌. అంటే ఈ కంప్యూటర్‌ మేఘాన్ని మన ఇంట్లో విలువైనవాటిని జాగ్రత్త చేసే బీరువా లాగానో, బ్యాంకులోని స్ట్రాంగ్‌ రూమ్‌లాగానో ఊహించవచ్చు.


  >>  ఏమిటి దీని ఉపయోగం?   


మనం వినియోగించే మొబైల్‌కో మెమరీ ఉంటుంది. ఆ పరిమితి వరకూ మొబైల్‌ మనల్ని మురిపిస్తుంటుంది. ఆ పరిధి దాటగానే మొరాయిస్తుంది. డేటా స్టోరేజీ నిండిపోయిందని హెచ్చరిస్తుంది. వెంటనే మనం కొంత డేేటాను (ముఖ్యంగా వీడియోలు, ఫొటోలు) తొలగిస్తాం. దీంతో మొబైల్‌ మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. కానీ కొంత డేటాను నిర్దాక్షిణ్యంగా డిలీట్‌ చేస్తున్నప్పుడు మళ్లీ దీని అవసరం ఏర్పడుతుందేమోనన్న సంశయం మనల్ని వెంటాడుతుంటుంది.  


సరిగ్గా ఆ సమయంలోనే ఓ అద్భుతమైన సూచన మొబైల్‌ తెరపై కనిపిస్తుంది. క్లౌడ్‌లో కొంత స్థలం (స్పేస్‌) తీసుకోమన్న సూచన మనల్ని ఆకర్షిస్తుంది. అందుకు ఛార్జీలు స్వల్పంగానే ఉండటంతో డేటాను శాశ్వతంగా పోగొట్టుకోవడం కంటే ఇదే మేలని క్లౌడ్‌లో స్పేస్‌ కొనేస్తాం. సరిగ్గా ఇదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ వినియోగదారుల సమాచారాన్ని పదిలపరచే వ్యవస్థగా అవతరించిన కంప్యూటర్‌ క్లౌడ్‌. 


  >>  ఎలా ప్రాచుర్యం పొందింది?  


టెక్నికల్‌ ప్లాట్‌ఫామ్‌పై సాంకేతిక వృత్తి నిపుణులకు నేడు ఏం కావాలన్నా క్లౌడ్‌పైనే ఆధారపడుతున్నారు. ఒక్క స్టోరేజీ కోసమే కాదు, ఎన్నో అవసరాలను క్లౌడ్‌ తీరుస్తోంది. గ్రాఫిక్‌ డిజైనర్‌కి సాఫ్ట్‌వేర్లు కావాలన్నా, ఐటీ నిపుణుడికి మైక్రోసాఫ్ట్‌ అప్లికేషన్లు కావాలన్నా క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి వెళితే చాలు.. అందుబాటులోకి వస్తాయి. సాఫ్ట్‌వేర్‌లతో పాటు అప్లికేషన్లు లభ్యం కావడంతో క్లౌడ్‌ తక్కువకాలంలో ప్రాచుర్యం పొందింది. ఎప్పటికప్పుడు సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లకు క్లౌడ్‌ పరిష్కారం కావడంతో సాంకేతిక ప్రపంచ ఆదరణను పెంపొందించుకుంటోంది.  


యాపిల్, ఆండ్రాయిడ్, విండోస్‌ వేర్వేరు సాఫ్ట్‌వేర్లు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ గల వ్యవస్థలు. ఒక టెక్నాలజీలో ఉన్న వినియోగదారుడికి హఠాత్తుగా మరో ఆపరేటింగ్‌లో మాత్రమే ఓపెన్‌ అయ్యే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కావాలంటే ఎలా? ఈ సమస్యను క్లౌడ్‌  కంప్యూటింగ్‌ని సంప్రదించి పరిష్కరించుకోవచ్చు. తమకు కావలసిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌నూ, సాఫ్ట్‌వేర్లనూ క్లౌడ్‌ నుంచి ఎరువు తెచ్చుకొని మన పని అయ్యాక తిరిగి ఇచ్చేసి నామమాత్రపు రుసుము చెల్లించవచ్చు. ఇటువంటి ఎన్నో సౌలభ్యాలున్నందున క్లౌడ్‌ ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది. 


మౌలిక సదుపాయం: డేటా స్టోరేజీ, మెమరీ, ప్రాసెస్‌ వంటి మౌలిక సాంకేతిక వసతులకు క్లౌడ్‌ కంప్యూటర్‌ చిరునామాగా మారింది.  


ప్లాట్‌ఫామ్‌: లినెక్స్, విండోస్, ఆండ్రాయిడ్, జావా, డాట్‌నెట్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌. 


అప్లికేషన్స్‌: డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్‌ లెర్నింగ్‌ డాక్యుమెంట్లు.  


ఇలాంటి వివిధ అవసరాలకు క్లౌడ్‌ కంప్యూటర్‌ వినియోగపడుతూ ఇదొక వ్యాపార అవకాశంగా అవతరించింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు తమ అప్లికేషన్స్‌ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నందున వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయి. 


 >>   సప్త సముద్రాలంత డేటా   


భూతలంపై విస్తరించిన సప్త సముద్రాల్లోని జలరాశిని లెక్కించగలమా? ప్రపంచ వ్యాప్తంగా రోజూ టన్నుల కొద్దీ సమాచారం పోగైపోతుంది. స్వతంత్రంగా పనిచేసే కంపెనీల డేటాను పక్కనబెట్టి కేవలం ఒక్క ఇంటర్నెట్‌లోనే 2021లో 2.5 క్వింటిలియన్‌ బైట్ల డేటా పోగైంది. ఒకటి పక్క 18 సున్నాలు పెడితే వచ్చే అంకే.. క్వింటిలియన్‌. ఇంటర్నెట్‌ వినియోగదారులు పెరుగుతున్నకొద్దీ ఈ డేటా రాశి ‘ఇంతింతై వటుడింతై’ అన్న రీతిన పెరుగుతూనే ఉంది. పరిమితి దాటిన తర్వాత ఒక్క వీడియో వచ్చినా మన మొబైల్‌ అల్లాడిపోతున్నట్టే, డేటా భారంతో తమ సిస్టమ్స్‌ మందగమనంలోకి వస్తూ కంప్యూటర్‌ వినియోగదారులు తలలు పట్టుకుంటున్న సమయంలో దిగ్గజ వాణిజ్య సంస్థ అమెజాన్‌ ఈ సంక్షోభంలో ఒక గొప్ప అవకాశాన్ని చూసింది. అదే డేటా స్టోరేజి...క్లౌడ్‌ కంప్యూటింగ్‌.   


ఈ అవసరం కోసం అమెజాన్‌ 2006లో ఎలాస్టిక్‌ కంప్యూటర్‌ క్లౌడ్‌Âను ప్రారంభించడంతో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు ప్రారంభమయ్యాయి. మరో రెండేళ్లకు సంచలనాత్మక ధరలతో పరిమితకాలం ఉచితంగా సేవలు వినియోగించుకునే ఆఫర్లతో గూగుల్‌ ప్రవేశించడంతో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఐటీ విభాగంగా స్థిరపడి వేగంగా పరుగెత్తడం మొదలైంది. 2021లో 368 బిలియన్‌ డాలర్లుగా ఉన్న కంప్యూటర్‌ క్లౌడ్‌ మార్కెట్‌ ఏటా 16 శాతం పెరుగుతోంది. ఇలా 2030 వరకు ఈ రంగ అభివృద్ధికి ఏ ఢోకా లేదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఉద్యోగావకాశాలు కనీసం మరో ఐదేళ్లపాటు ఉద్ధృతంగా కొనసాగుతాయని స్పష్టమవుతోంది.  


   >>   ఉద్యోగాలెలా?    



పెద్ద కంపెనీలకు భారీ స్థాయిలో డేటాను నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం తాము స్వయంగా సాంకేతిక మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవాల్సిన అవసరం లేకుండా క్లౌడ్‌ సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే తమకు కావలసిన సాఫ్ట్‌వేర్లు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ కోసం క్లౌడ్‌ సేవలు ఉపయోగించుకోవచ్చు. ముందుగా డేటాను క్లౌడ్‌లో భద్రపరచుకోవాలంటే అందుకు అనుగుణంగా డేటా ఫార్మాట్లను రూపొందించుకోవాలి. ఈ నైపుణ్యంగల సీనియర్లతోపాటు క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై ఆసక్తి ఉన్న ఫ్రెషర్స్‌కు కంపెనీలు అవకాశం ఇస్తున్నాయి. వేగంగా పెరుగుతున్న ఈ రంగంలో ఎదిగే అవకాశాలు రానున్న రోజుల్లో పుష్కలం. 


‣ 2030 వరకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగ అభివృద్ధికి ఏ ఢోకా లేదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి దీనిలో ఉద్యోగావకాశాలు కనీసం మరో ఐదేళ్లపాటు ఉద్ధృతంగా కొనసాగుతాయని స్పష్టమవుతోంది. విస్తృతమవుతున్న మార్కెట్‌ మూలంగా ఐటీ రంగంలోని ఈ విభాగం ఒక బలమైన కెరియర్‌గా స్థిరపడింది!


 >>   డిమాండ్‌కు కారణాలు ఇవీ  

క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుందనడానికి నిపుణులు కొన్ని కారణాలు చెబుతున్నారు.  


వ్యయం: కంపెనీలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ని ఆశ్రయించడంవల్ల తమ వార్షిక వ్యయాలను నియంత్రించుకోవచ్చు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల సర్వర్ల కొనుగోలుతో పాటు ఇరవై నాలుగు గంటల కరెంట్‌ సరఫరా, కూలింగ్‌ (శీతల) వ్యవస్థ నిర్వహణకు అయ్యే భారీ వ్యయాన్ని నివారించవచ్చు. పైగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఒక విధానం ఐటీ కంపెనీలను బాగా ఆకర్షిస్తోంది. హార్డ్‌వేర్‌ లేదా సాఫ్ట్‌వేర్, సర్వర్లను వినియోగించిన కాలానికే టారిఫ్‌ చెల్లించాలి. అవసరం లేని సమయంలో వదిలేయవచ్చు. ఈ విధంగా వ్యయ నియంత్రణ రీత్యా క్లౌడ్‌ వ్యవస్థ కంపెనీలకు వర ప్రదాయినిగా మారింది.  


వేగం: క్లౌడ్‌ సేవలు వేగంగా ఉండటం.. దీనిపట్ల కంపెనీలు ఆకర్షితులు కావడానికి మరో కారణం. కొన్ని క్లౌడ్‌ సేవలు ఒక క్లిక్‌తో నిమిషాల వ్యవధిలో అందుబాటులోకి వస్తాయి. దీంతో కంపెనీల సామర్థ్యం, ప్రమాణాలు పెరుగుతున్నందున క్లౌడ్‌కు ఆదరణ రోజురోజుకీ విస్తృతమవుతోంది.  


భారీస్థాయి: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వల్ల మరో సౌలభ్యం...ఈ భూతలంపై ఎక్కడ ఏ మారుమూల ఉన్నా సేవలు పొందవచ్చు. క్లౌడ్‌ సేవల కంపెనీల బ్యాండ్‌ విడ్త్‌ని బట్టి ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంతటి డేటానయినా భద్రపరచుకోవచ్చు. అవసరమైనప్పుడు క్షణాల్లో వినియోగించుకోవచ్చు.  


ఉత్పాదకత: కంపెనీలు క్షేత్రస్థాయిలో తమ సొంత సౌకర్యాలతో డేటా సెంటర్లు నెలకొల్పాంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. భారీ సర్వర్ల వంటి హార్డ్‌వేర్, వీటిని పనిచేయించే సాఫ్ట్‌వేర్‌లను నిర్వహించాలి. ఐటీ సిబ్బంది వీటిపై ఎంతో సమయం వెచ్చించాలి. కానీ అదే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ని ఆశ్రయిస్తే ఈ అవసరం ఉండదు. ఏ విధమైన హైరానా లేకుండా కంపెనీలు తమకు కావలసిన ఉత్పాదకత (ప్రొడక్టివిటీ)ను సాధించవచ్చు.  


నాణ్యమైన సేవలు: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలందించే సంస్థలు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వివిధ డేటా సెంటర్లతో అనుసంధానమై ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎప్పటికప్పుడు ‘అప్‌గ్రేడ్‌’ అవుతుంటాయి. దీనివల్ల ఈ సేవలు అత్యుత్తమంగా ఉంటాయి. అదే.. సొంతంగా ఈ వ్యవస్థను నిర్వహించాలంటే కంపెనీలకు కష్టసాధ్యమవుతుంది.  


భద్రత: కంపెనీలు సొంతంగా ఏర్పాటు చేసుకునే డేటా సెంటర్ల కంటే క్లౌడ్‌లో భద్రత పటిష్ఠంగా ఉంటుందని పలుమార్లు రుజువైంది. వివిధ కంపెనీలకు క్లౌడ్‌ సేవలు అందుతుంటాయి కాబట్టి వాటి భద్రతపై సేవా కంపెనీలు అధిక పెట్టుబడులు పెడతాయి. డేటా భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తాయి.  


కారణాలు ఏవైతేనేం, క్లౌడ్‌ సేవలు నానాటికీ సాంకేతిక ప్రపంచంలో దూసుకెళుతూ ఏటా వినియోగదారులను పెంచుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్‌ విస్తృతమవుతూ ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఐటీ రంగంలోని ఈ విభాగం ఒక బలమైన  కెరియర్‌గా స్థిరపడింది! 


- యస్‌.వి. సురేష్, సంపాదకుడు, ఉద్యోగ సోపానం


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

Posted Date: 11-06-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌