• facebook
  • whatsapp
  • telegram

 క్లౌడ్ కంప్యూటింగ్

ఐటీలో ఈ విభాగం అత్యంత వేగంగా ఎదుగుతోంది. దీనిలో ప్రవేశించటానికీ, అవకాశాలను అందిపుచ్చుకోవటానికీ విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఏం చేయాలి? మీ ఇంట్లో గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడనుకుందాం. అతనికి తగ్గ సాఫ్ట్‌వేర్స్, సిస్టమ్ కావాల్సి వస్తుంది. మరొకరికి కార్యాలయ విధుల కోసం మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లు అవసరమవుతాయి. మీకూ, ఇంజినీరింగ్ చదువుతున్న మీ సోదరికీ లినక్స్  ప్లాట్‌ఫార్మ్ అవసరం! 

ఈ ఖర్చును తగ్గించుకునే మార్గం ఏమిటి? 

మనకు లినక్స్ సిస్టం కావాలంటే లినక్స్, విండోస్ కావాలంటే విండోస్... ఆపై మనకు ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ అవసరమైనప్పుడు ఇస్తూ- ఎంత వాడుకున్నామో అంతటికే చెల్లించే అవకాశాన్ని 'క్లౌడ్ కంప్యూటింగ్' అందిస్తుంది. (నెట్‌వర్క్ డయాగ్రమ్స్‌లో ఇంటర్నెట్‌ను సూచించటానికి మేఘాన్ని cloud - ఉపయోగిస్తుంటారు).

మనం డౌన్‌లోడ్ చేసుకున్న పాటలు, వీడియోలకు సరిపోయే హార్డ్‌డిస్క్ స్థలం సిస్టంలో లేదనుకుంటే కొంత 'స్పేస్'ని క్లౌడ్‌లో అద్దెకు తీసుకోవచ్చు.

ఏదైనా అప్లికేషన్ రన్ చేయడానికి సిస్టంలో 16 జి.బి. మెమరీ కావాలి. కానీ లేదు. అప్పుడు క్లౌడ్‌లో అంత మెమరీ ఉన్న సిస్టమ్‌ని అద్దెకి తీసుకొని వాడుకోవచ్చు.

మీ మిత్రుడు ఓ అటాచ్‌మెంట్‌ని ఆపిల్ మెషీన్ నుంచి పంపించాడు. అది ఆపిల్ మెషీన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌లో మాత్రమే ఓపెనవుతుంది. కానీ మీది విండోస్ సిస్టం. మీ సిస్టంలో నుంచి క్లౌడ్‌లో ఉన్న ఆపిల్ సిస్టంని అద్దెకు తీసుకుని ఆ అప్లికేషన్‌ని చూడొచ్చు. ఎంత సమయం ఆ సిస్టం వాడుతున్నారో అంతే సమయానికి చెల్లింపు చేసే సౌకర్యముంది.

క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఈ సాంకేతికత (టెక్నాలజీ) కంప్యూటర్- ఐటీ రంగాల్లో పెను మార్పులు తేవటమే కాకుండా కంప్యూటింగ్‌లో ఉన్న ఎన్నో అనవసర ఖర్చులను తగ్గించడానికి ఉపకరిస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిస్తోంది.

ఇలా ప్రతి ఒక్కరి అవసరం కోసం వివిధ అప్లికేషన్లు, ప్లాట్‌ఫార్మ్‌లు కావాలంటే వాటి సిస్టం, లైసెన్సుల కోసం చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంతేనా? పైన చెప్పిన అప్లికేషన్స్ అన్నిటికీ కొత్త వెర్షన్స్ ప్రతీ రెండు మూడేళ్ళకూ మారిపోతాయి. అంటే ప్రతీ వెర్షన్ లైసెన్స్‌కి డబ్బు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మూడు రకాల సేవలు 

ఇది ఓ ఉత్పత్తిగా కాకుండా వివిధ వినియోగదారులకు కావల్సిన సేవలను ఏర్పాటు చేసే టెక్నాలజీగా పనిచేస్తుంది. ఆ సేవలు మూడు విధాలు.

1. అవస్థాపన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్): వినియోగదారులకు కావలసిన హార్డ్‌వేర్ అవసరాల (స్టోరేజీ, మెమరీ, ప్రాసెస్ పవర్, మొబైల్ వంటివి) కోసం.

2. ప్లాట్‌ఫార్మ్: లినక్స్, విండోస్, ఆండ్రాయిడ్, జావా, డాట్‌నెట్ లాంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్. 

3. అప్లికేషన్లు: డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్, లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ల లాంటి వివిధ సాఫ్ట్‌వేర్లను సేవలుగా అందించడం. ఇంట్లో విద్యుత్తును ఎంతవరకు వాడుకుంటున్నామో దానికే బిల్లు చెల్లిస్తాం కదా? అలాగే ఈ విధానంలో వివిధ కంప్యూటింగ్ సేవలను ఎక్కడి నుంచైనా, ఏ సిస్టం నుంచైనా వాడుకుంటాం; వాడినంతవరకు మాత్రమే చెల్లిస్తాం.

ఎలాంటి కెరియర్లు?

దీని ప్రయోజనాలు చూసి అన్ని ఐటీ కంపెనీలూ, ఎంటర్‌ప్రైజ్ ఆధారిత సంస్థలూ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్లను ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ ప్రస్తుతం తమ వద్దనున్న అప్లికేషన్లని క్లౌడ్ బేస్డ్‌గా మార్చటానికీ, కొత్త క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ల అభివృద్ధికీ ప్రయత్నిస్తున్నాయి కాబట్టి వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి చాలా గిరాకీ ఉంటుంది. 

ఇలాంటి అప్లికేషన్ బదిలీ కోసం ఐటీ రంగంలో అనుభవమున్నవారు అవసరం. అయితే కొత్త అప్లికేషన్ల అభివృద్ధికి ఎక్కువగా ఫ్రెషర్లను నియమించుకుంటారు. కొత్త సాంకేతికత ఎప్పుడూ కొత్త టాలెంట్‌ని వెతుకుతుంది కాబట్టి ప్రస్తుతం ఇంజినీరింగ్, ఐటీ ఆధారిత కోర్సులను ఎంచుకునేవారు క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్ల మీద ఓ కన్నెయ్యడం చాలా మంచిది. 

అంతమాత్రాన ఈ నూతన సాంకేతికత పాత ఉద్యోగాలకు ఎసరు పెడుతుందనేది అపోహే. ఎందుకంటే ఇదొక కొత్త ప్లాట్‌ఫాం, పాత అప్లికేషన్ల కోసం! పాత అప్లికేషన్లన్నీ ఒక సపోర్టుగా క్లౌడ్ కంప్యూటింగ్‌కి బ్యాకప్‌గా ఉంటాయి. అంటే ఇప్పటివరకు పనిచేసిన వారందరి చేయూతతో కొత్త టాలెంట్‌ని ఈ కొత్త సాంకేతికత ఆహ్వానిస్తుంది.

శిక్షణకు ఏవి ఉత్తమం? 

ఇప్పుడిప్పుడే క్లౌడ్ ఆర్కిటెక్చర్ మీద వివిధ శిక్షణ, కార్యశాలలను విశ్వవిద్యాలయాలు అందజేస్తున్నాయి. వివిధ కమర్షియల్ క్లౌడ్స్ మీద శిక్షణను సంబంధిత కంపెనీ దగ్గర తీసుకోవడం మంచిది. అంటే వి.ఎం.వేర్ క్లౌడ్ మీద వి.ఎం. వేర్/ అధీకృత కేంద్రాల దగ్గర శిక్షణ పొందడం మేలు.

క్లౌడ్ కంప్యూటింగ్ మీద వివిధ శిక్షణల కోసం ఈ కింద కేంద్రాలను సంప్రదించవచ్చు. కానీ ముందుగా పూర్తి వివరాలు తీసుకొని, ఇంతకుముందు శిక్షణ పొందిన విద్యార్థులతో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకోండి.

Indian Institute of Hardware Technology (IIHT), Bangalore, and Hyderabad centers.

7-1-212/6, 1st floor, Lane beside Surya Residency, Shivbagh, Ameerpet, Near S.R. Nagar Police Station, Hyderabad Knowledge Labs, Chennai.

e-mail: cloud.klabs@gmail.com  

NxTech Consulting, Pune

14-A, 2nd Floor, Aditya Shagun Mall, Bavdhan, Pune 411021. e-mail: mail@nxtech.in

పైన చెప్పిన అన్ని సంస్థలూ ప్రైవేట్‌వి. క్లౌడ్ కంప్యూటింగ్ కొత్త సాంకేతికత కాబట్టి అక్కడున్న ఫ్యాకల్టీని బట్టి అప్పటికే ఏదయినా ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం ఉన్నవారు సంప్రదించవచ్చు. 

సీ-డాక్, జేఎన్‌టీయూలలో...

ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) తమ పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌ని ఒక మాడ్యూల్‌గా ప్రవేశపెడుతోంది. కొత్తవారికి ఇది ఉపయోగం. జేఎన్‌టీయూ కూడా తమ ఐటీ, కంప్యూటింగ్ కోర్సుల్లో క్లౌడ్ టెక్నాలజీని ప్రత్యేక, ఐచ్ఛిక మాడ్యూల్స్‌గా ప్రవేశపెట్టింది. సి-డాక్, జేఎన్‌టీయూ రెండూ ఈ సాంకేతికత గురించి సదస్సులు, కార్యశాలలు నిర్వహిస్తున్నాయి. ఫ్రెషర్లు, ఇప్పటికే చదువుతున్నవారు ఈ కోర్సులను ఎంచుకోవటం వారి కెరియర్‌కి ప్రయోజనకరం. క్లౌడ్ సాంకేతికత మీద అవగాహన ఉంటే మౌఖిక పరీక్షలో ఉపయోగమే కాకుండా ఎక్కువ వెయిటేజి దొరుకుతుంది.

సానపెట్టుకోవాలి... ఇప్పటినుంచే 

గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్‌లో తమ ప్రయత్నం చేస్తూ ఉండటమే కాక తమ అప్లికేషన్లని అడాప్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఈ రంగంలో ఉన్న అవకాశాల కోసం ఫ్రెషర్లు తమను ఇప్పటినుంచే సానబెట్టుకోవడం ఉత్తమం.

రానున్న కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్ మొత్తం ఐటీ అవస్థాపనలోనే మౌలికంగా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ వినియోగదారులకు సర్వీస్ ఆధారిత అప్లికేషన్లను అందించటమే కాకుండా వినియోగదారునికి ఎలా కావాలో ఆ విధంగా (బిల్ట్-ఇన్- ఎలాస్టిసిటీ) వృద్ధి చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఫ్రెషర్లు వివిధ అప్లికేషన్లని క్లౌడ్‌లో ఎలా ఎనేబుల్ చెయ్యాలో నేర్చుకోవాలి. 

విద్యార్థులు ముందుగానే వర్చువలైజ్‌డ్ ఎన్విరాన్మెంట్ మీద అవగాహన పెంచుకోవాలి. తాము నేర్చుకొంటున్న/ డెవలప్ చేస్తున్న అప్లికేషన్స్ ఫ్రీ/ ఓపెన్ సోర్స్ వర్చువలైజ్‌డ్ ఎన్విరాన్మెంట్‌లు వాడి అనుభవం తెచ్చుకుంటే కెరియర్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ వర్చువల్ మెషీన్/ జెన్ వర్చువలైజ్‌డ్ ఎన్విరాన్మెంట్‌లో మీ అప్లికేషన్లు ప్రయత్నించండి. ఆ తరవాత పబ్లిక్ బేస్డ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్‌ని ప్రయత్నించవచ్చు.

శిక్షణ అవకాశాలు

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: మొదటిదైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ముఖ్యంగా సిస్టం, నెట్‌వర్క్, డేటా సెంటర్‌ని మేనేజ్ చేసేవారికి ఉపయోగపడుతుంది. దీనిలో వివిధ ఆపరేటింగ్ సిస్టంలు, స్టోరేజి అప్లికేషన్లు, నెట్‌వర్క్ ఎన్విరాన్‌మెంట్‌ని అందించాల్సి వస్తుంది. కాబట్టి సిస్టం, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లకు మంచి అవకాశాలు ఉంటాయి. వీరు సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్‌ని అవగాహన చేసుకుని వివిధ ఆపరేటింగ్ సిస్టంలతో పాటు వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్‌పై ప్రావీణ్యం సంపాదించుకోవాలి. కింది వెబ్‌సైట్ల ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చు.

www.eucalyptus.com

www.windowsazure.com

www.xen.org

www.vmware.com

సిస్టం అండ్ నెట్‌వర్క్ అడ్మిన్/ మేనేజిమెంట్ వారికి క్లౌడ్ ఇన్‌స్టలేషన్స్ నుంచి మేనేజిమెంట్ వరకు కెరియర్ అవకాశాలున్నాయి. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్‌లో పబ్లిక్, ప్రైవేట్, ఎంటర్‌ప్రైస్ అనేవి మూడు రకాలు. వీటి మధ్యనున్న తేడాలను బట్టి క్లౌడ్‌ని మేనేజ్ చేయడంలో కీలకపాత్ర వహించవలసివస్తుంది.

ప్లాట్‌ఫార్మ్: దీనిలో జావా బేస్డ్, డాట్ నెట్ బేస్డ్‌తో అభివృద్ధి చేసినవే కాకుండా వివిధ డేటా బేసెస్‌తో పాటు కలిగివున్న క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌ని ఎంచుకోవలసి వస్తుంది. జావా/ డాట్‌నెట్/ మరేదైనా ప్లాట్‌ఫార్మ్ అనుభవం ఉన్నవారు ముఖ్యంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఇంటిగ్రెషన్ మీద శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. 

ఫ్రెషర్లు అయితే ఒక ప్లాట్‌ఫార్మ్ మీద దృష్టి నిలిపి వివిధ ప్లాట్‌ఫార్మ్‌ల మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా తమ మొదటి, రెండేళ్లలో డాట్‌నెట్/ జావా/ మరేదైనా ప్లాట్‌ఫార్మ్ మీద పట్టు సాధించాలి. ఆ తరవాత మూడు నాలుగేళ్లలో క్లౌడ్ మీద పట్టు సాధిస్తే క్లౌడ్ కంప్యూటింగ్‌లో నిష్ణాతులయ్యే అవకాశం ఉంది.

ఈ కింద ప్లాట్‌ఫార్మ్‌లు ఓపెన్ సోర్స్‌లో లభ్యమవుతున్నాయి కాబట్టి ఫ్రెషర్లు వీటిమీద తమ కళాశాలలో ప్రాజెక్ట్ వర్క్‌గా ఎంచుకుంటే మంచిది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం వీటిని అభివృద్ధి చెయ్యడానికి మీ దగ్గర ఉన్న జావా, సి++, లేదా డాట్‌నెట్ ప్రోగ్రామింగ్ భావనలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిమీద అవగాహన పెంచుకోవలసి ఉంటుంది.

www.opengrm.com

www.xen.org/products/cloudxen.html

www.opennebula.org/

www.openstack.org/

www.cloud.com/

కమర్షియల్స్ క్లౌడ్స్ మీద అవగాహనకు ఈ కింద వాటి మీద శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

www.vmware.com/products/vcloud/overview.html

www01.ibm.com/software/tivoli/products/cloudburst/

www.netiq.com/products/cloud-manager/index.asp

www8.hp.com/us/en/business-solutions/solution.html?compURI=1079455

www.windowsazure.com/en-us/home/features/overview/

సాఫ్ట్‌వేర్: దీనిలో వివిధ సాఫ్ట్‌వేర్‌ల మీద అవగాహన ఉండాలి. ఏ సాఫ్ట్‌వేర్‌లో అయినా, ఏ ప్రోగ్రామ్‌లో అయినా మీకు ప్రావీణ్యం ఉంటే క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు రాసిన ప్రోగ్రామ్‌ని వివిధ ప్లాట్‌ఫారాలకు అనుసంధానం చేసే అవకాశం ఉంది. మీరు విండోస్‌లో అభివృద్ధి చేసినా లినక్స్ యూజర్స్/ లినక్స్ బేస్డ్ ఎన్విరాన్మెంట్‌లో కూడా పనిచేసే విధానాన్ని క్లౌడ్‌లో కల్పించాలి.

Posted Date: 14-10-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌