• facebook
  • whatsapp
  • telegram

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

జూన్‌ 28 దరఖాస్తు గడువు


త్రివిధ దళాల్లో వాయుసేనదే విశిష్ట స్థానం. రక్షణ రంగంలో ఉద్యోగాలు ఆశించేవారిలో ఎక్కువమంది ఎయిర్‌ ఫోర్స్‌లో చేరడానికే ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగం కావాలనుకున్నవారికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో ఏఎఫ్‌క్యాట్‌ ముఖ్యమైంది. ఈ పరీక్షను వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో విజయవంతమైనవారికి ముఖాముఖి, వైద్యపరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగంలోకి అవకాశమిస్తారు. సాధారణ డిగ్రీ లేదా బీటెక్‌ అర్హతతో మహిళలు, పురుషులు పోటీ పడొచ్చు. ఇటీవలే వెలువడిన ఏఎఫ్‌క్యాట్‌- 2024(2) వివరాలు.. 


ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) రాసి విజయవంతమైనవారు.. పైలట్, టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో లెవెల్‌-10 వేతన శ్రేణితో రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. ప్రతి ఆరు నెలలకూ ఈ ప్రకటన వెలువడుతుంది. దీన్ని లక్ష్యంగా చేసుకున్నవారు గరిష్ఠ వయసు గడువులోపు కనీసం ఆరు సార్లు రాసుకోవచ్చు. ముందునుంచీ సన్నద్ధమైతే తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావచ్చు. పరీక్ష ఉమ్మడిగా ఉంటుంది. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు మాత్రం ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) అదనం. రాత పరీక్షలో అర్హులకు స్టేజ్‌-1, 2లకు అవకాశమిస్తారు. అందులోనూ నెగ్గితే, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు. ఎంపికైన పోస్టు, విభాగం ప్రకారం వీరిని శాశ్వత, 14 ఏళ్లపాటు కొనసాగే తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. 


      పరీక్ష ఇలా..   

ఆన్‌లైన్‌లో 300 మార్కులకు నిర్వహిస్తారు. వంద ప్రశ్నలు. సరైన సమాధానానికి 3 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ల్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో, మిగిలినవి డిగ్రీ స్థాయిలో ఉంటాయి. వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉంచారు. పరీక్షకు ముందు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్టూ అందుబాటులోకొస్తుంది. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాలి. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు.


      ఏ విభాగం ఎలా?   

జనరల్‌ అవేర్‌నెస్‌: చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమిక స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. ఎక్కువ ప్రశ్నలకు సాధారణ అవగాహనతో జవాబు గుర్తించవచ్చు. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమానాంశాల్లో.. నియామకాలు, అవార్డులు, క్రీడలు, ఎన్నికల ఫలితాలు, పుస్తకాలు- రచయితలు, రక్షణ రంగంలోని తాజా పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పరీక్ష తేదీకి 9 నెలల ముందు వరకు జరిగిన ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. 

వెర్బల్‌ ఎబిలిటీ: కాంప్రహెన్షన్, ఎర్రర్‌ డిటెక్షన్, సెంటెన్స్‌ కంప్లీషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, వొకాబ్యులరీ నుంచి ప్రశ్నలుంటాయి. ఆంగ్ల భాషలో అభ్యర్థికి ఏ మేరకు అవగాహన ఉందో పరిశీలిస్తారు. హైస్కూల్, ఇంటర్మీడియట్‌ స్థాయిలోని ఆంగ్ల వ్యాకరణాంశాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.   

న్యూమరికల్‌ ఎబిలిటీ: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తులు, సాధారణ వడ్డీ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనచేస్తే ఈ విభాగంలో విజయవంతం కావచ్చు. 

రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్, స్పేషియల్‌ ఎబిలిటీ (మెంటల్‌ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ తర్కంతో ముడిపడే ఉంటాయి. బాగా ఆలోచించి సమాధానం గుర్తించవచ్చు. పాత ప్రశ్నపత్రాలను సాధన చేసి, ఈ విభాగంలో రాణించవచ్చు.

ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్టు: ఇందులో సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచీ నుంచి ప్రశ్నలు వస్తాయి. బీటెక్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే సరిపోతుంది.


       స్టేజ్‌ 1, 2    

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్‌ ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రాటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్లు, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపుతారు. దాన్ని విశ్లేషించాలి. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాన్ని గమనిస్తారు. అనంతరం ముఖాముఖి ఉంటుంది. ఈ దశలన్నీ దాటినవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సమస్యలూ లేనివారిని శిక్షణకు పిలుస్తారు.


      శిక్షణ.. వేతనం   

జులై, 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ విభాగాల్లో సుమారు 62 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాలకు 52 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలలు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం.. ఫైటర్‌ పైలట్, ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్, హెలికాప్టర్‌ పైలట్లగా విడదీసి రెండు దశల్లో శిక్షణ నిర్వహిస్తారు. దుండిగల్, హకీంపేట, బీదర్, ఎలహంకల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణలో నెలకు రూ.56,100 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఎ, పలు ఆలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ)లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.పాతిక వేల ఫ్లయింగ్‌ ఆలవెన్సు, టెక్నికల్‌ బ్రాంచీలవారికి టెక్నికల్‌ ఆలవెన్సు అదనంగా అందుతాయి. అన్నీ కలిపి రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. ఇతర సౌకర్యాలూ ఉంటాయి.


     విజయం కోసం   

ప్రకటనలోనే సిలబస్‌ వివరాలు వెల్లడించారు. వాటిని పరిశీలించి, ఆ అంశాలనే బాగా చదవాలి. 

ముందుగా అన్ని విభాగాల్లోనూ ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. అనంతరం విభాగాల వారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

పాత ప్రశ్నపత్రాలు గమనించాలి. ప్రశ్నల స్థాయి, అంశాల వారీ లభిస్తోన్న ప్రాధాన్యాన్ని గ్రహించి, సన్నద్ధతను పరీక్షకు అనుగుణంగా మలచుకోవాలి. 

పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధించాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెనుకబడుతోన్న అంశాలను గుర్తించి, వాటికోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి, వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. మాక్‌ టెస్టుల్లో నిలకడగా 60 శాతం మార్కులు పొందితే అధ్యయనం బాగున్నట్లే లెక్క. విజయం దిశగా అడుగులేస్తున్నారని భావించవచ్చు.  

పరీక్షలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరలోనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయాలి. 


   ఫ్లయింగ్‌ బ్రాంచ్, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ   

ఈ పోస్టులకు ౬౦ శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌/ప్లస్‌ ౨లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో ౫౦ శాతం చొప్పున మార్కులు తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.   

వయసు: జులై 1, 2025 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 2001 - జులై 1, 2005 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉంటే మరో రెండేళ్లు మినహాయింపు పొందవచ్చు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.


  గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌  

ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి.


  గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌  

ఇందులో.. విపన్‌ సిస్టం, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మీటీయరాలజీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విపన్‌ సిస్టం ఖాళీలకు ఇంటర్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో ౫౦ శాతం మార్కులతోపాటు ఏదైనా డిగ్రీలో ౬౦ శాతం ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం ౬౦ శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్‌ పోస్టులకు ౬౦ శాతం మార్కులతో బీకాం/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్‌/ సీఎఫ్‌ఏ/ బీఎస్సీ (ఫైనాన్స్‌) కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌ ఖాళీలకు ఏదైనా పీజీలో ౫౦, యూజీలో ౬౦ శాతం ఉండాలి. మీటీయరాలజీ విభాగానికి బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్‌లతో ౬౦ శాతం మార్కులు లేదా నిర్దేశిత బ్రాంచీల్లో ౬౦ శాతం మార్కులతో బీటెక్‌/బీఈ అవసరం. అన్ని విభాగాలకూ ఇంటర్మీడియట్‌ చదివుండటం తప్పనిసరి. అన్ని పోస్టులకూ ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసుః గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు జులై ౧, ౨౦౨౫ నాటికి ౨౦ నుంచి ౨౬ ఏళ్లలోపు ఉండాలి. జులై ౨, ౧౯౯౯ - జులై ౧, ౨౦౦౫ మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకు పురుషులు ౧౫౭.౫, మహిళలు ౧౫౨ సెం.మీ.ఎత్తు తప్పనిసరి.

ఖాళీలుః అన్ని విభాగాల్లో ౩౦౪ ఉన్నాయి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ఫ్లయింగ్‌ పోస్టులు వీటికి అదనం.   

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువుః జూన్‌ ౨౮.

ఫీజుః రూ.౫౫౦+ జీఎస్‌టీ

పరీక్ష తేదీలుః ఆగస్టు ౯, ౧౦, ౧౧ 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలుః హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం.

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

Posted Date : 04-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌